Wednesday, 14 October 2015

మంచి మాటలు

పూర్వము పెద్దిభొట్టు అనే గొప్ప కవి వుండేవాడు.ఇతను మంచి సంస్కృత సాహిత్యము,శాస్త్ర పాండిత్యము గలవాడు.పెద్దిభొట్టు నిరాడంబరుడు మంచి వాడు.నిజాయితీ పరుడు.ధనాశ లేదు వచ్చినదానితో నిరాడంబరముగా జీవితము గడిపే వాడు.శిష్యుల వద్దకూడా ఎక్కువ డబ్బు తీసుకునేవాడు కాదు.అందుకే బీదతనము లోనే వుండినాడు.అతని తోడల్లుడు ఘనాంతము, వేద విద్య నేర్చినవాడు.మంచి కండ పుష్టి కలిగినవాడు.దురాశా పరుడు.అతడు ఎక్కువ ధనము సంపాదించి ధనవంతుడుగా పేరు పొందినాడు.అతనికి
పెద్దిభొట్టు అంటే చులకన.అత్తగారింట్లో కూడా చిన్నల్లుడినే ఎక్కువ గౌరవంగా చూసేవారు.అందుకని పెద్దిభొట్టు అత్తగారింటికి వెళ్ళేవాడుకాదు.ఒకసారి మామగారి వూరిలో పండితసభకు పెద్దిభోట్టును,అతని
తోడల్లుడి నీ ఆహ్వానించారు అందుకని పెద్దిభొట్టు ఆ గ్రామమునకు వెళ్లి అత్తగారింట బస చేయవలిసి వచ్చెను.5 రోజుల
సభ కనుక 5 రోజులు వుండవలిసి వచ్చెను.అత్తగారు చిన్నల్లుడికి గదిలో పట్టెమంచం మీద,పెద్దల్లుడికి గది బయట వసారాలో క్రింద పడక ఏర్పాటు చేసింది.పెద్దిభోట్టుకు కోపము వచ్చిననూ వూరికే వుండెను
మధ్యరాత్రిలో చిన్నల్లుడు లఘుశంక కోసం బయటకు వెళుతూ కావాలనే పెద్దిభొట్టు ను కాలితోతన్ని
పొరబాటున తగిలిందని "క్షమద్వం" ""క్షమద్వం"(క్షమించండి)అని చెప్పి వెళ్లి పోయాడు.మరుదినము కూడా అలాగే కాలితో తన్ని క్షమద్వమ్ క్షమద్వమ్ అని అన్నాడు.మూడో రోజు కూడా అలాగే చేసాడు.
పెద్దిభోట్టుకు బాగా కోపం వచ్చింది విసురుగా లేచి చిన్నల్లుడి సిగ పట్టుకొని లాగి పోగారుబోతా!ప్రతిదినము తన్నుచూ క్షమద్వమ్ అని అంటావా?అతన్ని వంగ బెట్టి నీకు ఒక క్షమద్వము తెలిసిన నాకు ముప్పది
రెండు "శ్రయద్వములు " వచ్చును ఏమనుకున్నావో నా దెబ్బ చూసుకో అని వీపుమీద ప్రథమా ద్వితీయా
యేషు శ్రయద్వం,ద్వితీయా తృతీయా యేషు శ్రయద్వం,తృతీయా చతుర్తేషు శ్రయద్వం అంటూ 32
శ్రయద్వాలు సుస్వరముతో చెప్తూ 32 పిడి గుద్దులు వెన్నెముకలు విరుగునట్లు గుద్దెను.(యిట్లు 32 శ్రయద్వములు వున్న వేద మంత్రమున్నది)చిన్నల్లుడు కిక్కురుమనక భరించెను.అందరూ లేచిన తనకవమాన మగునని.అప్పటి నుండీ పెద్దిభొట్టు పట్ల భయభక్తులతో మెలగు చుండెను.
ఎవరైనా తన్నులు తిని వచ్చిన వాడికి బాగా "శ్రయద్వము"లు తగిలినవి అని అదొక పారిభాషిక పదముగా
లోకములో మిగిలిపోయింది. .   




రాత్రిర్గమిష్యతి, భవిష్యతి సుప్రభాతం
భాస్వానుదేష్యతి హసిష్యతి పంకజశ్రీ:
ఇత్థమ్ విచింతయతి కోశ గతే ద్విరేఫే
హా హంత హంత నళినీం గజ ఉజ్జహార
అర్థము:-- (ఈ శ్లోకం జగన్నాథ పండిత రాయలు వ్రాసినది. ఈయన దిల్లీ పాదుషాను మెప్పించి ఆయన దర్బారులో స్థానం సంపాదించాడట.) ఒక తుమ్మెద తామర పువ్వు మీద వాలింది. మకరందాన్ని ఆస్వాదిస్తూ చాలా సేపు అలాగే వుండి పోయింది. ఇంతలో సాయంత్ర మయింది తామర పువ్వు ముడుచుకొని పోయి తుమ్మెద అందులోనే చిక్కుకొని పోయింది. ఆ తుమ్మెద యిలా అనుకుందట. తెల్లవారుతుంది, సూర్యోదయం కాగానే తామర విచ్చుకుంటుంది అ ప్పుడు ఎగిరి పోవచ్చు అని. కానీ ఇంతలో ఒక ఏనుగు వచ్చి ఆ తామర తూడును తన తొండము తో పెకలించి బయట పడవేసింది. ఇంకతామర వికసించదు కదా!తుమ్మెద లోపలే చనిపోయింది. మనమనుకున్న వన్నీ జరగవు. తానొకటి తలిస్తే దైవ మొకటి తలుచును.రేపు ఏమవుతుందో ఎవరూ ఊహించ లేరు. అందుకని ఆశాసౌధాలు కట్టవద్దని కవి హెచ్చరిస్తున్నాడు.



ప్రాణి లోకంబు సంసార పతిత మగుట వసుధ పై గిట్టి పుట్టని వాడు గలడె
వాని జన్మంబు సఫల మెవ్వాని వలన వంశ మధికోన్నతి వన్నె కెక్కు
అర్థము:-చావు పుట్టుకలనునవి అనివార్యము. ఈ సంసార చక్రములో చచ్చిన వారందరూ తిరిగి పుట్టు వారే
అట్టి వారిలో నశింపని వారెవ్వరు?ఎవ్వని పుట్టుక వలన వంశము కీర్త్యాదులతో ప్రసిద్ధి కెక్కునో వాని జన్మయే గణనీయ మైనది.



రాయలసీమ లో క్షామము వచ్చినప్పుడు ఒక అజ్ఞాత కవి.
రాయలేలిన సీమ రతనాల సీమ
రాళ్ళు దప్ప రత్నాలు లేవురా
కన్నీళ్లు దప్ప తాగే నీళ్ళు లేవురా
అంటే యింకో కవి
క్షామము దాపురించి పలుమారులు చచ్చెను జంతుసంతతుల్
వేమురు జచ్చినారు ప్రజలు వేనకువేలు చరిత్ర లోపలన్
క్షామము లెన్ని వచ్చినా రసజ్ఞత మాత్రము చావలేదు జ్ఞా
నామృత పుష్టికిన్ కొరత నందని రాయలసీమలోపలన్

కన్నీరు,మున్నీరు,పన్నీరు,తేనీరు అనే పదాలను యిచ్చి రాయాలసీమ లో నీటి కోసం రాముడిని ప్రార్థించ మని అడిగారు.ఒకసారి అవధానం లో నా.ఫ. శర్మ గారి పూరణ
కన్నీరున్ దిగ ద్రావలేము గదరా గంభీర మేఘా కృతీ
పన్నీరౌ నీ కడగంటి చూపు చిలుకన్ భద్రాంగ జాగేలరా
మున్నీరై చను సీమ జీవితములో ముత్యమ్ము నీ చూపే రా
తిన్ నాతిన్ గలిగించు వాడ తేనీరు రామప్రభో
రాతినుంచి నాతిని పుట్టించినావు గదా!నీళ్ళు పుట్టింప లేవా ?అన్ని పాదాలలోనూ నీటిని గురించిన విశేషణం వాడారు.మేఘం లో నీళ్ళుంటాయి భద్రాంగ=తుంగభద్ర,మున్నీరు అంటే సముద్రము.రెండవ పాదం లో పన్నీరు.



సిరిగల వానికెయ్యెడల చేసిన దానమది నిష్ఫలం బగున్
నేరగురి గాదు పేదలకు నేర్పున జేసిన సత్ఫలం బగున్
వరపున వచ్చి మేఘుడొక వర్షము వాడిన చేలమీదటన్
కురిసిన గాక అంబుధి లం గుర్వగ నేమి ఫలంబు భాస్కరా
అర్థము:--- ధనవంతులకు చేసిన దానము వ్యర్థమగును. అదే పేదవానికి చేసిన ఫలిత ముండును. వర్షము ఎండిన చేల మీద కురిసిన మంచిది గాని సముద్రములో కురిసిన వ్యర్థమె యగును కదా ! (కానీ లోకములో
ఉన్నవాళ్ళూ వున్నవాళ్ళకే యిస్తారు, లేని వారూ వున్నవారికే యిస్తారు)



ఉత్తమే క్షణ కోపస్యాత్ మధ్యమే ఘటికా ద్వయం
అధమేస్యాత్ దహోరాత్రం పాపిస్టే మరణాంతకం
అర్థము:ఎవరి మీదైనా కోపము వచ్చినప్పుడు ఉత్తమునియందు ఒక క్షణ కాలము మాత్రమే ఉండును
మధ్యముని యందు రెండు ఘడియలు మాత్రమే యుండును
అధముని యందు యొక ఆహోరత్రముండును (ఒక రాత్రి ఒక పగలు)
చచ్చేంత వరకు కోపము మనసులో పెట్టుకొని యుండు వాడు
పాపిష్టి అని అనబడుతాడు (అధమాధముడు)


జొన్నకలి జొన్నంబలి
జొన్నన్నము జొన్న పిసరు జొన్నలె తప్పన్
సన్నన్నము సున్న సుమీ
పన్నుగ పలనాటి సీమ ప్రజలందరకున్
అని శ్రీనాథుడు వెక్కిరిస్తే ఒక ఆధునిక కవి డా.కోడూరి ప్రభాకర రెడ్డి గారు యిలా అంటున్నారు.
జొన్నల నిజరుచి నెరుగని
అన్నా! నీదేమి నాల్క అయ్యో పో,నీ
సన్నన్నమే పస లేనిది
చెన్నుడు నిను మెచ్చ నేమి శ్రీనాథ కవీ!

నూనె వంకాయ కూరతో పూని దిన్న
రుజువు దొరికెడు జోన్నరోట్టే రుచులు
జొన్నయంబలి మజ్జిగ జుర్రు వేళ
తేనె సుధలును చప్పగా తేలి పోవే



పెద్దన గారు తన "మనుచరిత్ర" లోప్రవరుడి నీ అతని శీలాన్నీ అద్భుతంగా వర్ణించారు.బ్రాహ్మణుడంటే ఎలా వుండాలో చాలా చక్కగా చెప్పారు.
ఆ పురి బాయకుండు మకరాంక శశాంక మనొజ్ఞ మూర్తి భా
షా పర శేష భోగి వివిధాద్వరనిర్మల ధర్మ కర్మ దీ
క్షా పరతంత్రు డంబురుహ గర్భ కులా భరణం బనారతా
ధ్యాపరతత్పరుండు ప్రవరాఖ్యు డలేఖ్యతనూ విలాసుడై
అర్థము:--ప్రవరుడు చంద్రుడి వలె అందమైన వాడు భాషలన్నిటిలోనూ పటుత్వము గలవాడు వివిధ వైదిక విధులను ధర్మముగా నెరవేర్చువాడు,బ్రాహ్మణ కులానికే ఆభరణము వంటివాడు.నిరతాగ్ని హోత్రి అటువంటి ప్రవరుడు అరుణా స్పద పురమును విడువకుండా అక్కడే వుండేవాడు
తీర్థ సంవాసు లేతెంచి నారని విన్న నెదురుగా నేగు దవ్వెంత యైన
ఏగి తత్పదముల కరిగి యింటికి దెచ్చు దెచ్చి ఇష్టాన్న సంతృ ప్తులుగా జేయు
జేసి కూర్చున్నచో చేర వచ్చు వచ్చి తీర్థ మాహత్మ్యముల్ తెలియ నడుగు
నడిగి బోవలయు జూడ నంచు నిట్టూర్పులు నిగుడ్చు తీర్థ సందర్శనా భిలాష
మాత్మ నుప్పొంగ నత్తరుణా గ్నిహోత్రి
అర్థము:-- ఎవరైనా పుణ్య తీర్థాలను దర్శించి వచ్చినారని తెలిస్తే వారిని చూసేందుకు ఎంత దూరమైనా
వెళ్ళేవాడు,వెళ్లి వారి పాదములకు నమస్కరించి యింటికి దోడ్కొని వచ్చి వారికి యిష్ట మైన పదార్థాలన్నీ
వండించి పెట్టి వారిని సంతోష పరిచేవాడు.తరువాత ఆ తీర్థ మహిమలను అడిగి తెలుసుకునే వాడు.తెలుసుకొని నేను ఎప్పుడు పోవలెనో నాకు చూడవలెనని ఆసక్తిం మెండుగా వుంది అని నిట్టూర్పులు విడుస్తూ వుండేవాడు.
ఆ ప్రవరుడింటికి ఒక యోగి వచ్చాడు.ఆయన ప్రవరుని ఆసక్తి గమనించి ఒక పసరు ప్రవరుని కాలికి పూస్తాడు.దానితో కోరుకున్న చోటికి యెగిరి పోవచ్చు అని చెప్తాడు.ప్రవరుడు తనకు హిమాలయాల్ని చూడాలని వుంది అని మనసులో తలచినంతనే అతను హిమాలయాల్లో వుంటాడు.అక్కడి అందాలన్నీ చూసి పరవశించి పోతాడు.హిమాలయాలను యిలా అద్భుతం గా వర్ణించాడు.
అట జని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సర ఝరీ
పటల ముహుర్ముర్ముహుర్లుఠద భంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్క రేణు కరకంపిత సాలము శీత శైలమున్
తా:-- అట్లు ప్రవరాఖ్యుడు పోయి హిమవత్పర్వతమును చూచెను.అందు ఆకాశము నంటు శిఖరాగరముల నుండి ప్రవహించు సెలయేర్ల యలల చప్పుళ్ళు మద్దేల్ల మ్రోతల వలెవిన బడగా పించములు విప్పుకొని యా ధ్వని కి తగినట్లు నెమిళ్ళు ఆడుచున్నవి.దాని నడిమి ప్రదేశ మందు గజములు తొండములతో
చెట్లను బట్టి వూగులాడించు చున్నవి.
అలా సంచరించుచూ ఆ అందాలను ఆస్వాదిస్తూ తనను తాను మరిచి పోతాడు.తటాలున సమయము మించి పోతూ వుందని గుర్తు కొస్తుంది యింటికి వెళ్ళిపోవాలని తలుస్తాడు.కానీ మంచుకు కాలికి సిద్ధుడు పోసిన పసరు కరిగి పోయి పోలేక పోతాడు.అప్పుడు యిలా అనుకుంటాడు
ఎక్కడి యరుణాస్పద పుర
మెక్కడి తుహినాద్రి క్రొవ్వి యే రాతగునే
అక్కట మును చనుదెంచిన
ద్రిక్కిది యని యెరుగ వెడలు తెరవేయ్యదియో
ఎక్కడి అరుణాస్పద పురము ఎక్కడ ఈ హిమాలయము నేను క్రొవ్వి యిక్కడి రావచ్చునా?అయ్యో ఇక్కడికి వస్తే యిలా అవుతుందని నాకు తెలియలేదే యిప్పుడుమా వూరికి వెళ్ళుటకు దారి ఎవరు చెప్తారు?
నన్ను కానక నా తల్లిదండ్రులు యెలా తల్లడిల్లిపోతున్నారో అనుకుంటూ
నను నిముసంబు గానక యున్న నూరెల్ల నరయు మజ్జనకు దెంతడలు నొక్కొ
ఎపుడు సంధ్యల యందు నిలు వెళ్లనీక నన్నోమెడు తల్లి యెం తొరలు నక్కొ
యనుకూలవతి నాడు మనసులో వర్తించు కులకాంత మది నెంత కుండు నొక్కొ
కెడ దోడు నీడలై క్రీడించు సచ్చాత్రు లింతకు నెంత చింతితు రొక్కొ
యతిథి సంతర్పణంబు లేమయ్యే నొక్కొ
యగ్ను లేమయ్యే నొక్కొ నిత్యంబు లైన
కృత్యముల బాపి దైవంబ కినుక నిట్లు
పార వైచితె మిన్నులు బడ్డ చోట
నేను నిముషము కనపడకుంటే ఊరంతా వెతికే నా తండ్రి ఎంత దిగులు పడతాడో,పొద్దున్న సాయంత్రము
బయటకు వెళ్ళవద్దని చెప్పే మా తల్లి ఎంత బాధ పడుతుందో.అనుకూలవతియై నా మనసెరిగి నడుచుకునే
నాభార్య మనసులో ఎంత కుములుతుందో, ఎప్పుడూ తోడునీడల వలె నా వెంట తిరుగు నా శిష్యులు ఎంత చింతిచు చుందురో, అతిథి సంతర్పణలు ఏమయ్యాయో ,అగ్నులేమయ్యాయోనిత్య కృత్యములకు దూరము చేసి దేవుడు నామీద అలుక తో ఈ ఆకాశమూ భూమికలియు చోటికి తెచ్చి పడేశాడే.
అలా ఆలోచిస్తూవెడుతూ వుంటే ఆడవాళ్ళు ఒంటికి పూసుకునే పునుగు జవ్వాది మొదలైన వాటి వాసన అతని ముక్కుకు సోకినాయి.యిక్కడ ఎవరోమనుషులు ఉన్నట్టున్నారు అనుకోని ఆ వాసన వచ్చిన
దారినే పోతాడు అక్కడ ఒక దివ్యమైన సుందరి వీణ వాయిస్తూ కూర్చుని వుంటుంది ఆవిడ దగ్గారికి వెళ్లి
ఎవ్వతె వీవు భీత హరిణేక్షణ యొంటి జరించె దోట లే
కివ్వన భూమి భూసురుడ నే ప్రవరాఖ్యుడద్రోవ తప్పితిన్
గ్రొవ్వున నిన్నగాగ్రమునకున్ జనుదెంచి పురంబు జేర నిం
కెవ్విధి గాంతు దెల్పగదవే తెరువెద్ది శుభంబు నీకగున్
తా:-- భయము లేకుండా యిక్కడ తిరుగాడు తున్న ఓ! సుందరీ నీవెవరు?నేను త్రోవ తప్పి కొవ్వెక్కి ఈ పర్వాతాగ్రమునకు వచ్చినాను మా నగరమునకు యెట్లు వెళ్ళ వలెనో చెప్పవా నీకు మంచి జరుగుతుంది.
నేను ప్రవరుడు అను పేరు గల బ్రాహ్మణుడను.
అతని అందాన్ని ఆశ్చర్యముతో చూసి యిలా అనింది ఆ సుందరి.
ఇంతలు కన్నులుండ దెరు వెవ్వరి వేడెదు భూసురేంద్ర యే
కాంతము నందు నున్న జవరాండ్ర నెపం బిడి పల్కరించు లా
గింతియగాక నీ వెరుగవే మును వచ్చిన త్రోవ చొప్పు నీ
కింత భయంబు లేకడుగ నెల్లిద మైతిమి మాట లేటికిన్
తా:-- ఓ విప్రుడా! చేరెడేసి కళ్ళు పెట్టుకొని త్రోవ అడిగేదవేమి?ఒంటరిగా వున్నవయసు గత్తెలను పలకరించు నెపము లాగున్నది.కాకపోతే నీవెలా వచ్చితివో ఆ త్రోవనే నీకు తెలియదా?యింత భయము లేకుండా అడుగు తున్నావు అంత తేలికై పోయామా?ఇందులోఇంతలు కన్నులు అనడం లో ప్రవరుని కన్నులు విశాలముగా నున్నవని మెప్పు,భూసురేంద్ర అనడం లో ఇంద్రుడి లాగ రసికుడవు అనే భావము,
ఏకాంతము నందు నున్న జవరాలు అంటే నేను ఏకాంతముగా వున్నాను మనం యధేచ్చగా విహరింప వచ్చు ననే భావము,జవరాలని చెప్పుట లో యౌవ్వన వతిని అని భావము తెలుపుట ను సూచిస్తూ
నర్మ గర్భముగా పలికింది వరూధిని.
నాకు అటువంటి అభిప్రాయము లేదమ్మా నిజముగానే నేను దారి తప్పి పోయినాను.అంటాడు ప్రవరుడు అమాయకంగా అప్పుడు ఆమె
నా పేరు వరూధిని నేను అప్సరస కాంతను.ఘ్రుతాచి,తిలోత్తమ మొదలగు వారు నాకు చెలికత్తెలు.అని కూడా చెప్పింది.తిరిగి తిరిగి అలసి పోయినావు కాసేపు యిక్కడనే విశ్రమించి నా ఆతిథ్యమును స్వీకరించ రాదా?అని . అడుగుతుంది.లేదు తల్లీ!ఇప్పటికే ఆలస్యమైనది నేను యింటికి చేరుకోవాలి.యింట్లో అందరూ నేను కనపడలేదని చింత పడుతుంటారు,అప్సరసవు గాన నీకు నన్ను యింటికి చర్చే శక్తి వుంటుంది,దయచేసి ఎలాగైనా నన్నుమా యింటికి చేర్చు అని వేడుకుంటాడు ప్రవరుడు.అప్పుడు వరూధిని
ఎక్కడి యూరు కాల్ నిలువ కింటికి బోఎదనంచు బల్కేదీ
వక్కట మీ కుటీర నిలయంబులకున్ సరి రాక పోయెనే
యిక్కడి రత్న కందరము లిక్కడినందన చందనోత్కరం
బిక్కడి గాంగ సైకతము లిక్కడి ఈ లవలీ నికుంజముల్
తా:ఎక్కడి వూరయ్యా నీది?కాలునిలవకుండా పోతాను పోతాను అంటున్నావు?మీ కుటీరాలకంటే యిక్కడి
మణిమయమగు గుహలు ,ఈ పూపోద రిండ్లు,యిక్కడి మంచి వాసనతో గూడిన చందన వృక్షాలు, యిక్కడి గంగా యిసుక తిన్నెలు బాగా లేవా?
అంటుంది యింక యితనికి వివరంగా చెప్తేకానీ అర్థమయ్యేటట్టు లేదని భావించి నేను నిన్ను ప్రేమిస్తున్నాను
యిక్కడే వుండి నా తోబాటు సుఖ భోగాలు అనుభవించు.అని చెప్తుంది.అప్పుడు ప్రవరుడు
తరుణీ రేపును మాపు హవ్యముల చేతన్ దృప్తుడౌ వహ్నిస
త్కరుణా దృష్టి నొసంగు సౌఖ్యము లెరుంగన్ శక్యమే నీకు నా
కరణుల్ దర్భలు,నగ్నులున్ బ్రియము లైనట్లన్యముల్ గా వొడల్
తిరమే చెప్పకు మిత్తి తుచ్ఛ సుఖముల్ మీసాల పై దేనియల్
తా:--తరుణీ! పొద్దున్న సాయంత్రము హోమ ద్రవ్యములతో తృప్తి పడు అగ్నిదేవుని మంచి దృష్టి యిచ్చే సుఖము నేకేమి తెలుస్తుంది?నాకు అరణలు(అగ్నిపుట్టించే కర్రలు) దర్భలు,అగ్నులు తప్ప యింకేవీ ప్రియమైనవి కావు.ఈ శరీరము శాశ్వత మైనది కాదు.యిటువంటి అశాశ్వత సుఖములు నేను కోరను అవి
మీసాల పై తేనెల వంటివి.(కాసేపు మాత్రమె తృప్తి నిచ్చేవి).
అప్పుడు వరూధిని
ప్రాంచ ద్భూషణ బాహుమూల రుచితో పాలిండ్లు పొంగార బై
అంచుల్ మోవగ గౌగిలించి యధరం బాసింప హా! శ్రీహరీ
యంచున్ బ్రాహ్మణు డోర మోమిడి తదీయాంస ద్వయం బం టించి పొ
మ్మంచున్ ద్రోచె గలంచునే సతుల మాయల్ ధీర చిత్తంబులన్
తా:--వరూధిని తట్టుకోలేక అతన్ని కౌగలించుకుని ముద్దు బెట్టుకోపోగా ప్రవరుడు మొహం పక్కకు తిప్పుకొని హా శ్రీహరీ అంటూ తన రెండు చేతులతో ఆమెను త్రోసి వేశాడు.యిటువంటి ఆడవాళ్ళ మాయలు
ధీర చిత్తులను కలచి వేస్తాయా వేయవు. .
అప్పుడు వరూధిని
పాటున కింతు లోర్తురే కృపా రహితాత్మక నీవు త్రోవ ని
చ్చోట భవ న్నఖాంకురము సోకే కనుం గొనుమంచు జూపి య
ప్పాటల గంధి వేదన నెపం బిడి యేడ్చేకలస్వనంబుతో
మీటిన గబ్బి గుబ్బ చనుమిట్టల నశ్రులు చిందు వందగన్
దెబ్బలకు ఆడవాళ్ళు ఓర్చుకుం దురా ?దయలేనివాడా నీవు త్రోసినప్పుడు నీ గోరు గ్రుచ్చుకొని నాకు గాయమయింది చూడుఅని చూపించి కన్నీళ్లు ఆమె వక్షస్తలం పై పడుచుండగా తియ్యని స్వరం తోఏడ్చింది.
ప్రవరుడు ఆమె యేడ్పును పట్టించుకోలేదు.తాను అను నిత్యం పూజించే అగ్ని హోత్రుడిని తలచు కొన్నాడు
.
దాన జపాగ్ని హోత్ర పరతంత్రుడ నేని భవత్పదాం బుజ
ధ్యాన రతుం డ నేని పరదార ధనాదుల గోర నేని స
సన్మానము తోడ నను సదనంబున నిల్పు మినుండుపశ్చిమాం భోధి
లోన గ్రుంకకయ మున్నె రయంబున హవ్య వాహనా
అర్థము:-నేను దానము,జపము అగ్ని హోత్రము లనే నామనసులో నిలుపుకొను వాడనే అయినట్లయితే ,
పర భార్యలను,పర ధనమును ఆశించని వాడనైతే,నిన్ను భక్తితో కొలిచేవాడి నయినట్లయితే నన్ను నా యింటికి వెంటనే సూర్యాస్తమయము అయ్యే లోపల చేర్చు అగ్నిదేవుడా!
అని ప్రార్థించే సరికి ఆ అగ్ని దేవుడు అతన్ని యింటికి చేర్చి వేస్తాడు.అప్పటి నిష్టా గరిష్టు లైన బ్రాహ్మణులకు
ఆ శక్తి ఉండేదని అర్థమవుతుంది.


పుణ్యస్య ఫల మిచ్చంతి ' పుణ్యం నేచ్చంతి మానవా: :
న పాపఫల మిచ్చంతి ; పాపం కుర్వంతి యత్నతః .
అర్థము:-- : మానవులు పుణ్యమును చేయ నుత్సహించరు గాని పుణ్యము
చేయుట వల్ల గలుగు ఫలము కావాలని మాత్రం కోరుకుంటారు .
పాపం చేయటానికి నిరంతరం యత్నిస్తున్నారు గానీ పాప ఫలం తమకు
కలగ కూడదని కోరుకుంటారు.ఎంత విపరీతము .


పద్మాకరం దినకరో వికచం కరోతి
చంద్రో వికాసయతి కైరవ చక్రవాలం
న భ్యర్థితో జలధరోపి జలం దదాతి
సంతః స్వయం పరహితాభి యోగాః
అర్థము:--ఎవరూ ప్రార్థించకుండానే సూర్యుడు పద్మములను వికసింప జేస్తున్నాడు, చంద్రుడు కలువలను వికసింప చేయు చున్నాడు, అడుగకయే మేఘుడు వర్ష ధారలు గురిపించి జీవన దాన మొనర్చు చున్నాడు: సత్పురుషులు తమంత తామే పరహితమును చేయుటకు పరమోత్సాహము కలిగి యుందురు కదా!
(భర్తృహరి సుభాషితం)

ఆరోప్యతే శిలా శైలే యత్నేన మహతా యథా
నిపాత్యతే క్షణేనా ధః తధాత్మా గుణ దోషయో:
అర్థము:--- పర్వతము మీదికొక పెద్ద శిలను యెక్కించుట కెంత యో ప్రయత్నము అవసరము. దానినే ఆచటి నుండి క్రిందికి త్రోసివేయుట ఎంతో సులభము.అట్లే మానవునికి మంచివాడని కీర్తి పొందుట చాలా కష్టము. చెడ్డవాడనిపించు కొనుట ఎంతో సులభము.(హితోపదేశం)


విపదో నైవ విపదః సంపదో నైవ సంపదః
విపద్వి స్మరణం విష్ణో సంపత్త స్త్యైవ సంస్మృతి:
అర్థము:--ఆపదలంటే ఆపదలు కావు.
సంపదలంటే సంపదలు కావు. విష్ణువును విస్మ రిస్తే అదే ఆపద.
విష్ణువును స్మరిస్తే అదే సంపద.



స్వల్ప మపి దీప కణికా బహుళం నాశ యే త్తమః
స్వల్పేపి బోధో నిబిడం బహుళం నాశయేత్తమః
అర్థము:-- దీపము ఎంత చిన్న దైనను చీకట్లను పోగొట్టునట్లు ఉత్తమ గురువుల బోధనలు ఎంత కొద్దిగా ఉన్ననూ
అంతకంటే గొప్పదైన అజ్ఞానమనే చీకట్లను నశింప జేయును. (గ్రహించే శక్తి గల శిష్యునీకె యిది వర్తించును)



అఘటిత ఘటితం,ఘటయతి,సఘటిత ఘటితాని దుర్ఘటీ కురుతే
విధిరేవ తాని ఘటయతి యాని పుమా న్నైవ చిన్తయతి.(కాళిదాసు)
అర్థము:--మనిషి ఊహించను గూడా ఊహించలేని సంఘటనలను విధి జరిపిస్తుంది.జరగటానికి వీలుకాని
వాటిని జరిపిస్తుంది.జరిగిపోతున్న వాటిని స్తంభింప జేస్తుంది.ఘటనాఘటనలు విధి చేతులోనే వున్నాయి.
హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైర పి
లలాట లిఖితా రేఖా పరి మార్ష్ట్యుం న శక్యతే
హరి గానీ హరుడు (శివుడు) గానీ,బ్రహ్మగానీ,దేవతలు గానీ నుదిటిపై వ్రాతను చెరిపి వేయలేరు.మార్చలేరు.
ఏది జరగ వలిసి వుందో అది జరిగి తీరుతుంది (కాళిదాసు).
బహూనాం అల్ప సారాణాం సమవాయో దురత్యయః
తృ ణై: విధీయతే రజ్జు: బంధ్యతే తేన దంతినః
అర్థము:-- బలహీనులైన వారు పలువురు కలిస్తే ఆ కూటమిని జయించటం ఎంత బలవంతుడి కైనా కష్టం
గడ్డి పోచలను తాడుగా పేని ఆ తాటి తో ఏనుగునులను బంధించవచ్చు గదా!(కాళిదాసు.)
కాళిదాసు పై అసూయతో మిగతా కవులు కుట్ర చేసి భోజుడి తో కాళిదాసును ఆస్థానము నుండి బహిష్కరించేలా చేసిన సందర్భం లో కాళిదాసు చెప్పుకున్న శ్లోకాలు.అంటే గడ్డిపోచల్లాంటి కవులంతా
ఏకమై ఏనుగు లాంటి నన్ను బంధించి బయటికి పోయేలా చేశారు కదా! విధి ఎటువంటి పని నైనా చేయిస్తుంది అని భావము.కాళిదాసును విలాసవతి తన యింట్లో రహస్యంగా దాచి వుంచింది..
కాళిదాసు వెళ్ళిపోయిన తర్వాత భోజరాజుకు కవుల కుట్ర తెలిసింది.ఆయన వారిని ఏమీ అనకుండా ఒక సమస్య యిచ్చాడు. "తులనాం అన్వను సరతి గ్లౌ: ముఖ చంద్రస్య స ఖలు ఏతస్యా:"చంద్రుడు యీమె ముఖ చంద్రుడి తో సమానత్వాన్ని నిశ్చయంగా అనుస రిస్తున్నాడు.ఈ సమస్యను పూరించ లేకపోతే
మీరెవ్వరూ నా రాజ్యం లో వుండ డానికి వీలు లేదు,అని అన్నాడు.మాకు ఏడు రోజుల గడువు యివ్వమన్నారు కవులు.భోజుడు ఒప్పుకున్నాడు.
వారంతా సమావేశ మై కుట్ర చేసి కాళిదాసును వెళ్ళగొట్టాము.తప్పుచేసాము యిప్పుడు ఆయాన తప్ప ఈ సమస్యను ఎవరూ పూర్తి చెయ్య లేరు
.
సామాన్య విప్ర ద్వేషేచ కులనాశో భవేత్ కిల
ఉమా రూపస్య విద్వేషే నాశః కవికులస్య హి
సామాన్యుడయిన బ్రాహ్మణుడిని ద్వేషి స్తేనే కుల నాశనం జరుగుతుంది కాళీ రూపుడయిన కాళిదాసును ద్వేషి స్తే కవికులానికే నాశనం సంభవిస్తుంది
.
వాళ్ళందరూ ఎడ్ల బళ్ళు కట్టుకొని వూరు విడిచి పారిపోవడానికి బయల్దేరారు.వేశ్యా గృహం లో దాగి వున్న కాళిదాసు యిది చూసి వారెందుకు,ఎక్కడకు వెళ్ళు తున్నారో కనుక్కొని రమ్మని పరిచారిక ను పంపించాడు. ఆ అమ్మాయి విషయం కనుక్కొని వచ్చి యిలా చెప్పింది.
ఏకేన రాజహంసేన యా శోభా సరసః భవేత్
న సా బాకా సహస్రేణ పరితః తీర వాసినా
ఒక్క రాజహంస వల్లసరసుకు యెంత శోభ కలుగుతుందో అలాంటి శోభ సరసు చుట్టూ మూగిన కొంగల వల్ల
కలుగుతుందా?కలుగదు. అప్పుడు కాళిదాసు .అయ్యో వాళ్లకు ఏమి ఆపద కలిగిందో నేను వాళ్లకు సహాయ పడాలి.
కిం పౌరుషం రక్షతి యేన నార్తాన్ ?
కిం వా ధనం నార్థి జనాయ యత్ స్యాత్
సా కా క్రియా యా న హితాను బద్ధా ?
కిం జీవితం సాదు విరోధి యద్యై:
అర్థము:--ఆర్తులను రక్షించ లేని పౌరుషం ఏమి పౌరుషం?యాచక జనులకు యివ్వని ధనం వుండి ఏమి లాభం?అందరికీ హితం కాని పని ఎందుకు?సజ్జనులతో విరోధం పెట్టుకుంటే మంచిది కాదు.అనుకోని
వేషం మార్చుకొని పారిపోతున్న కవులను కలిసి పండితులారా!భోజ సభను అలంకరించే పండితులు,
బృహస్పతులు మీరు ఎక్కడికి పారిపోతున్నారు?అందరూ క్షేమమే కదా!నేను భోజరాజు దర్శనం కోసం కాశీ నుండి వస్తున్నాను.అన్నాడు.అందుకు వారు అయ్యా పరదేశీ!మాకు భోజరాజు ఒక సమస్య యిచ్చాడు.అది పూరించలేకపోతే దేశ బహిష్కారమే అన్నాడు. మాకు పూరణ రాలేదు అందుకనే వెళ్లి పోతున్నాము. అన్నారు.ఏమిటా సమస్య నాకు చెప్పండి నేను ప్రయత్నిస్తాను అన్నాడు కాళిదాసు.అప్పుడు కవులు
" తులనాం అన్వను సరతి గ్లౌ: ముఖ చంద్రస్య స ఖలేతస్యః" కాళిదాసు వెంటనే
అను యితి వర్ణ్యతే, కథ మనుకృతి:తస్య ప్రతిపది చంద్రస్య
తా:--నిశ్చయంగా అన్నారు కానీ ఆమె ముఖ చంద్రుడితో పోలిక పాడ్యమి చంద్రుడికి ఎలా సాధ్య మవుతుంది?
అంటే చంద్రుడికంటే ఆమె ముఖ చంద్రుడే అందం గా వున్నాడు.పాడ్యమి నాడు చంద్రుడు అందంగా వుండ డు కదా! ఈమె ఎప్పుడూ అందంగానే వుంటుంది?అందుకని చంద్రుడి తో యీమె ముఖాన్ని పోల్చ లేము కదా! అని భావము.
ఆ పూరణ ని వారు రాజుకు విని పించారు.ఆ శ్లోకం వినగానే భోజరాజుకు యిది కాళిదాసు యొక్క పూరణ నే యని అర్థమయింది.దొరికి పోయాడు కాళిదాసు మరీ షరా మామూలే క్షమాపణ కోరడం కాళిదాసును మరీ ఆస్థానానికి పిలుచుకొని రావడమే.
గొప్ప వారెప్పుడూ తమకు కీడు చేసిన వారికి మేలు చెయ్యడానికే ప్రయత్నం చేస్తారు.అదే కాళిదాసు యొక్క గొప్పతనం



విజయనగర సామ్రాజ్యం లోని ఒక వూరిలో అక్కిసెట్టి అనే ఒక కోమటి వుండేవాడట.అతను గుగ్గిళ్ళు చేసి అమ్ముతూ వుండే వాడట.అతనికి తెనాలి రామకృష్ణుడు అన్ని పద్యాలు చెప్తాడు కదా!నేనూ కవిత్వం వ్రాస్తే
బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది.రామకృష్ణుడి దగ్గరికి వెళ్లి కవిత్వం వ్రాయడానికి చిట్కా లేమైనా చెప్పమని అడిగాడు.రామకృష్ణుడు నీకు ఈ కవిత్వం వ్రాయాలనే పిచ్చి ఎందుకు?అందరికీ కవిత్వం పట్టుబడదు. హాయిగా గుగ్గిళ్ళు అమ్ముకుంటూ బ్రతుకు అని నచ్చ చెప్పాడు.కానీ ఆ కోమటి కాదుకూడదు మీరు నాకు చిట్కాలు చెప్పాల్సిందే అని పట్టు బట్టాడు.అప్పుడు రామకృష్ణుడు సరే అయితే పున్నమి రాత్రి
వెళ్లి ఏదైనా మంచి తోటలో చెట్టుక్రింద కూచుని ఆలోచిస్త్తూ వుండు ఏదైనా స్ఫురించ వచ్చు అని చెప్పి పంపించాడు.సరే నని ఆ అక్కిసెట్టి పున్నమ నాటి రాత్రి ఒక తోటలో కూర్చుని ఆలోచిస్తున్నాడట.అలా చంద్రుడిని చూస్తూ వుంటే అతనికేదో స్ఫురించింది వెంటనే వ్రాసుకున్నాడు.
'పున్నమి వెన్నెల కాసెగా'
అది చాలా బాగుంది అని పించింది సెట్టికి యింక ఉత్సాహం వచ్చేసింది ఒక పాదం వచ్చింది కదా అని ఆలోచిస్తూ వుంటే ఒక కోయిల కుహూ కుహూ అని కూసింది. వెంటనే అతనికి యింకో పాదం స్ఫురించింది
'పొన్న పై కోయిల కూసెగా' చాలా బాగుంది అనుకున్నాడు.యింక యెంత ఆలోచించినా మూడో పాదం రాలేదు అప్పటికే అర్ధరాత్రి అయి పోయింది యింక యివ్వాల్టికి చాలని యింటికి వెళ్లి పోయాడు. యింటికి వెళ్ళగానే చూస్తే ఎప్పుడో ప్రొద్దున చేసిన గుగ్గిళ్ళు అన్నీ పాసిపోయాయి.ఆ దినం ఆదాయం కూడా పోయింది.అయినా అతనికి వెంటనే యింకో పాదం స్ఫురించింది.
'అంగట్లో గుగ్గిళ్ళు పాసేగా'
అదీ వ్రాసుకున్నాడు.నాలుగో పాదం యెంత ఆలోచించినా రాలేదు యింక రేపు చూసుకోవచ్చు లే అని పడుకున్నాడు.ప్రోద్దునలేచి యెంత ప్రయత్నించినా నాలుగో పాదం రాలేదు.సరే అనుకోని రామకృషుని దగ్గరకు వెళ్లి మూడు పాదాలూ వినిపించాడు.నాలుగో పాదం చెప్పమని బ్రతిమలాడాడు.
పున్నమి వెన్నెల కాసెగా
పొన్న పై కోయిల కూసెగా
అంగట్లో గుగ్గిళ్ళు పాసెగా
రామకృష్ణుడు వెంటనే 4వ పాదం అక్కి శెట్టి ముండ మోసెగా
అంటే వ్యాపారం జరుగక అక్కిసెట్టి నష్ట పోయాడు. అని దాని అర్థం .
నేను చెప్పాను కదా! కవిత్వము అందరికీ రాదు అనీ వెళ్లి చక్కగా వ్యాపారం చేసుకో అని బుద్ధి చెప్పి పంపించేశాడు.అక్కిసెట్టి బుద్ధిగా వ్యాపారం చేసుకుంటూ బ్రతికేసాడు.ఈ కథ మీ పిల్లలకు చెప్పండి.నవ్వుకోడానికి బాగుంటుంది. 



 కర్మ ణో హి ప్రధానత్వం కిం కుర్వన్తి శుభాశుభా
వసిష్ఠ దత్త లగ్నోపి ,రామః కిం భ్రమతే వనే
అర్థము:--జ్యోతిష్య శాస్త్రం కంటే మన కర్మ నే ప్రధాన మైనది. పండితుల శుభాశుభ నిర్ణయాలు కర్మను తప్పించ లేవు.వశిష్టు డంతటి వాడు పట్టాభిషేకానికి నిరయించిన ముహూర్తం లో రాముడు అరణ్యాల పాలవ లేదా?యింత కంటే నిదర్శనం యింకేమి కావాలి? యెంత జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేసినా కొన్ని విఫల మవడానికి మన పూర్వజన్మ కర్మయే కారణము.విధి నెవ్వరూ తప్పించ లేరు.



భవభూతి మహా కవి తన "ఉత్తరరామచరిత్ర" నాటకం పూర్తి చేసిన తర్వాత,దాన్ని ఆ కాలం లో ప్రసిద్ధు డైన
కాళిదాస మహా కవికి చూపించి ఆయన అభిప్రాయం తెలుసుకోవాలని కొన్నాళ్ళు తహతహ లాడాడు. బాణభట్టు లాగానే.
తీరా నాటక మంతా చదివాక మహాకవి ఏమంటాడో అని బాణుడి లాగానే ఒక శంక కలిగింది.అందువల్ల తను స్వయంగా కాళిదాసు కు తన నాటకం చూపించటానికి సంశయించి,తన కుమారుడికి తాళపత్ర గ్రంథం యిచ్చి
కాళిదాసు యింటికి పంపాడు,
అతను వెళ్ళేటప్పటికి కాళిదాసు చదరంగం ఆడుకుంటున్నాడు. మీరు కొంచెం సమయం యిస్తే,మా నాన్నగారి
నాటకం మీకు వినిపించి మీ అమూల్యమైన మీ అభిప్రాయం తెలుసుకుందామని వచ్చాను.అన్నాడు భవభూతి కుమారుడు.వేరే సమయ మెందుకు?వచ్చావు కదా చదివి వినిపించు ఒక చెవి పడేసి వింటాను.అన్నాడు కాళిదాసు చదరంగం బల్ల మీది నుండి దృష్టి కూడా మరలించకుండా.భవభూతి కుమారుడికి మనసు చివుక్కుమంది.తన తండ్రి వ్రాసిన మహా కావ్యాన్ని శ్రద్ధ పెట్టి వినేందుకు కూడా
యిష్టం లేని ఈ అహంభావికి నాటకమంతా వినిపించడం చెవిటివాని ముందు శంఖమూది నట్లు గదా అనిపించింది.కానీ ఏం చేస్తాడు?తన తండ్రి కి కాళిదాసు గురుతుల్యుడు అంతకంటే ఎక్కువ.ఈయన అభిప్రాయం తెలుసుకుంటే తప్ప ఆయనకు మనశ్శాంతి లేదు.చేసేది లేక నాటక మంతా చదివి వినిపించాడు.చదివాడు కానీ కాళిదాసు ఒక ముక్కన్నా విన్నాడని అతనికి నమ్మకం లేదు.ఆయన మానాన ఆయన చదరంగం ఆడుకుంటూ కూర్చున్నాడు.యిటు పక్కకు తిర్గి చూడను కూడా చూడలేదు.
అంతా చదివాక,నోటినిండా తాంబూలం తో అస్పష్టంగా ఏదో అన్నాడు.ఏదో సున్న ఎక్కువైంది.అని మాత్రం
వినిపించింది.భవభూతి కుమారుడికి ఓహో!ఈ వ్యసనపరుడైన అహంభావికి తాంబూలం లో సున్నం ఎక్కువై నట్టుంది దాని మీద వున్న ఆసక్తి కూడా ఈయనకు యితరులు వ్రాసిన కావ్యాల మీద లేదు.
అనుకున్నాడు.ఆ నిర్లక్ష్యం,అనాసక్తి అతన్ని బాగా నొప్పించాయి.
ఒక నమస్కారం చెప్పి యింటికి వెళ్లి జరిగినదంతా తండ్రికి చెప్పాడు.విని ఆయన కూడా చిన్నబుచ్చుకున్నాడు.
తండ్రీ కొడుకులిద్దరూ యిలా దిగాలుగా కూర్చుని వుండగా కాళిదాసే భవభూతి యింటికి వచ్చాడు.వస్తూనే భవభూతిని కౌగలించుకొని 'ఎంత గొప్పగా రాశావయ్యా!గ్రంథం'అని మెచ్చుకున్నాడు.భవభూతి ఆయనను
కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేశాడు.
మాటల మధ్యలో భవభూతి కాళిదాసు తో మహాకవీ! నా కుమారుడు మీకీ నాటకం వినిపించినప్పుడు,మీరు పనిలో వుండి శ్రద్ధగా వినలేక పోయారని చెప్పాడు.అంతా విన్న తర్వాత కూడా మీరు నాటకం విషయం ప్రస్తావించకుండా,మీ తాంబూలం లో సున్నం ఎక్కువవటం గురించి మాత్రం ఏదో అన్నారని చెప్పాడు.
మీరేమో యిప్పుడు నాటకాన్ని యింతగా ప్రశంసిస్తూ వున్నారు.ఏదో సాటికవినని మర్యాద తో మీరిలా అంటున్నారను కుంటాను.మీరేమీ అనుకోక పొతే,మరోసారి నాటక మంతా నేనే చదివి వినిపిస్తాను.అన్నాడు భవభూతి.ఈ సారయినా మీ సూచనలూ,అభిప్రాయమూ నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తాను.అన్నాడు.
కాళిదాసు నవ్వాడు. కవిరాజా! నాకు కావ్య రచన లో, కావ్య పఠనమ్ లో, శ్రవణం లో వున్న ఆసక్తి మరే విషయం పైనాలేదు.మీ చిరంజీవి చదువుతున్నప్పుడు నేను మీ కావ్యం క్షుణ్ణంగా,శ్రద్ధగా విన్నాను.
పూర్తి ఏకాగ్రతతో.మీరు కావాలంటే నేను ఆ నాటకం ఆమూలాగ్రం ఇప్పటికిప్పుడు తిరిగి చెప్పగలను.
నాటకం నాకు ఎంతో నచ్చింది.నేనన్న మాటలు పై పై మర్యాదకు చెప్పినవి కాదు.అన్నాడు.యింక సున్నం విషయమా?మీ అబ్బాయి నేనన్నది సరిగ్గా వినలేదు.నేనన్నది సున్నం గురించి కాదు 'సున్న' గురించి
నాటకం లో ఒకే ఒక చోట ఒక సున్న ఎక్కువైందేమో,ఆ సున్నా తీసేస్తే శ్లోకం మరింత రమ్యంగా వుంటుందేమో అనిపించింది.అందుకని చిన్న సూచన చేశాను.అది తప్ప మీ అద్భుత మైన నాటకం లో ఏ చిన్న మార్పూ అవసరం అని నాకు అనిపించటం లేదు.
భవభూతి పొంగిపోయాడు.ఉత్సాహంగా ఏ శ్లోకం లో స్వామీ ! నాటకం లో శ్లోకాలన్నీ మళ్ళీ చదివి వినిపిస్తాను దయచేసి చెప్పండి.అన్నాడు.
ఆ అవసరం లేదు నీ కావ్యం లో ఏ శ్లోక మైనా నేను మరిచి పొతే గదా నువ్వు నాకు గుర్తు చేసేది?మొదటి అంకం లోనే,రాముడు తను అరణ్యవాసం లో సీతతో గడిపిన తోలి రోజులు గుర్తు చేసుకుంటూ వుండే సందర్భం లో ఒక మనోహరమైన శ్లోకం చెప్పావు.
కిమపి కిమపి మందంమంద మాసక్తి యోగాత్
ఆవిరళిత కపోలం జల్పతోర క్రమేణ
అ శిధిల పరిరంభ వ్యాపృ తై కైక దోష్నో
అవిదిత గతయామా రాత్రి రేవం వ్యరం సీత్
అ శిధిల పరిరంభ వ్యాపృత ఏక ఏక దోష్నో = అతి సన్నిహితంగా ఒకరి బాహువుల్లో ఒకరు ఒదిగి ఒదిగి
ఆవిరళిత కపోలం =చెక్కిలికీ చెక్కిలికీ మధ్య స్థలం లేకుండా
ఆసక్తి యోగాత్ అక్రమేణ కిమపి కిమపి మందం మందం జల్పతో = ఆసక్తి బట్టే తప్ప మరే వరసా ,క్రమం లేకుండా ఏవేవో ముచ్చట్లు గుసగుసలుగా చెప్పుకుంటున్న మనకు
అవిదిత గత యామా రాత్రి: ఏవం వ్యరం సీత్ = తెలియకుండా దోర్లిపోయిన జాములు గల రాత్రి యిలా గడిచి పోయింది.
అవునవును అన్నాడు భవభూతి
అందులో రాత్రి రేవం వ్యరం సీత్ (రాత్రి యిలా గడిచి పోయింది)అనే బదులు రాత్రి రేవ వ్యరం వసీత్(రాత్రే గడిచి పోయింది మాటలు యింకా మిగిలే వున్నాయి)అని చెప్తే మరీ బాగుంటుంది.పరస్పరం అనురక్తులైన
దంపతుల మాటలు యెడ తెగనివి అలా వుంటూనే వుంటాయి రాత్రి జాములు దోర్లిపోతూనే వుంటాయి
అని అందమైన భావం వస్తుంది అన్నాడు కాళిదాసు.
ఆవశ్యం మహా కవీ! ఎంత అద్భుత మైన మార్పు సూచించారు.అందుకే తమరు కవికుల గురువులు
అన్నాడు ఆనందభాష్పాలతో భవభూతి.
అదేమీ లేదు మీ అంతటి వారు మీరు మహాకవులు.
'నాటకేషు చ కావ్యేషు వయం వా వయమేవ వా
ఉత్తరే రామ చరితే భవభూతి: విశిష్యతే '
నాటక రచనలో,కావ్య రచనలో మాకు మేమే సాటి.ఉత్తరరామ చరిత్ర లో మాత్రం భవభూతి మమ్మల్ని మించి పోయాడు.అని చెప్పక తప్పదు.అన్నాడు కాళిదాసు.
భవభూతి రచనలు మూడూ నాటకాలే
'ఉత్తరరామ చరితం" మాలతీమాధవం" మహావీర చరితం" భవభూతి కరుణ రసాన్ని ఎక్కువ అభిమానించాడు.



విద్యా ధనం శ్రేష్టం ధనం
తన్మూల మితరం ధనం
దానేన వర్ధతే నిత్యం
న భారాయ న నీయతే
అర్థము:--సంపద లన్నిటి లోనూ విద్యా సంపదే గొప్పది. ఇతర సంపద లన్నింటినీ విద్య వలన పొంద
వచ్చు. అది ఇచ్చిన కొలదీ పెరుగుతుంది ఎవరికీ బరువుగా తోచదు,దొంగలపాలు కాదు

హర్తకు గాదు గోచర మహర్నిశ మున్ సుఖ పుష్టి సేయు స
త్కీర్తి ఘటించు విద్య యను దివ్య ధనం బఖిలార్థ కోటికిన్
బూర్తిగ నిచ్చినన్ బెరుగు బోదు యుగాంతపు వేళ నైన భూ
భర్తలు తద్ధనాధికుల పట్టున గర్వము మాను టొప్పగున్
తా:--విద్యా ధనము దొంగలు హరింప లేరు,ఎల్లప్పుడూ సుఖాన్ని కలిగిస్తుంది, కోరిన వారికి ఎంత యిచ్చిననూ తరిగి పోదు యింకా పెరుగుతుంది.ప్రళయ కాలమప్పుడు కూడా నశించదు, యిట్టి విద్యా ధనము గలవారి నెదుర్కొను టకు ఎవ్వరునూ చాలరు, వీరి యెడ సామాన్య ధనము గల రాజులు దురాగ్రహమును విడిచి నదుచుకొనవలయును



దోష భీతే రనారంభః : తత్ కాపురుషస్య లక్షణం
కై రజీర్ణ భయా ద్భాంత్ర: ;భోజనం పరిహేయతే
అర్థము:---- తప్పులు జరుగ వచ్చుననే భయంతో ఏ పనీ అసలే ప్రారంభించ కుండా వుండడం తెలివిలేని వారి లక్షణం. అజీర్ణము చేయునేమో నని భయపడి ఎవరైనా భోజనమే మాని వేస్తున్నారా?

రాయల సభ లో ఒకసారి భట్టుమూర్తి ఒక సమస్య యిచ్చాడట. "కుంజర యూధంబు దోమ కుత్తుక సోచ్చేన్" అంటే ఏనుగుల గుంపు దోమ గొంతు లోప్రవేశించింది అని.
రామకృష్ణుడు వెంట నే లేచి యిలా పూరించాడట.
గంజాయి తాగి తురకల
సంజాతుల గూడి కల్లు చవిగొన్నావా
లంజల కొడకా ఎక్కడ
కుంజర యూధంబు దోమకుత్తుక సొచ్చెన్

రాయలు కోపోద్రిక్తుడై రామకృష్ణా ఇదేమి అసభ్య పూరణము అన్నాడట. అప్పుడు తెనాలి వారు పెద్దనాది కవులకు ఈ భట్టు కవి సమస్య యిచ్చేంతటి వాడా?ఇతనికి యిట్టి పూరణ యే తగును.అన్నాడు.. రాయలు కోపంగా అయితే ఈ సమస్య నేనే యిస్తున్నాను పూరించు అన్నాడట. అప్పుడు తెనాలి వారు
రంజన చెడి పాండవులరి
భంజనులై విరటు గొల్వు పాలై రకటా
సంజయా విధి నేమందు
కుంజర యూధంబు దోమ కుత్తుక సోచ్చెన్. అర్థము:- పాండవులు వైభవము కోల్పోయి శత్రువుల చేతులో భంగ పడి విరాట రాజు కొలువులో చేరారు కదా!యిది ఏనుగుల గుంపు దోమ గొంతు లో ప్రవేశించడం లాంటిదే కదా!
అప్పుడు రాయలు నవ్వుతూ నీ కత్తికి రెండు వైపులా పదునే రామకృష్ణా అన్నారట.
ఒకసారి ద్విశతావధానములొ యిలాంటిదే సంస్కృత సమస్య యిచ్చారు. ఆ అవధానం రవీంద్ర భారతి లో జరిగింది. సమస్య:- "మశక దశన మధ్యే వారణా సంచరం తి" అంటే దోమ దంతాల మధ్యన ఏనుగులు తిరుగు తున్నాయి అని. నాగఫణి శర్మ గారి పూరణము.
విపుల రహిత దేశే శ్రీ రవీంద్ర ప్రదేశే
ద్విశత సు కవి మాన్యా సంచరంతీతి చిత్రం
యిదమద పరి దృశ్య ప్రౌఢ విద్యా వదంతి
మశక దశన మధ్యే వారణా సంచరంతి. అర్థము:--ఇరుకైన ఈ రవీంద్ర భారతి లో రెండు వందల మంది పండితులు (పృచ్చకులు)అటూ యిటూ తిరుగుతుంటే ఆ దృశ్యం దోమ దంతాల మధ్య ఏనుగులు తిరుగాడు తున్నట్టుంది.

ఈ సమస్య 1918 లో నెల్లూరు లో జరిగిన శతావధానము లో కీ. శే. గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి గారి కి యిచ్చినది. ఆయన దీనిని పూరించారు. "పతి తల గోసి వండె నొక పాంథుని నాతి మనోహరంబుగన్"పూరణ
చం: కుతుకము మీర శ్రీగిరి కకుంఠిత భక్తిని బోవుచుండి వి
స్త్రుత నవపల్లవావృత దిదృక్షుముదావహ తింత్రిణీ కుజా
ప్రతిమపు నీడలో విడిసి పప్పుడుకేత్తేడు నంత నా కురు
ట్పతి తల గోసి వండె నొక పాంథుని నాతి మనోహరంబుగన్
అర్థము:--ఒక దంపతులు శ్రీశైలము నకు యాత్ర కు పోవుచున్నారు.ఒక చింత చెట్టు నీడలో వసతి చేసుకొని
వంట చేసుకోను చున్నారు. భార్య పొయ్యి మీద పప్పు ఉడుకుతున్న వేళ
ఆమె ఆ చింత చెట్టు చిగురు కోసి పప్పులో వేసి కమ్మగా వండినది.(ఆ కురుట్పతి తల = ఆ వృక్షరాజము యొక్క చిగురు )


ఇదొక చమత్కార శ్లోకం. లక్ష్మీ దేవికీ, పార్వతీదేవి కీ మధ్య సరసంగా సాగిన సంభాషణ.
శ్లోకం:-- భిక్షార్థీ ప్రయాతః సుతను?బలిమఖే, తాండవం క్వాద్య భద్రే?
జానే బృందావనాన్తే,క్వ చ స మృగ శిశు:? నైవ జానే వరాహం
బాలే,కశ్చిన్న దృష్ట:? జరట వృష పతి:?గోపా ఏవాస్య వేత్తా
లీలా సల్లాప ఏవం జలనిధి హిమవత్కాన్యయో త్రాయతాం వః
అర్థము:--లక్ష్మీ దేవి చుట్టపు చూపుగా కైలాసానికి వెళ్ళిందట. ఆమె ఎగతాళిగా పార్వతీ నీ భర్త భిక్ష మడుక్కునేందుకు ఎక్కడికి వెళ్లాడు?పార్వతి తక్కువ తినిందా? బలిచక్రవర్తి యాగానికి వెళ్ళాడు సుందరీ అనిందట. ఈ రోజు మీ తైతక్కలు ఎక్కడ తల్లీ? అనింది మళ్ళీ లక్ష్మి ,పార్వతి వెంటనే బృందావన ప్రాంతం లో అనుకుంటాను. మీ అందాల మృగ శిశువు (వినాయకుడు) ఎక్కడ?అంది లక్ష్మి ఎగతాళిగా, అందుకు పార్వతి ఈ పందుల(విష్ణువు వరాహావతారం) సంగతి నాకు తెలీద.మ్మా.మళ్ళీ పార్వతి మీ ముసలి ఎద్దు ఏదీ ఎక్కడా కనపడదేమి?ఎద్దులూ,ఆవుల విషయం మీ ఆవులు కాచే వాడికే తెలియాలి. ఇలా ఎకసక్కాలాడుకునే లక్ష్మీ,పార్వాతులు మిమ్మల్ని కాపాడుదురు గాక.

ఒక అవధానం లో లక్ష్మీ పార్వతుల సంవాదం లాగా సీతారాముల సంవాదాన్ని ఆశువుగా చెప్పండిఅని ఒక పృచ్చకుడు అడిగాడట. అప్పుడు అవధాని ఆశువుగా ఈ పద్యం చెప్పారట.
పద్యము:-- పొలము దున్నిన పిల్లలు మొలవగలరు
మిథిల యందని రాముడు మేలమాడ
అవు నయోద్ధ్యను పాయస మారగింప ఆ
భయము గలదంచు సీత సంభ్రమము జూపే
రాముడు మీ మిథిల లో పొలము దున్నుతే బిడ్డ పుట్టిందట గదా?అంటే సీతమ్మసమాధానం. మీ అయోధ్యలో పాయసం తాగితే నలుగురు పుట్టారట గదా!అక్కడ పాయసం తాగాలంటే భయమే మరి. ఇవన్నీ కవి చమత్కారాలు. మాత్రమే.

సుందరే సుందరో రామః , సుందరీ కథా
సుందరే సుందరీ సీతా ,సుందరే సుందరం వనం
సున్దరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపి:
సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం
సుందరకాండ గురించి శతాబ్దాలుగా వినబడుతున్న ఒక శ్లోకమిది.
అర్థము:--సుందర కాండ లో రాముడు సుందరుడు,కథ అత్యంత సుందరమైనది. సీతాదేవి చక్కని సుందరీ మణి,సుందరకాండలో వర్ణించ బడ్డ అశోకవనం బహుసుందరం,సుందరకాండ లోని మంత్రమూ సుందరమే,సుందరకాండ లో సుందరం కానిది ఏమున్నది?ఇది గొప్ప మంత్ర గ్రంథం. సుందరకాండ భక్తీ శ్రద్ధలతో రోజూ పారాయణం చేస్తే విశేష కార్య సిద్ధి కలుగుతుందట. అది,బుధ,గురు,శుక్ర వారాల్లో విదియ,తదియ,పంచమి,సప్తమి,దశమి,ఏకాదశి,త్రయోదశి తిథులలొ ఆశ్వీజ, ,భాద్రపద,ఆషాఢ మాసాల్లో తప్ప యితర మాసాల్లో పారాయణం ప్రారంభించి చేస్తే విశేష కార్యసిద్ధి కలుగుతుందట.
శ్లోకం:నమోస్తు రామాయ,స లక్ష్మణాయ,దేవ్యై చ తస్మై జనకాత్మజాయై
నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో,నమోస్తు చంద్రార్క మరుద్గుణే భ్యః
అర్థము:-సీతా, రామ,లక్ష్మణ,రుద్రా,యమ,అనిల (వాయుదేవుడు),చంద్ర,సూర్య, మరుద్గణా లను స్మరిస్తున్నాను. ఈ శ్లోకం చదివి ఆరంభించిన పని సఫల మవుతుంది.అని పెద్దలు చెప్తారు.


ఇహ తురగ శతై: ప్రయాంతు మూఢ;
ధన రహితాస్తు బుధా ప్రయాంతు పద్భ్యాం
గిరి శిఖర గతాపి కాక పంక్తి:
పులిన గతై: న సమత్వ మేతి హంసై:
అర్థము:- లోకమున విద్యా సంస్కార హీనులైన వారెందరో గజములు, గుర్రములు కట్టిన రథాలలో అత్యంత వైభవముగా ప్రయాణిస్తుంటారు. మహా పండితులు,పరమయోగ్యు లయిన ధార్మిక పురుషులు ఎందరో నిరుపేద లగుట చేత పాదచారులై పోతుంటారు. కాకులు పర్వత శిఖరమున బారులు తీరి కూర్చున్నంత మాత్రమున క్రింద సరస్సులో విహరించు చున్న హంసలతో సాటి రాగలవా? ఇప్పుడు లోకములో అదే జరుగుతున్నది కదా!సంస్కార హీనులు,విద్యా హీనులు గద్దెనెక్కి పరిపాలిస్తున్నారు, సమర్ధులైన విద్వాంసులు,ధార్మికు లయినవారు ధనము,అధికారము లేక బాధ పడుతున్నారు. 'కాకి కాకే హంస హంసయే'


స్వసుఖ నిరభిలాషః ఖద్యసే లోకహితో
ప్రతిదినమథవా తే వృత్తి రేవం విధై వ
అనుభవతి హి మూర్ధ్నా పాదప స్త్రీవ్ర ముష్ణ మ్
శమయతి పరితాపం ఛాయయా స్వాశ్రితానాం
అర్థము:తమసుఖమునందు దృష్టి నుంచు కొనక, లోకహితమునకై ఎప్పుడును మహా పురుషులు పాటుపడుతుంటారు. వారికది సహజగుణము. . మహా వృక్షము తీవ్రమైన ఎండ నంతను తాను భరించుచు తనను ఆశ్రయించిన వారికి తాపోప శాంతి నొసగి
నీడనిచ్చి సుఖ పెట్టుట దానికి సహజ గుణమే కదా!


వాల్మీకి మహర్షి అన్నా,వ్యాస మహర్షి అన్నా కాళిదాసుకు అపరిమిత భక్తీ గౌరవాలు వుండేవి.రామాయణ,
మహాభారతాలు ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు.
కాళిదాసు తన కవిత్వ శైలి లో వాల్మీకి రామాయణాన్ని అనుసరించాడు.అలాగే 'అభిజ్ఞాన శాకుంతలం'లాంటి మహా కావ్యాల మూల కథ భారతం లోనుంచి తీసుకున్నాడు.ఆయనకు వాళ్ళిద్దరూ మార్గదర్శ కులు,పరమ గురువులు.వ్యాస,కాళిదాసుల గురించి ఒక కథ ప్రచారం లో వుంది.
కాళిదాసు తన మిత్రులతో,శిష్యులతో ముచ్చటించే టప్పుడు తరుచుగా వ్యాసుడిని 'చ'కార కుక్షి అని ప్రస్తావిస్తూ వుండేవాడు.దానికి కారణం వ్యాసుడి శ్లోకాల లో తరుచుగా వినపడే 'చ'అక్షరం.'చ' అంటే మరియు అని అర్థం
ఆంగ్లం లో 'అండ్'లాగ.
వ్యాసుడు పంచమవేదమైన భారత యితిహాసాన్ని, ,అష్టాదశ పురాణాలనూ వ్రాసిన వాడు.మొత్తం నాలుగు లక్షల పైగా శ్లోకాలు రాసినవాడు.పోలిక చెప్పాలంటే కాళిదాసు రచనలన్నింటిలో కలిపి ఆరువేల శ్లోకాల కంటే ఎక్కువ వుండవు.ఎక్కువ సంఖ్యలో గ్రంథాలు వ్రాసేటప్పుడు అవసరాన్ని బట్టీ ఒక్కోకప్పుడు ఛందస్సు
పాటించడం కోసం 'తు'(అయితే)'చ'(మరియు) లాంటివి ఊతగా వాడక తప్పదు.వ్యాసుడి గ్రంథాల లో పాత్రల సంఖ్యా వేలలో వుంటుంది.అలాంటప్పుడు ;చ' వాడక తప్పదు.తరతరాల రాజుల పేర్లు,ఋ షుల పేర్లూ
చెప్పుకోస్తూ వుంటారు.ఉదాహరణకి 'భవాన్ భీష్మశ్చ,కర్ణశ్చ,కృపశ్చ,సమితింజయ'అని వరుసగా చెప్పేటప్పుడు 'చ'కారం తప్పనిసరి.ఈ విషయాలు కాళిదాసుకు తెలియనివి కావు.వ్యాసుడిని 'చ'కార కుక్షి
అనటం ఆ మహానుభావుడిని చులకన చేయాలన్న ఉద్దేశ్యం తో కానే కాదు.ఒక విధమైన చనువుతో ముత్తాత గూర్చి మునిమనుమడు ఆట పట్టించే టట్టు చెప్పిన మాటలే
ఒకరోజు కాశీ క్షేత్రం లో వ్యాస భగవానుడి విగ్రహం కనిపించింది.కాళిదాసుకు సాష్టాంగ నమస్కారం చేశాడు.చిలిపితనం తో
ఆ విగ్రహం బొడ్డు లో తన కుడి చూపుడు వేలును వుంచాడు.ఆయన మిత్రులు ఎందుకు కవీంద్రా అలా చేస్తున్నావు?అని అడిగారు.ఏమీ లేదు మా తాతగారి పొట్టనిండా 'చ'కారాలే గదా ఎన్ని వున్నాయో చూసి కాసిని బయటికి లాగి అవసర మైనప్పుడు నేను వాడుకోవచ్చు గదా అన్నాడు నవ్వుతూ.వేలు బయటకు తియ్యబోతే రాలేదు.అందులో యిరుక్కు పోయింది.ఎన్నిసార్లు ప్రయత్నించినా రాలేదు.
విగ్రహం లోనుంచి మాటలు వినపడ్డాయి.నన్ను పదే పదే 'చ'కార కుక్షి అని గేలి చేసినందుకు నీకిది శిక్షఅని
తాతగారూ! ఏదో చలోక్తిగా మాటవరుసకు అన్నాను నన్ను క్షమించి వదిలేయండి మీరంటే నాకెంతో భక్తీ
గౌరవం అది మీకూ తెలుసు కదా!అని బ్రతిమాలాడు కాళిదాసు.
నీకు నా మీద భక్తీ ఉన్నదో లేదో కానీ మహాకవి నన్నఅహంకారం మాత్రం ఎక్కువగా వుంది అందుకే విర్రవీగి పోతున్నావు.నేను లక్షల శ్లోకాలతో వేల పాత్రలతో వందల కొద్దీ చరిత్రలు వర్ణించిన వాడిని నీలాగా ఏ పురాణం లో నించో ఒక చిన్న ఘట్టం తీసుకొని దాన్నే సాగదీసి పెద్ద పెద్ద కావ్యాలుగా రాయ లేదు.అనేక పాత్రల గురించి వ్రాయాలంటే 'చ'కారం వాడక తప్పదు.దాన్ని పట్టుకొని నీవు నన్ను ఎగతాళి చెయ్యటం
కూడని పని.అన్నాడు వ్యాసుడు.
మీరు చెప్పింది అక్షరాలా నిజం నేను చేసింది తప్పే చెంప లేసుకుంటున్నాను.నన్ను క్షమించి వదిలేయండి అని బ్రతిమలాడాడు.
శిక్ష తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం వుంది.నేను ఒక ఘట్టం చెప్తాను.దాన్ని నీవు 'చ'కారాలు వాడ
కుండా శ్లోకం చెప్పగలిగితే వదిలేస్తాను.అన్నాడు వ్యాసుడు.
చెప్పండి తాతగారూ! ఆ శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాను.అన్నాడు కాళిదాసు.అప్పుడు వ్యాసుడు
ద్రౌపదికి అయిదుగురు భర్తలు అందరూ అన్నదమ్ములు.కనుక వాళ్ళలో పెద్దవాడి తమ్ముళ్ళు నలుగురూ ఆమెకు మరిది వరుస అవుతారు.అలాగే వారిలో కనిష్టుడి అన్నలు నలుగురూ ఆమెకు బావ వరుస అవుతారు.
ధర్మ రాజు ఆమెకు మరిది కాడు,అలాగే సహదేవుడు బావ కాడు యిలాగే వరుసగా పేర్లు ,వరుసలో చెప్పుకుంటూ రావాలంటే 'చ'కారం లేకుండా సాధ్యమవుతుందా?చేతనైతే నువ్వు శ్లోకం గా 'చ'కారం లేకుండా చెప్పు చూస్తాను.అన్నాడు వ్యాసుడు.
వినమ్రంగా శిరస్సు వంచాడు కాళిదాసు తాతగారూ!మీరు చెప్పగలిగినంత పకడ్బందీ గా శ్లోకం చెప్పటం నా లాంటి అల్పజ్ఞుడి వల్ల అయ్యే పని కాదని మీకూ తెలుసు,నాకూ తెలుసు.అయినా నాకు చేతనయినంత వరకూ ప్రయత్నిస్తాను.మీరు పరీక్ష పెట్టినప్పుడు నేను చెప్పకపోతే అది అవిధేయత అవుతుంది.శ్లోకం చిత్తగించండి
ద్రౌపద్యా: పాండు తనయాః పతి దేవర భావుకాః
న దేవరో ధర్మరాజః సహదేవో న భావుకః
తా:- ద్రౌపది కి పాండుపుత్రులు భర్తలు ,మరిదీ,బావ వరుస కూడా.కానీ ధర్మరాజు మరిది వరుస కాడు,సహదేవుడు బావ వరుస కాడు.
యిలా చెప్తే మీరడిగిన భావం చాలా వరకూ వచ్చిందనుకుంటాను.అన్నాడు.ఈ శ్లోకం లో 'చ'కారం వాడలేదు.శ్లోకం విని వ్యాసుడు చిరునవ్వు నవ్వాడు.శహభాష్!మనవడా చక్కగా చెప్పావు.నువ్వు నీ ప్రతిభ
తో చిరకాలం నిలిచిపోయే మహా కావ్యాలు వ్రాయాలని నిన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను.
కాళిదాసు వేలు తీసుకొని చేతులు జోడించాడు. మహా ప్రసాదం ఋషీ శ్వరా నా అపచారం మన్నించండి.
యింక ముందు పరిహాసానికి కూడా మీ వంటి మహానుభావులను కించ పరిచే పొల్లు మాటలు ఎప్పుడూ మాట్లాడను. అంటూ లెంపలు వేసుకొని సాష్టాంగ ప్రణామం చేశాడు.కాళిదాసు కవిత్వం లో 'చ'కారాలు తక్కువగా కనిపిస్తాయి, 'హి' 'ఖలు' అనేవి కనిపిస్తాయి.అవి ఆయన ఊతపదాలు.
కాళిదాసు యొక్క ప్రతిభ లోకానికి తెలియజెయ్యాలనే వ్యాసుడు ఇలాంటి పరీక్ష పెట్టాడు అని కూడా అంటారు.గొప్పవాళ్ళను ఎప్పుడూ యెగతాళి చేయరాదనే ఈ కథలోని నీతి..


ఒక వూరిలో రామరాజు,రంగరాజు అనే స్నేహితులుండేవారు.రామరాజు ధార్మిక బుద్ధి కలవాడు,ఆపదలో వున్నఅందరికీ సహాయం చేసే బుద్ధి కలవాడు.రంగరాజు లౌక్యుడు.తనకు ఎవరి వలనైనా లాభం వుంటే తప్ప
సహాయం చేసేవాడు కాదు.వారిద్దరూ కాశీకి ప్రయాణ మయ్యారు.ఆ రోజుల్లో నడిచే వెళ్ళేవాళ్ళు కదా.దారికి కొంత బత్తెం కట్టుకొని బయల్దేరారు.అలా రాత్రి అయితే ఒక్కోవూరిలో ఎవరింట్లోనైనా లేదా ఏదైనా సత్రం లో బస చేసి తెల్లవారి మరీ బయల్దేరే వారు. ఒకరోజు వీళ్ళిద్దరూ ఒక రింట్లో బస చేశారు.యింట్లో భార్యా,భర్త ఇద్దరే వున్నారు.సామాన్య కుటుంబీకులు. మరుదినం వీళ్ళు బయల్దేరుదామని అనుకుంటూ వుండగా హఠాత్తుగా
ఆ యింటి యజమాని ఆరోగ్యం పాడయింది.రామరాజు ఊర్లోకి వెళ్లి వైద్యుడిని పిలుచుకొని వచ్చి మందు యిప్పించాడు.అయినాతగ్గక పోవటం తో రామరాజు బలవంతం మీద రంగరాజు కూడా రెండు రోజులు వుండవలిసి వచ్చింది.రెండు రోజులైనా ఆ యజమాని జ్వరం తగ్గలేదు.రంగరాజు విసుగ్గా ఎన్నాళ్ళు చూస్తాము
మనం వెళ్లి పోదాము వూర్లో వాళ్ళు చూసుకుంటారు లే మనం వెళ్లి పోదాం పద అన్నాడు.అయ్యో జబ్బు మనిషిని వదిలేసి ఎలా వెళతాం?ఆవిడ ఒక్కతే వుంది.నీవు కావాలంటే వెళ్ళు ఈయనకు తగ్గాక నేను బయల్దేరి వస్తాను అన్నాడు.రామరాజు.రంగరాజు సరే నని వెళ్ళిపోయాడు.
ఆ యింటి యజమానికి తగ్గక పోవటం తో రామరాజు వారికి సేవ చేస్తూ,మందులు సమయానికి యిస్తూ అక్కడే వుండి పోయాడు.రంగరాజు కాశీ కి చేరాడు.గంగలో స్నానం చేద్దామని గంగ ఒడ్డుకు వెళ్ళాడు.జనం చాలామంది వున్నారు.రంగరాజుకు రామరాజు గంగ లో స్నానం చేస్తూ కనబడ్డాడు.అరె ఇతను నాకంటే ముందుగా ఎలా వచ్చాడు?స్నానం కూడా చేసేస్తున్నాడు. అనుకోని అతన్ని కలుసుకోవాలని జనాన్ని తోసుకుంటూ వెళ్ళాడు.ఎంత వెతికినా రామరాజు కనపడలేదు.ఎక్కడో ఒకచోట కనపడక పోడు లే అనుకోని దైవ దర్శనానికి వెళ్ళాడు.అక్కడా జనం చాలానే వున్నారు,శివుడికి అభిషేకం చేస్తూ రామరాజు కనబడ్డాడు
రంగారాజుకి.అతన్ని కలుద్దామనుకునేంతలోతానూ దర్సనం చేసుకొని వచ్చేసరికి ఎక్కడా కనపడలేదు.వుస్సూరుమని కూలబడి పోయాడు.రంగరాజు చుట్టుపక్కల క్షేత్రాలన్నింటికీ వెళ్ళాడు.అన్ని చోట్లా రామరాజు తనకంటే ముందే స్నానం దర్శనం చేసేస్తున్నాడు.తనకు మాత్రం దొరకడం లేదు..అక్కడ కూర్చున్న సాధువును విషయమంతా
చెప్పి యిలా ఎందుకు జరుగుతున్నదో చెప్పమని అడిగాడు.ఆయన నవ్వి రామరాజు ధార్మికుడు, దీనులకు సహాయం చేసే బుద్ధి కలవాడు.అతను ఆ వూరిలో ఆ యజమానికి సేవచేస్తున్నా నిరంతరం దైవ ధ్యానం
చేస్తూ నేను కాశీకి వెళ్ళ లేక పోయానే అని బాధ పడుతూనే వున్నాడు.ఆ కారణం గా అతను రాకపోయినా అతని మనస్సు దేవుడి దగ్గరికి వచ్చేసింది.అందుకే నీకు అతను ప్రతి చోటా కనబడుతున్నాడు.నా మాటల మీద నమ్మకం లేకపోతె
వెళ్ళేటప్పుడు వారింటికి వెళ్లి చూడు రామరాజు అక్కడే ఉంటాడు. .అని చెప్పాడు.రంగరాజు యిలా కూడా జరుగుతుందా?అని బయల్దేరి వెళ్లి కొన్నాళ్ళకు ఆ వూరు చేరుకున్నాడు.వారింటికి వెళ్లి చూస్తె రామరాజు అక్కడే వున్నాడు.రంగారాజును
చూసిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి పాదాలకు నమస్కరించి నీ ప్రయాణం బాగా జరిగిందా?కాశీ విశ్వే శ్వరు డి దర్శనం బాగా జరిగిందా?నీవు చాలా అదృష్టవంతుడి వి.నిన్ను తాకితే చాలు నాకూ [పుణ్యం వస్తుంది అని అన్నాడు.రంగరాజు సిగ్గుతో తలవంచు కున్నాడు.ఈ యజమాని జబ్బు తగ్గిపోయింది నా డబ్బు కూడా ఖర్చయి పోయింది.యింక కాశీకి ఏమి వెళ్ళేది?యింక మన వూరికి వెళ్లి పోదాము పద అన్నాడు రామరాజు.దేవుడికి ఎవరు దగ్గర వారో రంగరాజుకు బాగా అర్థమయి పోయింది.మానవసేవయే
మాధవ సేవ అని నమ్మిన రామరాజు ధన్యుడు.నేను కాశీకి వెళ్ళినా రామరాజు నా కంటే ముందెలా వచ్చాడని
ఆలోచించాను తప్ప దేవుడి గురించి ఆలోచించనే లేదు. అనుకుని పశ్చాత్తాప పడ్డాడు యిద్దరూ వూరు చేరారు. 
 


ఒక దేశ రాజుగారి మంత్రి చనిపోయాడు.రాజు ఇంకో మంత్రిని ఎన్నుకోవాలని అర్హులైన,తెలివైన వారు కావాలని ప్రకటన చేశారు.చాలామంది యువకులు వచ్చారు.వివిధ పరీక్షలు జరిపి వల్లభుడు,సులభుడు అనే యిద్దరిని ఎంపిక చేశారు.ఆ యిద్దరికీ ఒక పరీక్ష పెట్టారు. వారిద్దరికీ ఒక్కొక్కరికీ వంద చక్కిలాలు యిచ్చి వాటిని చాలా దూరంలో వున్న యిద్దరు వేరు వేరు దిక్కులలో వున్న రాజుల కు యిచ్చి ముట్టినట్టు రసీదు తీసుకొని రావాలి.వారికి దారిలో తినటానికి గానీ బసకు గానీ ఏమీ ఏర్పాటు చేయ లేదు.
వల్లభుడు తూర్పు దిక్కుగా సులభుడు పశ్చిమ దిక్కుగా బయల్దేరి వెళ్ళారు.అరణ్యం గుండా ప్రయాణించాలి.
వల్లభుడు మధ్యాహ్నం వరకూ ప్రయాణించాడు.ఎక్కడా వూరుకానీ ఉండేందుకు బస గానీ కనిపించలేదు.వాడికి బాగా ఆకలి వేస్తూంది యింక నడవ లేనని ఒక చెరువు దగ్గర చెట్టుక్రింద కూచుని ఈ చక్కిలాల్లో కొన్ని తిని ఆకలి తీర్చుకుంటాను.వాళ్లకు నా దారి బత్తెం కింద తినేశానని చెప్తాను.వాళ్ళేమీ నా తిండి సంగతి ఆలోచించి నట్టు లేదు.అనుకోని 15 చక్కిలాలు తిని చెరువు లో నీళ్ళు త్రాగి కాసేపు విశ్రాంతి తెసుకొని బయల్దేరి సాయంత్రానికి ఆ రాజు గారి వూరు చేరి 85 చక్కిలాలు యిచ్చి 85 ముట్టినట్టు రసీదు తీసుకున్నాడు.ఆ రోజు ఆ రాజుగారు ఏర్పాటు చేసిన బస లో వుండి,మరుదినం తిరుగు ప్రయాణ మయ్యాడు సులభుడు కూడా పశ్చిమ దిక్కుగా ప్రయాణించి ఒక అడవి చేరుకున్నాడు.వాడికీ ఆకలి వేసింది.ఆలోచించాడు తనకు తిన టానికి ఏమీ యివ్వక పోవడం కూడా పరీక్ష లో ఒక భాగమని అర్థం చేసుకున్నాడు.ఒక చెట్టు నీడలో కూర్చుని చక్కిలాల మూట విప్పి పక్కనే తనమీది పంచె పరిచాడు.నెమ్మదిగా ఒక్కో చక్కిలం తీసి ఒక చుట్టు నెమ్మదిగా తుంచాడు ఆ ముక్క తన పంచె లో వేశాడు
అలాగ వంద చక్కిలాలు తుంచాడు.ఒక కుప్ప తయారైంది మిగతా 100 చక్కిలాలు మూట గట్టి ఆ తునకలన్నీ తిన్నాడు చెరువులో నీళ్ళు తాగాడు.కాసేపు విశ్రాంతి తీసుకొని వాళ్ళు చెప్పిన రాజ్యానికి చేరుకొని చక్కిలాలు వంద యిచ్చి100 ముట్టినట్టు రసీదు తీసుకొని రాత్రికి అక్కడ బస చేసి మరుదినం
ఉదయం ప్రయాణమై తాను బస చేసిన యింటి యజమానిని అడిగి చద్ది కట్టించుకొని బయల్దేరి సాయంత్రానికి తన రాజ్యం చేరుకున్నాడు.మరుదినం ప్రొద్దున వల్లభుడు,సులభుడు రాజు దగ్గరకు వెళ్లి
రసీదులు సమర్పించారు.వల్లభుడి రసీదులో 85 ముట్టినట్టు వుందేమని అడిగారు. వాడు నాకు ఆకలి వేస్తే తినేశానని చెప్పాడు.రాజుగారు మంచి పని చేశావనిఅన్నారు.అందులో తప్పేమీ లేదు కదా!అన్నారు. కానీ సులభుడు తెచ్చిన రసీదులో 100 చక్కిలాలు ముట్టినట్టు వుండడం చూసి నీకు ఆకలి వేయలేదా?నీవేమి చేశావని అడిగాడు రాజు. వాడు వున్నది ఉన్నట్టుగా చెప్పాడు.. రాజు వాడిని మెచ్చుకొని, సులభుడిని మంత్రిగా ప్రకటించాడు.రాజు వల్లభుడిని చూసి మంత్రి కావలిసిన వాడికి కొంత సమయ స్ఫూర్తి అవసరం
ఆ సమయస్ఫూర్తి సులభుడిలో వుంది.అన్నాడు.వల్లభుడు సిగ్గుతో తలవంచుకున్నాడు.రాజు వల్లభుడికి కొంత ధనం యిచ్చి పంపించి వేశారు.


లోకం లో ఒక నానుడి వుంది.
ఉపమా కాళిదాసస్య భారవే రర్థ గౌరవం
దండినః పదలాలిత్యం మాఘే సంతు త్రయో గుణాః
అర్థము:--కాళిదాసు ఉపమానం(పోలిక)చెప్పడం లో దిట్ట .భారవి అర్థానికి ప్రాధాన్యమిస్తాడు. దండి పదాలు చాలా లలితంగా వుంటాయి. మాఘ కవి కవిత్వం లో ఈ మూడూ కూడా వుంటాయి.
అసలు సంస్కృతం తెలియని ఒక అతను దీన్ని మరోలా అర్థం చేసుకున్నాడట.
కాళిదాసు ఉప్మా చాలాబాగా చేస్తాడు.భారవి ఉప్మా ని గౌరవిస్తాడు. (అంటే తింటాడు)దండి వుప్మాని చాలా మృదువుగా (మెత్తగా) చేస్తాడు.మాఘ కవి ఈ మూడూ చేస్తాడు. ఈ కథ మా మామయ్య మా చిన్నప్పుడు చెప్పేవాడు. దీనికి విపరీతార్థాలు తీయవద్దని మనవి.. తమాషాగా చెప్పుకుందుకు బాగుంటుంది అంతే



ఒకనాడు భోజరాజు ఆస్థానానికి దక్షిణ దేశం నుంచి లక్ష్మీ ధరుడనే కవి వచ్చాడు.ఆయన ముఖం తేజస్సు తో
వెలిగి పోతూ వుంది.భోజరాజుకు అతన్ని చూడగానే మహానుభావుడని అభిప్రాయం కలిగింది.
కవిగారు భోజరాజుకు మంగళ వాక్యాలతో స్వస్తి చెప్పి,అభివాదం చేసి కూర్చున్నాడు.రాజా!నీది పండిత మండిత సభ నువ్వు సాక్షాత్తూ నారాయణ స్వరూపుడివి.నీ ముందు నా పాండిత్యం ఎంత?అయిన ఒక శ్లోకం
చెప్తాను.
భోజ ప్రతాపం తు విధాయ ధాత్రా
శేషై:నిరస్తై: పరమాణుభి :కిమ్
హరే:కరేభూత్ పవి,రంబరే చ
భాను:, పయోధే: ఉదరే కృశాను:
తా:--ఆ బ్రహ్మ భోజుడి పరాక్రమాన్ని సృష్టించి,మిగిలి పోయి వదిలేసిన పరమాణువుల తో ఇంద్రుడి వజ్రాయుధము,ఆకాశం లో సూర్యుడు,సముద్రం మధ్యలో బడబాగ్ని తయారు చేశాడేమో.
రాజు, సభికులు ఈ శ్లోకం విని ఆశ్చర్య చకితు లయ్యారు.
రాజు ఆ శ్లోకానికి అక్షర లక్షలు యిచ్చాడు.
అతడు రాజా!నేను మీ రాజ్యం లోనే ఉండిపోవాలనే కోరిక తో సకుటుంబంగా వచ్చాను.ఎందుకంటె
క్షమీ దాతా గుణగ్రాహీ.స్వామీ పుణ్యేన లభ్యతే
అనుకూలః శుచి: దక్షః కవి: విద్వాన్ సుదుర్లభః
తా:--క్షమా గుణం వున్నవాడూ,దాతా,ప్రతిభను గుర్తించే వాడూ,అయిన ప్రభువు పూర్వ పుణ్యం వలననే
లభిస్తాడు.దానికి తొడు అనుకూలుడూ,నిర్మలుడూ,సమర్థుడూ, పై పెచ్చు విద్వాంసుడూ,కవి అయిన నీ లాంటి రాజు దొరకటం చాలా కష్టం.
అలాంటి మహాకవులు తన ఆశ్రయము కోరడం కంటే భోజుడికి కావల్సినదేముంది?యీనకు ఒక ఇల్లు ఏర్పాటు చెయ్యమని మంత్రిని ఆదేశించాడు.
మంత్రికి ఆయనకు యివ్వడానికి ఒక్క ఇల్లు కూడా కనిపించలేదు.ఎవరి ఇల్లు ఖాళీ చేయించి ఆయనకు యివ్వాలి?అందరూ ప్రతిభావంతులే,కవులే,పండితులే.
వెతగ్గా ఒక సాలెవాడి ఇల్లు కనిపించింది.మంత్రిగారు అతని తో నాయనా!నువ్వు నీ ఇల్లు ఖాళీ చేసి మరో చోటికి వెళ్ళాల్సి వుంటుంది.ఈ యింట్లోకి మహా విద్వాంసుడు రాబోతున్నాడు అన్నాడు.
నేతగాడు బిత్తర పోయాడు.అతను నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్లి నమస్కరించి రాజా నీ మంత్రి నన్ను మూర్ఖుడిగా లెక్క గట్టే శాడు.అన్యాయంగా యింటి నుండి వెళ్ళ గొడుతున్నాడు. ఇల్లు పండితుడికే యిస్తాడట.నువ్వయినా పరీఎక్షించి చూడు నేను పండితుడినో కాదో జనో ఒక శ్లోకం చెప్పాడు.
కావ్యం కరోమి నహి చారుతరం కరోమి
యత్నాత్ కరోమి యది, చారు తరం కరోమి
భూపాల మౌళి మణి రంజిత పాద పీఠం
హే!సాహసాంక కవయామి, వయామి,యామి
తా:-- కావ్యం నేనూ రాస్తాను.కానీ అంత చక్కగా రాయలేను,బాగా ప్రయత్నిస్తే చక్కగానూ రాయగలను.
శత్రు రాజుల శిరస్సు ల మీది రత్నాల కాంతుల చేత ఎర్రగా ప్రకాశించే పాద పీఠం కలవాడా!సాహసమే మారుపేరుగా కలవాడా కవిత్వమూ రాస్తాను,నేత కూడా నేస్తాను వెళ్లి పొమ్మంటే వెళ్ళీ పోతాను.
ఒక నేతగాడు తనను నువ్వు,నువ్వని సంభోధిస్తుంటే రాజుకు ఆశ్చర్యం కలిగింది.ఆ నేతగాడి కవితా మాధుర్యానికి కూడా ఆశ్చర్యం కలిగింది.నువ్వు చక్కగా పదాలు కూర్చి శ్లోకం చెప్పావు తియ్యగా చెప్పావు.
అయితే కవితా శక్తి గురించి అయితే కొంచెం ఆలోచించాల్సిందే అన్నాడు.
నేతగాడికి కోపం వచ్చింది.రాజా!రాజ ధర్మం వేరు,విద్వాంసుల ధర్మం వేరు.ఒక్క విషయం చెప్పాలని వుంది కానీ చెప్పా లేక పోతున్నాను.
ఏమిటా విషయమ సంకోచించ కుండా చెప్పు అన్నాడు రాజు.
దేవా! నేను కాళిదాసు ను తప్ప ఇతరులను కవులుగా అంగీకరించ లేక పోతున్నాను.నీ సభలో కవిత్వ తత్వం తెలిసిన విద్వాంసులు కాళిదాసు తప్ప యింకెవరున్నారు?
యత్ సారస్వత సౌరభం గురు కృపా పీయూష పాకోద్భవం
తత్ లభ్యం కవి నైవ నైవ హటతః పా ఠ ప్రతిష్ఠాజుషా
కాసారే దివసం వసన్నపి పయః పూరం పరం పంకిలం
కుర్వాణ : కమలాకరస్య లభతే కిం సౌరభం సైరిభి:
తా-:- కవిత్వ సౌరభం అనేది గురు కృప అనే అమృత పాకం వల్ల పుట్టేది.అది కవి అయిన వాడికే తెలుస్తుంది
బలవంతంగా పాఠాలు చెప్పించుకొనే వాడికి తెలియదు.రోజంతా చెరువులో వుండి చెరువునంతా కలుషితం
చేస్తున్న దున్నపోతు తామర కొలను సౌరభాన్ని పొందుతుందా?
అయం మే వాగ్గుంభః విశద పద వైదగ్ధ్య మధురః
స్ఫురత్ బంధః వంద్యః పర హృది,కృతార్థకవి హృది
కటాక్ష: వామాక్ష్యాః దార దళిత నేత్రాంగ గళితః
కుమారే నిస్సారః స తు కిమపి యూనః సుఖయతి
తా:--- ఈ నా పద గుంభనం,స్పష్ట మైన పదాల అమరిక తో మధురమైనది పద బంధాల మెరుపులు గలది.అది కవి హృదయాన్ని మెప్పిస్తుంది.యితర హృదయాల లో అది నిష్ఫల మై పోతుంది.అతివ అరమోడ్పు కన్నుల కొలకుల నుంచి జారే చూపు పసిబాలుడికి పనికి రాదు.పడుచు వాడినయితేనే అది
ఉల్లాస పరచ గలదు.
పోతే నేను నిన్ను నువ్వు,నువ్వు అన్నానని కోపగించుకోకు.
బాల్యే సుతానాం, సురతేంగనానాం
స్తుతౌ కవీనాం,సమరే భటానాం
'త్వం' కార యుక్తాః హి గిరః ప్రశ స్తాః
కః తే ప్రభో మోహభరం,సమర త్వం
తా :--బాల్యంలో కుమారులకూ,ఏకాంత ప్రణయ వేళలలో స్త్రేలకూ, స్తుతించే టప్పుడుకవులకూ,యుద్ధం లో
సైనికులకూ,'నువ్వు'అన్న సంభోధన తో కూడిన మాటలు ప్రశస్తమయిన మాటలని శాస్త్రం జ్ఞాపకం తెచ్చుకో
నీ కెందుకీ అపార్థం?
రాజు బాగా చెప్పావు అని మెచ్చుకొని అక్షర లక్షలతో సన్మానిం చట మే గాక యధేచ్చగా యింట్లో వుండేందుకు అనుమతిచ్చి పంపించాడు.లక్ష్మీధర కవికి విడిది ఏర్పాటు చేసి వేరే ఒక ఇల్లు కట్టించమని
ఆజ్ఞాపించాడు.సాలె వాడు చివరికి సాధించాడు.


ఒక రోజు ఒక లింగాయిత బ్రాహ్మణుడు తన భూమి అమ్మిన డబ్బు మూట గట్టుకొని తీసుకొని వెళుతున్నాడు.లింగాయతులు మెడ లో శివలింగం ధరిస్తారు.కాసేపటికి ఒక నిర్జనమైన వీధిలో ప్రవేశించాడు..డబ్బు మూట చూసిన ఒక దొంగ అతని వెంట పడ్డాడు..
దొంగను చూసి భయపడిన అతను వేగంగా పరిగెత్తి పోతున్నాడు..వేగంగా పరిగెట్టడం లో అతని మెడలోని లింగం గుండెల మీద అటూ యిటూ కొట్టుకుంటూ చాలా నొప్పి అవుతూంటుంది అది భరించ లేక అతను "దొంగ దాడి కంటే లింగ దాడి మెండాయే నే " అని అనుకున్నాడట . లోకం లో ఒక బాధ వెంట ఇంకొక పెద్ద బాధ వస్తే యీ సామెత వాడుతుంటారు..

మన తెలుగువాళ్ళకు 'కారాలంటే ఎంతో యిష్టం.ఈ కారాలను చూడండి.
మొదులు పెట్టె కారం ---- శ్రీకారం, గౌరవించే కారం ----సంస్కారం, ప్రేమ లో కారం --- మమకారం
పలకరించేకారం ----నమస్కారం, భోజనం ముందుచేసే కారం---- అభికారం, పదవి తో వచ్చే కారం ---అధికారం, అది లేకుండా చేసే కారం------ అనధికారం, వేళాకోళం లో కారం ---- వెటకారం
భయం తో చేసే కారం ---- హాహాకారం, బహుమతి లో కారం --- పురస్కారం, ఎదిరించే కారం --- ధిక్కారం
వద్దని తిప్పికొట్టే కారం-----తిరస్కారం, లెక్కల్లో కారం --- గుణకారం, గుణింతం లో కారం -- నుడికారం
గర్వం తో వచ్చే కారం ---- అహంకారం, సమస్యలకు కారం ----- పరిష్కారం,
ప్రయోగశాల లో కారం------- ఆవిష్కారం, సంధులలో కారం --- 'ఆ'కారం,సాయం లో కారం --- సహకారం
స్రీలకు నచ్చే కారం--- అలంకారం, మేలు చేసే కారం ----ఉపకారం, కీడు చేసే కారం -- అపకారం
శివునికి నచ్చే కారం ---- ఓం కారం, విష్ణువు లో కారం ----శాంతాకారం, ఏనుగులు చేసేది --- ఘీంకారం
మదం తో చేసే కారం --- హూంకారం, పైత్యం తో వచ్చే కారం --వికారం, రూపం తో వచ్చే కారం --ఆకారం
ఇంటి చుట్టూ కట్టే కారం -- ప్రాకారం, ఒప్పుకునే కారం --- అంగీకారం, చీదరించుకునే కారం ---చీత్కారం
పగ తీర్చుకునే కారం---- ప్రతీకారం, వ్యాకరణం లో వచ్చే కారాలు 'ఆ'కారం', 'ఇ' కారం, 'ఉ' కారం,
'ఋ'కారం
అన్నీ కారాలే మీకు తెలిసిన 'కారాలు'యింకా ఏమైనా వుంటే వ్రాయండి.


భోజరాజు తన ఆస్థానం లోని భవభూతి,దండి కవులను పరీక్శాధికారులు గా నియమించాడు.తమ ప్రతిభ
చూపి సత్కారం పొందాలని వచ్చే పండితులను ముందు వారు పరీక్షించి వారినెలా సత్కరించాలో రాజుకు సిఫారసు చెయ్యటం వీళ్ళ విధి.
దశకుమార చరిత్ర లాంటి గద్య కావ్యం,కావ్యా దర్శనం లాంటి అలంకార గ్రంథం వ్రాసిన గండి ఏకసంత గ్రాహి.
అంటే ఒక్కసారి వింటే ఆయనకు గుర్తుండి పోతుంది.వెంటనే చెప్పేసేవాడు.
ఉత్తర రామచరిత్రం,మాలతీ మాధవం,మహావీర చరితం అనే మూడు ముచ్చటైన సంస్కృత నాటకాలు వ్రాసి
యెనలేని ఖ్యాతి పొందిన భవభూతి ద్విసంథా గ్రాహి.ఏ విషయమైనా రెండు సార్లు వింటే వెంటనే అది చెప్పేసేవాడు. తమకున్న ఈ శక్తులతో వీళ్ళిద్దరూ కొత్తగా వచ్చిన కవులను ఒకాట ఆడించేవారు.కవిని ఒక శ్లోకం చెప్పమనేవారు.అతడు చెప్పగానే దండి ఈ శ్లోకం కొత్తదేమీ కాదు నాకు తెలిసినదే అని ఆ శ్లోకం చెప్పేసేవాడు.వెంటనే భవభూతి రెండుసార్లు విన్నాడు కనుక ఆ శ్లోకం నాకూ తెఉసు అని చెప్పేసేవాడు.అలాగ
కవులకు రాజ సత్కారం లభించక పోగా అవమానమే ఎదురయ్యేది.వాళ్ళు వట్టి చేతులతో వెళుతుంటే
దండి,భవభూతి తమ ప్రతిభకు గర్విస్తూ నవ్వుకుంటూ వుండే వాళ్ళు.
.ఇది ఇలావుండగా కాళిదాసు మొదటిసారి రాజ దర్శనానికి వచ్చినప్పుడు ఆయనకూ ఈ అనుభవం ఎదురైంది.వాళ్ళు చేస్తున్న మోసం కాళిదాసుకు అర్థమైంది.మంచి కవులు వస్తే తమ గొప్పతనం తగ్గిపోతుందేమో నని వాళ్ళు వాళ్ళు రాజు దగ్గర ఎక్కువ సత్కారం పొందుతారేమోనని వాళ్ళిలా చేస్తున్నారని అర్థమై పోయింది.
ఈ కుళ్ళు బోతుతనానికి ఒక విరుగుడు ఆలోచించాడు.కావాలనే ఒక వెర్రి మొర్రిస్లోకమ చెప్పాడు.
'అస్థివత్, బకవత్ చైవ,చల్లవత్,వెల్లకుక్కవత్
రాజతే,భోజ!, తే కీర్తి: పునః సన్యాసి దంతవత్
ఓ!భోజరాజా!నీ కీర్తి చాలా తెల్లనిది,అది తెల్లటి బొమికె లా వుంటుంది,కొంగలాగా వుంటుంది, మజ్జిగలా
చల్లగా వుంటుంది,వెల్లకుక్కలా వుంటుంది అంటూ పిచ్చి పిచ్చి ఉపమానాలతో శ్లోకం చెప్పాడు. అది విని
పరీక్షా ధికారులు నవ్వుకొని ఇలాంటి వెర్రి కవిని రాజు దగ్గరకు పంపినా ఆయన దగ్గర చీవాట్లు తింటాడు
తప్ప సత్కారం లభించదు,అతను నవ్వుల పాలవుతూంటే చూసి నవ్వుకోవచ్చు యితని వల్ల తమ హోదాకు భంగం వాటిల్లదని అతనికి రాజ దర్శనానికి అనుమతించారు.
రాజసభ లోకి రాగానే కాళిదాసు తన పద్ధతి పూర్తిగా మార్చేశాడు.ఎలాగైనా కవిత్వం చెప్పగల ధీశాలి గదా!
పరమ పాషాణ పాకంగా,అప్రసిద్ధ పదాలన్నీ ఏర్చి కూర్చి ఎవ్వరికీ అర్థం కాకుండా, నోట బట్టకుండా
అంటే నోరు తిరగకుండా ఈ శ్లోకం చెప్పాడు.
"వాశ్చా రెడ్ద్వాజ ధగ్ ధృతో డ్య పతి: కుధ్రేడ్జ జాని:" అంటూ ఒక శ్లోకం చెప్పుకొచ్చాడు.
అది చెప్పడం ఏకసంథ గ్రాహి దండికి గానీ,ద్విసన్థ గ్రాహి భవభూతికి గానీ వశం కాలేదు.కనుక అది పాత శ్లోకమే నని నిరూపించ లేక పోయారు.
ఈ శ్లోకం అంతా గజిబిజిగా, తికమక గా వుంది.దీనికి అర్థం ఏమిటో కూడా మీరే చెప్పాలి అన్నాడు భోజరాజు.
రాజా! ఈ శ్లోకానికి అర్థం సంగతి అలా వుంచండి. ఒక పరమార్థం ఒకటున్నది.అది మీ ఆస్థానం లో మీ అధికారుల ద్వారా జరుగుతున్న మోసాన్ని మీ దృష్టికి తేవటం.అంటూ దండి,భావభూతులు ఆడుతున్న నాటకం అంతా వివరించాడు.సత్కవులను ప్రోత్సహించే బదులు వాళ్ళను పరాభవించిపంపుతున్నారని ఆధారాలతో సహా చెప్పుకొచ్చాడు.
రాజు గద్ధించగా వాళ్ళిద్దరూ తమ తప్పు ఒప్పుకున్నారు.చేసిన తప్పుకు పశ్చాత్తాపం వెలిబుచ్చారు.రాజు వాళ్ళని రాజసభ నుంచి బహిష్కరిస్తూ రాజోద్యగాల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయ బోతుండగా
కాళిదాసు వారించాడు.
రాజా!వీళ్ళిద్దరూ మహా కవులు,మేధావులు,పండితులు మీ ఆస్థానం లో పరీక్షా ధికారులుగా వుండేందుకు
వీరికంటే అర్హులు మీ దేశం లో ఎవరున్నారు?చేసిన తప్పులు ఒప్పుకొని పశాత్తాప పడుతున్నారు.తమరు
సభాముఖం గా మందలించారు.సున్నితమైన మనసు గలవారికి ఈ శిక్ష చాలు.మల్లె యిటువంటి తప్పు
ఎప్పుడూ చేయరు.వాళ్ళని ఉద్యోగాల్లో కొనసాగించడమే మంచిది అని వారించాడు.
భోజరాజు ఉదార శీలుడు కనుక కాళిదాసు మాటవిని వారిద్దరినీ పూర్తీ గౌరవాదరాలతో పరీక్షా ధికారులు గా
ఆస్థాన కవులుగా కొనసాగనిచ్చారు. ఆ తర్వాత వాళ్ళు కూడా కొత్త కవులను ప్రోత్సహిస్తూ అర్హులైన వారికి
రాజసత్కారాలు అందే టట్టు చేశారుఅప్పటి నుండీ భోజరాజు ఆస్థానం సత్కవులకు నెలవై ప్రకాశించింది .
ఈ కథ కల్పించబడిందని నిజం కాదని చాలా మంది అభిప్రాయం.మీకు కూడా అలాగే అనిపిస్తూంది కదా!
నాకైతే ఇది కల్పితకథ అనే అనిపిస్తుంది. .
 
భోజరాజు ఒక రోజు ఈ సమస్య యిచ్చాడు."భారతం చేక్షుఖండం చ సముద్ర మపి వర్ణయః"
భారతము,చెరుకుగడ,సముద్రము ఈ మూడిటికీ సంబంధించిన ఒకే పాదము తో వర్ణించ మని అడిగాడు.కాళిదాసు
ఇలా పూరించాడు. "పాదేనై కేన పక్ష్యామి ప్రతి పర్వ రసోదయం"
అర్థము:--భారత భాగములను పర్వములని(పక్షములని ) అంటారు.అందు ప్రతి పర్వము నందు రసము చిమ్ముచుండును.
(రసోదయము)చెరుకుగడ గెణుపులను కూడా పర్వములంటారు.ఒక్కొక్క గెణుపుదగ్గర అది కూడా రసము గ్రక్కు చుండును.అమావాస్య,పూర్ణిమ రెండు పర్వములు.ఆ రెండు దినము లందును సముద్రము పొంగును కాన ప్రతి పర్వము రసోదయమే యగుచున్నది. .

వేద మూలమిదం జ్ఞానం
భార్యామూలమిదం గృహం
కృషి మూలమిదం ధాన్యం
ధనమూలమిదం జగత్
అర్థము:జ్ఞానమునకు వేదమే మూలము ;గృహమునకు భార్యయే మూలము;
ధాన్యమునకు కృషియే మూలము; జగత్తునకు ధనమే మూలము.


తివిరి ఇసుమున తైలంబు తీయ వచ్చు
తవిలి మృగతృష్ణ లో నీరు త్రాగ వచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధించ వచ్చు
చేరి మూర్ఖును మనసు రంజింపరాదు
అర్థము:-- ప్రయత్నమ చేసి ఇసుక నుండి యైనా నూనె తెయవచ్చును. ఎండమావుల యందు నీళ్ళు సంపాదించి త్రాగవచ్చు,తిరిగి తిరిగి కుందేటి కొమ్ము తీసుకొని రావచ్చును. కానీ దురాగ్రహము గల మూర్ఖుని మనసును సమాధాన పరుచుట సాధ్యం కాదు. ఇది భర్తృహరి సుభాషితము.
.ఒకసారి రాయలవారు ఈ క్రింది పద్యము చెప్పి మీరెవరైనా అందులో ఏ ఒక్కటి అయినా సాధించ గలరా? అని సభ నుద్దేసించి అడిగారట. తెనాలి రామకృష్ణుడు లేచి నేను తిరగ కుండానే కుందేటి కొమ్ములు సాధిస్తాను. అన్నాడట. అదెలా సాధ్యం?అన్నాడు రాయలు. రామకృష్ణుడు పలక మీద 'కుందేలు'అని వ్రాసి 'క' 'ల' కు కొమ్ములున్నాయి కదా మరి కుందేలుకు రెండు కొమ్ములున్నట్టే కదా!అన్నాడు. సభలో కరతాళ ధ్వనులు మారు మ్రోగాయి.


ఒక వూరిలో వూరి బయట ఒక గుడిసె లో తల్లీ కొడుకు నివసిస్తూ వుండే వారు.కొడుకు పేరు రాము. వాళ్ళు చాలా బీదవాళ్ళు.
తల్లి చాల మంది ఇళ్ళల్లో పాచిపని చేసి కొడుకు ను పోషిస్తూ వుండేది. వూరిలో పిల్లలందరూ పక్క వూరికి వెళ్లి ఒక గురువు గారి దగ్గర చదువుకునే వారు.వాడు నేనూ వెళ్లి చదువుకుంటానని గొడవ చేశాడు. తల్లి ఆ గురువు గారి దగ్గరికి వెళ్లి కొడుకును చేర్పిస్తానని బతిమాలి ఆయనను ఒప్పించింది.గురువు గారి వూరికి వెళ్ళాలంటే అడవి దారి గుండా వెళ్ళాలి.మిగతా పిల్లలందరూ వారి వారి ఎడ్ల బండ్ల లో వెళ్ళే వారు.రాముడు నడిచి వెళ్ళేవాడు.వాడు వాళ్ళమ్మ తో అమ్మా! నాకు అడివి లో వెళ్ళేటప్పుడు భయమేస్తుంది అన్నాడు.వాడి అమ్మ
నాన్నా! 'గోపాలా గోపాలా అని గట్టిగా పిలుస్తూ వెళ్ళు నీకు భయ మెయ్యదు అని చెప్తుంది వాడు అలాగే గోపాలా గోపాలా అని అరుస్తూ వెళుతుంటే ఒక చిన్న గోవులు కాసుకునే పిల్లవాడు చేతిలో పిల్లనగ్రోవి పట్టుకొని వచ్చి పిలిచావా?అని అడిగాడు.వాడు మా అమ్మభయం వేయకుండా అలా పిలవమని చెప్పిందని చెప్పాడు .సరేలే నేను నిన్ను అడవి దాటిస్తాను అని రోజు వాడిని వెళ్ళే టప్పుడూ తిరిగి వచ్చేటప్పుడూ అడవి దాటించి వెళ్ళేవాడు.వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు.రాముడు చాలా శ్రద్ధగా చదువుకునే వాడు.
ఇలా వుండగా ఒక రోజు గురువు గారింట్లో ఆయన కూతురి పెళ్లి జరుగుతూంది. పిల్లలందరూ వెళుతున్నారు.అందరూ ఏదో ఒక కానుక తీసుకొని వెళుతున్నారు.రాముడు అమ్మా! నేనేమి తీసుకెళ్ళాలి? అని అడిగాడు. మనం పేదవాళ్ళం నాయనా!మనం వాళ్లకు ఏమి కానుక యివ్వగలము?అని అన్నది .
వాడు విచారంగా వెళ్ళిపోయాడు.రోజు లాగే గోపాలా గోపాలా అని పిలిచాడు. ఆ గొల్ల పిల్లవాడు పిల్లన గ్రోవి
ఊదుకుంటూ వచ్చాడు.రాముడి ముఖం విచారంగా వుండడం చూసి ఎందుకు అలా వున్నావని అడిగాడు వాడు విషయం చెప్పగానే ఆ గొల్ల పిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక చెంబు నిండుగా పాలు తీసుకొని వచ్చి వాళ్లకు పాయసానికి యివి ఉపయోగ పడతాయి తీసికెళ్ళు అని చెప్పాడు. వాడు జాగ్రత్తగా ఆ పాల చెంబు తీసుకొని గురువు గారింటికి వెళ్ళాడు.గురువు గారి భార్య తో అమ్మా నేను ఈ పాలు తెచ్చాను తీసుకోండి అని చెప్పాడు.ఆవిడ నిర్లక్షంగా ఒక నౌకర్ కి ఆ పాలు తీసుకొని వెళ్లి ఆ పాల గంగాళం లో పొయ్యమని చెప్పింది.వాడు పోసే సరికి మళ్ళీ చెంబు నిండా పాలు వున్నాయి అలాగ ఎన్ని సార్లు పోసినా
మరీ చెంబు నిండా పాలు వుంటున్నాయి.గంగాళం నిండి పోయింది.వాడు గురువుగారి భార్యను పిలిచి
చూపించాడు. ఈ విషయం పెళ్లి యింటికి వచ్చిన వాళ్ళందరికీ తెలిసి పోయింది అందరూ ఆశ్చర్య పోతున్నారు గురువు గారు రాముడిని పిలిచి ఈ పాలు ఎక్కడ తెచ్చావు? అని అడిగాడు.రాముడు మొత్తం కథ అంతా అమాయకంగా చెప్పాడు వాళ్ళ అమ్మ చెప్పడం తను .రోజూ తను గోపాలా అని పిలవగానే గొల్లవాడు వచ్చి తనను అడవి దాటించటం,పాలు యివ్వడం అన్నీ చెప్పాడు. వాళ్ళెవ్వరూ నమ్మలేదు.వాడిని ఆ అడవి కి తీసుకెళ్ళి ఏదీ
యిప్పుడు పిలువు వస్తాడేమో చూస్తాము.అని అన్నారు.వాడు గోపాలా గోపాలా అని ఎన్ని సార్లు పిలిచినా
ఎవరూ రాలేదు.అన్నే అపద్దాలు యిలా అబద్దాలు చెప్తావా?
అని గురువు గారు, మిగతా వాళ్ళందరూ వాడిని
బాగా తిట్టారు.వాడికి దుఃఖ మొచ్చింది పెద్దగా ఏడువ సాగాడు.ఎందుకు గోపాలా నీవు రావడం లేదు రోజూ
పిలవగానే వచ్చేవాడివి కదా! అని వెక్కి వెక్కి ఏడువ సాగాడు అప్పుడు ఆకాశవాణి వినిపించింది. రామూ
నీవు అమాయకంగా మీ అమ్మ మాటను నమ్మి నన్ను పిలిచావు కనుక నేను వచ్చాను.నేను ఈ స్వార్థ పరులకు కనిపించను.అందుకే రాలేదు. అని విని పించింది. అందరూ ఆశ్చర్య పోయారు.అప్పటినుండి వూరివాళ్ళు,గురువుగారు,పిల్లలు రాముడి తల్లినీ రాముడినీ తమ యిళ్ళ దగ్గరనే ఒక ఇల్లు యిచ్చి వాళ్ళు జీవించడానికి తగినంత సహాయం చేసేవారు. ఈ కథ మా పెద్దమ్మ సరస్వతమ్మ మా చిన్నప్పుడు చెప్పేది.
"దేవుణ్ణి నిష్కల్మషంగా నమ్మితే సహాయం చేస్తాడని కూడా చెప్పేది".


న విషం విష మిత్యాహు బ్రహ్మస్వ విషముచ్చతే
విషమేకాకినం హన్తి బ్రహ్మస్వం పుత్ర పౌత్రుకం
అర్థము:-- విషం అంత భయంకరమైనది కాదు. కానీ దేవుడిసొమ్మువిషము కంటే భయంకరమైనది. విషము
తీసుకున్న వాడిని మాత్రమె చంపుతుంది కానీ దేవుడి సొమ్ము అపహరిస్తే పుత్రులను పౌత్రులను కూడా
చంపుతుంది. అంటే వంశ నాశనం అవుతుంది.


తాతాచార్యులవారు కృష్ణదేవరాయల ఆస్థాన గురువులు.రాయలవారికి ఆయనంటే చాలా గౌరవం.ఆయనకు
మంచి భవనము,సేవకులు,అన్ని సౌకర్యాలూ యిచ్చారు.కానీ తాతాచార్యులవారికి అత్యాశ.రాయలకంటే తనకే అందరూ గౌరవ మివ్వాలి అని అనుకునే వారు.ఆస్థానములో చేరడానికి వచ్చే కవులందరూ తనదగ్గరకు వచ్చి
తనను సంతోష పెడితేనే రాజ సభలో ప్రవేశము లభిస్తుంది అని శిష్యులతో నగర శివార్లలోనే చెప్పించేవారు.పాపం వచ్చిన వారందరూ ముందు ఆయన దర్శనం చేసుకొని ఆయనకు ముడుపులు
సమర్పించుకొనేవారు."రాజ దర్శనాత్పూర్వం తాతః పూజ్యో న సంశయః"అని నిబంధన.రాజ దర్శ నానికి ముందు తాతాచార్యులవారిని పూజించాలి.
ఇదంతా రాయల వారికి తెలియదు.కొత్తగా వచ్చే కవులందరూ రామకృష్ణుడికి ఇదంతా చెప్పి తమను .ఎలాగైనా కాపాడమని వేడు కున్నారట .రామకృష్ణుడు ఆయనకు బుద్ధి చెప్పాలని ఆయన శిష్యుల దగ్గర,యింకా కొంత మంది ముఖ్యులదగ్గర యిదేదో "ముఖ ప్రక్షాళనాత్పూర్వం గుద ప్రక్షాళనం యధా"లాగ వుందే అనేవాడట . అంటే పళ్ళు తోముకునే ముందు కాలకృత్యాలు తీర్చుకుంటారు కదా అలాగ వుంది(ముఖం అంటే సంస్కృతం లో నోరు)ఈ సంగతి ఆ నోటా ఈనోటా రాయల వారికి తెలిసింది.ఆయన అవినీతిని యెంత మాత్రం సహించరు.ఎంతయినా ఆయన తన గురువు.అందుకని ఆయననురహస్యంగా తన మందిరానికి పిలిపించి మెత్తగా మందలించారట.ఇక మీదట యిలాగే కొనసాగితే క్షమించేది లేదని మెత్తగా చెప్పారట.అంతే అప్పటినుండీ ఆయన అలా చేయడం
మానుకున్నారట.కొత్తగా వచ్చే కవులందరూ రామకృష్ణుడికి కృతజ్ఞతలు చెప్పారట.


దాతృత్వ ప్రియ వక్తృత్వం
ధీరత్వ ముచితజ్ఞాతా
అభ్యాసేన న లభ్యన్తే
చత్వార సహజ గుణా
అర్థము:దానము చేసే గుణము,ప్రియముగా మాటలాడుట,ధీరత్వము,ఉచితానుచితజ్ఞానము,పుట్టుకతో వచ్చేవే కానీ నేర్చుకుంటే వచ్చేవి కావు.
ధీరో దార గుణంబులు
కారణ జనమునకు వేరే గరుపగా వలెనా
ధారుణిలో టెంకాయకు
నీరేవ్వరు పోసిరయ్య నిట్టల హరియా
అర్థము:-- ధైర్యము, ఉదారత్వము (ఔదార్యము)ఉత్తమునకు నేర్ప వలిసిన పని లేదు. కొబ్బరికాయలో
నీరెంత సహజముగా పుట్టుకు వస్తుందో ధైర్య, ఔదార్య గుణాలు కూడా పుట్టుకతోనే వస్తాయి. నేర్చుకుంటే వచ్చేవి కావు.

ప్రథమ వయసి పీతం తోయ మల్పం స్మరంతః
శిరసి నిహతి భారా నారికేళా నరాణాం
సలిల మమృత కల్పం దద్యురా జీవితాంతం
నహి కృత ముపకారం సాధవో విస్మరంతి
అర్థము:--కొబ్బరి చెట్లు మనము కొద్ది నీళ్ళు పోసి పెంచినా పెద్దదై బరువైన కాయల్ని మోస్తూ జీవిత పర్యంతమూ మనుషులకు తీయని నీటిని యిస్తుంది. కదా! అటులనే సాధుపురుషులు తమకు చేసిన చిన్న వుపకారమును కూడా మరువక ప్రత్యుపకార పరులై వుంటారు.


కీర్తిశేషులు వేటూరి ప్రభాకరశాస్త్రి గారు తెలుగు సాహిత్యం.పుష్టికీ,తుష్టికీ ఎంతో సేవ చేశారనేది నిర్వివాదాంశం.
ఎన్నో ప్రాచీన శాసనాలను వీరుద్ధరించారు.తాళపత్ర గ్రంథాలను పరిశోధించారు.చాటువులను సేకరించారు.
ప్రబంధాలను,కావ్యాలనూ సంస్కరించి శుద్ధపాఠాలను తయారు చేశారు.మారుమూల పడి మూలుగుతున్న
కవులకు వెలుగు నిచ్చారు.అటువంటి వారిలో తాళ్ళపాక తిమ్మక్క గారొకరు.యీమె వ్రాసిన "సుభద్రా కల్యాణం" పాటను శ్రీ శాస్త్రిగారు ఉద్ధరించి ప్రకటించారు.
సుప్రసిద్ధ వాగ్గేయకారు లైన తాళ్ళపాక అన్నమాచార్యుల గారి ధర్మపత్ని తిమ్మక్క గారు..మనకు తెలిసినంతవరకూ మొట్టమొదటి తెలుగు కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్కగారే. తేట తెనుగులో మధురాతి మధురంగా వున్న ఈ పాట,ఆ రోజుల్లో విశేష ప్రచారం లో వుండటం వల్లనే కావచ్చును. ఇందులోని ఛాయలు
కొన్ని ఆనాటి మహా కవుల రచనల్లో కనిపిస్తున్నాయి.
మాయా యతి రూపం లో వున్న అర్జునుని సుభద్ర ఎలా పలకరిస్తున్నదో చూడండి.

అయ్య మీరే దేశ మరసి చూచితిరో?
యెయ్యది మీ నామ?మెచట నుండుదురో?
పరగ నింద్ర ప్రస్థ పట్టణమ్మునను
బహుళ సంపదలతో బరగు చున్నార?
ధీర మానసులు కుంతీసుతుల్?వారు
ఆరయ కడుసుఖులై యున్నవార?
అంటూ ఆత్రంగా ప్రశ్నిస్తుంది సుభద్ర
ఇదే ఘట్టం లో "విజయ విలాసం" కర్త ఏమంటున్నాడో చూడండి.
"మీరింద్రప్రస్థముగని
నారా?పాండవుల జూచినారా?సుఖులై
వారందరునొకచో ను
న్నారా? వీరాగ్రగన్యు నరు నెరుగుదురా?
సుభద్ర అర్జునుల వివాహ క్రతువునంతా నడుం కట్టుకొని నడిపించింది ద్రౌపది. పడకటింటిని అలంకరింప
చేసింది.అయినా మనో వేదనను అనుభవింపక తప్పలేదు.అప్పటి ద్రౌపది మానసికావస్థ ను తిమ్మక్క
చాలా హృద్యంగా అభి వర్ణించింది.
"తలపోసే మనసులో తాళంగ లేక
ఏమి వస్తువు లైన నియ్యవచ్చు గాని
ప్రాణేశు నిచ్చిమరి బ్రతుకంగ రాదు
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని
చెల్లెలు గనక నే నొల్ల ననరాదు"
అదీ ద్రౌపది అసలు బాధ. అంతే కాదు, కొరవ సభలో మానభంగం జరగకుండా కాపాడినాడు శ్రీకృష్ణుడు.
అతని చెల్లెలు గనుకనే సుభద్రను సవతి గా తానూ ఆమోదించింది.దీనికి ప్రతిబింబం లాంటిదీ పద్యం.
''సొమ్ము లియ్యవచ్చు సోమ్మంద మీయవచ్చు
నియ్యరాని ప్రాణ మియ్యవచ్చు
తనదు విభుని వేరె తరుణి చేతికి నిచ్చి
తాళ వశమె యెట్టిదాని కైన?


ఒకరోజు భోజరాజు తన రాజధాని ధారానగరం లోమారువేషం తో తిరుగు చుండగా ఒక అందగత్తెను చూశాడు.
ఆమె బంతితో ఆడుకుంటున్నది.బంతిని చేతితో నేలకేసి కొడుతూ ఆమె ఆడుకుంటూ వుంటే ఆమె చెవికి కర్ణాభరణం గా వున్న పూవు జారి ఆమె కాళ్ళ మీద పడింది.ఆ దృశ్యం రాజుకు ఎంతో మనోహరం గా
కనిపించింది.కాసేపు ఆ ఆట చూసి, తిరిగి రాజమందిరానికి వెళ్ళిపోయాడు.
మరునాడు రాజసభలో తన ఆస్థాన కవులకు తను చూసిన బంతి ఆట దృశ్యం గురించి చెప్పి ఆ బంతి ఆటను
వర్ణిస్తూ తలా ఒక శ్లోకం చెప్పమని కోరాడు. మొదట భవభూతి లేచాడు.ధాటీగా తోటక వృత్తం లో యిలా శ్లోకం చెప్పాడు. (తోటక వృత్తం అంటే 'కమలాకుచచూచుక కుంకుమ తో నియతారుణి తాతుల నీలె తనో' అన్నట్టు
'టటటా టటటా' అని వరస 'స' గణాలతో సాగుతుంది)
విదితం,నను కందుక!, తే హృదయం
ప్రమదాధర సంగమ లుబ్ధ యితి
వనితా కర తామరసాఖి హతః
పతితః పతితః పునరుత్పతసి
ఓ!బంతీ నీ ఉద్దేశ్యం స్పష్టంగా తెలుస్తూనే వుంది. ఈ అందగత్తె అధరాలను ముద్దాడాలని చాలా ఉత్సాహ పడు తున్నావు.అందుకే తామరపువ్వు లాంటి ఆమె చేతుల దెబ్బతిని మాటి మాటి కీ కింద పడి కూడా
పైకి లేస్తున్నావు.(నను కందుక!=ఓ!బంతీ, తే హృదయం విదితం=నీ హృదయ మేమిటో తెలుస్తూనే వుంది
ప్రమదాధర సంగమ లుబ్ధః యితి =జవరాలి అధరాలను చేరాలని ఆశపడుతున్నావు. వనితా కర తామరస
అభిహతః=ఈ వువిద కర కమలాల చేత కొట్టబడి కూడా పతితః పతితః=పదే పదే కింద పడి, పునః ఉత్పతసి=మళ్ళీ పైకి లేస్తున్నావు)
చక్కటి ఉత్ప్రేక్ష,అన్నాడు భోజరాజు.
తరువాత వరరుచి లేచాడు.తన వర్ణన యిలా చెప్పాడు.
ఏకోపి త్రయ యివభాతి కందుకోయం
కాన్తాయాః కరతల రాగ రక్త రక్తః
భూమౌ తచ్చరణ నఖాంశు గౌర గౌరః
ఖస్థః సన్ నయన మరీచి నీల నీలః
ఈ బంతి ఒకటే అయినా మూడు బంతుల్లాగా కనిపిస్తున్నది. ఆ కాంత చేతిలో ఆమె అరచేతి యెర్రని కాంతుల వల్ల ఎర్రబడి, యెర్రని బంతిగా కనిపిస్తున్నది. అదే బంతి భూమి మీద పడినప్పుడు ఆమె కాలి గోళ్ల తెల్లని కాంతిలో తెల్లటి బంతి లాగా కనిపిస్తున్నది,ఆ బంతే మళ్ళీ పైకి లేచినప్పుడు ఆమె కన్నుల నీలి కాంతుల లో నల్లటి బంతి లాగ కనిపిస్తున్నది.
(అయం కందుకః ఏకః ఆపి త్రయః యివ భాతి =ఈ బంతి ఒక్కటే అయినా మూడు బంతుల లాగా ప్రకాశి
స్తున్నది ; కాంతాయా: కరతల రాగ రక్త రక్తః =కాంత యొక్క అరచేతి ఎర్రదనం చేత ఎర్రబడి ఎర్రనిదిగా
భూమౌ తత్ చరణ నఖఅంశు గౌర గౌరః =భూమి మీద పడ్డప్పుడు ఆమె చరణాల నఖముల కాంతి కిరణాల
చేత తెల్లబడి తెల్లదిగానూ,ఖస్థ సన్ నయన మరీచి నీల నీలః =ఆకాశములో వున్నప్పుడు (పైకి లేచినప్పుడు)కన్నుల కాంతి వల్ల నల్లదిగానూ కనిపిస్తున్నది.
యిది మరీ బాగుంది అన్నాడు రాజు
ఇంతలో కవికుల గురువు కాళిదాసు లేచి రాజు గారు చెప్పిన దృశ్యాన్ని యిలా వర్ణించాడు.
పయోధరాకార ధరోహి కందుకః
కరేణ రోషాభిహన్యతే ముహు:
ఇతీవ నేత్రాకృతి భీత ముత్పలం
స్త్రియః ప్రసాదాయ పపాత పాదయో:
తా:-- ఆ యింతి బంతి ఆట చూస్తే ఆమె చెవిలో నున్న కలువ మొగ్గ కు భయం వేసిందట ఎందుకు?తన పయోధరాలను ఆ బంతి అనుకరిస్తున్నదని కోపంతో ఆ జవరాలు బంతిని పదే పదే చేతులతో కొట్టి దండిస్తున్నది, మరి కలువపూవు నైన నేను కూడా ఆమె కన్నులను అనుకరిస్తున్నాను కదా! నన్ను కూడా దండిస్తుందేమో నని భయపడి ఆ కలువ ఆమె చెవి నుండి జారి ఆమె పాదాల మీద పడిపోయింది
క్షమించమని.(కవులు అందమైన స్త్రీ కన్నులను కలువపూవులతో పోలుస్తారు)
పయోధర ఆకార ధరః కందుకః =ఆ బంతి ఆమె పాలిండ్ల ఆకారం ధరించినదని రోషాత్ కరేణ ముహు:అభిహస్యతే హి=కోపముతో చేతి తో మాటి మాటి కీ కొడుతున్నది కదా! ఇతి యివ=అన్నట్లుగా
నేత్ర ఆకృతి భీతం ఉత్పలం =తానూ కన్నుల ఆకారములో వుండటం చేత భయపడ్డ ఆ కలువపూవు
స్త్రియః ప్రసాదాయ=ఆ స్త్రీ అనుగ్రహం కోసం పాదయో పపాత =పాదాల పై పడి పోయింది.
ఇక భోజరాజుకు కాళిదాసు వర్ణననే కదా నచ్చిందని వేరే చెప్పనవసరం లేదు.
ఈ మూడు శ్లోకాలూ జాగ్రత్తగా చదివి ఎవరి వర్ణన ఎక్కువ మనోహరంగా వుందో పాఠకులే తేల్చుకోవాలి


మాతృవత్పర దారాంశ్చ పర ద్రవ్యాణి లోష్టవత్
ఆత్మవత్స్సరవ భూతాని యః పశ్యతి సపశ్యతి!
అర్థము:-- పర స్త్రీని తల్లి వలెను, పరుల ధనమును మట్టి పెళ్ల వలెను, సకలభూతములను తన వలెను, ఎవడు చూచునో అతడు బ్రహ్మ జ్ఞాని యగును. ఇది సహదేవుడు చెప్పిన వచనము.


భోజ కాళిదాస కథలలో ఎక్కువ కథలు భోజుడి ఔదార్యాన్నీ,కాళిదాసు కవిత్వ మహాత్యాన్నీ ప్రశంసిస్తూ చెప్పేవి.కొన్ని కథల లో కాళిదాసు యుక్తితో సమస్యల నుంచి తప్పించుకోవడం గురించి చెప్తారు.యిది అలాంటి కథ.
ఒక దూరదేశం లో దుర్యోధను డనే కవి వుండేవాడు.ఆయన కాళిదాసు కవిత్వము గురించీ ఆయన పొందుతున్న సత్కారాలను గురించీ విన్నాడు.భోజుడి రాజ్యం లో కాళిదాసునే భోజుడికంటేఎక్కువ గౌరవిస్తారనీ విన్నాడు. దుర్యోధనుడు స్వయం గా మంచి విద్వాంసుడూ.కవీ దానికి తోడు మహా భక్తుడు,దేవీ ఉపాసకుడు కూడా.అయితేనేమి కొంచెం అసూయా పరుడు.కాళిదాసును మించిన కవిత్వం చెప్పాలనే కోరిక తో
దేవిని గూర్చి తపస్సు చేశాడు.దేవి ప్రత్యక్ష మైంది.మాతా!నాకు కాళిదాసు ను మించిన కవితా పాటవాన్ని ప్రసాదించు.కాళిదాసును ఓడించాలని నాకోరిక. అని అడిగాడు..అప్పుడు దేవి భక్తా! నీ కోరిక లో ఈర్ష దాగి వుంది అది నీకు మంచిదికాదు.కాళిదాసు నా భక్తుడు.నా వరం తోనే మహా కవి యైన వాడు.ఆయన తో నీకు పోటీ కూడదు.అయినా తపస్సు చేసి నన్ను మెప్పించావు కాబట్టి,నీకు ఆ శక్తిని ప్రసాదిస్తున్నాను. కానీ
రాబోయే పౌర్ణమి నాటికి భోజుడి ఆస్థానం చేరితే ఆ రోజు ఒక్కరోజు మాత్రమే ఆ శక్తి పనిచేస్తుంది. అని చెప్పి అంతర్ధాన మైంది.
సంతోషం తో తన పరివారాన్ని తీసుకొని ధారనగారానికి వెళ్లి నగర శివార్లలో విడిది చేసి పొర్ణమి నాడు తను
రాజాస్థానానికి వస్తున్నానని కబురు పంపాడు.ఆ సాయంత్రం కాళిదాసు రోజు లాగే కాళీమాతను పూజిస్తూండగా దేవి పలుకులు వినిపించాయి కాళిదాసా! రేపు మీ ఆస్థానం చేరబోతున్న దుర్యోధన కవికి ఈ ఒక్క రోజుకూ నేను నిన్ను ఓడించగల శక్తి ప్రసాదించినాను.ఈ ఒక్కరోజూ దుర్యోధనుడిని గెలవటానికి నేను ఏమీ సహాయం చేయలేను.నీ వేమయినా జాగ్రత్త పడతావేమో నని నిన్ను హెచ్చరిస్తున్నాను.అని చెప్పి మాయమై పోయింది.కాళిదాసు ఒక యుక్తి పన్నాడు.గడ్డి మోపులు అమ్మేవాడిలాగా వేషం వేసుకొని ఊరిబయట వున్నగుడారాలలో విడిది చేసిన దుర్యోధనుడి పరివారాల దగ్గరికి వెళ్లి గుర్రాలకు కావలిసిన మేత కారు చౌకగా అమ్మాడు.రాత్రయిపోయిందని సాకు చెప్పి అక్కడే వుండి పోయాడు.
గుడారం లో దుర్యోధనుడికి నిద్ర పట్టలేదు,కాళిదాసు కూ నిద్ర పట్టలేదు.యిద్దరికీ రేపేంజరుగుతుందో నని ఆందోళనా భయం.దుర్యోధనుడు తెల్లవారక ముందే తన గుడారం నుంచి బయటికి వచ్చిఅక్కడే తిరుగుతున్నాడు. కాళిదాసు అయన ప్రక్కన చేతులు కట్టుకొని నిలబడ్డాడు.పడమటి దిక్కున చంద్రుడు యింకా ప్రకాశిస్తున్నాడు.సూర్యోదయం యింకా కాలేదు.పక్షుల కలకలా రావాలు అప్పుడప్పుడే మొదలవుతున్నాయి.ప్రకృతి ఎంత అందం గా వున్నది.యిదంతా చూస్తుంటే నీ హృదయం స్పందించడం లేదా?అని అడిగాడు.దుర్యోధనుడు మారువేషం లో వున్న కాళిదాసును.గడ్డి అమ్ముకునే వాడిని నాకవన్నీ
ఏమి తెలుస్తాయి?మీరే ఏదైనా మంచి వర్ణన చెప్పండి వింటాను అన్నాడు.అయితే విను
చరమగిరి కురంగీ శృంగ కండూయనేన
స్వపితి పునరిదానీం అంతరిందో:కురంగః
అంటే అర్థ మయిందా?నీకు కాలేదనుకుంటాను నేను చెప్తాను అన్నాడు.చిత్తం అవసరం లేదండీ.కాళిదాసు గారి గుర్రాలకు కూడా నేనే గడ్డి అమ్ముతాను అక్కడి సేవకులతో మాట్లాడుతుంటాను.కాళిదాసుగారి కవిత్వం అప్పుడప్పుడూ వింటూ వుంటాను మరీ కఠిన మైనవి అర్థం కావు కానీ ఇలాంటి చిన్న చిన్న శ్లోకాలు అర్థం చేసుకోగలను.అన్నాడు.దుర్యోధనుడు నివ్వెర పోయి ఏదీ చెప్పుచూద్దాం అన్నాడు.
చరమగిరీ అంటే పడమటి కొండ కురంగీ అంటే లేడి శృంగం అంటే క్మొమ్ము కండూయనం అంటే దురద పోయేలా హాయి కలిగించేలా మెల్లగా గీరటం.అంతరిందో:కురంగః అంటే ఆ చంద్రుని లోపల కనిపిస్తున్న లేడి.
(చంద్రుడికి హరిణాంకుడు అని పేరు.మధ్యలో హరిణం వున్నవాడు.అని అర్థం)వెరసి మీరనేది పడమటికొండ అనే లేడి తన కొమ్ములతో చంద్రుడి లో వున్న లేడికి హాయి గొలిపేలా గీరుతూ వుంటే అది నిద్రావస్థ లోకి యిప్పుడు జారుకుంటున్నది అని అంతే కదా కవిరాజా! అన్నాడు.అమాయకత్వం నటిస్తూ.ఆరి పిడుగా అని ఆశ్చర్య పోయాడు దుర్యోధనుడు.గడ్డి అమ్ముకునే వాడికే యింత పాండిత్యం వుంటే యిక ఆస్థానం లోని కవులేంతటి వారో అని అతనికి వణుకు పుట్టింది.పైకి మాత్రం డాంబికంగా చూశావాఅలంకారం యెంత బాగా
వేశానో అన్నాడు.అలంకారానికేమి స్వామీ అద్భుతం గా వున్నది.కాకపొతే నాదొక చిన్న సందేహం
'చరమగిరి కురంగీ' అన్నారు కదా!కురంగీ అంటే ఆడలేడి.ఆడ లేడికి కొమ్ములు వుండవు కదండీ మీరు ఏ
భావం తో చెప్పారో వివరం చెప్పరా?అన్నాడు కాళిదాసు.దుర్యోధనుడి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది.
తను పప్పులో కాలేశాడు.వీడే తన కవిత్వం లో తప్పులు చూపిస్తున్నాడే అని కొంత ఆందోళన పెరిగింది.
పైకి మాత్రం ఆ ఏదో తెల్లవారు ఝాముననె నిద్రకళ్ళతో ఆశువుగా రెండు ముక్కలు చెప్పానులే నువ్వు కనుక్కో గలవో లేదో అని నిన్ను పరీక్షించ డానికి చెప్పాను అన్నాడు.ఇది అద్భుతమైన ఊహండీ ఏ భాసుడో
సౌమిల్లుడో చెప్పాల్సినంత గొప్ప శ్లోకం.నాకు తెలుసు మీరు కావాలనే తప్పు చెప్పారని. ఇలాంటి తప్పులు సవరించడం నేను కాళిదాసు గారి దగ్గర నేర్చుకున్నానండీ మీరు నన్నుప్రోత్సహిస్తున్నారు కాబట్టి నేను దీన్ని సవరించి చెప్తానండీ మీకు నచ్చుతుందో లేదో తెలియదు.
మీ శ్లోకం లో 'శృంగీ' అన్న దానికి బదులుగా 'తుండీ' అని మారిస్తే సరిపోతుందండీ తుండి అంటే ముట్టే అని అర్థం వస్తుంది కదండీ అందుకని సరిపోతుంది.మిగతా రెండు పాదాలూ చెప్పేయండి.అన్నాడు.దుర్యోధన కవి కంగారు పడ్డాడు. ఆ చలిలో కూడా చెమట పట్టిందిఅయినా పైకి బింకంగా, .కవిత్వం చెప్పడం,
శ్లోకం పూర్తి చెయ్యటం అంటే గడ్డిమోపులు అమ్మినంత సులభం కాదు.అలంకారం,ధ్వనీ రసం అన్నీ సరిచూసుకోవాలి కదా!వున్న పళాన చెప్పేది కాదు అన్నాడు.నిజమే లెండి అవన్నీ ఆలోచించి మీరు శ్లోకాన్ని ఎలా పూరిస్తారో నాకు తెలియదు కానీమా కాళిదాసు గారి గొడ్ల కాపరి దగ్గర ఇలాంటి శ్లోకాలు పూరించటం నేను రెండు మూడు రోజులు నేర్చుకున్నాను.వాడి శైలి కొంచెం అనుకరించి ఈ శ్లోకం నేను పూరిస్తాను చూడండి. కాళిదాసు గారు పండితులతో ముచ్చటిస్తూ వుంటే విని నాకూ కొంచెం శ్లోకాలు యెలా పూరించాలో అబ్బింది లెండి. ఈ శ్లోకం మిగతా రెండు పాదాలూ వాడైతే బహుశా యిలా పూరిస్తాడు.
'పరిణిత రవి గర్భ వ్యాకులా పౌరుహూతీ
దిగాపి ఘన కపోతీ హుంకృతై: క్రందతీవః అంటాడు.
మీరు పడమటి దిక్కు గురించి రెండు పాదాలు చెప్పారు.తూర్పుదిక్కు గురించి మిగతా రెండు పాదాలూ
చెప్తే సరిపోతుంది కదా! అని చెప్పాను .పౌరుహూతి అంటే తూర్పు దిక్కు కదండీ 'పరిణత రవి గర్భ వ్యాకుల'
అంటే సూర్యుడిని గర్భం లో వుంచుకొని నెలలు నిండిన వనితలా ప్రసవ వేదన తో కేకలు పెడుతున్నది కదండీ అదిగో 'ఘన కపోతీ హుంకృ తై క్రందతీవ' అంటే పక్షుల పెద్ద పెద్ద అరుపుల రూపం లో ఆమె ప్రసవ వేదన పడుతున్నట్లు అనిపించడం లేదూ?అంటూ అప్పుడే లేచి కలకలా రావాలు చేస్తున్న పక్షులను చూపించాడు.కాళిదాసు.శ్లోకం పూర్తయింది.
చరమగిరి కురంగీ తుండ కండూయ నేన
స్వపితి పునరిదానీం అంతరిందో:కురంగః
పరిణిత రవి గర్భ వ్యాకులా పౌర హూతీ
దిగపి ఘన కపోతీ హుంకృతై :క్రందతీవః
పడమటి కొండ అనే ఆడ లేడి తన తుట్టేతో చంద్రుడిలో వుండే హరిణాన్ని తనముట్టెతో దానికి హాయి గోలిపేలా గీరుతున్నది.యిక తూర్పుదిక్కు సూర్యుడిని తన గర్భం లో దాచుకొని నెలలు నిండిన వనిత ప్రసవ వేదన పడుతున్నప్పుడు చేసే ఆక్రందనల్లాగా పక్షుల కిలకిలా రావాలు అనిపిస్తున్నాయి.
దుర్యోధనుడికి ఆ కవిత్వ సౌందర్యానికి ఒళ్ళు పులకరించింది.తనకు రాజాస్థానం లోపరాభవం తప్పదని
భయం వేసి దేవీ కటాక్షం మీద కూడా నమ్మకం పోయి ఈ కవుల ముందు తాను నిలువ లేనని పించి
అప్పటికపుడే తన సేవకులందరినీ లేపేసి తెల్లవారక ముందే సపరివారం గా వూరు విడిచి వెళ్లి పోయాడు.
కాళిదాసు ' మాణిక్యవీణా ముపలాలయంతీం'
మదాలసాం మంజుల వాగ్విలాసాం
మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం
మాతంగ కన్యాం మనసా స్మరామి
అంటూ మునుపెన్న డో తనే రచించిన శ్లోకాలతో కాళీ మాతను స్తుతించు కుంటూ ఇల్లు చేరాడు.


ఒకసారి భోజరాజు కోశాగారం లోకి ఒక దొంగ ఎలాగో ప్రవేశించి విలువైన రత్నాలన్నిటిని మూట గట్టుకొని బయల్దేరే సమయములో వాడికి ఎందుకో జ్ఞానోదయమైంది. వాడు యిలా అనుకున్నాడు.
యతో వ్యంగా కుష్టు నశ్చంధా పంగవశ్చ దరిద్రణ:
పూర్వోపార్జిత పాపస్య ఫల మాస్నంతి దేహినః
అర్థము:-- లోకం లో అంగవైకల్యము గలవారు, కుష్టు రోగులు,కుంటివారు,గుడ్డివారు,
దరిద్రులూ వీరంతా ఎపుడో చేసిన పాప కర్మల ఫలితాన్ని అనుభవిస్తున్న వారే కదా!అనే పాపభీతి కలిగి
ఆ మూట అక్కడే వదిలేసి వెళ్ళిపోదామని అనుకుంటూ వుండగా, భోజ రాజు నిద్ర పట్టక లేచి కిటికీ లోనుంచి తన అందమైన ధారా నగరాన్ని చూస్తూ భావావేశంతో గట్టిగా యిలా అన్నాడట.
శ్లోకం:-- చేతోపహరా యువతయః సుహ్రుదనుకూలా సద్బాంధవా ప్రణయ గర్భగిరశ్చభ్రుత్యాన్
వల్గంతి దంతి నివహా తరళా: తురంగాః
అర్థము:-- నాకేమి తక్కువమనోహరమైన అందగత్తెలు,అనుకూలురైన మిత్రులూ,సజ్జనులైన బంధువులూ,
యెంతో ప్రేమతో సేవచేసే సేవకులు,గజ తురగ దళాలూ,దూకుడు గల సేనలూ వున్నాయి.
దొంగ అప్రయత్నంగాగట్టిగా నాలుగో పాదం యిలా పూరించాడు.
"సంమీలనే నయనయో : నహి కించి దస్తి"అంటే ఒక్కసారి కన్నుమూత పడగానే (అంటే చనిపోగానే)నశించే వే కదా! దాంతో దొంగ దొరికి పోయాడు. భటులు వాడినిరాజు గారి దగ్గరికి తీసుకొని వచ్చారు. రాజు వాడు చేయ బోయిన దొంగ తనాన్నిపట్టించు కోకుండా చక్కటి సత్యంతో తన శ్లోకాన్ని పూర్తి చేసి నందుకు అతనికి తన చేతి బంగారు కడియాన్ని బహూకరించి పంపేశాడట
యింటికి వెళ్లి ఆ దొంగ ఆ కడియాన్నితీసుకొని తన మిత్రుడింటికి వెళ్ళాడు.ఆ మిత్రుడు నిరుపేద,అతని పరిస్థితి చూసి జాలి పడి ఆ కడియాన్ని అతనికిచ్చి యిది రాజుగారి సొంత ఆభరణం.చాలా విలువైనది చౌకగా మాత్రం తెగనమ్మకు అని చెప్పాడు. ఆ మిత్రుడు కడియాన్ని పొద్దున్నే ఒక బంగారు దుకాణం లో మంచి ధరకు అమ్మేశాడు.ఆ సొమ్ముతో ఖరీదయిన బట్టలూ,ఆభరణాలు కొనుక్కొని అవన్నీ ధరించి వీధిలో నడుస్తూంటే అందరూ ఆశ్చర్య పోయారు.నిన్నటి వరకూ కోతికి కూడా గతిలేని వాడికి యివన్నీ ఎలా వచ్చాయి అని ఎక్కడో దొంగతనం చేసి ఉంటాడని అనుమానం వేసి రాజు గారి భటులకు అప్పగించారు.
వాళ్ళు అతనిని రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్ళారు.రాజుగారు యివన్నీ నేకేక్కడివి?అని గద్దించి అడిగారు. అప్పుడు వాడు రాజుకోక శ్లోకం చెప్పాడు.
భేకై: కోటర శాయిభి,మృత మివ క్ష్మాం తర్గతం కచ్ఛపై:
పాఠీ నై: పృథు పీఠ లుఠనాత్ అస్మిన్ ముహుర్మూర్చితం
తస్మిన్ శుష్క సరస్య కాల జలదే నాగత్య తచ్చేష్టితం
యేనాకుంభ నిమగ్న వన్య కరిణాం యూధై:పయః పీయతే
తా :--రాజా!ఒక ఎండిపోయిన చెరువు న్నది అందులో నీరు లేక నేల బొరియలలో పడుకొన్న కప్పలున్నాయి,తాబేళ్లు భూమిలోకి వెళ్లి చచ్చిపోయినట్టు పడి వున్నాయి.చేపలు నీరు చాలక ఆ ఎండిన బంకమట్టి పలకల మీద వెల్లకిలా పడి తరచుగా మూర్చ పోతున్నాయి.అలాంటి ఎండిన సరస్సులో ఆకాలం లో మేఘు డిచ్చిన వర్షం వల్ల పెద్ద అడవి ఎనుగులే అకస్మాత్తుగా కుంభ స్థలాల వరకూ మునిగి పోయి
యిప్పుడు హాయిగా నీళ్ళు తాగుతున్నాయి.(నిరుపేదనైన నాకు అకస్మాత్తుగా సిరి లభించింది).నా మిత్రుడొకడు ఒక బంగారు కంకణము ను నాకు యిచ్చాడు. దానితో నేను ధనవంతుడ నయ్యాను.అన్నాడు
అతని కవిత్వం రాజుకు నచ్చింది.తాను మొన్న రాత్రి ఆ దొంగ కు యిచ్చిన కడియమే ఆ దొంగ తన మిత్రుడికిచ్చాడని గ్రహించి, ఆ దొంగయొక్క మంచితనానికీ ,వితరణకూ సంతోషించి దొంగ యొక్క మిత్రుడికి తానూ ఒక లక్షనాణాలు యిచ్చి పంపించాడు.


అల్లసాని పెద్దన వ్రాసిన మనుచరిత్ర ప్రబంధం లోని వరూధిని ఏడుపు వర్ణన.
పాటున కింతు లోర్తురె కృపా రహితాత్మక నీవు త్రోవ ని
చ్చోట భవన్నఖాంకురాము సోకే కనుంగొనుమంచు జూపి య
ప్పాటల గంధి వేదన నెపంబిడి యేడ్చే కలస్వనంబుతో
మీటిన గబ్బి గుబ్బ చనుమిట్టల నశ్రులు చిందువందగన్
అర్థము:--తనను ప్రేమించమని వేడుకుంటూ కాదంటే మీద పడి కౌగలించుకున్నవరూధినిని ప్రవరుడు తనచేతులతో త్రోసి వేశాడు.అప్పుడు ఆమె నీవు తోసి వేస్తేఆ దెబ్బకు ఆడవాళ్ళు ఓర్చు కుందురా?దయలేనివాడా నీవు త్రోసినప్పుడు నీ వేలి గోరు నాకు గ్రుచ్చుకొని గాయమయింది చూడు అని తన వక్షస్థలమును చూపి ఆ వరూధిని మధురమైన గొంతుతోవేదన అనే సాకు తో తన గోటి తో చిమ్మినకన్నీరు ఆమె వక్షస్థలము పై చింది పడుచుండగా యేడ్చేను.

ముక్కుతిమ్మన వ్రాసిన "పారిజాతాపహరణము"లో సత్యభామ ఏడుపు వర్ణన
.
ఈసున బుట్టి డెందమున హెచ్చిన శోకదవానలంబు చే
గాసిలి యేడ్చే ప్రాణవిభు కట్టె దురన్ లలితాంగి పంకజ
శ్రీ సఖ మైన మోము పై చేల చెరంగిడి బాల పల్లవ
గ్రాస కషాయ కంఠ కలకంఠ వధూకల కాకలీ ధ్వనిన్
అర్థము:--మనసులో ఈర్ష కోపము ,శోకము కలిసి హెచ్చిన దావానలముతో మండి పోయి వెక్కి వెక్కి తన భర్త యెదుటఆ లలితమైన అంగములు కల సత్యభామ తామర పూవు వంటిఅందమైన తన ముఖముపై పైట చెరగు కప్పుకొని లేత మామిడి చిగుళ్ళు తిని కూసిన కోకిల కూత వలె మధురము గా యేడ్చింది.
భట్టుమూర్తి వ్రాసిన వసు చరిత్ర లో నాయిక గిరిక ఏడుపు వర్ణన
.
ఆజాబిల్లి వెలుంగు వెల్లికల డాయన్ లేక రాకా నిశా
రాజశ్రీ సఖమైన మోమున పటాగ్రం బొత్తి యెల్గెత్తి యా
రాజీవానన యేడ్చే కిన్నెర వధూ రాజత్కారాంభోజ కాం
భోజీ మేళ విపంచికా రవ సుధా పూరంబు తోరంబు గాన్
అర్థము:-ఆవెన్నెల వెలుగు రేపిన విరహాన్ని భరించలేక చంద్ర బింబము వంటి తన ముఖము పై తన పైట చెరగు కప్పుకొని ఆ తామరపూవు వంటి ముఖము గల వనిత కిన్నెర కాంతలు తమ వీణ మీద కాంభోజీ రాగము
మేళ వించి పాడినట్టుగా అమృత మైన గొంతు తో ఎలుగెత్తి గట్టిగా యేడ్చింది.
ఈ మూడు యేడుపులమీద రామకృష్ణుడి వ్యాఖ్య
అల్లసానిపెద్దన అటు నిటుగా యేడ్చే
ముక్కుతిమ్మన ముద్దు ముద్దుగా నేడ్చే
భట్టుమూర్తి బావురుమని యేడ్చే


అగ్నిహోత్రం గృహ,క్షేత్రే, గర్భిణీ,వృద్ధ, బాలకౌ
రిక్త హస్తేన నో పేయాత్ ద్రాజనం దైవతం గురుం.
అర్థము:--అగ్నిహొత్రమునకు మంత్ర పూర్వకముగా ఆహుతు లిచ్చు చోటికి పోవునప్పుడు, ఎవరి గృహమునకైన వెళ్ళినప్పుడు,గర్భిణీ స్త్రీలను,పిల్లలను, వృద్ధులను, రాజులను,దేవుడిని,గురువులను
చూచుటకు పోవునప్పుడు వట్టి చేతులతో పోరాదు.అనగా ఫల పుష్పాదులను గోనిపోవలయును.


భోజరాజు రాత్రి వేళలో నగరం లో తిరుగుతుంటే,ఒకచోట యిద్దరు దొంగలు కనిపించారు.ఒకడి పేరు శకుంతుడు
మరొకడి పేరు మరాళుడు.వారిద్దరూ మాట్లాడుకుంటూ వుంటే భోజరాజు చెట్టు చాటునుండి వింటున్నాడు.
శకుంతుడు మిత్రమా!కన్నం వేసి యింత సొమ్ము దొంగిలించి తెచ్చాము,కానీ నాకు భయంగా వుంది.ఊరంతా
రక్షక భటులు తిరుగుతున్నారు.వాళ్ళు పట్టుకోక ముందే మనం దోచుకున్నసోమ్ము పంచుకొని వెళ్ళిపోవడం
మంచిది.అన్నాడు మరాళుడు 'శకుంతా మనం దోచుకున్న సొమ్ము విలువ చాలా ఎక్కువే వుంటుంది యింత సొమ్ముతో నీవేమి చేస్తావు?అందుకు శకుంతుడు యిదంతా ఎవరైనా యోగ్యుడైన పేదవాడికి దానం చేస్తాను.అతను యింక ఎవ్వరినీ యాచించ వలిసిన పని లేకుండా. దానం చేస్తే యిచ్చిన వాడికీ పుచ్చుకున్న వాడికీ కూడా ఒళ్ళు పులకరించేలా చెయ్యాలి.
దొంగసొమ్ము దానం చేస్తే నీకు పుణ్యం ఎలా వస్తుంది మరాళా?అన్నాడు మరాళుడు.
దొంగతనం కూడా 64 కళల్లో ఒకటి యిది మన తాత ముత్తాతల నుంచి వస్తున్న వృత్తే కదా!కనుక ఈ సొమ్ము దానం చెయ్య వచ్చు.పెద్దలు అంటారు కదా!

మూర్ఖో నహి దదాత్యర్థం నరో దారిద్ర్య శంకయా
ప్రాజ్ఞస్తు వితర త్యర్థం నరో దారిద్ర్య శంకయా
అర్థము:--దానం చేస్తే దరిద్రుడ నవు తానేమో నన్న భయంతో మూర్ఖుడు దానం చెయ్యడు.దానం చెయ్యకపోతే ముందు జన్మకు దరిద్రుడ నవుతా నన్న భయం తో బుద్ధిమంతుడు దానం చేస్తాడు.
యింతకీ మరాళా!ఈ దొంగ సొమ్ముతో నేవేమి చెయ్యాలని అనుకుంటున్నావు?అందుకు మరాళుడు
మొన్న మా ఇంటికి కాశీ నుండి ఒక బ్రహ్మచారి వచ్చాడు.కాశీవాసం చేస్తే చాలా పుణ్యమని మా నాన్నకు
బోధించి వెళ్ళాడు.చిన్నప్పటి నుంచీ దొంగతనాలు చేస్తూ కూడగట్టుకున్న పాపమంతా కాశీ వాసం చేసి
పోగొట్టుకోవాలని .మా నాన్నఆలోచన.ఇప్పుడాయన దొంగతనాలు మానేసి వైరాగ్య మార్గంలో నడవాలనుకుంటున్నాడు.ఆయన కాశీ యాత్రకోసమే ఈ డబ్బంతా..ఆ బ్రహ్మచారి మానాన్నకు యిలా చెప్పాడు.
వారాణసీ పురీ వాస వాసనా వాసితాత్మనా
కిం శునా సమతాం యాతి వరాకః పాక శాసనః
అర్థము:--కాశీ వాస పుణ్యం చేత పుణ్యాత్మ అయిన కుక్కతో ఇంద్రుడ యితే మాత్రం సమాన మవుతాడా?
ఆ కుక్క పుణ్య ఫలం ఇంద్రుడి కంటే అధికం.
మరణం మంగళం యత్ర విభూతిశ్చ విభూషణం
కౌపీనం యత్ర కౌశేయం సా కాశీ కేన మీయతే
అర్థము:-- ఎక్కడయితే మరణమే మంగళ ప్రదమో,బూడిదే ఆభరణమో,గోచిపాతే పట్టు పుట్టమో ఆ కాశీ తో దేనికి పోలిక?
వాళ్ళిద్దరి సంభాషణ విని రాజు చాలా ఆనందిం చాడు.కర్మగతి యెంత విచిత్రం.ఈ దొంగ లిద్దరూ మంచి బుద్ధి కల వాళ్ళే.అనుకోని మౌనంగా అక్కడినుండి వెళ్ళిపోయాడు.


విద్వానేవ విజానాతి విద్వత్ జన పరిశ్రమం
నహి వంధ్యా విజానాతి గుర్వీమ్ ప్రసవవేదనాం
అర్థము:-- విద్వాంసులు,వారు విద్వాంసులు కావడానికి వారుచేసిన కృషి,కష్టము,విద్వాంసులే అర్థం చేసుకోగలరు.ఏ రంగము లోనైనా అంతే.ఎలాగయితే గొడ్రాలికి పురిటినొప్పుల సంగతి తెలియదో అలాగ.(ఈ కాలం లో పురిటి నొప్పులు తెలియకుండా యేవో సూదిమందులు తీసుకుంటున్నారు. కానీ శ్లోకం ఈ కాలంలోది కాదు కదా!)


జడ భరతుని కథ ఈ కథ చాల మందికి తెలీదు.
అగ్నీధ్రుడు జంబూ ద్వీపాన్ని పరిపాలించాడు.వూర్వాభిత్త అనే అప్సరస వలన అతనికి తొమ్మండుగురు
పుత్రులు కలిగారు.వారు నాభి,కింపురుషుడు,హరివర్షుడు,ఇలావృతుడు,రంయకుడు,హిరణ్మయుడు,కురువు,
భద్రాశ్వుడు,కేతుమాలుడు అనువారు.జంబూ ద్వీప వర్షాలను (సంవత్సరాలు)ఈ తొమ్మిది మందికీ పంచి యిచ్చాడు.తండ్రి అగ్నీధ్రుడు.తమ తమ పేర్లతో వున్న వర్షాలను పరిపాలిస్తూ వచ్చారు.పెద్దవాడయిన నాభి భార్య మేరుదేవి.వారిరువరికీ విష్ణువు కుమారుడుగా జన్మించాడు.అతఃని పేరు ఋషభుడు.అతను తన అద్భుత శక్తి చేత ఇంద్రుడి అణచి వేశాడు.తన రాజ్యానికి అజనాబం అని పేరు పెట్టాడు.అతని భార్య జయంతి.
వారికి నూర్గురు పుత్రులు కలిగారు.వారందరూ గుణగణాలలో తండ్రికి సాటి అయినవారు. వారిలో పెద్దవాడు భరతుడు.అతను ప్రసిద్ధుడై గొప్ప కీర్తి గడించాడు.భరతుడు పరమ భాగవతోత్తముడు.విశ్వరూపుని కుమార్తె అయిన పంచజని ని పెళ్ళాడాడు.అన్ని విధాల తనతో సమానులైన 5 గురు పుత్రులను కన్నాడు.భరతుడు తన తండ్రి తాతల వలెనె ప్రజానురంజంకంగా పదివేల సంవత్సరాలు భూమండలాన్ని పరిపాలించాడు.ఎన్నో
యజ్ఞాలూ,యాగాలూ,సత్కర్మలూ చేసి పరమ పురుషుడిని ఆరాధించాడు.శ్రీ నారాయణుని తన మనసులో ప్రతిష్టించుకొని పూజిస్తూ వచ్చాడు.తుదకు కుమారులకు రాజ్యాన్ని అప్పగించి విరక్తుడై సర్వం త్యజించి పులహ మహర్షి ఆశ్రమ మైన సాలగ్రామ క్షేత్రానికి వెళ్లి అక్కడ ఒక పర్ణశాల నిర్మించుకొని ప్రశాంత వాతావరణం లో భగవంతుడిని ఆరాధిస్తూ గడపసాగాడు.లేడి చర్మం వస్త్రం గా ధరించి వివిధ పుష్పాలతో,
తులసి దళాల తో శ్రీహరిని పూజిస్తూ భగవచ్చింతన తప్ప వేరోకో విషయం పట్టకుండా గొప్ప భక్తుడై బ్రహ్మ
జ్ఞాని అయ్యాడు.అన్నిటికీ అతీతుడై జడత్వముతో వుండడము వల్ల అతనికి జడభరతుడు అని పేరు వచ్చింది.
ఒకనాడు అతడు పరమ పవిత్ర మైన చక్ర నదికి స్నానానికి వెళ్ళాడు స్నానం చేసి నిత్య నైమిత్తిక కర్మలు
ఆచరించి ప్రణవ మును జపిస్తూ కాసేపు ఆ నది ఒడ్డున నే కూర్చున్నాడు.అప్పుడొక లేడి అక్కడికి నీళ్ళు తాగడానికి వచ్చింది అది నిండు గర్భవతి.నీళ్ళు తాగుతుండగా సమీపం లో నుండి సింహ గర్జన వినిపించింది.అసలే పిరికి దయిన ఆలేడి బెదిరి పోయి నదికి అడ్డం పడి నదిని దాట డానికి ప్రయత్నిస్తూ వుంటే అప్పుడు దానికీ గర్భ స్రావ మై దాని బిడ్డ నదిలో పడి పోయింది.అదికూడా చూసుకోకుండా ప్రాణభయం తో నది దాటి ఆయాసం తో అక్కడే మరణించింది.జడభరతుడు నదిలోకి దిగి ఆ చిన్న లేడి కూనను చేతిలోకి తీసుకొనిదాన్ని శుబ్రంగా కడిగి తుడిచి తన వెంట ఆశ్రమానికి తీసుకొని వెళ్ళాడు.తల్లి లేని దాన్ని చూసి అతఃనికి దయ,జాలి కలిగాయి.అప్పటినుండీ దానిని యెంతో అభిమానం గా చూసుకునే వాడు.దానికీ గడ్డి ఆకులు తినిపించడం దాన్ని మృగాల బారిన పడకుండా కాపాడడం అలా కన్న బిడ్డ వలె చూసుకో సాగాడు.అది కూడా ఒక క్షణం కూడా అతన్ని విడిచి పెట్టకుండా వెంక వెనకే తిరుగుతూండేది.
స్నానానికి వెళ్ళినా ధ్యానం చేసుకుంటున్నా ఎప్పుడూ అతని వెంటే వుండేది.అన్ని బంధాలూ విడిచి భగవంతుని ఆరాధన లో కాలం కాలం గడుపుతున్న భరతుడికి ఈ లేడి మూలంగా ఒక ఎడతెగని బంధం ఏర్పడి పోయింది.దిన దినానికీ ఎక్కువై పోయి ఆ లేడి పిల్లే అతఃని లోక మై పోయింది.క్రమంగా అతని పూజలూ,జపతపాలూ, దేవతార్చనలు, అనుష్టాన క్రియలూ గంగ లో కలిశాయి.తన భాగవత్పూజ వెనక పడినందుకు జడభరతుడు విచారించ లేదు.పైగా పరోపకారం,శరణాగత రక్షణ తన కర్తవ్యం అనుకున్నాడు. .ఆ లేడి క్షణం కనిపించక పొతే విలవిల లాడి పోయేవాడు.ఈ స్థితి లో కొన్ని సంవత్సరాలు గడిచాయి.అతనికి అవసాన దశ వచ్చేసింది.అయితే మరణ సమయం లో కూడా తను భగవన్నామ స్మరణ చేయక ఆ లేడి
నే తలుస్తూ ప్రాణాలు విడిచాడు.
ఆకారాణం వల్ల అతను మరుజన్మలో ఒక లేడిగా పుట్టాడు.అయితే అతఃను పూర్వ జన్మ లో చేసిన పుణ్యం ,
తపోబలం వల్ల అతనికి పూర్వజన్మ జ్ఞానం కలిగింది.తన పూర్వజన్మ తలుచుకొని యెంతో దుఃఖ పడ్డాడు.
భగవదారాధన చేస్తూ యోగిగా తను మోక్ష పదం పొందడానికి బదులు అవివేకియై ఒక లేడి పిల్లను చేరదీసి
తుదకిట్లా భ్రష్టుడనయ్యానే వాపోయాడు.ఆ విధంగా జడభరతుడు విరక్తి పొంది తానువుండే కాలాంజనం అనే పర్వతం నుండి సాలగ్రామ క్షేత్రమైన పులహ ఆశ్రమానికి వెళ్లి పోయాడు.ఈ మృగ జన్మ ఎప్పుడు అయిపోతుందా?అని ఆరాట పడుతూ తుదకు ఆహారాదులు వర్జించి నదీ జలాల లో ప్రవేశించి ఆ మృగ దేహాన్ని విడిచి పెట్టాడు.
దేనిమీదా అతిగా వ్యామోహం పెంచుకోకూడదు.తమ పిల్లల మీద గానీ,మనవలూ,మనవరాళ్ళూ అని అతి ప్రేమ పెంచుకొని దైవారాధన మరిచి వాళ్ళే సర్వస్వమని ఎక్కువ మమకారాన్ని పెంచుకో కూడదు.తామరాకు పై నీటి బొట్టు వలె వుండాలి.ఎకువ మమకారం చూపించే వాళ్ళను మాచిన్నప్పుడు
పెద్దవాళ్ళు వీడేమిరా జడభరతుడి లాగ అయిపోయాడు. అనే వాళ్ళు.యిప్పటి వాళ్లకు తెలీదు ఆ సంగతి.
ధనం మీదా,పిల్లల మీదా,వేరే దేని మీద కూడా విపరీత వ్యామోహం వుండకూడదు.అని ఈ కథ సారాంశం .
ఇష్టం,ప్రేమ వేరు వ్యామోహం వేరు.

అర్థాతు రాణాం న గురుం న బంధు: :
కామాతు రాణాం న భయం న లజ్జా
విద్యాతు రాణాం న సుఖం న నిద్ర
క్షుదాతు రాణాం న రుచిర్నపక్వం
తా:--డబ్బు సంపాదనే ధ్యేయముగా గలవాడు గురువులని గానీ ,బంధువులని గానీ పట్టించుకోడు,కామముగలవానికి సిగ్గూ లజ్జా వుండవు, విద్య అభ్యసించాలనే వాడికి సుఖము,నిద్ర పైన ఆసక్తి
వుండకూడదు,ఆకలితో నున్నవాడు రుచి గా ఉందా లేదా ,లేక వుడి కిందా లేదా?.అని చూడడు.

సుఖార్థీ త్యజతే విద్యాం
విద్యార్థీ త్యజతే సుఖం
సుఖార్థినః కుతో విద్యా
కుతో విద్యార్థినః సుఖం.
అర్థము:సుఖము ను కోరువాడు విద్యను వదులుకోవల్సిందే.
విద్య కావలిసిన వాడు సుఖాన్ని వదులు కోవలిసిందే. సుఖార్థు లకు .విద్య ఎందుకు?విద్యార్థులకు సుఖము ఎక్కడ?

సింహళ దేశం రాజు ఒకసారి పొరుగు దేశం వెళ్ళాడు.అక్కడి రాజకుమారిని చూశాడు.ఆమె నేను మీ చిత్రాన్ని గీస్తాను అన్నది.ఆమె రాజు చిత్రం గీయబోయి హఠాత్తుగా కదలిక లేని చిత్తర్వు లా అయిపొయింది.అది చూచి రాజు స్పృహ కోల్పోయాడు. తేరు కున్న తర్వాత జ్ఞాపక శక్తి కోల్పోయాడు.అప్పటినుండీ 'సా తత్ర చిత్రాయతే'
(ఆమె చిత్తరువు అయిపొయింది) అనడం మొదులు పెట్టాడు.ఎప్పుడూ అదే మాట.రాజ్యపాలన ఆగిపోయింది.
రాజవైద్యులు, దూరాలనుండీ వచ్చిన వైద్యులూ ఆయన వ్యాధి ఏమిటో కనిపెట్టలేక పోయారు.
ఇది యిలా వుండగా భోజరాజుకూ,కాళిదాసుకు ఒక వాదన వచ్చింది.
జ్ఞాయతే జాతు నామాపి న రాజ్ఞః కవితాం వినా
కవే: తత్ వ్యతిరేకేణ ణ కీర్తి : స్ఫురతి క్షితౌ
తా:--కవిత్వం లేకుంటే రాజు పేరు లోకానికి తెలియ బడదు.దానికి వ్యతిరేకం గా రాజాదరణ లేకుండా లోకము లో కవి కీర్తి ప్రకాశించదు.
భోజరాజు కవికే గౌరవం ఎక్కువనీ,కాళిదాసు రాజుకే ప్రజలు ఎక్కువ గౌరవం యిస్తారనీ వాదించుకో సాగారు.
ఈ విషయం నిగ్గు తేల్చేందుకు యిద్దరూ మారు వేషాల్లో బయల్దేరారు.ఎక్కడ చూసినా ప్రజలు రాజుకు,సంపదకే ఎక్కువ గౌరవం యిస్తున్నట్టు కనిపించింది.ఒక్క సింహళ దేశం లో తప్ప అక్కడ కవిత్వానికే ఎక్కువ విలువ యిస్తున్నట్టు కనపడింది.ఆ రాజ్యపు రాజు తీవ్ర అనారోగ్యముతో బాధపడుతున్నాడు.ఎవరూ ఆయన వ్యాధిని నయం చేయలేకపోయారు అని వాళ్లకు తెలిసింది.ఒక సంవత్సరం గా ఆయన సరిగ్గా తిండి తినడం లేదు,నిద్ర పోవడం లేదు.ఏదీ గుర్తు వుండడం లేదు.ఆయన నోట 'సా తత్ర చిత్రాయతే'అనే మాటనే వస్తున్నది.కాళిదాసు వైద్యుడి వేషం వేసుకొని రాజుకు చికిత్స చేస్తానని వెళ్ళాడు.రాజా ఎలా వుంది మీ ఆరోగ్యం అని అడిగితే 'సా తత్ర చిత్రాయతే' అన్నాడు.యిదేదో మానసిక వ్యాధి అని కాళిదాసు గ్రహించాడు.కారణ మేమిటో తెలిసి రాలేదు.
కాళిదాసు ఆ సాయంత్రం భువనేశ్వరీ దేవి ఆలయానికి వెళ్లి ధ్యానం లో కోర్చున్నాడు.దేవి దయవల్ల ఆయన
రాజు వ్యాధికి కారణం తెలుసుకో గలిగాడు.'సా తత్ర చిత్రాయతే' అనేది ఒక సమస్యగా గుర్తించాడు.పూరించడం
ఆయనకు కష్టమైన పనేమీ కాదు.కదా! మరునాడు రాజు దగ్గరకు వెళ్లి ఆయన చెవిలో ఈ శ్లోకం చెప్పాడు.

చిత్రాయ త్వయి యోజితే తను భువా: సజ్జీ కృతం స్వం ధను:
వర్తిం ధర్తు మపాగతేంగుళీ యుగే, బాణాః గుణి యోజితాః
ఆరబ్దేత్వయి చిత్ర కర్మణి తదా తద్భాణ భగ్నా సతీ
భిత్తం ద్రాక్ అవలంబ్య, సింహళ పతే, సా తత్ర చిత్రాయతే.
తా:-- ఆమె నీ చిత్రం గీద్దామని అనుకోగానే మన్మథుడు తన ధనుస్సును సరిచేసుకున్నాడు, చేతి వేళ్ళ
మధ్యకు కుంచెను పట్టుకోగానే ఆయన బాణాలు అల్లెత్రాటికి బిగించాడు, నీ చిత్రం గీయటానికి ఆరంభించగానే
ఆ మదనుడిబాణపు దెబ్బ ఆమెకు తగిలింది, వెంటనే ఆమె గోడకు కొంచెం ఆనుకొని ఓ!సింహళ రాజా!
ఆమె అక్కడ చిత్తరువై పోయింది (అంటే నీ అందం చూసి ఆమె స్థాణు వై పోయి చిత్తరువు లాగా వుండి పోయింది)
రాజులో వెంటనే మార్పు వచ్చింది.ఆయనకు తిరిగి జ్ఞాపక శక్తి తిరిగి వచ్చేసింది.రాజుగారికి స్వస్థత చిక్కడానికి ఎక్కువ సమయం పట్ట లేదు,కాళిదాసును,భోజరాజును ఆయన సత్కరించి పంపాడు.
తర్వాత మంత్రుల సహాయం తో ఆపొరుగు దేశ రాజకుమార్తెను.పెళ్లి చేసుకున్నాడు.


భోజుడు కేవలం పండితులనే కాక నిరక్షర కుక్షులను కూడా బీదవారైతే ఆదరించే వాడు.సహాయం చేసే వాడు.
ఆ విషయము చాలా మందికీ తెలియదు.అది తెలియని ఒక బీద బ్రాహ్మణుడు ఒకదినము కాళిదాసు దగ్గరకు వచ్చాడు.తాను నిరుపేద నని రాజుగారికి చెప్పి తనకేదయినా దయచేయించు డని ప్రాధేయ పడ్డాడు.
కాళిదాసు:-నీవేమైనా చదువుకున్నావా?
బ్రా:-- ఏదో వానాకాలం చదువు చదువుకున్నాను..మీరే ఆధారము.
కాళి:-- నేనొక శ్లోకమును వ్రాసి యిత్తును.దానిని రాజు దగ్గర చదువుతావా?
బ్రా:-చదువలేను కాళ్ళు వణుకు తాయి.దడ పుడుతుంది.
కాళి:- సరే రేపు రాజుగారికి ఏదయినా కానుక తీసుకొని ఆస్థానమునకు రమ్ము.యని చెప్పి పంపెను.
సరే అని ఆ బ్రాహ్మణుడు యింటికి బోయి తనదగ్గరనున్న రెండు పైసలతో రెండు చెరుకుగడ లను కొని తనతువ్వాలులో చుట్టి ఆస్థానమునకు వచ్చాడు.ఇంకనూ ఆస్థానము తెరచు సమయము కానందున
అక్కడ దగ్గరలో నున్న చెట్టు క్రింద ఆచెరుకు గడల మూట పక్కన పెట్టుకొని పడుకున్నాడు.చల్ల గాలికి .బాగా నిద్ర పట్టేసింది.యింతలో ఒక దొంగ వచ్చి ఆచెరుకు గడలను తీసుకొని ఆ తువ్వాలు లోఅక్కడే చెట్టు క్రింద వుండిన రెండు కాలిన కర్ర ముక్కలను పెట్టి వెళ్లి పోయాడు.
ఆ బ్రాహ్మణుడికి మెలుకవ వచ్చి సమయమై పోయిందని హడావుడి గా ఆ మూటను తీసుకొని ఆస్థానానికి వెళ్ళాడు.అక్కడ రాజుగారిని చూడగానే భయపడి పోయాడు.ఆ తువ్వాలు ను రాజుగారికి సమర్పించాడు.అందులో ని కాలిన కట్టెలను చూసి రాజుగారు ఏమిటిది?అని గద్దించారు.వాడు వణికి పోయాడు.చెరుకు ముక్కలకు బదులు ఆ కోరువులు ఎలా వచ్చాయో అర్థం కాక అలాగే నోరు తెరుచుకొని చూస్తూండి పోయాడు.
అప్పుడు కాళిదాసు ఏమి జరిగి వుంటుందో ఊహించి రాజా !ఈ కొరకంచులను ఈ విప్రుడు ఎందుకు తెచ్చాడో నేను చెప్తాను అని ఈ క్రింది శ్లోకం చెప్పాడు.

దగ్ధ ఖాండవ మర్జునేవచ వృధా దివ్యద్రుమ మైర్భూషితం
దగ్ధ వాయుసుతేన హేమ రచితా లంకాపురీ స్వర్గభూ:
దగ్ధ స్సర్వ ఖాస్సదశ్చ మదనో హా హా నృధా శంభునా
దారిద్ర్యం ఘన తాపదం భూవినృణాం కేనాపిపో దహ్యతే
తా:--పూర్వము అర్జునిని చే వ్యర్థముగా ఖాందావ్ వనము దహింప బడి అచ్చటి దివ్య వృక్షము లన్నియు నాశన మయ్యెను.స్వర్గ నగర తుల్యమైన లంకా నగరమును హనుమతుడు వృథాగా తగులబెట్టేను,ఈశ్వరుని చే ఏ పాప మెరుగని మన్మథుడు దహించ బడినాడు.కానీ ఈ దరిద్రమును తగులబెట్టుటకు ఎవ్వరూ పుట్టలేదు.నీవైనా దారిద్ర్యానికి నెలవైన ఈ కర్రలను దహించి వెయ్యి.(అంటే నీవు నాకు ధనము ను యిచ్చి నా దారిద్ర్యాన్ని పోగొట్టుము).
భోజరాజు ఆ బ్రాహ్మణుడికి లక్ష దీనారములను యిచ్చి పంపించెను.పిమ్మట కొంత కాలమునకు ఈ చమత్కారము కాళిదాసే చేసినాడని ఎరిగి అతఃని సమయస్ఫూర్తికి చాలా సంతసించెను.
ఈ శ్లోకము నే ఎవరో అజ్ఞాత కవి తెలుగులో యిలా వ్రాశాడు.
నరుడను వాడు ఖాండవ వనంబు వృధా దహనంబు జేసే, వా
నర వరుడైన పవన నందనుడూరక లంక గాల్చె నా
హరుండు పురంబు లార్చేనన నంతియే కాని మహాదారిద్ర్య వి
స్ఫురణను గాల్చు వాడొకడు భూమి జనింపక బోయె భూవరా
అర్థము:--- అర్జునుడు ఖాండవ వనాన్ని వృధాగా కాల్చి వేశాడు,హనుమంతుడు పనీ పాటా లేనట్టు వృధాగా సుందర నగరమైన లంకను కాల్చాడు,శివుడు విద్యున్మాలి,తారకాక్షుడు, కమలాక్షుడు అనే రాక్షసుల పట్టణాలను కాల్చాడు. ఈ మూడు దహన కాండలకు ఏవో కారణాలు వుండ వచ్చు. కానీ రోజు రోజుకు అధికమవుతున్నఈ దారిద్ర్యాన్ని దహించే వాడు భూమిలో యింత వరకు పుట్టలేదు కదా!
అని ఒక బీద కవి ఆవేదన.


ఆత్మానం రథినమ్ విద్ధి: శరీరం రథ మేవచ
బుద్ధిన్తు సారధిం విధి మనః ప్రగ్రహ మేవచ
ఇంద్రియాణి హయ ణ్యాహు విషయాం స్తేషుగోచరాన్
ఆత్మేంద్రియ మనోరుక్తం భోక్తేత్యా హుర్మనీషి ణః
యిది కఠోపనిషత్ లోని వాక్యం అర్థము:--ఆత్మను రథికుడు గా తెలిసికో శరీరమే రథం, శరీరాన్ని క్రియాత్మకంగా నడిపే సారథి బుద్ధి, మనసు గుర్రానికి కట్టిన కళ్ళెం, యింద్రియాలే గుర్రాలు, ప్రాపంచిక విషయాలు ఆ గుర్రాలు పరిగెత్తే మార్గాలు.ఆత్మ యింద్రియాలతో, మనసుతో కలిస్తే పండితులు దాన్ని భోక్త అంటారు.భోక్త అంటే కర్మ ఫలాలు, సుఖ దుఖాలు అనుభవించే ప్రాణి.తన సారథిని బాగా అర్థము చేసుకొని
మనసును ప్రాపంచిక విషయాలపై పోకుండా కళ్ళెం వెయ్యాలి. గుర్రాలను సరిగ్గా నడిపించక పొతే అవి ప్రక్క
త్రోవలు పట్టి వాటి యిష్టం వచ్చినట్టు పరుగెడతాయి.గమ్యం చేర్చ లేవు.



కవితా వినోదములలో యింకొక విచిత్ర చిత్రణము పునరుక్తములు గా (మరీ మరీ చెప్పుట) గానిపింప వలెను,
అవి భాషాంతర పదములుగా వుండవలెను.ఈ విధమైన రచన ఎవరో భావుకవి వ్రాసినాడు.చూడండి
శ్లోకం:--భాండే జాలం వా తక్రం వా
నీరో మోరో వదాంగనే
మార్గ మాలోక్య గంతవ్యం
ముల్లుస్యా త్తత్ర కంటకం
తా:--యిందులో జాలం వా తక్రం వా అనునవి సంస్కృత పదములు,నీరో తెలుగు పదము,మోరో అరవ పదము(మజ్జిగ),ముళ్ళు తెలుగు పదము,కంటకం సంస్కృత పదము మొత్తమంత సంస్కృత మెట్లయినదో చూడండి. ఒక స్త్రీ నెత్తిమీద కుండ పెట్టుకొని పోవు చుండగా ఒకతను యిట్లడుగు చున్నాడు.
నీరో మోరో,నీరోమ=రోమములు లేని ఉరో=రోమ్ముగల, అంగనే=ఓ అంగనా!, భాండే=కుండలోనిది
జాలం వా తక్రం వా =నీళ్ళా మజ్జిగనా? మార్గ మాలోక్య గంతవ్యం= ఏది అయిననూ దారి చూసుకొని పోవలయును.యెందుల కనగా తత్ర=ఆ మార్గములో కంటకం=ముండ్లు వున్నవి.ముళ్ళు గ్రుచ్చుకున్నచో
ముల్లు స్యాత్, ముత్=సంతోషము లుస్యాత్= లోపించి పోవును.కనుక చూసుకొని పొమ్ము . 



దత్తపది:- గోలకొండ,మాలముండ, పూలదండ,కొత్తకుండ పూరణ
ఓయి ధృతరాష్ట్ర నీకొడుకుత్త గోల
కొండ వలె నుండు క్షణ మాలముండ దింక
భండనమ్మున గెల్తురు పాండు పుత్రు
లుదరమున పూలదండ రేకొత్తకుండ
తా:-ఓ! ధృతరాష్ట్ర మహారాజా నీ కొడుకు దుర్యోధనుడు వట్టి పనికి మాలినవాడు.కొండవలె వుంటాడు.అంతే గానీ యుద్ధము చేయడు.యుద్ధములో పాండవులు మెడలో వేసుకున్న పూలదండల లోని రేకులు కూడా నలగకుండా (అంత సులభముగా)యుద్ధములో గెలుస్తారు చూడు.



విశుద్ధ సత్వగుణ లక్షణము: విశుద్ధ సత్వస్య గుణాః ప్రసాద
స్వాత్వానుభూతి పరమ ప్రశాంతి:
తృప్తి: ప్రహర్షః పరమాత్మ నిష్టా
యయా సదానందరసం సమృ చ్చతి
అర్థము:మనో నైర్మల్యము, స్వాత్మానుభావము, ఎక్కువ శాంతి, నిత్య తృప్తి, పరమాహ్లాదము, ఎల్లప్పుడూ ఆత్మానంద రసమును కలుగజేయు పరమాత్మ నిష్టయు,యివి యే విశుద్ధ సత్వగుణములు .ఇట్టి గుణములే జీవన్ముక్తుని లక్షణములు


 

రజోగుణ లక్షణము:
ఆరంభ రుచితా ధైర్య మసత్కార్య పరిగ్రహః
విషయోప సేవాజస్రం రాజసం గుణ లక్షణం
అర్థము:ఆరంభ శూరత్వము. ఆధైర్యం, చెడు కార్యములు చేయు ప్రవృత్తి, సదా విషయ భోగములయందు ఆసక్తి, ఇవి రజోగుణము యొక్క స్వభావములు .


 
 తమోగుణ లక్షణము:
లోభః స్వప్నో ధృతి: క్రౌర్యం నాస్తిక్యం భిన్న వృత్తితా
యాచిష్ణుతా ప్రమాదశ్చ తామస గుణ లక్షణం.
అర్థము: లోభము, అతినిద్ర, ధైర్యము లేకుండుట,క్రూర స్వభావము కలిగి యుండుట, గురు, దైవ, శాస్త్రముల యందు విశ్వాసము లేకుండుట, అనాచారము, పరులను యాచించు స్వభావము,ప్రమాదము, ఇవి తామస గుణ లక్షణములు


వారక ఈశ్వరుండు తలపై ధరియించిన యంత మాత్రము న
వ్వారిజ వైరి తోడ సరివత్తువె యుమ్మెత పూవ నీ పసనన్
వారిధు లుబ్బునో దెసలు వన్నెలు దీరునొ చంద్రకాంతముల్
నీరవునొ చకోరముల నెవ్వగ తీరునో తాపమారునో
అర్థము:--- ఎవరో శివ భక్తుడు ఈశ్వరుని తలపైన ఉమ్మెత్త పూవును వుంచాదాడట. దానితో ఉమ్మెత్త పువు నేనూ చంద్రుడిలా శివుని తలపై వున్నాను నేను చంద్రుని లాంటి వాడినే యని గర్వ పడిందట. అధికారంతో కుయుక్తులతో గద్దె నెక్కిన వారిని యీ పూవు తో పోలుస్తున్నాడు కవి. కాసేపు శివుని తలపై ఉన్నంత మాత్రాన చంద్రునితో నీవు సమాన మౌదునని అనుకుంటున్నావా?చంద్రుని కాంతితో సముద్రములు వుప్పొంగినట్లు నీ కాంతి తో పొంగుతాయా? దిశలన్నీ వెన్నెలతో వెలిగినట్లు నీ తెల్లదనం తో వెలుగు తాయా?
వెన్నెలను పానము చేసి తమ దప్పికనూ,తాపాన్నీ చకోర పక్షులు తీర్చుకుంటాయి. మరి నీవు ఆ చకోరాల దాహాన్ని తీర్చ గలవా?చంద్ర కిరణాల స్పర్శ తోచద్రకాంత శిలలు చేమ్మగిల్లినట్టు నీ తెల్లని రంగుతో చేమ్మగిల్లుతాయా?అలాగే సంఘం లో అధికారస్థానమే గొప్పది కాదు. దాన్ని నిలబెట్టుకునే సామర్థ్యము కూడా కావాలి. ప్రజలకు సేవ చెయ్య గలగాలి,.ప్రజల మనస్సులో స్థానం సంపాదించు కోగాలగాలి, అధికారం లో వున్నవాళ్ళు తమకు స్నేహితులని గొప్పలు చెప్పుకుని తమ పబ్బాలు గడుపుకునే వారు,అక్రమంగా అధికారాన్ని చేజిక్కించుకునే వాళ్ళు ఈ పద్యములోని ఉమ్మెత్త పూవు వంటి వారే. ఆ అధికారము పోయినప్పుడు పూవు వలే వడలి రాలిపోతారు. శివుని మీద వున్న ఉమ్మెత్త చంద్రుడు కానట్టే చట్ట సభల్లో, విద్వత్ సభల్లోకూర్చున్న మూర్ఖుడు యీ ఉమ్మెత్త పువు వంటి వాడే. ఈ నాటి రాజకీయాలకు సరిపోయే పద్యమిది.



జానామి ధర్మం న చ మే ప్రవృత్తి:
జానామ్యధర్మం న చ మే నివృత్తి :
కేనాపి దేవేన హృది స్థితేన
యథా ప్రవృత్తోస్మి తథా కరోమి
అర్థము:--ధర్మ మేమిటో నాకు తెలుసు కానీ నేను దాన్ని అనుసరించి ప్రవర్తించలేను. అధర్మ మేమిటో కూడానాకు తెలుసు కానీ దానికి దూరంగా ఉండలేను.నాలో తిష్ట వేసుకొన్న దుష్ట శక్తి ఎలా నడిపిస్తే అలా నడుస్తుంటాను. మహా భరతం లో దుర్యోధనుడు చెప్పిన మాటలివి. లోకం లో అందరూ చేసే పనే యిది.
కానీ మనసునూ,యింద్రియాలనూ,బుద్ధినీ కొంచెము ప్రయత్నపూర్వకముగా నిగ్రహించి ఈర్ష్య,అసూయ,మాత్సర్యం అనే దుష్ట శక్తుల్ని దరికి రానీకుండా నిగ్రహించుకోవాలి. లేకుంటే దుర్యోధనుని లాగ మనము కూడా నాశన మవుతాము. అని వ్యాసుడు భారతము లో బోధిస్తాడు. భారతము లో ఉన్నదే
యిప్పుడు లోకం లో వున్నది . భారతములో లేనిది యిప్పుడు లోకం లో లేదు.



ఇది యింతకు ముందు వ్రాసినదే కొత్త మిత్రుల కోసం మరీ వ్రాస్తున్నాను.
హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది?ఎందుకోసం ఆపదలు బాపే హనుమంతుని ప్రసన్నం చేసుకునే స్తోత్రాలలో విశేషమైన హనుమాన్ చాలీసా ఎలా ఉద్భవించిందో తెలుసుకుందాము.
వారణాసి లో సంత్ తులసీదాసు నివసిస్తూ ఉండేవాడు.రామగాన నిరతుడయి బ్రహ్మా నందము లో తేలియాడు
తుండేవాడు.మహాత్ములయిన వారి సన్నిధిలో మహిమలు ఎప్పుడూ వెల్లడవుతుంటాయి.వారి ప్రభావము వల్ల ప్రభావితులయిన జనం వారి ద్వారా రామనామ దీక్ష తీసుకొని రామనామ రసోపాసనలో తేలియాడు
తుండేవారు.యెంతో మంది యితర మతాల వారు కూడా రామ భజన పరులు కావడంజరుగుతున్నది.
అయితే తమ నమ్మకాల పట్ల మొండి పట్టుదల కల మతగురువులకు యిది కంటగింపుగా వుండేది.వారు తులసీదాసు మత మార్పిడులకు పాల్పడుతున్నాడని మన మతాన్ని కించ పరుస్తున్నాడని ధిల్లీ పాదుషా వారికి అభియోగాలు పంపుతూ వుండేవారు.
ఇది యిలా వుండగా వారాణసిలో వుండే ఒక సదాచార పరుడయిన ఒక గృహస్తు తన ఏకైక కుమారునికి కుందనపు బొమ్మ లాంటి అమ్మాయితో వివాహం చేశాడు.వారిద్దరూ చిలకా గోరింకల్లాగా అన్యోన్యంగా కాపురం చేస్తుండగా విధి వక్రించి ఆ యువకుడు ఒకనాడు వున్నట్టుండి చనిపోయాడు.ఆ అమ్మాయి గుండెలు పగిలేలా రోదించింది.ఆ యువతి శోకానికి అందరి గుండెలూ ద్రవించి పోయాయి.ఎవరెంత బాధ
పడినా జరగవలిసిన వి ఆగవు కదా!ఆ శవాన్ని పాడే మీద పెట్టి తీసుకుని పోతుండగా ఆ అమ్మాయి ఎవరు చెబుతున్నా వినకుండా ఆ పాడే వెనకే రాసాగింది.కొంత మంది స్త్రీలు ఆమెను గట్టిగా పట్టుకొని వున్నారు.
శవయాత్ర సాగిపోతున్నది.త్రోవలో తులసీ దాసు ఆశ్రమం ముందుగా వెళుతూ వుంది.ఆ ఆశ్రమము దగ్గరకు రాగానే ఆ అమ్మాయి అందరినీ విడిపించు కొని ఆశ్రమములోపలికి పరుగుతీసింది ఆయనముందు ప్రణ మిల్లింది. ఆయన కన్నులు మూసుకొని వున్నాడు.అందెల,గాజుల శబ్దము విని కళ్ళు తెరచి తనకు ప్రణ మిల్లిన ఆమెను దీర్ఘ సుమంగళీ భవ యని దీవించారు.ఆ యువతీ మరింత బిగ్గరగా ఏడుస్తూ తండ్రీ ఈ నిర్భాగ్యురాలిని దీవించిన తమ లాంటి మహాత్ముల వాక్కుకూడా వ్యర్థమేనని దుఖిస్తున్నాను అన్నది.
అప్పుడు ఆయన కళ్ళు తెరిచి ఆ యువతిని చూసి అమ్మా!రాముడు నానోట అసత్యం పలికించ డే అన్నాడు.బయటకు వచ్చి చూడండి మహాత్మా!నా భర్త విగతజీవుడై వున్నాడు అని చెప్పెను. ఆయన లేచి వెళ్లి అయ్యా!కొంచెం ఆ పాడెను దింపండి అని ఆపించి ఆ శవం కట్లు విప్పి రామనామం జపించి తన కమండలములోని నీళ్ళు ఆ శవము పై
చల్లెను.దానితో ఆ శవము లో చైతన్యము వచ్చి ఆ యువకుడు లేచి కూర్చుండెను.అది చూసిన జనం ఆయనకు జేజేలు పలుకుచూ భక్తీ పూర్వకముగా నమస్కరించిరి.దీనితో ఆయనకు ప్రాచుర్యం పెరిగి ప్రజలు తండోప తండాలుగా వచ్చి ఆయనను దర్శించి రామనామ దీక్ష తీసుకుని రామ నామాన్ని జపించటం ఎక్కువై పోయింది.
మహమ్మదీయ గురువులు ధిల్లీ పాదుష వారి దగ్గర కి వెళ్లి తులసీదాసు రామనామము గొప్పదని అమాయకులైన ప్రజలను మోసగిస్తున్నారని ఫిర్యాదు చేసినారు. దానితో పాదుషావారుతులసీదాసును పిలిపించారు.తులసీ దాసు గారూ మీరు రామనామముఅన్నిటికన్నా గొప్పదని ప్రచారము చేస్తున్నారట నిజమేనా?అని అడిగారు.అందుకు తులసీదాసు అవును ప్రభూ!సృష్టి లో సకలమునకూ ఆధార మయిన
రామనామ మహిమను వర్ణించ నెవరి తరము?అనెను.రామనామము తో సాధించ లేనిది ఏదీ లేదు.
అన్నాడు.
అయితే మేము ఒక శవము ను తెప్పించేదము దానికి ప్రాణం పోసి మీ మహత్వమును నిరూపించుకోండి.అన్నాడు పాదుషా. అప్పుడు తులసీదాసు క్షమించండి పాదుషా గారూ జనన మరణాలని ఆపేందుకు మన మెవరము?అంతా ఆ ప్రభువు ఇచ్చానుసరముగా జరుగు తాయి.మన కోరికలతోఆయనకు పని లేదు.అన్నాడు.అప్పుడు పాదుషా రామనామము అంతా మోసమని మీరు చెప్పేవి అన్నే అబద్దాలని ఒప్పుకోండి.లేకపోతె మీకు శిక్ష తప్పదు అని బెదిరించాడు.తులసీదాసు ఒప్పుకోన లేదు.అప్పుడు ఆయనను బంధించమని తన సైనికులను ఆజ్ఞాపించాడు పాదుషా .తులసీదాసు ఏ మాత్రము చలించకుండారామనామము జపిస్తూ ధ్యాన నిమగ్నుడయ్యాడు.సైనికులు ఆయుధాలు ధరించి ఆయనను బంధించుటకు రాగా ఎక్కడినుండి వచ్చినాయో వేల కోతులు వచ్చి సైనికుల ఆయుధాలు లాగుకొని వారికే గురిపెట్టి వారిని కదలనీ కుండా చేశాయి.అందరూ ఏ కోతి తమ మీద పడి కరుస్తుంది అని హడలి పోతూ పరుగులు తీశారు.ఈ కలకలానికి కారణ మేమని తులసీదాసు కనులు తెరిచి చూశాడు.ఆయనకు సింహ ద్వారము మీద హనుమంతుడు కనిపించాడు.ఆయన దర్శనముతో పులకించిపోయి 40 దోహాలతో "జయ హనుమాన జ్ఞాన గుణ సాగర "
అంటూ చాలీసానుఆశువు గా గానం చేశాడు.. హనుమంతుడు ఈ స్తోత్రం తో మాకు ఆనందమును కలిగించావు.నీకేమి కావాలో కోరుకో అని అడిగాడు.మహాత్ము లెప్పుడూ తమకోసం గాక పరుల కోసమే బ్రతుకు తారు కనుక ఆయన తండ్రీ ఈ స్తోత్రం తో నిన్ను స్తుతించిన వారికి తమరు అభయమిచ్చి కాపాడాలని నా కోరిక అన్నాడు.
దానితో సంతోషించిన హనుమంతుడు తులసీ! మాకు అత్యంత ప్రీతీ పాత్ర మయిన ఈ చాలీసా తో నన్నెవరు స్తుతించినా వారి రక్షణ భారాన్ని నేను వహిస్తాను అని వాగ్దానం చేశారు.అప్పటినుండీ యిప్పటి వరకూ
హనుమాన్ చాలీసా భక్తుల అభీష్టాలను కామధేనువై తీరుస్తూనే వున్నది "జయ హనుమంత మహా బలవంత" " జై శ్రీరాం".



మద్దులపల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తమ్ముడు వీర రాఘవ శర్మకు అతడు సాహిత్యము పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత ఆయన కావ్య గురువు గారు ఈ సమస్య యిచ్చారట. "వివేశ సాతాని నికేతనాని" యిందులో ''సాతాని" అని
ఒక కులము పేరు వచ్చినది కదా! అటులనే మిగతా మూడు పాదములలో ఒక్కో పాదములో ఒక కులము పేరు వచ్చునటుల పూర్తి చేయమని చెప్పినారాట.అతడు చేసిన పూరణ మిది.
యా మాదిగ ధ్యక్ష పద పదాత్రీ
సుమంగలీ రంగ హృది స్థితా యా
యానాది రానంద కర స్వరూపా
వివేశ సాతాని నికేతనాని
అర్థము:--యా = ఏ మా= లక్ష్మీదేవి దిగధ్యక్ష పద పదాత్రీ = దిక్పాలాధ్యక్ష పదవి నోసగునదియో, యా = ఏ లక్ష్మీ దేవి సుమంగలీ = సౌమంగల్యము కలదియై, రంగహృది = శ్రీరంగ నాథుని యొక్క వక్ష స్థలము నందు, స్థితాః= ఉన్నదో, యా=ఏ లక్ష్మీ దేవి అనాది: =పుట్టుక లేనిదో మరియు ఆనందకర స్వరూపా =ఆనందము కలిగించు స్వరూపము కలదియో, సా= ఆ లక్ష్మీ దేవి, తాని = ఆ, ,నికేతనాని=గృహముల యందు, వివేశ = ప్రవేశించెను.క్రొత్తగా కట్టిన యిండ్లు కళకళ లాడుచు శోభాయమానముగాఉండుటకు కారణము లక్ష్మీ దేవి ఆ యిళ్ళలో ప్రవేశిం చుటయే.యని భావము మాదిగ, మంగలి, యానాది, సాతాని
నాలుగు కులములు వచ్చినవి కదా!



జానుమద్ది. హనుమచ్ఛాస్త్రి ప్రసిద్ధి చెందిన తెలుగు కవి. విమర్శకుడు. ఈయన ఫిబ్రవరి 28 న మరణించారు. బ్రౌను గ్రంధాలయ భవన నిర్మాణమునకు కృషి చేసారు.
"అందరికీ జానుమద్ది ఎందరి కో జ్ఞానమద్ది"
ప్రతి మనిషీ తన జన్మకు
పరమార్థం తెలుసుకొని
తన కోసమే కాదు పరుల కోసం బతకాలి
తానున్నా లేకున్నా తన పేరు మిగాలాలి (జానుమద్ది)
ఈయనను గురించి మల్లెమాల గారిలా రాశారు
అలుపన్న దెరుగక అయిదు దశాబ్దముల్ సారస్వతార్చన సలిపే నెవ్వడు?
బ్రౌను గ్రంథాలయ భవనమునకు తానె నిలువెత్తు ద్వారమై నిలిచేనేవ్వడు?
జాతి గర్వించ దగిన సౌజన్యమూర్తి జానుమద్దికి జేజేలు వేనవేలు.



పుణ్యస్య ఫల మిచ్చంతి ' పుణ్యం నేచ్చంతి మానవా: :
న పాపఫల మిచ్చంతి ; పాపం కుర్వంతి యత్నతః .
అర్థము:-- : మానవులు పుణ్యమును చేయ నుత్సహించరు గాని పుణ్యము
చేయుట వల్ల గలుగు ఫలము కావాలని మాత్రం కోరుకుంటారు .
పాపం చేయటానికి నిరంతరం యత్నిస్తున్నారు గానీ పాప ఫలం తమకు
కలగ కూడదని కోరుకుంటారు.ఎంత విపరీతము .



యౌవ్వనం ధన సంపత్తి ప్రభుత్వ మవివేకతా
ఏకైక మప్యనర్థాయ కిము యత్ర చతుష్టయః
అర్థము:-- యౌవ్వన ప్రాయము,ధనసంపత్తి,అధికారప్రాప్తి,వివేకము లేకపోవుట వీటిలో ఒకటి వుంటేనే ఎన్నో అనర్థములు కలుగును కదా! ఏ నాలుగూ ఒకే చోట ఉన్నచోఏమి జరుగునో చెప్పవలిసిన పనిలేదు.



తటాకం ధన నిక్షేపం బ్రహ్మ స్థాప్యం సురాలయం
ఆరామ కృతి (కూపాని) సత్రాణి సప్త సంజ్ఞాకా:
అర్థము:బావి త్రవ్వించుట ధర్మ కార్యముల కొరకు ధనము కూడా బెట్టి ఉంచుట
(ఫండ్స్)బ్రహ్మ వేత్తలకు ఉండుటకు స్థల మేర్పరుచుట దేవాలయమును కట్టించుట పరోపకారము కొరకు ఫల పుష్పాదుల తోట నేర్పరుచుట ఉత్తమ గ్రంథములను అచ్చు వేయించుట అన్నసత్రములను కట్టించుట ఇవి సప్త సంతానము లన బడును వీటిలో ఏ ఒక్కటి అయినా చేసినచో ఉత్తమ సంతానము చే కలుగు పుణ్యము కలుగు నని శాస్త్రము చెప్పు చున్నది.



అది పెద్దన గారి గృహము.రెండవ రాజ భవనము.రాజభవనమునకును,పట్టణము నకును మధ్యలో నుండెను.దాని యావరణము ఆరు ఎకరములు .లోపల పెద్ద తోట,చిన్న కృత్రిమ సరోవరము,అక్కడే వచ్చిన అతిథులకు అతిథి గృహములు,శిష్యులు ఉండుటకు ఆశ్రమాలు ఉండెను.ఎప్పుడుఎవరు వచ్చిననూ ఆతిథ్యము లో లోటు జరుగదు.ఎన్నాళ్ళు అయిననూ అడుగు వారు లేరు.
పెద్దనగారు అరుణోదయ పూర్వమే లేచి స్నానము,అగ్నిహోత్ర ద్యనుష్టానములు తీర్చుకొని శిష్యులకు చదువు చెప్పుదురు.తరువాత తన దర్శనము నాకు వచ్చిన కవిపండితులతో ఇష్టా గోష్టి,తరువాత అతిథులతో భోజనం కాసేపు విశ్రాంతి తర్వాత అల్పాహారము గ్రహించి కప్పురవిడెము గొని రాజ సభకు పోవుట అక్కడ విద్యా పరీక్షాది రాజకార్య నిర్వహణ,యింటికి వచ్చి సాయంత్రము అగ్నిహోత్రము నకు పూజ, వెంటనే రాత్రి భోజనము,అనంతరము శిష్యులతో గానీ ఆప్తులతో గానీ కవితా సంగీతాది విమర్శ గోష్టి
తర్వాత శయనము యిది పెద్దనగారి దిన చర్య.
శ్రావణ మాసము వచ్చినది.వర్షాలు మొదలైనవి.ఆ సారి విజయనగరము లో విపరీతముగా వానలు కురియ సాగెను.జనులు తమనిత్య కృత్యములు తీర్చు కొనుట కైనా బయటికి వచ్చు వీలు లేకపోయను.
వంటకు యెక్కడను ఎండు కట్టెపుల్లలు దొరకడము లేదు.పెద్దన గారి యింటి వెనుక బజారు లో వృద్ధ దంపతులు ఒక
చిన్న కుటీరములో నివసించేవారు .వారికి వంటచేసు కొనుటకు కట్టెపుల్లలు దొరకక మూడు రోజులు పస్తులు
వున్నారు.నాలుగవ రోజు వారి యింటి ముందు నుంచి పోవుచున్న పెద్దన గారి వంటకత్తే వాన పెద్దదవగా
వారి యింట్లోకి వచ్చి నిలిచెను.ఆమె వారి స్థితి కి విచారించి మా పెదన గారింటిలో యందు కట్టెపుల్లలు వున్నవి. వారెక్కడి నుండి తెప్పించు చున్నారో నాకు తెలియదు.వారి నడిగి ఒక మోపు మీకు వేయమనండి.
అంత మాత్రము వారు సహాయము చేయక పోరు.అని వానతగ్గినదని వెడలి పోయెను.ఆ యజమాని పెద్దన గారిని దర్శించి ఈ ప్రస్తావన తెచ్చెను.ఆయన అయ్యో!స్వామీ గృహకృత్యముల విషయములునా గృహిణి యే చూచుకోనును నాకేమీ తెలియదు అని చెప్పెను.ఆయజమాని ఈ విషయము తన యిల్లాలితో చెప్పగా ఆమె
దొడ్డివాకిట వెళ్లి పెద్దన గారి ఇల్లాలిని అడిగెను.ఆమె అమ్మా!నాకు బయటి విషయములు తెలియవు అన్నీ
మా వారికే తెలియును ఆయనను అది చెప్పెదను అని చెప్పియిప్పటికి మా పనివానితో మీ యింటికి కొన్ని పుల్లలు పంపించెదను వంట చేసుకోండి యని చెప్పి ఆమెను పంపెను.మరుదినము పెద్దన దంపతులు స్నాన మాచరించి అగ్ని శాల యందు ప్రవేశించిరి. సమిధలు వాన జల్లుకు కొంచెము తడియుట వలన
ఆమె వెలిగించుటకు కష్టపడు చున్నది.ఆ పొగతో ఆమె కళ్ళవెంట నీరు కారుట చూసి పెద్దనగారు కూడా ప్రయత్నించిరి.పొగకు యిద్దరి కన్నుల్లో నీళ్ళు కారుట తప్ప అవి వెలగ లేదు అలాగే కష్టపడి ఎలాగో వెలిగించి అగ్ని కార్యము పూర్తి చేసినారు.అప్పుడు పెద్దన గారు భార్యతో నిజముగా పురుషులందరూ స్త్రీలకు
కృతజ్ఞు లై వుండవలిసినదే అందులో నీ ముసురు కాలమున నాకు ఒక్క ఆహుతిని వెలిగించుట కే యింత కష్ట మైనది.మీరు దినము వంట చేయుటకు యెంత కష్ట పడుచున్నారో నా ఊహకే అందడం లేదు.అన్నాడు. అప్పుడు ఆమె అది సరే కానీ మన యింటి వెనక బజారులో వున్న గుడిసె లో వున్న ఇల్లాలు ఒక కట్టెల మోపు తమకు వేయించమని అడిగినది.పాపం మూడు దినములుగావంట చేసుకొనుటకు కట్టెలు లేక పస్తులున్నారట. ఈ పూటకు నేను కొన్ని కట్టెలు యిచ్చి పంపినాను.రేపు మిమ్మల్ని అడిగి వేయించే దని చెప్పి పంపినాను.వూరిలో ఎక్కడా ఎండు కట్టెలు దొరకడము లేదు.
మీరు ఎవరితో తెప్పిస్తున్నారో వారితో చెప్పివాళ్లకు ఒక మోపు వేయించ రాదా?అనెను. ఆయన ఆశ్చర్య
చకితుడై ఆ యజమాని కూడా యిదే విషయము నన్ను అడిగినాడు.నీవే తెప్పించు చున్నావని చెప్పి పంపితిని.అసలు ఎవరు తెప్పిస్తున్నారు?తెచ్చిన వారు పైకము కూడా తీసుకొనుట లేదు.మరి మన యిద్దరికీ తెలియ కుండా ఈ ఎండు కట్టేలెట్లు వచ్చు చున్నవి?నాకు తెలియదని నేను,నీకు తెలియదని నీవు చెప్పినాము పాపం వారేమనుకున్నారో ఏమో అని బాధ పడిరి.పనివారిని అడిగి చూసినారు.వారందరూ మాకు తెలియదంటే మాకు తెలియదు అని అన్నారు.రాత్రి మేలుకొని ఎవరు వేయుచున్నారో కనీ పెట్టండి అని ఆ పనిని వారికి అప్ప చెప్పిరి. వారునూ కనిపెట్ట లేకపోయిరి.ఎవరికీ తెలియకుండా
ఎవరు వస్తున్నారు?ఎవరు మోపు వేసి పోతున్నారు?ఏదయినా వస్తువులు పోయినా యింతే కదా అని వారిని మందలించి నారు.ఆరు రోజులకు వానలు తగ్గుముఖం పట్టినాయి.పెద్దన గారు ఆయన భార్య తామే కాపు కాసి పట్టుకొన వలయునని తలచి రాత్రి పెరటిలోని ఒక పొదరింట దాగుకొని యుండిరి.రాత్రి ఎంత గడచిననూ ఎవరూ రాలేదు.తెల తెల వారు చుండగా వారి వెనుక దబ్బు మని శబ్ద మాయెను.వెంటనే వారు ఆ వైపుకు పరిగెత్తి పోయిరి ఒకతను కంచె ఆవలి వైపు నుండి మోపు వేసి గబ గబ పోవుచుండెను.పెద్దన ఎవరది?ఆగుము అని కేక వేసెను వాడు గడ గడ వణుకుచూ నిలబడెను.పెద్దన భయము లేదు నిలువుము అని చెప్పి వాని సమీపమునకు బోయి నీవు కట్టెలు ఎందులకు వేయుచున్నావు?ఎవరైనా యిటుల వేయమని చెప్పినారా?అని అడిగిరి.దానికి వాడు ఆయన కాళ్ళ మీద పడి దేవరా!ఎవరూ లేరనుకొని మోపు వేసితిని
మీకేమైనా దెబ్బ తగిలినదా?యని అడిగి నన్ను ఎవరూ వేయమని చెప్ప లేదు నేనే వేయుచున్నాను.
అనిన పెద్దన గారు మరి పైకము తీసుకోన వలదా?వూరికే నీ కట్టెలు వాడుకొనిన మాకు పాపము రాదా?అనిరి
దేవరా నేను,మా ఆవిడ దగ్గరిలోని అడవికి వెళ్లి కట్టెలు కొట్టు కొని వచ్చి అమ్ము కుంటాము.వానలు రాకముందు నుంచీ కట్టెలు రోజూ తెచ్చి కూడ బెట్టినాము.మా యిద్దరికీ ఎన్ని పుల్లలు కావలయును?మాకు పిల్లలు లేరు.మీకు వేసిన పుణ్యము వచ్చునని వేయుచున్నాను అంతే గానీ వేరు కాదు.అని అన్నాడు.
నీవు అలాగ వేయుటకు నేనేమైనా ఈ వూరి రాజునా?అని పెద్దన అనగా మీరు వారి కంటే గొప్పవారని రాయల వారే అన్నారు కదా!మీరు సరస్వతీ స్వరూపులు కదా!రాజులు మీముందర నెంత?అని పలికెను.
కొంత వెలుగు వచ్చుట చే వాని మొగము చూసి ఓహో!నీవా?నీవే కదా ఆనాడు రాజ సభలో మాట్లాడిన వాడివి?నీ పేరేదో చెప్పినావు?అనగా వాడు నా పేరు గువ్వల చెన్నుడు సామీ అన్నాడు.
పెద్దన గారి భార్య అతను యింత చేసినందుకు మీరేమైనా అతనికి మేలు చేయ వలదా!అది ఆలోచింపక మీరేదో మాట్లాడు చున్నారు.మీరు చెప్పినదే కదా! 'బుద్ధి జాడ్య జనితోన్మాదుల్ గదా శ్రోత్రియుల్" అని
అది సార్థకము చేసికొను చున్నారా?అని మేల మాడెను.అందుకు పెద్దన ఓహో! వ్యాఖ్యాన సామర్థ్యము
బాగుగా అలవడినదే నీకు?ఎంతైనా కవితా పితా మహునకు భార్యవు గదా!అని భార్యతో సరసము గా పలికెను.
వానితో నీ కవితాభిమానము చూసి నాకు చాలా ముచ్చట యైనది. నీ పేరు చిరస్థాయిగా వుండు నటుల
చేయ సంకల్పించితిని అనెను.సామీ!మీ దయ వచ్చినట్టు చేయండి అని నా చేత నయినంత వరకూ మీ సేవ జేసుకొనుటకు వుత్తరువివ్వండి అని మరీ మరీ ప్రణామములు ఆ చరించి వెడలి పోయెను.
ఆ తర్వాత పెద్దన 'గువ్వల చెన్నా' అనే మకుటం తో "గువ్వల చెన్న" శతకమును రచించి వానికి అంకిత మిచ్చేను.ఆ శతకమే నేడు ప్రాచుర్యములో నున్నది.
వెల కాంత లెంద రైనను
కుల కాంత కు సాటి రారు కువలయ మందున్
కల విద్య లెన్ని యైనను
కుల విద్యకు సాటి రావు గువ్వల చెన్నా!
కలిమి గల లోభికన్నను
విల సైతముగ పేద మేలు వితరణి యైనన్
చలి చెలమ మేలుగాదా
కులనిది యంభోది కన్న గువ్వల చెన్నా!
ఈ రెండే నాకు తెలిసినవి మీకెవరికైనా యింకా తెలిస్తే వ్రాయండి.యిది పెద్దన గారి వితరణ కు ఒక ఉదాహరణ.చెన్నుని పేరు మనుచరిత్ర ఉన్నంత కాలం
గువ్వలచెన్న శతకం తో అతని పేరు కలకాలము నిలిచేలా చేశారు కదా!
తరువాత శ్రీకృష్ణ దేవరాయలవారు "ఆముక్తమాల్యద"(విష్ణు చిత్తీయము) అను ప్రబంధమును వ్రాసిరి.ఆ
సందర్భమున పెద్ద సభ జరిగెను.పెద్దనగారు లేచి సభా సదులారా!ఈనాడు ఎంతయో శుభ దినము.
నిరుపమానమైన కవితా కళా గరిమ కలిగిన మన ఏలిక ప్రేమమయుడు.యింతమంచి గ్రంథము రచించి
మనలనందరినీ ధన్యుల గావించినారు.ఈయన కీర్తి ఆచంద్ర తారార్కము నిలుచుగాక!యీతని ఏలుబడిలో
వీరికి సమకాలీకులుగా నుండుట మన అందరి అదృష్టము.యింతటి ఘనకార్యమును సాధించిన మన రాయలవారిని "ఆంధ్రభోజుడు" అను బిరుదముతొ సత్కరించు చున్నాము.యిందులకు మీరందరూ దీనికి
అంగీకరించి మమ్ము అనుగ్రహింప వలయునని ఈ కవిపండిత మహాజన సభాపరముగా నభ్యర్తించు చున్నాను. అని చాలించెను.సభ నుండిప్రహర్ష ముత్కర్ష మైన జయజయ ధ్వానములు మిన్నుముట్టెను..
కృష్ణదేవ రాయలు సింహాసనము నుండి లేచి మీరేల్లరూ నా పై జూపిన యాదరాభిమానములకు వాక్కుల కందని యానందము నాన్నావరించినది. మీరందరూ నన్ను పొగడుచున్నారు కానీ నేనొక సామాన్య మైన వ్యక్తినే నా ప్రజలలో నేనోక్కడను.నాయందు ఏదైనా ప్రత్యేకత వున్నది అంతే అదంతా మీ ఆశీస్సుల ప్రభావమే.నన్ను దాయదలబారి నుండి కాపాడి నన్నుయింత వానిగా జేసిన అప్పాజీ వారిదే ఈ ఘనత.నేనొక వుపకరణమును మాత్రమే.నా జీవిత మంతయు మీ సేవకు,తెలుగు కళామతల్లికీ అంకితము చేయుదునని ప్రతిజ్ఞ చేయుచున్నాను.అని కూర్చుండెను.సభ్యులందరూ మన రాజు ఎంత వినయశీలి,వుదారుడో కదా!
అని వారిలో వారు సంభాషించు కొనుచూ సభ ముగిసినందున అందరూ తమ తమ యిళ్ళకు బోయిరి.
ఆ రాత్రి వారందరూ తమకీయబడిన భవనము నందు విశ్రమించి తమలో తాము ఆ నాటి సభా ముచ్చట్లు చెప్పుకొను చుండిరి.అక్కడికి కృష్ణదేవరాయలు,రామకృష్ణుడు యిద్దరూ మారు వేషములలో వచ్చి వారేమి మాట్లాడు కుందురో అని వినుచుండిరి.అయితే వారిద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు వచ్చి వుండిరి.
అక్కడివారు పెద్దనగారి మనుచరిత్ర గురించి మాట్లాడు కొనుచుండిరి.ఆ పద్యములు పామరజనులుకూడా
చెప్పుచున్నారు.అంతగా ప్రజలను ప్రభావితము చేసినవి.అని ఒకడు చెప్పగా ఇంకొకడు అవును నేను ఈవూరికి వచ్చుచుండగా ఎటు బోవలేనో తెలియక అక్కడ వున్న కాపు పడుచును అమ్మా!విజయనగరమునకు పోవు దారి ఏది అని యడిగితిని.అప్పుడాయువతి
ఇంతలు కన్నులుండ దెరువెవ్వరి వేడుదు భూసురేంద్ర" యని పక పక నవ్వినది.(ఆ పద్యము వరూధిని ప్రవరుడితో అన్నది)ఇంకొకడు మొన్న నేనొక కరణము యింటికిబోయితిని వారింటిలో దొంగతనము జరిగినదట ఎలా జరిగినదని నేనడిగితే ఆ ఛాందసుడు రాత్రి వుక్కపోయుచున్నదని నాభార్య వాకిలికి అడ్డముగా చాప పరుచు కొని నిద్రించెను.నేను దొంగ ఎవడైనా వచ్చి నా పచ్చల ఉంగరము దొంగిలించునేమో నని అది ఎవ్వరూ తాకరు గదా!(మడి యని)యని దేవుని సంపుటము నందు వుంచితిని.అది దొంగ వచ్చి తీసుకొని పోయినదని చెప్పగా ఆచటివారు నవ్వుతూ "బుద్ధి జాడ్య జనితోన్మాదుల్ గదా శ్రోత్రియుల్" అని
అందరూ నవ్విరి.అనిన ఇంకొకడు ఒక ముసలావిడ తనకొడుకుతో ఒరే నాయనా పెండ్లి చేసుకోరా వయసు మీరి పోతున్నది ఈ వైరాగ్యము మానుమురా అని బ్రతిమలాడగా ఆ కుర్రవాడు "చెప్పకు మిట్టి తుచ్ఛ సుఖముల్ మీసాలపై దేనియల్" అన్నాడు.(ప్రవరుడు వరూదినితో నన్న పద్యము.)యిటుల మనుచరిత్రలోని పద్యములు సామాన్య ప్రజల నోట తిరుగుచున్నవి.అని అందరూ అనుకోను చుండిరి.మన రాజు ఎంత ఉదారుడు దానకర్ణుడు యని పోగడుచుండగా మారువేషము లో నున్న తెనాలి రామకృష్ణుడు రాజుగారు దానములు చేయుట లో విశేష మేమున్నది?ఒక పేదవాడు పెద్దన గారు తనపెరుమీద వ్రాసి తనకంకిత మిచ్చిన పద్యములను తనదగ్గర చదివిన వారందరికీ తనదగ్గర నున్న ఏదో ఒకటి బహుమతి గా యిచ్చు చున్నాడట.ఆఖరికి మొన్న ఎవడో తన పద్యము చెప్పగా అప్పుడు తనదగ్గర యిచ్చుటకు ఏమీ లేక తన
జీవనాధారమైన గొడ్డలిని యిచ్చివేసినాడట.అతనిని చూపించేద రమ్ము అని అతన్ని పిలుచుకొని పోవుచుండ కృష్ణరాయలు కూడా ఇదేమో చూతామని వారి వెంట వారికి తెలియకుండా అనుసరించి పోయెను.వారు వూరి బయట వున్న ఒక గుడిసెకు పోయి చెన్నుడు వాడి భార్య మాట్లాడుకొను మాటలు వినుచుండిరి.ఆమె మావా పొద్దున్న కూడు కూడా తినకుండా ఎక్కడికి పోయినావు అనగా తెలివితక్కువ దానా!అక్కడ మన రాజు పెద్ద సాహిత్య సభ జరుపుచుండగా అక్కడికి పోయితిని తిండి దేమియున్నది
రోజూ తినేడిదే కదా!అక్కడ ఆ కయితలతో నాకడుపు నిండి పోయినది అనెను .అప్పుడామే నీకు కయిత్వపు పిచ్చి పట్టుకోన్నదేమి మావా!వున్న గొడ్డలి కూడ దానం చేసేసినావు?యింకా మనకెట్లు జరుగుతుంది ?అని విసుగ్గా అంటూ వుంది.ఆ రాజుగారిచ్చిన బంగారు కడియమైనా అమ్మి సొమ్ము తేరాదా?అనెను.వాడు కోపముతో ఆమాట అన్నావంటే చూడు.అది విలువ లేనిది దానిని అమ్మ మందువా?అని కోపపడెను.
యింతలో రామక్ర్రిష్ణుడు,యింకొక అతనితో కలిసి అక్కడికి వచ్చిరి.చెన్నుడు మంచము నుండి లేచి ఎవరో మహానుభావులు వచ్చినారు రండి సామీ మిమ్ములను కూర్చోబెట్టేందుకు ఈ కుక్కి మంచము తప్ప మాయింటిలో ఏమియు లేదే అని బాధ పడెను అప్పుడు వారు పరవా లేదు లే చెన్నయ్యాఅనుచు
రామకృష్ణుడు ఈ క్రింది పద్యము చదివెను
వెల కాంత లెంద రైనను
కుల కాంతకు సాటి రారు కువలయమందున్
కల విద్య లెన్ని యైనను
కుల విద్యకు సాటి రావు గువ్వల చెన్నా
చెన్నుడు ఆనంద పరవశుడై దండాలు బాబూ! గొప్ప వాండ్లు ఈ అల్పుడి యింటికి వచ్చినారు మిమ్ములను తగినట్లు గౌరవించు టకు మాకు యోగ్యత లేదు.మీ పాదాలను మాయింట బెట్టి మా పాపములను అణగ ద్రోక్కినారు.నా అదృష్టము ఈనాడు పండినది ఆ పద్యాలు చదువు వారికి నేనేదయినా
సమర్పించు కొనుట నా యలవాటు.నాదగ్గర వున్న ఈ రత్న కంకణము సమర్పిచు కొను చున్నాను. దయతో స్వీకరించి నన్ను కృతార్థుని జేయండి యని ఆ నాడు రాజు గారిచ్చిన స్వర్ణ కంకణము సమర్పించెను.
అప్పుడు రామకృష్ణుడు చెన్నా నీకు అఖండ సంపద గలుగు గాక నీ కీర్తి దిగంతఃములకు వ్యాపించుగాక అని ఆశీర్వదించి యథా రాజా!తథా ప్రజా అను నానుడిని నిజము చేసినావు అని అభినందించెను.
ఏమో దేవరా!పెద్దయ్య గారు నా పేరుమీద పద్యాలు చెప్పినారు అవి అందరూ చెప్పుకొను చున్నారు.పిల్లలు లేని నాకు ఆ పద్యాలు యిచ్చి నాకు పిల్లలు లేరను లోటు తీర్చినారు.యనెను.అప్పటి వరకు అక్కడే దాగి వుండి వీరి మాటలను వినుచున్న రాయలు వారి ఎదుటకు వచ్చి పెద్దన ఈ పద్యాలు వ్రాసినారని నాకు తెలియనే తెలియదు.నేనే కృతి భర్త ననుకొంటిని నీవు నాకంటే గొప్ప కృతి భర్త వైతివి(గువ్వల చెన్న శతకము స్వీకరించి).యింతటి దానకర్ణుడు నా రాజ్యమందు ఉన్నాడని తెలిసికొని నాకు చాలా గర్వముగా నున్నది.నీ ఔదార్యము అభినంద నీయము.
అని తన మెడలోని ముత్యాలహారమును చెన్నుని మెడ లో వేసెను నీ యొక్క గువ్వలచెన్న శతకము
ఆంద్ర వాగ్మయము ఉన్నంతకాలము నీ పేరు చిరస్థాయిగా వుండు గాక అని ఆశీర్వదించి అతనికి ఒక గ్రామము దానము గా నొసగెను అతని జీవికకు అవసరమైనత ధనము యిప్పింతు నని ప్రకటించెను.
చెన్నుడు ఆనంద పరవశు డాయెనునాకు మీ దయవున్న చాలు మారాజా అనెను.
ఈ నవల "విజయ జ్యోతి" అను పేరిట విద్వాన్.జోస్యం జనార్దన శాస్త్రి గారిచే రచింప బడినది.ఆయన తాడిపత్రి గ్రామ వాసి.(అనంతపురం జిల్లా)ఎంత పాండిత్య మున్ననూ ఆ దరణ లేక బీదతనము లోనే తన జీవితము గడిపిన ధన్య జీవి.ఈ నవల 1956 లో ప్రచురిత మైనది.వీనస్ బుక్ హౌస్ నెల్లూరు వారు ప్రచురించినారు.


వసంతకాలము విజయనగర సామ్రాజ్యము లో నగరమంతయు అలంకరింప బడి వెలుగు చుండెను.వీధులన్నియు పన్నీరు కళ్ళాపి తో,సుగంధ ధూపపముల వాసనలతో నిండియుండెను.నగరమంతటా మకరతోరణముల తో,అందరి నోట సంగీత సాహిత్య,సామరస్యములతో మార్మోగుచుండెను.దూర దూరముల నుండి వచ్చిన పండిత పామరులతో,వంది మాగధ వైతాళికులతో నగర మంతయు నిండి యుండెను.ఆనాటి వైభవము విరూపాక్షస్వామి బ్రహ్మోత్సవము లప్పుడుగానీ,విజయ దశిమీవినోద ప్రదర్శన సందర్భమున గానీ తుదకు కృష్ణరాయని పట్టాభిషేక సమయమందు గానీ సంభవించి యుండలేదు.యింతకునూ కారణము ఆనాడు 'మనుచరిత్ర ప్రబంధము' కృతి సమర్పణ సమారోహ ణము.
సప్త సంతానములలో నాశనము గానిది కృతియొక్కటే.
.రాజ్యములు మారిపోవును,శాశ్వతము లనుకొన్న శిలా స్తంభములు భూగర్భమున మరుగు పడును.సంతానపరంపర లో నాలుగవతరమున నామమే నశించును.
ఎన్ని తరములు గడచిననూ యాచంద్ర తారార్కముగా యానాటి వైభవము,సంస్కృతి,ఆచారవ్యవహారములు,ఆ నాటి రాజకీయము లను అచ్చుగుద్దినట్లు తెలియజేయునది సత్కృతి యొక్కటే రామాయణ భాగవతాది మహా గ్రంధములు ఈనాటికీ నిలిచియున్నవి కదా!ఈ సంగతి తెలిసిన వాడు కనుక కృష్ణదేవరాయలు ఈ కృతి ఆవిష్కరణ కు అంత ప్రాధాన్య మొసగెను.
రాజభావనమునుంది రాజు బయలుదేరు చున్నాడనుటకు చిహ్నముగా సంఖా కాహళ,పనవాడి వాద్యములు,వాని వెనుక సన్నాయి వాయిద్యము వినవచ్చు చుండెను.పుష్ప మాలికలతో రంత్నపల్లవ తోరణములతో నలంకరింప బడిన పల్లకి యుంచ బడినది.పురోహితులు స్వస్తి వాచకములు పలుకు
చుండిరి.ఆ వెనుక సార్వభౌమ అలంకారములతో శ్రీకృష్ణ దేవ రాయలును,సాక్షాత్ సరస్వతీ అవతారమై యొప్పు పెద్దన కవీంద్రు లును నిల్చుండి యుండిరి. శ్రీ రాయలవారు తిమాసుసు గారిచే నందీయ బడిన
కాశ్మీరపుబంగారు శాలువను స్వహస్తములతో పెద్దనగారికి కప్పి,సువర్ణ రత్నహారములతొ,క్రమ పుష్పమాలికలతో పూజించి కవివర్యుని ఆలింగనము చేసుకొని పల్లకినందు కూర్చుండ బెట్టిరి.ఆ వెనుక శిష్య
గణము 'మనుచరిత్రతాళపత్ర గ్రంధము నుంచిన బంగారు మందసమును పల్లకిలోకి యెక్కించిరి.'జయజయ శ్రీ అల్లసాని పెద్దన కవీంద్ర' అనుచు పల్లకి తనచేతితో నెత్తెను.అవతల ప్రక్క మిగతా బోయీలు యెత్తిరి.ఆ ప్రదేశమంతా జయ జయ మనుచరిత్ర కృతి కర్త అను నినాదములతో
మారుమ్రోగేనుఆ యుత్సవము ప్రదానవీధులను దాటి గ్రామ ప్రదక్షిణము చేసి హజారరామ స్వామి దేవాలయుము దగ్గర నిలిచెను.అందరును దేవాలయము లోని కేగి స్వామికి కర్పూర హారతులిచ్చి మరల ఉత్సవము సాగి పెద్దనగారి యింటి ముందర నిలిచెను.తన చేయి అందించి రాయలు పెద్దన గారిని పల్లకి నుండి దింపిరి.గృహద్వారమున ఆయనకు కర్పూర నీరాజనము లివ్వబడెను.వారి సతీ మణికిరత్నహారములు,పుష్పమాలికలు లోనికి పంపబడెను.పెద్దనగారును అందరినీ లోనికి ఆహ్వానించి
చందన తాంబూలాదులు సమర్పించిరి.ఎక్కడివారక్కడ సెలవు తీసుకొని యిండ్లకు బోయిరి.
ఆ నాటి సాయంకాలము కృతి సమర్పణ కార్యక్రమము.కొలువుకూట మంతయు పండితులతో,కవులతో
సామాన్య ప్రజానీకముతో విరాజిల్లుచుండెను.రాయలవారు తన ఏనుగు పై పెద్దన గారింటికి వెళ్లి ఆయనను
తన కేలూత నిచ్చి ఏనుగు పైకి ఎక్కించుకొని కొలువు కూటమునకు పిలుచుకొని వచ్చిరి.సభయంతయు
'జయ జయ సారస్వత వినోద,జయశ్రీ పెద్దనామాత్య కవి పుంగవ'అను నినాదములతో మారుమ్రోగేను.
పెద్దన గారిని ఒక ఆసనము మపి కూర్చుండ బెట్టి రాయలు తాను సింహాసనము నదిష్టించెను.
తిమ్మరుసు వారు లేచి సభాముఖుడై మహాజనులారా! యివ్వాల్టి దినము ఎంతయో సుదినము.మన
పెదన గారు రచించిన మనుచరిత్ర గ్రంధమును శ్రీ రాయలవారికి అంకిత మిచ్చు చున్నారు.రాయలవారు
ఈ గ్రంధమును ఆవిష్కరింతురు గాక!అని పలికెను.పెద్దన గారు లేచి అక్కడి సరస్వతీ చిత్రమునకు నమస్కరించి,తన శిష్యుడు సంపుటము దెరిచి తన కందిచిన గ్రంధ రాజము ను తీసికొని
శ్రీ వక్షోజ కురంగ నాభ మెదపై చేన్నోంద విశ్వంభరా
దేవిం తత్కమలా సమీపమున బ్రీతి న్నిల్పి నాడో యనం
గా వందారు సనంద నాది నిజ భక్త శ్రేణి కిం దోచు రా
జీ వాక్షుండు కృతార్థు జేయు శుభ దృష్టిం గృష్ణ రాయాధిపున్
అని ఆశీర్వదించెను.కృతి భర్త (రాయల)యొక్క వంశవర్ణనము,ఆయన ప్రతాపము లను వర్ణించు చుండ
రాయలు అభ్యంతరము తెలిపి అవన్నీ తర్వాత ముందు గ్రంధము చదువుట ఆరంభిం పుడు అని
ఆజ్ఞాపించెను.పెద్దనగారు కొన్ని'మనుచరిత్ర'లోని కొన్ని ముఖ్యమైన ఘట్టములను చదివి వినిపించిరి.తరువాత తిమ్మరుసు గారు
లేచి మన పెద్దనగారికి "ఆంద్ర కవితా పితామహ"అని బిరుదము రాయల వారిచే యీయబడుచున్నది.అని
ప్రకటించిరి.దానికి అందరూ తమ సమ్మతి సంతోషము గా తెలిపి ఆ బిరుదమునకు ఆయన తగినవాడని
రాయలవారి నిర్ణయము చాల ఉత్తమమైనది యని పొగిడిరి.తిమ్మరుసు యింక సభాచాలించు సమయ మాసన్న మైనది.ఎవరైనను,పెద్దనగారి గురించి చెప్పదలుచుకున్నచో చెప్పవచ్చును అని ప్రకటించిరి.
అందరు పండితులు పెద్దన గారి మనుచరిత్రను,అతన్ని పొగుడుతూ మాట్లాడిరి.
తాతాచార్యులవారికి మాత్రము 'బుద్ధిజాడ్య జనితోన్మాదుల్ కదా శ్రోత్రియుల్' అనునది ఎంత మాత్రం నచ్చలేదు.
అయినా ఆయన మౌనముగానే యుండిరి.తిమ్మరుసు గారు, యిప్పుడు శ్రీ శ్రీ ప్రభులవారు స్వయముగా బంగారు గండ పెండేరమును కవి వర్యుల పాదాలకు తొడుగుతారు.ఆ దృశ్యమును చూచి కప్పుర విడియము లందు కొను డని వేడుకోలు.అంతట రాయలు వారు లేచి పసిడి పళ్ళెరము నందు ఉంచ బడిన గండ పెండేరమును ఒక రాజోద్యోగి మంత్రి కందించగా ఆయన రాయల కోసగిరి.మహారాజు నా జన్మము ధన్య మైనదను భావము కన్నులలో కన్పట్టు చుండగా సింహాసనము నుండి చివాలున లేచి,లేవ బోవు సభాసదుల వారించి కూర్చుండ నానతి యిచ్చి పెద్దాన గారి ఆసనము దగ్గరికి వెళ్లి సభనుద్దేశించి
'అధికారములు,ఐశ్వర్యములు న శాశ్వతములు.వ్యవహారమునకు నేనిపుడు రాజును.వీరు కవులు.రాజ్యలక్ష్మి అతి చంచలమైనది. ఈ నాటి రాజు రేపు బిచ్చగాడు కావచ్చును.కవిరాజు ఘనరత్నము.
"సుకవితా యద్యస్తి రాజ్యేన కిం"అన్న భర్తృహరి అవివేకి కాడు.(మంచి కవిత్వమున్న యెడల రాజ్య మెందులకు?").నా జన్మములో నిదియే నాకు అపరిమిత మైన ఆనంద దాయకము.నా చే చేయ బడిన కార్యములు ఏ నాటికైనా నశింపవచ్చును.ఈ కృతి యొక్క టియే నశిం చనిది.ఆంధ్రభాష ప్రపంచమున నున్నంత వరకు నన్ను కృతి భర్తను జేసిన శ్రీపెద్దన గారి ఋణము ఎన్ని జన్మలకు తీర్చ లేనిది.సప్తాంగ సంపన్న మైన నా ఈ రాజ్యము సైత మీ కృతికి సరితూగ జాలదు.ఈ గండ పెండేరము వారి పాండితీ ప్రకార్ష కుబహుమానమని కానీ,కవితా కళాభి జ్ఞతకుకానుక యని కానీ కృతి యిచ్చినందుకు కిమ్మత్తు అని కానీ
నేను భావించడము లేదు.వారియెడ నా భక్తిని,కృతజ్ఞత ను వెలిబుచ్చు బాహ్య చిహ్నమని మాత్రము మీరు విశ్వ సింప వలయును.నేను మీ యందరి అనుమతితో ఈ గండ పెండేరమును వారి పాదములకు దొడిగి కృతార్థుడనగుదును.కరతాళ ధ్వనులు మిన్ను ముట్టెను.రాయలు అతి భక్తి తో పెద్దన గారి వామపాదము నకు గండ పెండేరమును దొడిగెను.అప్పుడు తిమ్మరుసు వారు ఉత్సాహ పూరితు లెవరైనా
మాట్లాడ దలచిన అవకాశము ఇవ్వబడును.అని ప్రకటించిరి.అందరూ మౌనముగా వుండిరి.కానీ పౌరులలో
ఒకతను మాత్ర్రం తాను మాట్లాడుదునని చేయిఎత్తి ముందుకు రాబోయినాడు. పక్కన వున్నవాళ్ళు అతన్ని వెనుకకు లాగి ఒరే!నీకేమైనా పిచ్చా?అంతమంది పెద్దవాళ్ళు మాట్లాడుతూ వుంటే నేవేమిటి మధ్యలో అని ఆపడము కనిపించింది.తిమ్మరుసు వారు మాత్రం కవిత్వము రసజ్ఞు లను అలరించడము పెద్ద విశేషము కాదు మీ వంటి పామరులను అలరించుట యే గొప్ప విశేషము.తమ అభిప్రాయము తెల్పుటకు,
అందరూ అర్హులే నీవు వచ్చి నీ అభిప్రాయమును చెప్పవచ్చును అని అన్నారు.అప్పుడు అతడు ముందుకు వచ్చి రాజుకు,కవికి,సభ్యులకు నమస్కరించి దొరా!నన్ను క్షమించండి.అన్నాడు.అతను మోకాలు దిగువవరకు వున్న చల్లాడము వేసుకొని వున్నాడు.ఒక చౌక బారు పచ్చడము(శాలువా)మీద వేసుకొని యున్నాడు.శ్రామికుడిలా మొరటుగా వున్నాడు.యెత్తుపళ్ళు మీసాల చాటున కనపడుతున్నాయి..తిమ్మరుసు వారి మాటలు విని అతనికి ఏనుగెక్కినంత సంతోష మయ్యెను సభాసదు లందరి దృష్టి అతని వైపునకు తిరిగెను.అందరూ ఆశ్చర్య చకితులై చూచుచుండిరి.అతను అంజలి ఘటించి నడుము వంచి రాయలకు,పెద్దన కవి గారికి సభాసదులకు నమస్కరించెను.కాళ్ళు,గొంతు వణుకు చుండగా గుటకలు మింగుచూ దేవరా! చదువు రాని మోటు జాతి మాది.మేము ఎన్ని జన్మల లో చేసికొన్న
పున్నెము వల్లనో మాకు ఆ కృష్ణమూర్తి అవతారము వంటియీ కృష్ణదేవ రాయల వారి ఏలుబడి లో నుండు బాగ్గెముకలిగినది.రామరాజ్యము వంటి ఈ రాజ్యములో కూటికీ ,గుడ్డకు లోటు లేకున్నది.ఎప్పుడు సభలు,సంగీతాలు,వినోదాలు వీటి తోనే కాలము గడుపుతున్నామంటే మా మారాజు మహిమే కారణము.
ఈ పెద్దయ్య గారు చెప్పిన పద్యాలు మా వంటి వారికి కూడా వింటూ వుంటే ఏదో రసానందము కలిగి స్వర్గములోనో కలలోనో ఉన్నట్టుంది ఆకలి దప్పి కూడా తెలియకుండా యింకా వినవలయునని కోరిక కలగడమే విసేసము.అమృతము వంటి ఆ కవిత్వము చెప్పే మన పెద్దయ్యగారు మా రాజుగారి అదృష్టము కొద్దీ దొరికినారు.పెద్దయ్య అంటే దేవత అవతారమే రత్నము వంటి కయీస్వరుడు.రత్నాన్ని కనుగొని సోమ్ములలో వాడు కొను వారిదే అదృష్టము.ఈ రత్నము మా రాజుగారికి దొరికినది.దాంతో మా రాజుగారు తమ వంశానికే కాక దేశానికీ ,తెనుగు బాసకూ విలువలేని సొమ్ము సంపాదించినాడు.మా రాజు గారి పేరు యిప్పుడే కాదు ఏ కాలానికైనా వెలిగి పోతుంది.తెనుగు వేల్పు అయినాడు మా రాజు.ఎంత మంది రాజులు పుట్టలేదు?ఎంతమంది పేరు నిలిచింది?ఎన్నాళ్ళు తమ పేరు యిలలో నిలుచునో అంత కాలము స్వర్గములో ఉంటారని మీ వంటి అనుభవజ్ఞులు చెప్పగా ఇని యున్నాము.ఆ పెద్దయ్య వంటి వారి చేత పుస్తక మంత తన పేరున పెట్టుకొనుటకు ఎంత పున్నెము కావలె?నీ కడుపు చల్లగా వెయ్యేండ్లు వర్ధిల్లు
ఈ కలియుగము వుండు వరకు నీ పేరు వుండనీ అని ఆయాస పడుచూ యింత కంటే నేను ఏమీ చెప్పలేను అని అందరికీ మొక్కి వెనుతిరిగి పోవు చుండగా మహా మంత్రి వానిని ఆపి వాని రసానుభూతికి,భావ ప్రకటనకూ తమకు మెప్పు కలిగినదని వానికి ఒక హేమ కంకణము బహుమానముగా నిప్పించెను.వాని పేరే గువ్వల చెన్నుడు.సభ ముగిసెను.అందరికీ కప్పుర విడెములు(తాంబూలాలు) పంచ బడెను


ఇది యొక సంస్కృత పొడుపు కథ :-- . : ప్రభాతే కీ దృశం వ్యోమః?ప్రమాణే కీ దృశమ్ వచః
అంధ్ర గీర్వాణ భాషాభ్యాం ఏక మేనోత్తరం వదః
అర్థము ఉషః కాలమున(ప్రాతఃకాలము) ఆకాశ మెట్టిదిగా నుండును?ప్రమాణము చేయునప్పుడే మాట చెప్పుదురు?అని రెండు ప్రశ్నలు.
ఈ రెండు ప్రశ్నలకు సమాధానము ఒకే పదముగా నుండవలెను. అది తెలుగు పదము గాను సంస్కృత పదముగాను యుండ వలెను.
సమాధానము: 'నీతోడు' అని. మొదటి పాదమునకు సంస్కృత సమాధానము నీత =మాసిపోయిన ఉడు=నక్షత్రములు గలది=నీతోడు(నీతః+ఉడు=నీతోడు). రెండవ పాదానికి సమాధానము కూడా 'నీతోడు'తెలుగులో ప్రమాణము చేయునప్పుడు 'నీతోడు' అని అంటారు కదా!



ఒకసారి భోజరాజు ఆస్థానానికి ఒక పండితుడు వచ్చాడు. అతను మహారాజా మా ఇంట్లోని గ్రంథాలు
చూస్తూ వుంటే ఈ విచిత్ర మైన శ్లోకం కనిపించింది నాకు అసలు అర్థం కాలేదు. మీ సభలో కాళిదాసు,భవభూతి లాంటి మహా కవులున్నారు కదా!వారేమైన చెప్పగలరేమో నని వచ్చాను. ఆ శ్లోకం యిది.
"ప్రాతఃకాలే స్త్రీ ప్రసంగేన మధ్యాహ్నే ద్యూత ప్రసంగితం
రాత్రౌ చోర ప్రసంగేన పునర్జన్మ న విద్యతే
అర్థము:--ప్రోద్దునపూట స్త్రీ లను గురించి,మధ్యాహ్నం జూదము గురించి రాత్రి దొంగల గురించిన ప్రసంగము చేసిన పునర్జన్మ వుండదు. ఇదేమి విచిత్రమైన శ్లోకం
రాజు కాళిదాసు వైపు చూశాడు. కాళిదాసు లేచి ఆ శ్లోకం అర్థము యిలా వివరించాడు.
ప్రాతః కాలములో రామాయణము లోని సుందరకాండ పారాయణం చెయ్యాలి. సుందరకాండలో హనుమంతుడు రావణుడి అంతఃపురము లో చూసిన స్త్రీల వర్ణన, సీత వద్దవున్నరాక్షస స్త్రీలు
ఆవిడను బెదిరించిన ప్రసంగాలు వున్నాయి. అందుకని అది స్త్రీ ప్రసంగము. ఇక మధ్యాహ్నం ధర్మరాజు జూదమాడటం రాజ్యాన్ని కోల్పోవడం వున్న మహాభారతం లోని భాగాలను చదవాలి. రాత్రి పూట నవనీత చోరుడైన కృష్ణుని బాల్య క్రీడలు వున్న భాగవతం లోని ఆ భాగాలను చదవాలి. . ఈ విధంగా చేసిన వారికి పునర్జన్మ వుండదు అని దీని అర్థము.అని వివరించాడు. భోజరాజు, సభికులు హర్ష ధ్వానాలు చేశారు. ఆ పండితుడికి తగిన పారితోషికం యిచ్చి పంపించాడు భోజరాజు.
ఈ శ్లోకం, ఈ కథ మేము 'రాశి' సిమెంట్ కంపెనీ లో వున్నప్పుడు అక్కడి గుడి పూజారి గారు చెప్పినారు.



మహా భారతం లో భీష్ముడు,ద్రోణుడు, కర్ణుడు అందరూ చనిపోయాక కూడా దుర్యోధనుడు శల్యుడిని
సర్వసైన్యాధ్యక్షుడిగా చేసి యుద్ధం చేస్తానంటే అప్పుడు ద్రోణుడి కొడుకైన ఆశ్వత్థామ చెప్పిన శ్లోకమిది.
గతే భీష్మే తే ద్రోణే ప్యంగ రాజే దివంగతే
ఆశా బలవతీ రాజన్ శల్యో జేష్యతి పాండవాన్
అర్థము:-- మహావీరుడైన భీష్ముడు,గొప్ప ధనుర్ధరుడైన ద్రోణుడు, నిన్నేదో ఉద్దరిస్తాడని ఆసలు పెట్టుకున్న కర్ణుడూ చని పోయాడు. అయినా శల్యుని నమ్ముకొని యుద్ధము చేస్తానంటావే దుర్యోధనా భీష్మ,ద్రోణ.కర్ణుల వంటి వీరులను, ఓడించగలిగిన పాండవులకు శల్యుడొక లెక్కా
యుద్ధం మానుము. కానీ ఆశ అనేది ఎంత చెడ్డది. అది సాధ్యా సాధ్యాలను గురించి ఆలోచించ నివ్వదు. అందుకే అంటారు "వినాశకాలే విపరీత బుద్ధి" అని


దైవ వత్ పంచ వర్షా ణీ
దాస వర్షాణి దాసవత్
ప్రాప్తెతు శోడసే వర్షే
పుత్రం మిత్రం వదాచరేత్
అర్థము:-- పిల్లలను ఐదేళ్ళు వచ్చేవరకూ దైవంతో సమానం గాచూడాలి.ఐదేళ్ళ నునుంచి పదేళ్ళ వరకూ అంటే పదు నైదవ ఏడు
వచ్చే వరకు సేవకుడి లాగా అంటే దండిస్తూ,పనులు చేయిస్తూ వుండాలి.పదహారవ ఏడు దాటిన తర్వాత
సలహాలిస్తూ స్నేహితుడి లాగ చూడాలి. కానీ ఇప్పటి పిల్లల్నితల్లి దండ్రులు ఎక్కువ గారాబం చేసేసి చిన్నతనం
లోనే విపరీత స్వేఛ్చ నిచ్చి,అడిగిన వన్నీయిచ్చిపాడు చేస్తున్నారేమో నని పిస్తుంది.



నత్యహం కామయే రాజ్యం న స్వర్గం నా పునర్భవం
కామయే దుఃఖ తప్తానాం ప్రాణినాం మార్తి నాశనం
అర్థము:- ఓ! భగవంతుడా! నేను రాజ్యము కానీ,రాజ్య సుఖములను కానీ.స్వర్గాది సౌఖ్యము లను కానీ పునర్జన్మ రహిత మైన మోక్షమును కానీ కోరను.తాపత్రయ దుఃఖములచే తపించెడు ప్రాణి కోటికి దుఖోప శమనము చేయుమని మాత్రమే కోరు చున్నాను .భాగవతములో ప్రహ్లాదుని ప్రార్థన యిది. పుణ్య పురుషులు
లోకులందరి మేలు కోరి ప్రార్థింతురు.


మొదటిసారి కాళిదాసు భోజరాజు ఆస్థానం లో ప్రవేశించినప్పుడు రాజు కొలువులో లేడు.మిగతా కవి,పండితులు కూర్చుని వున్నారు.
కాళిదాసు రాజసభలోకి ప్రవేశించాడు.ధగధగ లాడే మణి కుండలాలు ధరించి,తళ తళ మెరిసే దివ్య వస్త్రాల తో
రాజపుత్రుడిలా వున్నాడు.కస్తూరి సువాసనలు విరజిమ్ముతూ,పూలమాలలు ఆభరణాలు గా ధరించి,మూర్తీ
భవించిన కవిత్వం లాగ,శృంగార రసప్రవాహం లాగ,దివినుండి భువి దిగి వచ్చిన దేవేంద్రుడిలా వున్నాడు.
సభికులందరూ ఆయన తేజస్సు చూచి అచ్చెరువొంది ఆయనెవరో తెలియకుండానే లేచి నిలబడి అభివాదం చేశారు.ఆయన ప్రతి నమస్కారం చేసి ఆసీనుడయ్యాడు.అంతలో భోజరాజు వచ్చాడు.వస్తూనే కొత్తవ్యక్తిని చూసి
తమ పేరేమిటి కవీశ్వరా?అని అడిగాడు.కాళిదాసు ఆయన చేతిని తన చేతి లోకి తీసుకొని ఆయన అరచేతిలో 'కాళిదాసు' అని వ్రాశాడు.అది చదివి రాజు ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశాడు.కవీంద్రా సాయం సమయమవుతూంది కదా!సంధ్యా వర్ణన వినిపించండి అన్నాడు.
కాళిదాసు నాలుగు చక్కటి ఉపమలతో ఓ చక్కటి శ్లోకం చెప్పాడు
.
వ్యసనిన ఇవ విద్యా క్షీయతే పంకజశ్రీ:
గుణిన ఇవ విదేశే దైన్య మాయంతి భ్రుంగా:
కు నృపతి రివలోకం పీడయత్యంధ కారో
ధన మివ కృపణస్య వ్యర్థ తామేతి చక్షు:
తా:--వ్యసనపరుడి విద్యలాగా తామరల కాంతి దిగజారిపొతున్నది.(సాయంకాలం తామరలు ముడుచుకుంటాయి.)తుమ్మెదలు పరదేశంచేరిన గుణవంతునిలాగా దైన్యాన్ని పొందుతున్నాయి. (.చీకటి
పడుతుంటే తుమ్మెదలు చెట్లపైకి చేరుతాయి)చీకటి దుర్మార్గు డయిన రాజులాగా లోకాలను బాధిస్తున్నది.
పిసినారివాడి ధనం లాగా కంటిచూపు నిష్ప్రయోజనమవుతున్నది.(చీకటిలో కళ్ళు కనపడటం లేదు)
ఆ తర్వాత భోజరాజు కీర్తిని ఈ క్రింది శ్లోకాలలో స్తుతించాడు
.
మహారాజ!శ్రీమాన్!జగతి యశ సా తే ధవళితే
పయః పారావారం పరమపురుషోయం మృగయతే
కపర్దీ కైలాసం, కరివర మభౌమం కులిశ భ్రుత్
కళా నాథం రాహు: కమలభవనో కంస మధునా
తా:--శ్రీమాన్ రాజా! ఈ జగత్తంతా నీ కీర్తి చేత తెల్లనై పోగా నారాయణుడు తన పాలసముద్రం ఎక్కడ ఉందా?
అని వెతుక్కుంటున్నాడు.శివుడు వెండి కొండ అయిన తన కైలాసం ఎక్కడా?అని వెతుకుతున్నాడు.
వజ్రాయుధు డైన ఇంద్రుడు తన తెల్లనైన ఐరావతం కోసం వెతుకు తున్నాడు.రాహువు కళా నాథుడైన
చంద్రుడినీ,బ్రహ్మ తన వాహనమైన హంసనూ వెతుకుతున్నారు.పాలసముద్రమో,ఐరావతము,చంద్రుడూ,
హంసా తెల్లనివి కాబట్టి విశ్వమంతా వ్యాపించిన నీ కీర్తి అనే తెలుపులో కలిసి పోయి కనపడటం లేదు
.
నీర క్షీరే గృహీత్వా నిఖిల ఖగతతీ ర్యాతి నాళీకజన్మా
తక్రం,ధృత్వాతు సర్వా నటతి జలనిధీంశ్చక్ర పాణిం ర్ముకుందః
సర్వానుత్తుంగ శైలాన్ దహతి పశుపతి: ఫాల నేత్రేణ పశ్యన్
వ్యాప్తా త్వత్కీర్తి కాంతా త్రిజగతి నృపతే!భోజరాజ క్షితీంద్ర!
తా:--నాళీక జన్మా=తామరపూవులో పుట్టిన బ్రహ్మ, నీరేక్షీరే గృహీత్వా=పాలూ నీళ్ళు కలిపి తెసుకొని
నిఖిల ఖగపతీ: యాతి=అన్ని పక్షుల దగ్గరకూ వెళుతున్నాడు.ఏ పక్షి నీటినీ పాలను వేరుచేయగలదో అదే
తన వాహన మైన హంస అని గుర్తించేందుకు. చక్రపాణి అయిన నారాయణుడు తక్రం ధృత్వా= మజ్జిగ
తీసుకొని అన్ని సముద్రాలలో వేస్తున్నాడు.ఏ సముద్రం లో తోడుకొని పెరుగు అయితే అదే తన పాలసముద్రము అని గుర్తు పట్టడానికి పశుపతి:ఫాల నేత్య్రేణ పశ్యన్=శివుడు తన మూడో కంటి తో అగ్నిని
సృష్టించి అన్ని కొండలనూ చూస్తున్నాడు.ఏ కొండ కరిగితే అదే తన కైలాసం అని గుర్తించేందుకు నీ కీర్తి
మూడు జగాలకూ వ్యాపించి వాటిని తెల్లరంగు తో కప్పేసింది అందుకే త్రిమూర్తులు తమ నివాసాలను కనుక్కో లేక వెతుకుతున్నారు.
ప్రశ్నోత్తర మాలికగా చమత్కార శ్లోకం యింకొకటి చెప్పాడు.
స్వర్గాద్గోపాల కుత్ర వ్రజసి?'సురమునే భూతలే కామధేనో:
వత్స స్యానేతు కామః -- త్రుణచయం!'ఆధునా,ముగ్ధ దుగ్ధం న తస్యా?
శ్రుత్వా శ్రీ భోజరాజ ప్రచురవితరణం వ్రీడ శుష్క స్తనీ సా
వ్యర్థో హి స్యాత్ ప్రయాసః తదపి తదరిభి: చర్వితం సర్వము ర్వ్యాం
తా:--స్వర్గ లోకం లో కామదేనువును చూసుకునే పసుల కాపరికీ నారడుడికీ మధ్య సంభాషణ
నారదుడు :-ఓ! గోపాలకా స్వర్గం నుంచి ఎక్కడికి వెళుతున్నావు?
గోపాలకుడు:-సురమునీ మా కామధేనువు దూడ కోసం గడ్డిమోపు తెచ్చేందుకు భూలోకానికి వెళుతున్నాను.
నారదుడు:-ఓరి అమాయకుడా!యిప్పుడు కామధేనువు దగ్గర పాలు లేవా?
గోపాలుడు:-శ్రీ భోజరాజు గారి మహత్తరమైన వితరణ గురించి విని సిగ్గుపడిన కామధేనువు ఎండి పోయి
శుష్కస్తని(ఎండిపోయిన పొదుగు గలది) అయిపొయింది.
నారదుడు:--అయితే నీ గడ్డి తెచ్చే ప్రయాసకూడా వ్యర్థమె కాబోతున్నది.భూమి మీద భోజరాజు పరాక్రమము వల్ల ఆయన శత్రువు లందరూ గడ్డి కరిచారు.(తిన్నారు)కాబట్టి నీకు ఆ గడ్డికూడా దొరకదు.
యిన్ని ఉపమానాలతో వున్నఅద్భుత మైన శ్లోకాలు విని భోజరాజు ఆశ్చర్యముతో చూస్తూ ఉండిపోయాడు.
తర్వాత తేరుకొని కాళిదాసును కౌగలించుకొని సత్కారాలతో ముంచెత్తాడు.


కాళిదాసు జన్మతః ఒక పసుల కాపరి. నిరక్షరాస్యుడు. మందబుద్ధి,గొర్రెలు కాచుకుంటూ తిరిగే వాడు. ఆ దేశపు రాజకుమారి విద్యాధరి. ఆమె గొప్ప విదుషీ మణి. తనకంటే గొప్ప పండితుడినే భర్తగా స్వీకరిస్తానని ప్రతిజ్ఞ పట్టింది. ఆమె చేత పరాభవం పొందిన పండితులంతా కలిసి ఆమెను ఎలాగైనా ఒక మూర్ఖుడి కిచ్చి పెళ్లి చేయాలని కుట్ర పన్నుతారు.
తాను కూర్చున్న కొమ్మనే నరుకుతున్న కాళిదాసు వాళ్లకు తటస్థ పడతాడు. అతనికి విలువైన ఆభరణాలు ధరింప జేసి పండితుని వేషము వేసి కొన్ని మాటలు, సంజ్ఞలు నేర్పి నీకు రాజకుమారితో పెళ్లి జరిపిస్తామని చెప్పి అక్కడ సభలో ఏమీ మాట్లాడవద్దని నీవు మౌన దీక్షలో వున్నావని చెప్తామని ఎలా ప్రవర్తించాలో నేర్పించి సభకు తీసుకొని వచ్చిఅతన్ని గొప్ప పండితుడిగా పరిచయం చేస్తారు. అతను ఒక సంవత్సరం పాటు మౌన దీక్ష చేపట్టారని ఎక్కువ మాట్లాడరని చెప్తారు.. అక్కడ రాజకుమారిని దీవించడానికి వాడికి ఇలా చెప్పమని చెప్తారు. "త్రిపీడా పరిహారోస్తు దినే దినే " అని అనమని వాడికి నేర్పిస్తారు. వాడు అక్కడికి వెళ్ళాక వాళ్ళు చెప్పినది మర్చిపోయి
"త్రిపీడాస్తు దినే దినే " అని దీవిస్తాడు. యిదేమి దీవెన? అని అంతా ఆశ్చర్య పోతారు. పండితులు దాన్ని సమర్థిస్తూ రాజకుమారీ నీకు పొద్దున పూట పిల్లలతోబాధ , మధ్యాహ్నం పూట అతిధి సత్కారలతో బాధ,రాత్రి నీ భర్త తో బాధ దినమూ వుండాలని వారి దీవెన లోని అంతరార్థం. ఇవన్నీ సంతోష కరమైనవె కదా స్త్రీలకు!అని చెప్తారు.అతని మొహం లో ఒక దివ్య తేజస్సు కనపడుతుంది రాకుమారికి. పెళ్ళికి వొప్పుకొని పెళ్లి చేసుకుంటుంది.. . మొదటి రాత్రి కాళిదాసును "అస్తి కశ్చిత్ వాగ్విసేష:?"అనగా నీకేమైనా వాక్కు విశేష మున్నదా?నీవేమైనా పండితుడవా?అని అడుగుతుంది.దానికి సమాధానం గా అతని పిచ్చిమాటలు విని
' తాను మోసపోయానని తెలుసు కుంటుంది. ఆమె అతన్ని నీవు పాండిత్యం సంపాదించుకొని వస్తేనే భర్తగా అంగీకరిస్తాను అంతవరకూ నాకు మొహం చూపించ వద్దని అంతఃపురం నుండి గెంటి వేస్తుంది.
ఆ అవమానంతో ఊరిబయట కాళీ దేవాలయానికి వెళ్లి కాళీ బిద్దియ్ (విద్య యివ్వు)అని పదే పదే జపిస్తుంటాడు. అతని నిష్కళంక భక్తికి మెచ్చి అతని నాలుకపై బీజాక్షరాలు వ్రాసి ఇవ్వాళ నుండి నీవు మహాకవి వై కీర్తి ప్రతిష్ఠలు సంపాదిస్తావు అని ఆశీర్వ దిస్తుంది దేవి. దాంతో అతనికి అపారమైన పాండిత్యము,కవితాశక్తి లభిస్తాయి.దేవిని స్తోత్రం చేసి అతను తిరిగి అంతః పురానికి వెళ్లి విద్యధరిని కలవాలని వెళ్లి ఆమె గది తలుపు తడతాడు ఆమె తలుపు తీయకుండా "ఆస్తి కశ్చిత్ వాగ్విశే షః?" .నీ వాక్కు తీరేమైన బాగు పడిందా? అని అడుగుతుంది. అందుకు కాళిదాసు "ఆస్తి కశ్చిత్ ప్రచండ వాగ్విశే షః "నా వాక్కు ప్రచండంగా బాగు పడింది అని సమాధానం చెప్పి కొన్ని అద్భుత మైన శ్లోకాలు చెప్తాడు. ఆమె నిన్ను భర్తగా అంగీకరిస్తున్నాను అని అంటుంది. దానికి కాళిదాసు నీవు నాకు విద్యా భిక్ష పెట్టిన దానివి గురువు తో సమానం నేను నిన్ను భార్యగా చూడలేను అని సమాధానం యిస్తాడు. ఆమె ఎంత బ్రతిమలాడినా అంగీకరించడు. ఆమెకు కోపం వచ్చినన్ను ధిక్కరించి నందుకు గాను నీవు చివరకు ఒక ఆడుదాని కారణంగానే మరణిస్తావు అని శాపం యిస్తుంది.. మహాప్రసాదం అని వెళ్లి పోతాడు.(సినిమాలో కథ కోసం వారిద్దరూ కలిసి కాపురం చేసారని చూపించారు) తర్వాత కాళిదాసు ఆమె తననుమొదటి రాత్రి అడిగిన
'ఆస్తి కశ్చిత్ వాగ్విశేషః" అనే పదాల్లోని మొదటి పదం 'ఆస్తి' అనే పదం తో కుమారసంభవం లోని మొదటి శ్లోకాన్ని,'కశ్చిత్'అనే పదం తో 'మేఘసందేశం' లోని మొదటి శ్లోకాన్ని , 'వాక్కు' అనే పదం తో 'రఘువంశ' కావ్యం లోని మొదటి శ్లోకాన్ని వ్రాశాడు. అ శ్లోకము లోకములో ప్రసిద్ధి చెందినది.
వాగర్థా మివ సంపృక్తౌ వాగర్థ ప్రతి పత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ
తా:--వాక్కు,అర్థము కలిసి పోయినటుల కలిసి పోయి వున్నటు వంటి పార్వతీ పరమేశ్వరులను రఘువంశ గ్రంథము వ్రాసేందుకు వాక్కు,అర్థము నాకు ప్రసాదించమని . లోకమంతటికీ తల్లి దండ్రు లైన వారిని ప్రార్థిస్తూ నమస్కరిస్తున్నాను.


ఒక కవిగారు సంచారము చేస్తూ ఒక పల్లెటూళ్ళో ఒకరి యింట బస చేయ వలిసి వచ్చెను. వారు అతనికి భోజనము పెట్టి పడుకుందుకు ఒక నులక మంచము నిచ్చిరి.బాగా నిద్ర వస్తున్నది. కానీ మంచములోని నల్లులు తెగ కుడుతున్నాయి. ఆ బాధ భరించలేక ఆ కవి ఈ పద్యము చెప్పెను.
శివుడద్రిని శయనించుట
రవి చంద్రులు మింట నుంట రాజీవాక్షుం
డ విరళముగా శేషునిపై
పవళించుట నల్లి బాధ పడలేక జుమీ!


భోజుడు రాజయిన తోలి రోజుల్లో తన క్రీడా వనం లో వాహ్యాళి చేస్తుండగా ఆయనకు ఒక పండితుడు ఎదురు పడ్డాడు.రాజును చూడగానే కళ్ళు మూసుకొని నడవసాగాడు.రాజు ఆ పండితుని ఆపి నన్ను చూడగానే
కళ్ళు మూసుకుంటూ వున్నావు కారణం ఏమిటి?
ఆ పండితుడు కళ్ళు తెరిచి రాజా! మీరు నాకు హాని చెయ్యరని తెలుసు. మేలు అసలే చేయరు.యిక మీజోలి నాకెందుకు?మీ అనుగ్రహం వల్ల ప్రయోజనమూ లేదు, ఆగ్రహం వల్ల నష్టమూ లేదు.
అప్రగల్భస్య యా విద్యా, కృపణస్య చ యత్ ధనం
యత్ చ బాహుబలం భీరో: వ్యర్తమేతత్ త్రయం భువి
అర్థము:--బుద్ధి వికసించని,పరిణితి లేని వాడి విద్య ఏదయితే వుంటుందో,ఔదార్యం లేని వాడి ధనం ఏదయితే వుంటుందో,పిరికివాడి భుజబలం ఏదయితే వుంటుందో లోకం లో ఈ మూడూ వ్యర్థం.
ఒకనాటికి మృత్యువు అందరినీ కబళించేస్తుంది.మృత్యువుకు పండితులు,ఆపండితులు,బలవంతులు ,బలహీనులు ప్రభువులూ,దరిద్రులూ అందరూ సమానమే అందువల్ల శక్తి వున్నప్పుడు దాన్ని వుపయోగించి జీవిత కాలం లో మంచి కీర్తి సంపాదించు కోవాలి ఔదార్యం లేని రాజుకు కీర్తి కలుగదు.
నేను యిలా నిర్మొహమాటం గా చెప్తున్నానని కోపం వద్దు.
మనీషిణః సంతి న తే హితైషిణో
హితైషిణః శాంతి న తే మనీషిణో
సుహృత్ చ విద్వాన్ ఆపి దుర్లభో నృణాం
యధౌష ధం స్వాదు హితం చ దుర్లభం
అర్థము:-విద్వాంసు లైన వారు శ్రేయోభిలాషులు గా వుండరు.శ్రేయోభి లాషు లైన వారికి విద్వత్తువుండదు.
మిత్రుడూ,విద్వాంసుడూ అనదగ్గవారు రాజులకు ఒక పట్టాన లభించరు.ఎలాగంటే మేలు చేసే మందు తీయగా వుండడం అరుదు.రాజు ఆపండితుడికి అక్షర లక్షలు యిచ్చాడు.
మీ పేరేమిటి?అని అడిగితే ఆ పండితుడు 'గోవిందుడు'అని నేలమీద రాసి చూపాడు.
గోవింద పండితా మీ వంటి పండితులు మా రాజ గృహానికి రోజూ వస్తూ వుండాలి.అని ఆహ్వానించాడు రాజు.
అప్పటినుండీ రాజు కవులకూ ,పండితులకూ విరివిగా దానాలు సత్కారాలు చేసేవాడు.
లక్షం మహా కవే: దేయం,తద్దర్థం విబుధస్యచ
దేయం గ్రామైక మర్థస్య, తస్యాప్యర్థం తదర్థిన:
మహా కవికి లక్ష యివ్వాలి , పండితుడికి అందులో సగం,సగం పాండిత్యం వున్న వాడికి మాత్రం అందులో సగం,అందులో సగం పాండిత్యం ఉన్నవాడికి దానిలో సగం యివ్వాలి అని నిర్ణయించుకున్నాడు.
దానితో ఆయన కీర్తి దేశ దేశాలకూ పాకి పోయింది.ఎక్కడెక్కడి నుంచో కవి పండితులు రాసాగారు.
దీనితో ఖర్చులు పెరిగి పోయాయి.యిలా చేస్తే బొక్కసం ఖాళీ అవుతుందని మంత్రికి భయం వేసింది.ఆయన
ఒక రోజు రాజు దగ్గరకు వచ్చి రాజా మన ఖజానాలో సొమ్ము ఈ దాన ధర్మాల వల్ల తరిగి పోతున్నది.
నిన్దయినా ఖజానాయే రాజుకు బలం. ఆ బలం క్షీణిస్తే మనం శత్రువులను ఎదుర్కోలేము.అందుకని దాన ధర్మాలు తగ్గించుకోవడం మంచిది అని సలహా యిచ్చాడు.
రాజు ఆ మంత్రిని పదవి లోనుంచి తొలగిస్తూ యిలా చెప్పాడు.
యత్ దదాతి,యత్ అశ్నాతి,తదేవ ధనినాం ధనం
అన్యే మృతస్య క్రీడంతి, దారైరపి ధనైరపి
ఏది దానం చేస్తామో ఏది అనుభవిస్తామో,ధనవంతుడికి అదే ధనం. చచ్చిన తర్వాత నీ సొమ్ము నీవాళ్ళు అనుభవించేందుకు తప్ప దేనికీ పనికి రాదు.ధనవంతుడు దానాలు చేస్తూ తానూ అనుభవిస్తూ ఉంటేనే
ధనమునకు రాణింపు.
ప్రియః ప్రజానాం దాతైవ,న పునః ద్రవిణే శ్వర:
ఆగచ్ఛన్ కాంక్షతే లోకై: వారిదః నతు వారిధి:
ప్రజలకు దాత యైన రాజే యిష్టుడు, అంతే గానీ ధనశాలి యైన రాజు కాదు.వర్షం యిచ్చే మేఘం (వారిదః)
రావాలని అందరూ కోరుకుంటారు, ఎంత నీరుంటే మాత్రం సముద్రం (వారిధి:) ఎవరికి కావాలి?
యింకొక చిత్రం తెలుసా?
సంగ్రహైక పరః ప్రాయః సముద్రోపి రసాతలే
దాతారం జలదం పశ్య గర్జంతం భువనోపరి
అర్థము:-- కేవలం కూడబెట్టడం లో నిమగ్ను డైన (నదుల నీళ్లన్నీ తీసుకుంటాడు కదా)సముద్రుడు పాతాళం వైపు కుంగుతుంటాడు, జలదాత యైన మేఘుడు చూడు దర్జాగా గర్జిస్తూ(భువనోపరి తలం ) ఆకాశం లో
షికార్లు చేస్తుంటాడు.
దాతయే గొప్పవాడు కూడబెట్టేవాడు ఏమి గొప్పవాడు?అనేది భోజుడి సిద్ధాంతం ఈ ఔదార్యం వల్ల ధారానగరం లో అందరూ విద్వాంసు లే అయ్యారు.ఆయన ఆస్థానం లో వరరుచి,బాణ,మయూర,రేఫన,హరి
శంకర,కళింగ, పూర,వినాయక,మదన,విద్యావినోద,కోకిల,తారేంద్ర యిత్యాది ప్రముఖులు యాభై మంది మహా కవులు చేరారు.

ఒకసారి అవధానం లో 'పద్యసేవనం' మద్యసేవనం' ఈ రెండింటి కీ పోలిక చెప్తూ శ్లోకం చెప్పమన్నారు. నాగఫణి శర్మగారి శ్లోకం
శ్లోకం:- శిరః కంపో విభాత్యత్ర చైవ చర్విత చర్వణం
పద్యం మాద్యంకరం దివ్యం వర్ధతాం అభివర్ధతాం
తా:--తలవూచుట రెండింటికీ ఒకటేనట.(సంచాలకులు బేతవోలు రామబ్రహ్మం గారు ఒక్కటే మనకు తెలుసు రెండవది ఊహించి చెప్తున్నారు అవధాని గారు అని సమర్థించారు )చెప్పిందే చెప్పటం పాడిందే పాడటం అదొకటి వుంటుందట.పద్యం కూడా మద్యం లాగ ఒకవిధంగా మత్తును కలిగించేదే.గట్టిగా అంటే నిషేధించే ప్రమాదముంది. కానీ దివ్యం అన్నాము కాబట్టి ఆ ప్రమాదం లేదు.మన పద్య కవిత దినాభి వృద్ధి చెందు గాక!
తధాస్తు! తధాస్తు!.
    

పూర్వము పెద్దిభొట్టు అనే సంస్కృత కవి ఉండేవాడు. అతడు తన గ్రంథాల్లో స్త్రీలను చాలా బాగా వర్ణించే వాడు. ఆ శ్లోకాలను రోజూ వింటున్న ఆయన భార్యకు తన భర్త తనను వర్ణిస్తూ శ్లోకం చెప్తే బాగుంటుంది కదా!అనిపించింది. ఏమండీ మీరు స్త్రీలను వర్ణిస్తూ శ్లోకాలు రమ్యంగా చెప్ప్తూంటారు కదా నన్ను వర్ణిస్తూ ఒక శ్లోకం చెప్పకూడదా. అని అడిగిందట. అందుకు ఆయన చెప్పిన శ్లోకం.
'మేరు మంధర సమాన మధ్యమా తింత్రిణీ దళ విశాల లోచనా
అర్క శుష్క ఫల కోమల స్తనీ పెద్దిభొట్టు గృహిణీ విరాజతే'
అర్థము:--మేరు, మంధర పర్వత మంత నడుము తోనూ, చింతాకు లంతటి విశాల మైన కళ్ళ తోనూ, ఎండిపోయిన జిల్లేడు కాయలంతటి స్తనముల తోనూ పెద్దిభొట్టు యొక్క భార్య విరాజిల్లు తున్నది.
ఆవిడకు ఆ వర్ణన విని వొళ్ళు మండి పోయింది.సమయము కోసం కాచుకొని వుంది.
పెద్దిభొట్టు ఎల్లప్పుడూ గ్రంథాలు చదువుతూ శిష్యులకు ఇత్యర్థ: ఇతి భావః(యిది అర్థం,యిది భావం) అని వారికి విద్య నేర్పిస్తూ చెప్తూ ఇంటిలోకి ఏమేమి పదార్థాలు కావాలో తేకపోగా వున్నట్టుండి ఎవరినో ఒకరిని భోజనానికి తీసుకొని వచ్చే వాడట . దానితో ఆవిడ తరుచూ ఏమి వండాలో తెలియక సతమత మయ్యేదిట. ఒకనాడు ఒక విద్వాంసుడు, దగ్గర బంధువు అయిన ఒకతను భోజనానికి వచ్చాడట. పెద్దిభొట్టు భార్యను పిలిచి అతిథి వచ్చాడు ఏమేమి కూరలు వండెదవు?అని అడిగాడట
ఇంట్లో పదార్థ ములేవీ లేవట. ఆవిడకు ఒళ్ళు మండి 'ఇత్యర్థము ల కూర, ఇతి భావముల' పులుసు వండె దను . మీరు ఇంటినిండా నింపు చున్న పదార్థము లివియే కదా!అని చెప్పి ఆ బంధువు తో తన అవస్థ చెప్పుకొని బాధ పడిందట. ఆయన పెద్ది భొట్టును బాగా మందలించి యిలా ఆడవాళ్ళను బాధ పెట్టకూడదు,
వాళ్ళు మన యింటికి తమ తల్లిదండ్రులను,అక్క,చెల్లెళ్ళ నూ,అన్నదమ్ములనూ వదిలి మన యింటికి వచ్చి
మన వంశాన్నినిస్వార్థం తో వృద్ధి చేస్తారు.వారిని ఈ విధంగా బాధిస్తే నరకానికి పోతావు అని మందలించి వెళ్ళిపోయాడట. .



భోజరాజు బాల్యం
పూర్వం సింధులుడు అనే రాజు ధారా నగరం రాజధానిగా మాళవ దేశాన్ని పాలించే వాడు. ఆయన రాజరాజ నరేంద్రుడికీ,నన్నయ భట్టుకీ సమకాలీనుడు. ఈ సింధులుడు మాళవ దేశాన్ని చాలా కాలం జనరంజకంగా పాలించాడు. బాగా వయసు మళ్ళిన తర్వాతనే అతనికి సంతానం కలిగింది. ఆయన ఏకైక కుమారుడే భోజుడు. భోజుడికి 5 సంవత్సరాల వయస్సున్నప్పుడు సింధులుడికి తీవ్రమైన అనారోగ్యం కలిగి మంచం పట్టాడు. ఆయన తరుఫున ఆయన తమ్ముడు ముంజుడు,మంత్రి బుద్ధిసాగరుడు రాజ్య వ్యవహారాలు చూస్తూండే వారు. సింధులుడు, ముంజుడు ఇద్దరూ సాహిత్య ప్రియులూ, కవి పోషకులూ. ముంజుడు స్వయంగా కవే కాక మహా బలుడూ, పరాక్రమ వంతుడు. చివరి రోజుల లో సింధులుడికి ఒకటే చింత తన తర్వాత భోజుడికే రాజ్యాదికారం వుండేలా చూడటం ఎలా?అని తాను చనిపోయిన తర్వాత ముంజుడు భోజుడుడిని హత్య చేసేస్తా డేమో అని అనుమానం.
"లోభః ప్రతిష్టా పాపస్య ప్రసూతి: లోభ యేవచ
ద్వేష క్రోధాది జనకః లోభః పాపస్య కారణం "
పాపానికి నెలవు దురాశ పుట్టుక స్థానం అది ద్వేషానికీ క్రోధానికీ తండ్రి దురాశే పాపానికి మూల కారణం. దురాశ వల్లనే కోపం కలుగుతుంది,కోపం నుంచి ద్రోహ బుద్ధి పుడుతుంది. ఆ ద్రోహ బుద్ధి వల్ల ఎంతటి వివేక వంతుడైనా, పండితుడైనా నరకానికి పోక తప్పదు. దురాశా గ్రస్తుడైన మానవుడు తల్లినీ,తండ్రినీ,కొడుకునీ,అన్ననీ,సన్నిహిత మిత్రుడినీ,ప్రభువునీ ఎవరినైనా చంపుతాడు . యిది సహజం. అను కొని రాజ్యాన్ని తమ్ముడి చేతిలో పెట్టి భోజుడి సంరక్షణా భారం కూడా అప్పగించి కన్నుమూశాడు.
.సింధులిడి మరణాంతరం ముంజుడు సింహాసనం ఎక్కాడు. ఎందుకైనా మంచిదని మంత్రి బుద్ధిసాగరుడిని తీసివేసి తనకు అనుకూలుడైన వాడిని మంత్రిగా పెట్టుకున్నాడు. ఒకనాడు ఒక గొప్ప జ్యోతిష్కుడు సభకు వచ్చాడు. అతడి ప్రతిభను పరీక్షించడానికని ముంజుడు నా జీవితమూ లో జరిగిన ముఖ్య ఘట్టాలను చెప్పు అన్నాడు. ఆ జ్యోతిష్కుడు ముంజుడి పూర్వ చరిత్ర అంతా సరిగ్గా చెప్పు కొచ్చాడు. ఎవ్వరూ ఎరుగని రహస్యాలను కూడా ఎన్నో చెప్పాడు. ఆయన విద్యనూ ప్రశంసిస్తూ ఈ శ్లోకం చెప్పాడు.
"మాతేవ రక్షతి, పితేవ హితే నియుంక్తే
కాంతేవ చాభిరమయత్యపనీయ ఖేదం
కీర్తించ దిక్షు వితనోతి తనోతి లక్ష్మీం
కిం కిం న సాధయతి కల్పలతేన విద్యా
అర్థము:-- చేతిలో వున్న విద్య కల్ప వృక్షం లాగా దేనినైనా సాధించి పెట్టగలదు. తల్లి రక్షించి నట్టు రక్షిస్తుంది, తండ్రి లాగా ధర్మ మైన కార్యాలకు ప్రోత్సాహం నిస్తుంది,భార్యలా దుఖం పోగొట్టి సంతోష పరుస్తుంది. కీర్తిని అన్ని దిక్కులకూ వ్యాపింప జేస్తుంది సంపదను కలిగిస్తుంది విద్య సాధించా లేనిది ఏమి వుంది?అని పొగిడి మా భోజుది జాతకం ఎలా వుందో చెప్పండి అని అడిగాడు. యువరాజును నేను స్వయంగా చూస్తె గానీ చెప్పలేను అన్నాడు. భోజుడిని గురుకులం నుండి పిలిపించారు. భోజుడిని తిరిగి గురుకులానికి పంపేయండి అని భోజుడు వెళ్లి పోయిన తర్వాత యిలా చెప్పాడు.
"పంచాశత్ పంచ వర్షాణి సప్త మాసాః దినత్రయం
భోజ రాజేన భోక్తవ్య: స గౌడో దక్షిణ పథః " అర్థము:-- యాభై ఐదు సంవత్సరాల,ఏడు నెలల మూడు రోజుల కాలం గౌడ దేశం తో సహా దక్షిణాపథం అంతా భోజరాజు చేత పాలింపబడుతుంది అని చెప్పాడు.
తర్వాత అతన్ని పంపేసి ఏకాంతం లో దీర్ఘంగా ఆలోచించాడు. ఈ తాజ్యం భోజుది చేతిలోకి వెళ్లి పొతే నేను జీవచ్చవం లాగా బతక వలిసిందే. అధికారం,సంపదా లేకపోతె మనిషికి విలువ వుండదు.
తానీంద్రియాణి, అవికలాని,తదేవ నామ
సా బుద్ధి: అప్రతిహతా వచనం తదేవ
అర్థోష్మణా విరహితః పురుషః క్షణేన
సోప్యస్య ఏవ భవతీతి విచిత్ర మేతత్
తా:ఇంద్రియాలు ఏ వైకల్యామూ లేనివి,బుద్ధి కుశలత ఏ ఆటంకమూ లేనిది.ధనమనే వెచ్చదనం కోల్పోయిన మనుష్యుడు లోకము లో పనికి రానివాడుగా చూడబడుతాడు.యిది విచిత్రమే
పాపభీతి,నలుగురూ ఏమనుకుంటారో అనే సంకోచం వుంటే సంపద మనల్ని వదిలి దూరంగా వెళ్ళిపోతుంది
అతి దాక్షిణ్య యుక్తానాం,శంకితానం పదే పదే
పరాపవాద భీరూణాం,దూరతః యాన్తి సంపదః
తా:-ఎక్కువ దయ గలిగి ప్రతిదానికీ సంకోచిస్తూ,లోక నిందకు భయపడే పిరికి వాళ్ళ నుంచి సంపదలు
దూరంగా వెళ్లి పోతాయి.అందుకే ఆలాస్యం చేయకుండా మనావమానాలను గురించి ఆలోచించకుండా
మన స్వార్థం మేదో మనం చూసుకోవడమే కర్తవ్యం.శత్రు శేషం,ఋణ శేషం వుండకూడదు అని ఆలోచించి
భోజుడిని చంపించాలని నిర్ణయించు కొని తన మిత్రుడైన వంగారాజు వత్సుడిని పిలిపించాడు. భోజుడిని వూరి బయట వున్న భువనేశ్వరీ ఆలయానికి తీసుకెళ్ళి చంపేయాలి అని చెప్పాడు. వత్సరాజు అలా చేయవద్దని ఎవరో పొట్ట కూటి కోసం చెప్పిన జ్యోతిష్యం నమ్మి పిల్లవాడిని చంపించ వద్దని యెంతో చెప్పి చూశాడు. ముంజుడు విన కుండా రాజాజ్ఞ ధిక్కరించితే ఫలిత మేమితో తెలుసుగా అని బెదిరించే సరికి వత్స రాజు ఒప్పుకున్నాడు. భోజుడిని
భువనేశ్వరీ ఆలయానికి తీసుకొని పోయి, నిన్ను మీ చిన్నాన్న చంపమని ఆదేశించాడు నేను నిన్ను చంపక తప్పదు. అని చెప్పాడు. గుండె ధైర్యం ,నిబ్బరం సహజ లక్షణాలైన భోజ రాజు ఓ!వత్స రాజా!చావు బతుకులు కాలవశాన జరిగేవి.
"రామే ప్రవ్రజనం,బలే నియమనం, పాండో సుతానాం వనం
వృష్ణీ నం నిధనం, నలస్య నృపతే రాజ్యాత్ పరి భ్రంశనమ్
కారాగార నిషేవణం చ మరణం సం చింత్య లంకేశ్వరే
సర్వ కాల వశేన నశ్యతి నరః కో వా పరిత్రాయతే?
అర్థము:--రాముడి అరణ్య వాసం,బలి చక్రవర్తి గర్వభంగం,పాండు సుతుల వనవాసం, యాదవుల నాశనం,నలమహారాజుకు రాజ్య నష్టం, లంకేశ్వరు డైన రావణుడికి కార్తవీర్యార్జునుడి చెరలో నివాసం రాముడి చేతిలో మరణం యివన్నీ ఆలోచించి చూస్తే మనిషికి నాశనం కాలవశం వల్లనే జరుగు తుంది.ఈశ్వరూడి సంకల్పము లేనిదే ఏదీ జరగదు.
అంభోధి: స్థలతాం,స్థలం జలధితాం,ధూళీ లవః శైలతాం
మేరు: మృత్కణ తాం, తృణం కులిశ తాం వజ్రం తృణ ప్రాయతాం
వహ్ని: శీతలతాం, హిమం దహనతాం ఆయాతి య స్యేచ్చయా
లీలా దుర్లలితా ద్భుత వ్యసనే దేవాయ తస్మై నమః
తా:-ఈశ్వ రేచ్చననుసరించి సముద్రము యింకిపోపోయి స్తలం గా మారుతుంది.స్థలం గా వున్నది సముద్రం గా మారుతుంది,చిన్న దుమ్ముకణం కొండంత అవుతుంది,మేరు పర్వతం యిసుక రేణువు అయిపోతుంది,గడ్డిపోచ వజ్రాయుధ మవుతుంది,వజ్రాయుధం గడ్డిపోచగా మారుతుంది.అగ్ని చల్లబడుతుంది,మంచు దహించి వస్తుంది,ఈ లీలలన్నీ చూపగల ఆ ఈశ్వరుడికి నమస్కారం.
శ్రీ మహాలక్ష్మికి తమ్ముడు, పాలసాముద్రుడి ముద్దుల పట్టి,మహాదేవుడి శిరస్సును అలంకరించిన భాగ్యశాలి
చంద్రుడికే వృద్ధి క్షయాలు తప్పలేదు.'విధి లిఖితం శిలా శాసనం' అన్నాడు
అని దగ్గరలోని మఱ్ఱి చెట్టు ఆకులు రెండు తెచ్చి ఒకదాన్ని దొన్నె లాగ చేసి చేతి కత్తితో తన పిక్క దగ్గర కోసి ఆ రక్తాన్ని ఆ దొన్నె లోకి పట్టి ఒక గడ్డి పోచ ఆ రక్తం లో ముంచి రెండో ఆకు మీద యిలా వ్రాశాడు.
మాంధాతా చ మహీపతి:కృత యుగాలంకార భూతః గతః
సేతు: యేన మహా దధౌ విరచిత: క్వా సౌ దశాస్యాంతకః?
అన్యే చాపి యుధిష్టిర ప్రభుతయ: యాతా: దివం భూపతే
నైక నాపి సమం గతా వసుమతీ నూనం త్వయా యాస్యతి!
అర్థము:--కృత యుగానికి అలంకార భూతుడైన మాంధాత,త్రేతా యుగం లో సేతువు కట్టి రావణ సంహారి అయిన శ్రీరాముడు,ద్వాపరయుగం లోని ధర్మరాజు అందరూ దివంగతు లయ్యారు. కానీ ఎవ్వరి తోనూ ఈ భూమి వెంట వెళ్ళ లేదు. నీ దురాశా,దుర్బుద్దీ చూస్తూ వుంటే ఈ భూమిని శాశ్వతంగా నీ నెత్తిన పెట్టుకొని తీసుకొని వెళ్ళగలనని అనుకుంటూ వున్నావు. అందుకే యిలాంటి పాప కార్యాలు
చేస్తున్నావు. అని వ్రాసి ఈ శ్లోకం మా చిన్నాన్న కు ఇవ్వండి అని చెప్పాడు. భోజుడి నిబ్బరం చూశాక అతన్ని చంపాలని పించలేదు వత్స రాజుకు.మరణా నంతరం ధర్మమూ తప్ప మనకు తోడుగా ఎవ్వరూ రారు సత్కర్మలు చేయగల వయసులోనే చేసుకోవాలి అధర్మ కార్యాలు చేసి పాపం మూట గట్టుకుంటే తర్వాత చింతించ వలిసి వస్తుంది.అనే వరాగ్య భావం కలిగి యువరాజును తన యింటికి తీసుకెళ్ళి నేల మాళిగ లో సురక్షితంగా దాచి
భోజుడిని చంపేశా నని అపద్ధం చెప్పిముంజుడిని నమ్మించాడు. భోజుడు చనిపోయే టప్పుడు ఏమీ అనలేదా?అని అడిగాడు. భోజుడి సందేశ శ్లోకం చదవిన ముంజుడికి జ్ఞానోదయ మైంది తను చేసిన దానికి పశ్చాత్తాప పడ్డాడు.మంత్రి బుద్ధిసాగరుడు వచ్చి తీవ్రంగా దూషించాడు.
రాజ్ఞి ధర్మిణి ధర్మిష్టా: పాపే పాప పరాః సదా
రాజానువర్తంతే యథా రాజా తథా ప్రజాః
తా:-రాజు ధర్మ మార్గం లో వుంటే ప్రజలు కూడా ధర్మిష్టులుగా నే వుంటారు.రాజు పాపి అయితే ప్రజలూ పాప పరులే అవుతారు.ఎందుకంటె ప్రజలు రాజును అనుసరిస్తారు.అన్నాడు.
.మున్జుడు పశ్చాత్తాపం తో రగిలి పోయాడు,అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకో బోయాడు రాజు కళ్ళు తెరిపించేందుకు వత్సరాజూ,మంత్రి బుద్ధిసాగారుడూ కలిసి చిన్న నాటకం ఆడారు. ఒక కాపాలిక మాంత్రికుడిని పిలిపించి ఏదో హోమం చేయించి దానితో భోజుడు బతికాడని తెసుకొని వచ్చి ముంజ రాజుకు అప్ప గించారు. ముంజుడు సంతోషంగా భోజుడికి పట్టం గట్టి తాను భార్యల తో వాన ప్రస్థానికి వెళ్లి పోయాడు.. అలాగ జ్యోతిష్కుడి జోస్యం నిజమైంది.భోజుడు నిరాటంకముగా,ప్రజానురంజకముగా పాలించాడు.


శర్వరీ దీపక శ్చంద్రః ప్రభాతో ద్దీపకో రవి:
త్రైలోక్య దీపకో ధర్మ: సుపుత్రః కుల దీపకః
అర్థము: చంద్రుడు రాత్రిని ప్రకాశింప చేయును సూర్యుడు పగటిని ప్రకాశింప జేయును,
ధర్మము మూడులోకములను ప్రకాశింప జేయును, సుపుత్రుడు కులమును
(వంశమును) ప్రకాశింప జేయును.

భోజరాజు మాళవ రాజ్యాన్ని పాలించే కాలం లో భుక్కుండుడు అనే గజదొంగ వుండేవాడు.వాడు నగరం లో చాలా సార్లు దొంగతనాలు చేశాడు.కానీ ఎప్పటికప్పుడు దొంగిలించిన సొమ్ము తో దేశం విడిచి పారిపోయే వాడు.
ఒక సంవత్సరం పాటు పరాయి దేశాల్లో గడిపి తన దొంగతనం సంగతి అందరూ మర్చి పోయాక మళ్ళీ నగరం లో ప్రవేశించి దొంగతనాలు చేసే వాడు.అయితే దొంగతనం చేసినా ధనికుల ఇళ్ళ లోనే దొంగతనం చేసేవాడు.
దొంగిలించిన సొమ్ము లో చాలా భాగం పేదలకు పంచేవాడు.ఒకసారి ఒక వేశ్య ఇంట్లో దొంగతనం చేస్తూ
రాజభటులకు దొరికి పోయాడు.భటులు భుక్కుండిడిని భోజరాజు సభలో ప్రవేశ పెట్టారు.యిన్ని సంవత్సరాలుగా
దొంగతనాలు చేసిన భుక్కుండిడికి కఠీనముగా శిక్షించాలని రాజుకు సలహా యిచ్చాడు మంత్రి
తనకు మరణ శిక్ష వేస్తారేమో నని భుక్కుండిడికి భయం వేసింది.అందుకని యుక్తిగా ఈ క్రింది శ్లోకం చెప్పాడు.


భట్టి: నష్టః,భారవి శ్చాపి నష్టః
భిక్షు ర్నష్ట:,భీమ సేనోపి నష్టః
భుక్కుండోహం, భూపతి: త్వాం హి రాజన్
భభావళ్యామ్ అంతకః సంనివిష్ట:
రాజా!తమరు నన్ను శిక్షించండి.కానీ నాకు ఒక్కటే భయం మీరు గమనించారో లేదో,భట్టి చనిపోయాడు,
భారవి కూడా కీర్తిశేషు డయ్యాడు.ఆ వెనకే భిక్షు కవి మరణించాడు. ఇటీవలే భీమ కవి కూడా కాలధర్మం
చెందాడు.మరి నేను భుక్కుండుడి ని,తమరేమో భూపతి. యమధర్మ రాజు 'భ' గుణింతం పట్టుకొని
భట్టినీ, భారవినీ, భిక్షుకవి నీ, భీమ కవినీ తీసుకెళ్ళాడు.మరి 'భ, భా, బి, భీ తర్వాత భుక్కుండు డిని నేను
భూపతి మీరు మరి యిప్పుడేం చేస్తాడో యముడు.మీ గురించే నా భయమంతా(.అంటే 'భు'తర్వాత 'భూ' నే
కదా వచ్చేది.భూపతి మీరు తర్వాత మీ వంతేమో నని)
రాజదండన పొందుతూ కూడా యిలా చమత్కారం గా శ్లోకం చెప్పడం రాజుకు నచ్చింది,నవ్వు వచ్చింది.
నవ్వు ఆపుకుంటూ సరే!భుక్కుండా,ఈ సారికి నిన్ను క్షమించి వదిలేస్తున్నాను.యికనుంచీ దొంగ తనాలు మానేసి యేదయినా వ్యాపారం చేసుకొని జీవించు.మరీ ఈ సారి దొంగతనం చేసావంటే శిక్ష తప్పదు. అని
హెచ్చరించి పంపేశాడు భోజరాజు
(భ బ్భా వళి అంటే 'భ' గుణింతం అంతకః =యమధర్మరాజు, సంనివిష్ట:=దృష్టి పెట్టిన వాడు).(పైని పేర్లన్నీ కవులవి). 


ఒకసారి భోజరాజుకీ కాళిదాసుకీ మాట పట్టింపు వచ్చింది.'విద్వాన్ సర్వత్ర పూజ్యతే'అంటూ ఆస్థానం వదిలి
వెళ్ళిపోయాడు.కాళిదాసు వెళ్ళిపోయాక గానే భోజరాలు కు ఆయన విలువ తెలిసి రాలేదు.ఏమీ తోచడం లేదు
మంచి కవిత్వం వినిపించే వాళ్ళు లేరు.ఆయన కాళిదాసు జాడ కనుక్కున్న వాళ్లకు లక్ష దీనారాలు బహుమతి ప్రకటించాడు.
ఇదిలా వుండగా పోరుగూరినుంది యిద్దరు పేద బ్రాహ్మణులు భోజరాజు దగ్గర ఏదైనా బహుమతి దొరుకు తుందనే ఆశతో ధారానగరానికి వచ్చి ఊరిబయట వున్న దేవాలయం లో కూర్చున్నారు.ఏదయినా శ్లోకం వ్రాసుకొని పోదామని ప్రయత్నిస్తున్నారు.ఎంత సేపు ఆలోచించినా వాళ్లకు తోచడం
లేదు.వాళ్లకు ఆకలి వేసింది.అప్పుడు ఒక పాదం స్ఫురించింది
'భోజనం దేహి రాజేంద్రా ఘ్రుత సూప సమన్వితం' రాజా!మాకు మంచి నెయ్యి వేసిన పప్పు తో కూడిన భోజనం కావాలి.ఆ మంటపం లో ఒక మూల కాళిదాసు మారువేషం లో కూర్చుని వున్నాడు..అయన దగ్గరికి వెళ్లి స్వామీ మీరు చూడబోతే పండితుల్లా కనిపిస్తున్నారు.మేము పేద వాళ్లము.భోజరాజు గారి దగ్గర ఏదైనా బహుమానం దొరుకుతుందేమో నని ఆశ
.తో వచ్చాము.మాకు శ్లోకం లో ఒక్క పాదమే వచ్చింది.రెండో పాదం చెప్పి పుణ్యం కట్టుకోండి అని బ్రతిమలాడారు. కాళిదాసు రెండో పాదం యిలా వ్రాశాడు. 'మాహిషం చ శర శ్చంద్ర చంద్రికా ధవళం దధి'
మంచి బర్రె పాలను తోడు పెట్టి తయారు చేసిన శరత్కాలపు వెన్నెల వలె తెల్లగా వుండే గడ్డ పెరుగుకూడా కావాలి.
వాళ్ళిద్దరూ కాళిదాసు కు కృతజ్ఞతలు చెప్పి రాజాస్థానానికి వెళ్ళారు.అక్కడ తమ శ్లోకం విని పించారు.
భోజనం దేహి రాజేంద్రా ఘ్రుత సూప సమన్వితం
.. మాహిషం చ శరశ్చంద్ర చంద్రికా ధవళం దధి
రాజు అదివిని మొదటి పాదం లో ఏమీ విశేషం లేదు.రెండో పాదానికి అక్షర లక్షలు యిస్తాను.కానీ అది మీరు వ్రాసిన దిగా అని పించడం లేదు.అది ఎవరు వ్రాశారో నిజం చెప్పండి.అని గద్దించి అడిగారు.వాళ్ళు భయపడి పోయి అసలు సంగతి చెప్పి వేశారు.రాజుగారిని క్షమాపణ అడిగారు.అప్పుడు భోజుడు అది వ్రాసినది కాళిదాసే నని గ్రహించాడు.అంత మంచి ఉపమానం కాళిదాసు తప్ప వేరెవరూ రాయలేరు అని ఆయన విశ్వాసం.ఆ వ్రాసిన వారిని మీరు చూపించండి ఆయన ఎక్కడ వున్నారు?అని అడిగారు రాజు గారు.అప్పుడు వాళ్ళు ఊరిబయట దేవాలయం లోని మండపం లో కూర్చుని వున్నారని చెప్పారు.అప్పుడు భోజ రాజు స్వయంగా వెళ్లి కాళిదాసుకు క్షమాపణ చెప్పి పిలుచుకొని వచ్చి.తాను అన్న మాట ప్రకారం కాళిదాసు జాడ తెలిపిన వారిద్దరికీ లక్ష దీనారాలు బహుమతి గా యిచ్చి పంపించి వేశారు.
ఆ బ్రాహ్మణు లిద్దరూ సంతోషంగా వెళ్ళిపోయారు.



ఒకసారి అవధానం లో ఈ దత్తపది యిచ్చారు.కొతిమీర, కర్రివేపాకు,అల్లము, చింతపండు నాగఫణి శర్మ గారి
పూరణ
కోతి మీరెను యుద్దాన క్రొత్త ఫణితి
కర్రివేపాకు రాముడా కాదు బలియె
అల్ల మునిజన సత్తపో యశము చేత
చింత పండిన నిపుడేమి చేయగలను?
తా:--ఈ మాటలు రావణాసురుడు అనుకుంటున్నాడు.యుద్ధం చివరి దశకు వచ్చింది,క్రొత్త విధంగా ఈ కోతులు యుద్ధం లోచెలరేగి పోతున్నాయి.
.(విజ్రుం భించి పోతున్నాయి )ఈ రాముడిని కూరలో కర్రివేపాకు లా తీసి పారవేయ వచ్చని అనుకున్నాను
కానీచాలా బలవంతుడే ఆ బలం ఎలా వచ్చి వుంటుంది?యిన్నాళ్ళూ మునులతో కలిసి గొప్ప తపస్సుచేయడం వల్ల
వచ్చివుంటుంది.ఇంక చింత పడి నేనేమీ చేయలేను కదా!
 

ఇది ఒక పొడుపు కథ లాంటిది.
రమ్యే విరాట నగరే కీచకా దుపకీచకం
అత్ర క్రియా పద వక్తుం దత్త షాన్మాసికో వ్యవధి:
అర్థము:--రమ్యమైన విరాట నగరము నందు కీచకులు,వుపకీచకులు అని మాత్రమే అర్థం వస్తుంది.యిక్కడ క్రియా పదం కనపడదు.యిందులో క్రియా పదము యేదో .. కనుక్కునేందుకు ఆరు మాసముల గడువు యిస్తాను.అని సవాలు చేస్తున్నాడు..
సూక్ష్మముగా దీని ఆర్థము రమ్యమైన నగరమునందు కీచాకాత్ =ఒక వెదురుపొద నుండి వుపకీచకం=వేరొక వెదురు పొదకు, వి:=పక్షి అట =తిరిగెను విహి+అట=విరాట, రమ్యమైన నగరమందు ఒక వెదురు పొద నుండి
యింకొక వెదురు పొదకు ఒక పక్షి తిరిగెను.యిప్పుడు క్రియా పదము కన్పించినది కదా!తిరిగెను క్రియా పదం 


శుక్రాచార్యుడి తండ్రి .భ్రుగువు.తల్లి ఉశ్యీ.ఊర్జస్వతి శుక్రుడి భార్య. శండుడు,అమర్కుడు,త్వాష్టుడు,ధరాత్రుడు
అతని కొడుకులు.శుక్రుడి కూతురు దేవయాని.శుక్రుడు గౌతముని ఆదేశం మేరకు శివుని గూర్చి తపస్సు
చేసి మృతసంజీవనీ విద్యను వరంగా పొందుతాడు.ఆ విద్యతో చనిపోయిన రాక్షసులని బ్రతికిస్తూ వుంటాడు.
దానితో దేవతలు తగ్గిపోతూ వుంటారు రాక్షస బలం ఎక్కువై పోతూ వుంటుంది.అందుకని శుక్రుడి దగ్గర
మృత సంజీవనీ విద్యను నేర్చుకొని రమ్మని దేవతలు బృహస్పతి కొడుకైన కచుడనే వాడిని పంపిస్తారు.
శుక్రుడి దగ్గర శిష్యుడిగా చేరుతాడు కచుడు.చాలా శ్రద్ధగా గురుసేవ చేస్తుంటాడు.గురువు కు కచుడంటే యిష్టం ఏర్పడుతుంది.శుక్రాచార్యుడి కూతురు దేవయాని కచుడి ని ప్రేమిస్తుంది.
కచుడిని శుక్రాచార్యుడు అభిమానిం చడం చూసిఅసూయ చెందిన రాక్షసులు చాలాసార్లు అతనిని చంపడానికి ప్రయత్నిస్తారు.
ప్రతి సారీ దేవయాని అతన్ని కాపాడుతుంది.యిలా కాదని రాక్షసులు కచుడిని దగ్ధం చేసి ఆ బూడిదను సుర లో కలిపి శుక్రాచార్యుడి చేత త్రాగిస్తారు.దేవయాని కచుడిని కానక తండ్రిని బ్రతిమాలుతుంది అతఃని జాడ చెప్పమని.శుక్రాచార్యుడు యోగ దృష్టి తో అంతా గ్రహించి అతన్ని మృతసంజీవనీ విద్యతో బ్రతికించాడు..కానీ కచుడు శుక్రాచార్యుడి కడుపులోనే వుండిపోయాడు.అప్పుడు శుక్రాచార్యుడు దేవయాని
చెప్పిన మేరకు కచుడికి మృతసంజీవనీ విద్య భోదిస్తాడు.తన కడుపు చీల్చుకొని బయటికి వచ్చి తరువాత
మృతసంజీవనీ విద్య ప్రభావం తో తనను బ్రతికించమని శుక్రాచార్యుడు కచుడితో చెప్తాడు. కచుడు అలాగే బయటికి వచ్చి శుక్రాచార్యు డిని బ్రతికిస్తాడు.సురవల్ల ఈ అనర్థం జరిగింది కచుడు మృతసంజీవనీ విద్య నేర్చుకున్నాడు.కనుక రాక్షసులకు సురా పానాన్ని నిషేధిస్తాడు శుక్రాచార్యుడు.తను వచ్చిన పని అయిపొయింది కనుక యింక వెళ్ళిపోవడానికి గురువును అనుమతి అడుగుతాడు.కచుడు.
కచుడు వెళ్లి పోతున్నాడని తెలిసి దేవయాని తను అతన్ని ప్రేమిస్తున్నాననీ అందుకనే యిన్ని మార్లు అతన్ని కాపాడా ననీ చెప్పి తనను పెండ్లి చేసుకోమంటుంది కచుడిని.కచుడు గురువు కూతురు సోదరితో సమానమని నేను చేసుకోనని అంటాడు కచుడు.దానితో ఆగ్రహించిన దేవయాని నీకు మృతసంజీవనీ విద్య
పనికి రాకుండా పోతుందని శాప మిస్తుంది దేవయాని.వెంటనే కచుడు నాకు పనికి రాకపోయినా నేను ఉపదేశించిన వారికి పనికి వస్తుంది.అని చెప్పి అనుచితమైన కోరిక కోరినందు వల్ల ఆమెకు బ్రాహ్మణుడితో
వివాహం కాదు అని ప్రతి శాపము యిస్తాడు కచుడు. కచుడు దేవతల దగ్గరికి వెళ్లి ఆ విద్య వారికి ఉపదేశిస్తాడు.ఈ విధంగా మృతసంజీవనీ విద్య దేవతలకూ సంప్రాపిస్తుంది.
వృష పర్వుడు అనే ఒక రాక్షసరాజు కూతురు శర్మిష్ఠ.శుక్రాచార్యుడు వృషపర్వుడి గురువు.వృషపర్వుడికి
శుక్రాచార్యు డంటే విపరీతమైన భక్తీ,భయము.ఆయన తన మృత సంజీవనీ విద్య వల్ల చనిపోయిన రాక్షసులను ఆయన బ్రతికించడం ఒక కారణమైతే ఆయనకు కోపం వస్తే శాపం పెడతాడనే భయం కూడా వుండేది.
శర్మిష్ఠ,దేవయాని స్నేహంగా వుంటూ వుండే వారు.శర్మిష్ఠ కు తను రాజు కూతురుననే అహంకారం చాలానే వుండేది. ఒకసారి శర్మిష్ఠ,దేవయాని మరి కొందరు చేలికత్తెలూ కలిసి వనవిహారమునకు వెళ్ళారు.అక్కడ కొలనులో
స్నానం చేద్దామనుకొని తమ తమ దుస్తులను ఒడ్డున వుంచి నీళ్ళ లోకి దిగుతారు.కాసేపు నీళ్ళలో సరదాగా గడిపి స్నానం చేసి ఒడ్డుకు వద్దామనుకునే సమయము లో . పెద్ద గాలి మొదలవుతుంది. దానితో హడావుడిగా బయటకు వచ్చి గాలికి చెల్లాచెదురైన తమ దుస్తులను తీసుకునే హడావుడి లో దేవయాని తొందరలో పొరపాటున శర్మిష్ఠ దుస్తులను ధరిస్తుంది.శర్మిష్ఠ విధి లేక దేవయాని దుస్తులను ధరిస్తుంది.నేను రాజకుమారిని నీ తండ్రి నా తండ్రి యిచ్చే జీతం తీసుకొని బ్రతుకుతున్నాడు.నా దుస్తులు ధరించడానికి నీ కెంత ధైర్యం అని నిందిస్తుంది దేవయాని తను కావాలని ధరించలేదనీ పొరబాటున అలా జరిగిందని ఎంత చెప్తున్నా వినకుండా చాలా చులకనగా మాట్లాడుతుంది.
అప్పుడు దేవయానికీ కోపం వస్తుంది మా నాన్న లేకపోతె మీ నాన్నకు జీవితమే లేదు.ఆయనవల్లనే మీరు హాయిగా రాజ భోగాలు అనుభవిస్తున్నారు అని ఎదిరించి మాట్లాడుతుంది.అప్పుడు శర్మిష్ఠ కోపం తో
దేవయానిని తన చెలికత్తెల సహాయం తో ఒక పాడుబడ్డ కూపం లోకి తోసేసి వెళ్ళిపోతుంది.దేవయాని
గట్టిగా ఎవరైనా నాకు సహాయం చేయండి అని గట్టిగా కేకలు వేస్తూ పిలుస్తూ వుంటుంది.అక్కడికి యయాతి అనే రాజు వేట కై వచ్చి
దారి తప్పి పోయి ఆ బావి దగ్గరికి వస్తాడు.ఆ అరుపులు నూతి లోనుంచి వస్తున్నాయని తెలుసుకొని నూతి లోకి తొంగి చూసి అద్భుతమైన సౌందర్యవతి యైన దేవయానిని చూస్తాడు.ఆమెకు తన
కుడిచెయ్యి అందిచ్చి నూతిలోనుంచి బయటికి లాగుతాడు.నా కుడిచేతిని పట్టుకుని పాణిగ్రహణం చేసావు కనుక నాకు నీతో వివాహం అయిపోయినట్టే నన్ను యధావిధిగా పెళ్లి చేసుకోమని అడుగుతుంది.
ఆమె శుక్రాచార్యునిముద్దుల కూతురని తెలుసుకొని కాదంటే ఆయన శాపం యిస్తాడని భయపడి సరే నంటాడు యయాతి. యయాతిని .తండ్రి దగ్గరకు పిలుచుకొని వెళ్లి శర్మిష్ఠ చేసిన పనిని ,యయాతి తనను రక్షించిన విధము ఏడ్చుకుంటూ చెప్తుంది.యయాతిని పెళ్ళిచేసు కుంటానని చెప్తుంది.అక్కడే వివాహం చేసుకుంటుంది.యయాతి ఆమెను రాచ మర్యాదలతో తర్వాత పిలుచుకొని వెళ్తానని చెప్పి తన రాజ్యానికి వెళ్లి పోతాడు. తర్వాత దేవయాని శర్మిష్ఠ ను,ఆమె తండ్రి యైన వృష పర్వుడినీ శిక్షించా లని పట్టు బడుతుంది.ఆమె మీది ప్రేమతో శుక్రాచార్యుడు వృష పర్వుడిని పిలిపించిఆయన కూతురు చేసిన నిర్వాకం చెప్పి తాను యిక మీదట నీకు గురువుగా ఉండను రాజ్యం విడిచి వెళ్లి పోతాననీ బెదిరిస్తాడు.వృష పర్వుడికి దిక్కుతోచకుండా అయిపోతుంది. శుక్రాచార్యుడు లేకపోతె ఎలా అని నా కూతురికి మీరు ఏ శిక్ష వెయ్యమంటే ఆ శిక్ష వేయమనీ మీరు రాజ్యం విడిచి వెళ్ళ వద్దనీ బ్రతిమ లాడతాడు.నా కూతురు దేవయానే
శర్మిష్ఠ కు ఏమి శిక్ష వెయ్యాలో నిర్ణయిస్తుందనీ చెప్తాడు దేవయానిని పిలిచి వృష పర్వుడు నీవే ఆమెకు ఏమి శిక్ష వెయ్యాలో చెప్పమని అడుగుతాడు.అప్పుడు దేవయాని నేను యిప్పుడు యయాతి మహారాజుగారి భార్యను నేను కాపురానికి వెళ్ళేటప్పుడు తనవెంట దాసిగా శర్మిష్ఠ రావాలనీ తను పెళ్లి చేసుకోకుండా జీవితాంతమూ తనకు సేవలు చెయ్యాలనీ షరతు పెడుతుంది.విధిలేక కూతురిని ఒప్పించి ఆమె వెంట దాసీ గా పంపిస్తాడు.దేవయాని యయాతికి తనతో తప్ప వేరేవారితో అతనికి సంతానం వుండకూడ దని, నియమం పెడుతుంది.
రాణి అయ్యాక దేవయాని శర్మిష్ఠ ను దూరంగా వున్న తోటలో ఒక ఆశ్రమము తయారు చేయించి అందులో
ఉంచుతుంది.శర్మిష్ఠ అందం చూసి యయాతి ఆమె వలలో పడతాదేమోనని ఆమె భయం.ఆమెకు యయాతి వల్ల యదు,తుర్వసుడు అనే కొడుకులు పుడతారు.
ఒకసారి యయాతి శర్మిష్ఠ వుండే తోటకి వెళ్ళడం తటస్థిస్తుంది.అక్కడ శర్మిష్ఠ ను చూస్తాడు.ఆమె సౌందర్యానికి ముగ్ధు డవుతాడు.ఆమెను నీవేవరివని అడుగుతాడు.ఆమె దేవయాని చేసిన పని గురించి చెప్పి నాకు కూడా పెళ్లి.చేసుకునే హక్కు వుందనీ దాన్ని లేకుండా దేవయాని చేసిందనీ తనకూ పిల్లలు కావాలనీ చెపి ఏడుస్తుంది.యయాతి కి జాలి కలుగుతుంది.ఆమె మీద మోహము కూడా కలుగు తుంది.ఆమెతో రహస్యంగా కాపురం చేస్తాడు.శర్మిష్ఠ కు అతడి వల్ల ద్రుహ్వి,అనువు, పూరుడు అనే
కొడుకులు పుడతారు.ఈ విషయం ఎలాగో తెలుసుకున్న దేవయాని యయాతిని నిలదీస్తుంది.నియమభంగం చేశాడని తన తండ్రికి ఫిర్యాదు చేస్తుంది.శుక్రాచార్యుడు నీకు వార్ధక్యం వచ్చుగాక
అని శాపం యిస్తాడు.అప్పుడు యయాతి గురువర్యా!నన్ను క్షమించి నన్ను శాప విముక్తుడిని చేయండి
నాకింకా కామోపభోగముల మీద ఆశ తీరలేదు అని ప్రార్థిస్తాడు.శుక్రాచార్యుడు ఎవరైనా నీ వార్ధక్యం తీసుకొని తమ యవ్వనాన్నినీకు యివ్వగలిగితే నీకు యవ్వనం వస్తుంది.నీకు కాంక్షలు తీరాక మరీ అతనికి ఆ యవ్వనం తిరిగి యిచ్చి వేయవచ్చు అని చెప్తాడు.
యయాతి దేవయాని కొడుకులను పిలిచి మీలో ఎవరైనా నా వృద్ధా ప్యాన్ని తీసుకొని మీ యవ్వనాన్నినాకు ఇవ్వగలరా? అని అడుగుతాడు.అప్పుడు వాళ్ళు నిరాకరిస్తారు.శర్మిష్ఠ కొడుకులలో పురుడు ఒక్కడూ
తండ్రి కోరిక తీర్చడం తనయుని ధర్మమని ఒప్పుకుంటాడు. అప్పుడు యయాతి యవ్వనాన్ని పొందుతాడు.తనివితీరాసుఖ భోగాలు అనుభవించి యవ్వనాన్ని పూరుడికి యిచ్చి తాను వానప్రస్థానికి వెళ్ళిపోతూ .తనకు యవ్వనాన్ని యిచ్చిన పూరుడికే తన తర్వాత రాజు అయ్యే అధికారం ఉంటుందని ప్రకటించి అతనికి రాజ్యాభిషేకం చేసి వెళ్ళిపోతాడు. దేవయాని ఎంత కష్ట పడినా చివరికి శర్మిష్ఠ కొడుకే రాజవుతాడు.అలాగ పూరుడు పౌర వంశ స్థాపకుడయ్యాడు, 



తెలివి యొకింత లేనియెడ తృప్తుడనై కరి భంగి సర్వమున్
దెలిసితి నంచు గర్విత మతిన్ విహరించితి తొల్లి యిప్పుడు
జ్వల మతు లైన పండితుల సన్నిధి నించుక బోధ శాలి నై
తెలియని వాడ నై మెలిగితిన్ గత మయ్యె నితాంత గర్వమున్
తా:-- తెలివి కొంచేముకూడా లేనికాలము లో నేను అన్నీ నాకే తెలుసునని మదించిన ఏనుగు వలె సంచరించితిని. కానీ యిప్పుడు మహాత్ములైన పండితుల దగ్గర కొంత నేర్చుకొని నాకేమీ తెలియదని
తెలుసుకొని గర్వమంతయు నశించి పోయి నడుచుకుంటిని.(భర్తృహరి సుభాషితము)
ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ వున్న విస్తరాకు అణిగి మణిగి వుంటుంది అని సామెత
పండిన పొలాలు ఎప్పుడూ వంగి వుంటాయి.చదువు ఎప్పుడూ వినయాన్ని పెంచాలి అని కవి చెప్తున్నాడు.



కొన్ని భోజ కాళిదాస కథలలో మహాకవిని స్త్రీ లోలుడిగా చిత్రీకరించారు.కవిగా,లలిత శృంగార రస పోషణ లో
ఆయన అందే వేసిన చెయ్యి కావటం వల్ల ఇలాంటి అపోహ కలిగిందా?లేక కాళీ వుపాసనతో పాటు కేళీ పిపాస
కూడా ఆయన జీవితం లో భాగంగా చెప్తే ఈ కథలు మరీ ఆసక్తి కరంగా వుంటాయని యిది ఈ కథలకు జోడించ
బడిందా?లేక 'ఎంత వారలయినా కాంత దాసులే' అన్న లోకోక్తి ని కాళిదాసు కూడా పూర్తిగా అనువర్తించాడా?
చెప్పడం కష్టం.
ధారానగరం లో రమణీ మణి అనే రాజ నర్తకి వుండేది. ఆమె సౌందర్యానికి నాట్య ప్రతిభకీ దాసుడై భోజరాజు ఆమెను తన ఉంపుడుగత్తె గా వుంచుకున్నాడు.ఆమెకు కాళిదాసు కవిత్వమంటే చాలా అభిమానం.ఆయనతోనూ ఆమెకు సంబంధాలుండేవి.ఈ రహస్యం ఆమె రాజుకు తెలియకుండా జాగ్రత్త పడింది.
అయినా కొన్నాళ్ళకు రాజుకు అనుమానం వచ్చింది. ఆయన దాన్ని తెలుసుకునేందుకు ఒక ఉపాయం చేశాడు
రాజు ఆమె భవనానికి వచ్చినప్పుడు గోడ మీద శ్లోక పాదం వ్రాశాడు.
'కుసుమే కుసుమోత్పత్తి: శ్రూయతే న తు దృశ్యతే'
అర్థము:-ఒక పువ్వులో నుంచి మరో పువ్వు పుట్టటం వినటమే గానీ ఎక్కడా కనబడదు.
ఈ శ్లోకం పూర్తీ చేసిన వారికి అక్షర లక్షలు యిస్తానని భోజుడు రమణి తో చెప్పాడు.ఒక వేల కాళిదాసు ఇక్కడికి వచ్చినట్టయితే తప్పక పూర్తీ చేస్తాడు,అప్పుడు రహస్యం బట్ట బయలవుతుందని ఆయన ఉద్దేశ్యం
యింత పెద్ద బహుమతి అంటే రమణికి ఆశ పుట్టింది.
ఈసారి కాళిదాసు వచ్చినప్పుడు ఆమె గోడమీది శ్లోక పాదం చూపించి నా కోసం దీనిని పూర్తీ చేయండి అని కోరింది.ఇదేమీ తెలియని కాళిదాసు చెప్తాను రాసుకో అని
'బాలే, తవ ముఖాంభోజే దృష్టం యిందీవర ద్వయం'
అర్థము:-- కానీ ఓ ముద్దరాలా యిప్పుడు నిన్ను చూడగా,నీ ముఖ మనే తామరపువ్వులో నీ కన్నులనే నీలి కలువలు పుట్టినట్టు కనిపిస్తున్నాయి సుమా!అన్నాడు మహా కవి.
అంత చక్కని పూరణ వినగానే రమణికి మతి పోయింది.ఈ పూరణ రాజుకు చూపిస్తే తనకు అక్షర లక్షలు ఖాయం.అనుకోని దురాశ తో కాళిదాసు నిద్రిస్తుండగా ఆయన తల నరికేసి శవాన్ని దాచేసింది.
రాజుగారు వ్రాసిన దానికిందే తన చేత్తో కాళిదాసు పూరణను కొంచెం మార్చి 'బాలే' అనే పదం కాక రాజును వుబ్బేద్దామని 'రాజే!'అని వ్రాసింది
కుసుమే కుసుమోత్పత్తి: శ్రూయతే న తు దృశ్యతే
రాజే,తవ ముఖాంభోజే దృష్టం యిందీవర ద్వయం
అర్థము:-- ఒక పువ్వులోనుంచి యింకొక పువ్వు పుట్టటం వినడమే గానీ ఎక్కడా కనబడదు.కానీ యిప్పుడు నిన్ను చూస్తె రాజా!నే ముఖమనే కమలం లో కన్నులనే నల్ల కలువల జంట కనబడుతున్నది.
రాజు రానే వచ్చాడు పూరణ చూసి ఎవరు పూరించారు?అని అడిగాడు యింకెవరు నేనే అని బొంకింది.
రాజు ఆమె చెంప చెళ్ళు మని పించాడు.దుర్మార్గురాలా నీ అబద్దం నమ్మటానికి నేను మూర్ఖుడ ననుకున్నావా?.యిది కాళిదాసు వ్రాసినదని స్పష్టంగా తెలుస్తూంది.ఎటొచ్చీ నీ బుద్ధి హీనత వల్ల 'బాలే'
అన్న మాటను మార్చి 'రాజే' అని వ్రాశావు.ఆ మాత్రం తో నేను బుట్టలో పడిపోతాననుకున్నావు.కానీ 'రాజన్'అనే సరయిన సంబోధనకు బదులు నీ సొంత తెలివి నుపయోగించి 'రాజే' అని తప్పు రాసి నీ దొంగ బుద్ధి ని నువ్వే ప్రకటించు కున్నావు.చెప్పు యింతకూ కాళిదాసు ఎక్కడ?అని నిలదీశాడు.
రమణి భయపడిపోయి తప్ప్పు ఒప్ప్పుకొని జరిగిన దంతా చెప్పింది.కాళిదాసు మరణించాడన్న వార్త రాజు నమ్మలేక పోయాడు.రమణి కాళిదాసు శవాన్ని చూపగానే రాజు మూర్ఛ పోయాడు.కాసేపటికి తేరుకొని
తన యిష్ట దేవత భువనేశ్వరీ దేవిని ప్రార్థించాడు.నా జీవితం లో మిగిలి వున్న ఆయువు లో సగం ఈ కవీశ్వ రుడికి ధార పోస్తాను.ఈయనను బ్రతికించు తల్లీ అని ప్రార్థించాడు.దేవి కరుణతో కాళిదాసు లేచి వచ్చాడు.రాజా నీ ఆయువు లో సగం ధారపోసి నన్ను బ్రతికించావు.నా శేష జీవితం నీకే అంకితం చేసి నీ ఋణం తీర్చుకుంటాను ఏమి చెయ్యాలో ఆజ్ఞాపించు. అన్నాడు కవిరాజు.కవీశ్వరా నువ్వు లేకుండా నేను జీవించ లేను,జీవించినా అటువంటి నిస్సార మైన జీవితం నాకు వద్దు.మనం జంటగా ఒక కావ్య రాద్దాం
నీ పేరూ,నాపేరూ శాశ్వతంగా చరిత్ర లో నిలిచి పోతుంది.అన్నాడు రాజు.
తర్వాత యిద్దరూ కలిసి 'చంపూ రామాయణ కావ్యాన్ని ప్రారంభించారు.(చంపూ కావ్య మంటే శ్లోకాలూ,గద్యాలూ రెండింటి తో చెప్పబడ కావ్యం)సరళంగా సాగే ఈ చక్కని గ్రంథం 'భోజ చంపువు'గా ప్రచారం పొందింది.దీన్ని ఈనాటికీ సంస్కృత విద్యార్థులు తమ తొలి అధ్యయన గ్రంథాలలో ఒకటిగా చదువుకుంటారు.అయితే ఈ రామాయణం 'సుందరకాండ వరకే భోజ,కాళిదాసుల రచన.అక్కడిదాకా వ్రాసి యిద్దరూ ఒకే సారి మరణించారు.మిగిలిపోయిన యుద్ధ కాండను ఆ తర్వాత్ 16వ శతాబ్దం లో లక్ష్మణ సూరి అనే ఆంద్ర దేశ పండితుడు పూర్తీ చేశాడట.



నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు జరిగిన అవధానము యిది.అప్పుడు మద్యపాన నిషేధము గురించి చాల చర్చ జరుగుతూ వుండింది.
అప్పుడు అవధానం లో ఒకావిడ అడిగారు.సురలోకం లో సురాపానాన్ని నిషేధిస్తే ఎలా వుంటుందో ఒక శ్లోకం లో చెప్పమని . సంచాలకుడైన రామబ్రహ్మం గారు,అసలే సురలోకం అక్కడ సుర లేకపోతే దేవతలు ఎమిచేస్తారు అంటే అవధానిగారు దీనికొక ఉపాయం చెబుతున్నారు..దేవలోకానికి దగ్గరలో 'యానాం' లేదు కదా! అని నవ్వుతూ అంటూ వుండగా . మధ్యలో అప్రస్తుత ప్రసంగి శంకరనారాయణ గారు "కల్లుతెచ్చు కోమని చెప్తారా? అంటే అవధాని గారు 'కల్లు'కాదు 'కళ్ళుతెరుచుకోమని' అని చెప్తూ ఈ క్రింది శ్లోకం చెప్పారు.
శ్లోకం:- సురలోకోయమితి ప్రభాతి నితరాం తత్రాపి నోచేత్సురా
కరణీయం కిమధ ప్రయోగ కుశలై: ర్దేవైస్య నిత్యమ్ము దా
సతతం మాద్యమహోకధతం ఘటతే చేతం తదా చేత్తదా
ద్వి శతం దివ్యవధానకం భవతు తత్తత్ త్పద్య మాద్యంకరం
అర్థము:-- అసలే సురలోకం సుర లేకపోతె దేవతలు పిచ్చి వాళ్లై పోయారు.. ఏమిచేద్దామని వాళ్ళు ఆలోచిస్తూంటే అవధాని గారు అప్పుడు ఇంద్రుడు దేవ భాషలో ద్వి శతావధానం ఏర్పాటు చెయ్యాలి.అప్పుడు .దానితో ఒక్కో శ్లోకం వింటూ వుంటే మద్యం తాగినట్టు తన్మయత్వంతో వాళ్ళు తూలి పోతారు . అంత రసవత్తరంగా సాగుతుంది ఆ అవధానం.
అవధాని నాగఫణి శర్మ గారి ఊహకు జోహార్లు.



కురుక్షేత్ర యుద్ధానికి ముందు అర్జునుడు,దుర్యోధనుడు యిద్దరూ కృష్ణుని యుద్ధం లో తమకు సహాయము చేయమని కోరడానికి వస్తారు. అప్పుడు కృష్ణుడు నా 10000సైన్యము ఒక వైపు,నేను ఒక్కదనూ ఒక వైపు నేను "ఆయుధమున్ ధరియింప యుద్ధమున్ సేయను ఊరక పక్కన వుండి మాట సాయము చేయువాడ". మీకేది కావాలో కొరుకోండి అంటాడు. అప్పుడు అర్జునుడు తనకే ముందు ఆవకాశము యిచ్చినా ఆ 10000సైన్యములో లలో ముందున్న ఒకటే కృష్ణుడు
అది లేక ఎన్ని సున్నాలు వున్నా విలువ లేదని గ్రహించి కృష్ణుడినే కోరుకుని విజయుడవుతాడు. . వివేకి,జ్ఞాని అయిన అర్జునుడు. . అవివేకి అయిన దుర్యోధనుడు 10000 సైన్యమును సంతోషముగా అంగీకరించాడు. అర్జునుడు దైవ బలము పై విశ్వాసముంచితే దుర్యోధనుడు మూర్ఖుడు,అజ్ఞాని కనుక అంగబలము నే నమ్ముకొని అపజయం పాలవుతాడు.
భగవంతుడనే ఒకటి లేకపోతె ప్రాపంచిక సుఖాలు, వైభవాలన్నీ విలువలేని సున్నాల్లాంటివి. అందువల్ల మనము భగవంతుని అనుగ్రహం సంపాదించడమే ముఖ్యము. మనము మహాత్ములు చూపిన బాట లోనే పయనించి భగవంతుడిని మన హృదయ క్షేత్రము లో ప్రతిష్టించుకుందాము. అప్పుడు మన జీవన క్షేత్రం ఓ ధర్మ క్షేత్రంగా మారి శాంతి పంటల్ని పండిస్తుంది,మనల్ని విజయ పథం లో నడిపిస్తుంది.(స్వామి పరిజ్ఞేయానంద, రామకృష్ణ ప్రభ)


      

ఒక రోజు కృష్ణ దేవ రాయలు సభలో 'కవులందరూ అందమైన ఆడవాళ్ళ ముక్కును సంపెంగ తోనూ, కళ్ళను తుమ్మెదల రెక్కల తోనూ పోలుస్తారు కదా! ఎందు వలన?అని అడిగాడట. అష్ట దిగ్గజాల్లో ఒకడైన రామరాజ భూషణుడు వెంటనే లేచి
చమత్కారంగా యీపద్యం వినిపించాడు.
నానా సూన వితాన వాసనల నానందించు సారంగ మే
లా నన్నొల్లదటంచు గంధఫలి పల్కాకన్ తపం బొనర్చి యో
షా నాసాకృతి దాల్చె సర్వ సుమన సౌరభ్య సంవాసి యై
పూనెన్ ప్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబు లిర్వంకలన్
అర్థము:--అన్ని పూలమీద వ్రాలి మకరందాన్ని గ్రోలే తుమ్మెద యింత సువాసనతో వున్న నా మీద ఎందుకు వ్రాలి మకరందాన్ని గ్రోలదు? అని సంపెంగ అనుకొని బ్రహ్మ దేవుణ్ణి గూర్చి ఘోరమైన తపస్సు చేసిందట.అప్పుడు బ్రహ్మ కవులు యికపై నిన్ను అందమైన ఆడవాళ్ళ ముక్కుతోనూ,కళ్ళను తుమ్మెద రెక్క్కలతోనూ తోను పోలుస్తారు.
అప్పుడు నీకు రెండు వైపులా రెండు తుమ్మెదలు నీ పై వ్రాలినట్టు అవుతుంది,నీ కోరిక తీరుతుంది లే
అని వరం యిచ్చాడట. అందుకని కవులు ముక్కును సంపెంగ తోనూ కళ్ళను తుమ్మెద రెక్కల తోనూ
పోలుస్తున్నారు.మహారాజా! అని చెప్పాడట.కవులకు యీ సమయ స్ఫూర్తి వుంటుంది.అప్పటికప్పుడు యిలా ఏదో కథ అల్లి చెప్పడం వాళ్ళకే సాధ్య మవుతుంది (సంపెంగ మీద తుమ్మెద వ్రాలదట ఎందుకో ఎవరికైనా తెలిస్తే చెప్పండి.)



వృశ్చికస్య విషం పుచ్చమ్ మక్షికస్య విషం శిరః
తక్షకస్య విషం దంష్ట్రౌ సర్వాంగం దుర్జనే విషం
అర్థము:--తేలుకు తోకయందును ,ఈగకు శిరస్సు నందును, పాముకు కోరల యందును విషము వుండును . కానీ దుర్జనులకు సర్వాంగముల యందు విషము వుండును. కావున దుర్జనులతో జాగ్రత్తగా వుండ వలయును.వారు తేనే పోసిన కత్తి లాంటి వారు.



ధారానగరము లో యజ్ఞవర్మ అనే బ్రాహ్మణుడు వుండే వాడు. అతను నిరుపేద . కానీ ఎవ్వరిదగ్గారా చేయి చాచి యాచించే వాడు కాదు.వారు సంపాదించిన డబ్బు న్యాయమైనది కాకపొతే తనకు పాపం కలుగుతుందని అది అపరిగ్రహ మని (తీసుకో కూడనిది) అతని అభిప్రాయము. అతడు . నిత్యాగ్ని హోత్రి. తనకు వున్న పొలము లో పండిన కొద్దిపాటి ధాన్యము అమ్మిన డబ్బుతోనే జీవనం సాగిస్తూ వుండే వాడు.అతని భార్యకు అత్యాశ. భోజరాజు దగ్గరకు వెళ్లి కవిత్వం చెప్పి డబ్బు సంపాదించ రాదా ? అని రోజూ పోరుతూ వుండేది.మనకు అగ్ని దేవుడే రక్షకుడు. ఆయన యెంత యిస్తే మనకు అదే మహాప్రసాదము అనేవాడు. కొనాళ్ళకి భార్య పోరు పడలేక భోజరాజు దగ్గరకు వెళ్లి ఆయనను ఆశీర్వ దిస్తూ శ్లోకాలు చెప్తాడు. రాజు ఆయనకు బహుమానం యివ్వ బోగా రాజా రాజులసోమ్ము క్రూర క్రియార్జితము తాము కష్టపడి సంపాదించిన డబ్బు ఏదైనా వుంటే ఒక్క రూకైనా చాలు నాకు యిప్పించండి అంటాడు. రాజు సరే రేపు రండి అని చెప్తాడు. ఆ దినం రాత్రి భోజరాజు మారువేషము లో వెళ్లి ఒక కమ్మరివాని దగ్గర సమ్మెట కొట్టి అతను 16 రూకలు యిస్తే అవి తీసుకొని వస్తాడు. మరుదినం వచ్చిన యజ్ఞవర్మకు ఆ పదహారు రూకలు యిచ్చి మహాత్మా యివి నేను రాత్రి సమ్మెట కొట్టి సంపాదించిన డబ్బు స్వీకరించండి అని యిస్తాడు. యజ్ఞవర్మ అవి
మహాప్రసాద మని తీసుకొని వచ్చి భార్య చేతిలో పెడతాడు. రాజు దగ్గరకు వెళ్లి లక్షలు తెస్తా వనుకుంటే ఈ వెధవ 16 రూకలా మీరు తెచ్చింది అని కోపంగా అక్కడే వెలుగుతున్న అగ్ని హోత్రం లోకి విసిరి వేస్తుంది. యజ్ఞ వర్మ అయ్యో అని స్నానం చేసి వచ్చి మెల్లిగా ఆ రూకల్ని ఒక్కొకటిగా బయటికి తీస్తాడు. అవి బంగారు నాణాలుగామారి వస్తాయి. యింకా ఎన్ని మార్లు తీసినా ఆక్షయముగా
వస్తూనే వుంటాయి. అతను భార్యతో చూశావా కష్ట పడి సంపాదించిన ధనమునకు యెంత మహత్తు ఉన్నదో అని అంటాడు.నీతి;- మనం కష్టపడి సంపాదించిన డబ్బే మనకు అక్షయ మవుతుంది. .




ఒకసారి అవధానం లో ;దుర్యోధన, దుశ్శాసన,శకుని,కర్ణ ఈ దుష్ట చతుష్టయాన్ని దత్తపదిగా యిచ్చి దీన్ని రామాయణ పరంగా వర్ణించ మన్నారు. నాగఫణి శర్మ గారి పూరణ
దుర్యోధనమీ సైన్యమ
వార్య దుశ్శాసన గత వక్ర ప్రతిభన్
క్రౌర్యాం శ కు నిజ ఫలమిది
కార్యంబగు మంచి దనుజ కర్ణము బడు నే
అర్థము:-విభీషణుడు అనుకుంటున్నాడు ఈ మాటలు.జయించడానికి అసాధ్యమైనది ఈ సైన్యము.వారించడానికి వీల్లేని దుష్ట మైన పరిపాలన, వక్రమైన బుద్ధి యొక్క పరిణామము యిది
క్రౌర్యమైన పనికి యిదే నిజమైన ఫలితము. (అందులో శకుని వచ్చాడు)మంచి మాటలు యెన్ని చెప్పినా కూడా దనుజుడి యొక్క చెవుల్లో మాత్రం పడడం లేదు.



కొందరు జాలరులు నర్మదా నది లో చేపలు పడుతుండగా వాళ్లకు ఒక శిలాఫలకం దొరికింది. దానిమీద ఏవో అక్షరాలు కనిపించి ఇదేదో శ్లోకం లాగుంది భోజరాజు గారికి యిస్తే మంచి బహుమతి యిస్తారు అని రాజు కు తెచ్చి యిచ్చారు. భోజరాజు వారికి మంచి బహుమానం యిచ్చి పంపించారు. ఆయన దాన్ని పండితులకు యిచ్చి వారు దానిని నిశితంగా పరిశీలించి
ఒక పాదం మాత్రం అర్థమయిందని చెప్పారు.
"అయిఖలు విషమ పురాకృతానాం భవతి హి జంతుషు కర్మణాం విపాకః"
అర్థము:-అయ్యయ్యో!పూర్వ కర్మల ఫలితం ప్రాణులకు చాలా విషమం గా వుంటుంది.
ఇంకో పాదం పూర్తిచేయమని భోజుడు కవి భవభూతి ని ఆజ్ఞాపించారు. భవభూతి యిలా పూరించాడు.
" క్వను కులమ కలంకం ఆయతాక్ష్యా?కవ చ రజనీ చర సంగమ అపవాదః?"
అర్థము:-- విశాలాక్షి అయిన సీత యొక్క అకలంక మైన కుల మెక్కడ?రాక్షసునితో సంబంధం కలిపే అపవాదు ఎక్కడా?
కానీ రాజుకు ఆ పూరణ నచ్చలేదు. తానూ యిలా పూరించాడు.
"క్వ జనక తనయా? క్వ చ దశకంధర మందిరే నివాసః" అర్థము :-- ఎక్కడి జనక మహారాజు కూతురు, రామపత్ని?ఎక్కడ దశకంధరు డి ఇంటిలో వుండడం. తన పూరణ కూడా ఆయనకు నచ్చ లేదు. కాళిదాసు వంక చూశాడు మహా కవీ నేరేమంటారు? అన్నాడు. కాళిదాసు కండ్లు మూసుకొని కాసేపు ధ్యానం చేసి యిలా చెప్పాడు. ఇది హనుమంతుడు వ్రాసిన హనుమ ద్రామాయణము లోని యుద్ధ కాండ లోని శ్లోకములో రెండవ పాదముగా వున్నది.
"శివాశిరసి శిరా రిశియాని రేజః వశివతా ని లుఠమ్ తి క్రుధః ప్రాదై:
అయి ఖలు విషమః పురాకృతానాం భవతి హి జంతుషు కర్మణా విపాకః"
అర్థము:-శివా శివా! ఏ తలలు శివుని తలపై విరాజిల్లెనో (రావణుడు ఒకసారి తన తలలు ఖండించి శివుడి శిరస్సు పై పడ వేస్తాడు ) అట్టి తలలు యిప్పుడు యుద్ధము లో తెగి పడి గ్రద్దల కాళ్ళచే దోర్లింప బడుతున్నాయి ఆయ్యో! పూర్వజన్మ కర్మ ఫల పరిణామం ప్రాణులకు యెంత కఠినమో కదా!
యిది సముద్రము లో లభించినది. దాని చరిత్ర ఏమిటో ?చెప్పగలరా? అని అడిగాడు భోజుడు.
అందుకు కాళిదాసు యిది హనుమద్రామాయణము లోనిది. హనుమంతుడు దాన్ని రామునికి చూపించగా రాముడు హనుమా!యిందులో నీ శౌర్యాన్నినీవే ఎక్కువగా వర్ణించి నట్టున్నది. అని అన్నాడు. దానితో హనుమంతుడు రామునికి నచ్చని ఈ గ్రంథ మెందు లకు? అని సముద్రములో పారవేసినాడు. అందులోని ఒక శిలాఫలకమే యిది . అన్నాడు కాళిదాసు.
అందుకు రాజు నీ పూరణ యుక్తము గానే యున్నది. కానీ యిదే కవి హృదయమని యెట్లు నిర్దారింప గలవు?అన్నాడు. అప్పుడు కాళిదాసు హనుమంతుని ధ్యానించాడు. హనుమంతుడు ప్రత్యక్ష మై కాళిదాసు పూరించినది సరియైనదే అని చెప్పాడు. అప్పుడు భోజుడు మీకు అంత బాగా జ్ఞాపకముందా?అన్నాడు. అప్పుడు హనుమంతుడు భోజుని ఉద్యాన వనము లో నైరుతి దిశ లో నున్న చెట్టు యొక్క ఆకు పసరు తెచ్చి ఈ శిలాఫలకము పైన పూయమన్నాడు అప్పుడు ఆ శ్లోకము స్పష్టముగా కనిపించినది. అది కాళిదాసు పూరించిన శ్లోకము గానే వున్నది. అప్పుడు భోజుడు,సభాసదులు కాళిదాసు ప్రతిభను కీర్తించి నారు.




అదాన దోషేణ భవేద్దరిద్రో
దారిద్ర్య దోషేణ కరోతి పాపం
పాపా దవస్యం నరకం ప్రయాతి
పునర్దరిద్ర: పునరేవ పాపీ
అర్థము:-- దానము చెయ్యని కారణంగామరు జన్మ లో దరిద్రుడు గా పుడతారు దరిద్రు
డయిన కారణంగా పాపాలు చేస్తాడు. దానివల్ల నరకానికి పోతారు. మరీ దరిద్రుడగా పుడతారు.
ఈ చక్రం అలా తిరుగుతూనే వుంటుంది.మనకు వున్నదానిలో మన కంటే పేద వాళ్లకు దానం చేయాలని భావం.
ఈ కథ వేయిపడగలు నవల లో విశ్వనాథవారు వ్రాశారు.. ఒక యజమాని తన యింటి అరుగు మీద
కూచుని వుంటాడు.ఇంతలో ఒక భిక్షగాడు వచ్చి ధర్మం చేయండి బాబూ అంటాడు. ఆయన భార్యను కేక వేసి ఏమే!మూడు జన్మల దరిద్రుడు వచ్చాడు, భిక్షం తీసుకొనిరా అంటాడు. భిక్ష గాడు కోపంతో అదేమిటి నన్ను మూడుజన్మల దరిద్రుడని అంటారు?అన్నాడు. అపుడు యజమాని నవ్వుతూ మరి అంతే కదా పోయిన జన్మ లో నీవు దానం చెయ్యలేదు కాబట్టి ఈ జన్మ లో దరిద్రుడిగా పుట్టావు,దరిద్రుడవు కాబట్టి దానాలు చెయ్యలేవు పాపాలు చేస్తావు. మరుజన్మలో కూడా దరిద్రుడిగా పుడతావు. అది అలా కొనసాగుతూనే వుంటుంది. నీవు మూడు జన్మల దరిద్రుదివే కదా!ఆ భిక్ష గాడు భిక్షాటన మానేసి కష్టపడి సంపాదించి దానాలు చేస్తూ పుణ్యాన్ని పొందుతాడు.దాన మెప్పుడూ గుప్తంగా చెయ్యాలి. అంటే నేను ఫలానా వాడికి యింత యిచ్చాను ఇంకోడికి యింత యిచ్చాను అని చెప్పుకో కూడదు. "దానమానావ మా నస్యా నవగోప్యా మనీషిభి:



ఈ సంస్కృత సమస్య అవధానం లో యిచ్చారు."పిపీలికా చుంబతి చంద్రబింబం" చీమలబారు చంద్రుడిని
ముద్దుపెట్టు కుంటున్నది.నాగఫణి శర్మ గారి పూరణ.
భవన్ముఖే దేవి సుధాంశు తుల్యే
విరత్య మానంతి లఖంబి నీలం
విలోక్య దీర్ఘం హృదయే చ మన్యే
పిపీలికా చుంబతి చంద్రబింబం
అర్థం:-- చంద్రబింబము లాంటి తన ముఖము పై అమ్మవారు కస్తూరి తిలకం దిద్దుకుంది.పొడవుగా వున్నఆ నల్లటి కస్తూరి తిలకము చీమలబారు చంద్రుడిని ముద్దు పెట్ట్టు కుంటున్నట్టుగా నా కనిపిచింది.
అద్భుత మైన ఊహ.



స్థాన విశేష మాత్రమున తామర పాకున నీటిబొట్ట నిన్
పూనిక మౌక్తికం బనుచు పోల్చిన మాత్రన యింత గర్వమా
మానవతీ శిరోమణుల మాలికలందున గూర్పగ వత్తువో
కానుక లీయ వత్తువో వికాసము నిత్తువో విల్వ దెత్తువో
అర్థము:-- తామరాకు పైని నీటిబొట్టును ముత్యముతో పోలుస్తుంటారు. నీవు వున్న ఆ స్థానము పై ముత్యములాగున కనపడుతున్నావు కనుక నిన్ను ముత్యము లాగ మెరుస్తున్నావు అని పొగిడి నంత మాత్రమున గర్వ పడకు. ఆడవాళ్ళు వేసుకొనే నగల్లో కూర్చడానికి, కానుక లివ్వడానికి, నీవు పనికి వస్తావా?వికాసాన్ని యిస్తావా? విలువ ఏమైనా వుందా నీకు?అలాగే అధికారం లో వున్నప్పుడు అందరు పొగుడుతారు. తర్వాత నీకు విలువేముంటుంది?ఆ స్థానానికే గౌరవము కానీ నీకు కాదు అని తెలుసుకొని మెలగు అని కవి హెచ్చరిస్తున్నాడు.



అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వతః
నిత్యం సన్నిహితో మృత్యు: కర్తవ్యో ధర్మ సంగ్రహ:
అర్థము:-- ఈ శరీరము అశాశ్వత మైనది,సంపదలు,వైభవాలు కూడా శాశ్వతాలు కావు,మృత్యువు దిన దినమునకు దగ్గరవుతూంది. కనుక ధర్మ సంగ్రహము మాత్రమె మానవులు చేయ వలయును. (నకుల ఉవాచ )



ఉత్తమం స్వార్జితం విత్తం ; మధ్యమం పిత్రార్జితం
అధమం భాతృ విత్తంచ ; స్త్రీ విత్త మధమాధమం
అర్థము:-- తాను స్వయముగా సంపాదించిన ధనము ఉత్తమ మైనది. పిత్రార్జితమైన ధనము
మధ్యమమైనది. అన్న దమ్ముల ధనము అధమమైనది. స్త్రీ ధనం అధమాధమ మైనది. పూర్వం స్త్రీలు
ఉద్యోగాలు చేసేవారు కాదు. తండ్రి ఆస్తిపై అధికారం వుండేది కాదు. అందుకని తండ్రి ఆమె రక్షణ కోసం పెళ్లి సమయములో కొంత ధనం కాని పొలం కానీ ఆమె కు ఇచ్చేవాడు. భర్త చనిపొయినా,వదిలి వేసినా ఆమె పోషణార్థం పనికి వస్తుందని. ఆ ధనమును స్త్రీ ధనం అని అంటారు . కొంత మంది మామాగార్లు, బావగార్లు,మరుదులు ఆమెను మోసము చేసి ఆ ధనాన్ని తమ పరం చేసుకునే వారు అది అధమాధమమైనదని కవి భావం.అదే ఇప్పుడు కట్న మనే దురాచారం గా మారింది.



మహా కవి కాళిదాసు "అభిజ్ఞాన శాకుంతలం' అనే నాటకం గురించి ఒక లోకోక్తి వుంది.
"కావ్యేషు నాటకం రమ్యం, నాటకేషు శకుంతలా,
తత్రాపి చతుర్థంక: తత్ర శ్లోక చతుష్టయం"
అర్థము:-- కావ్యముల లో నాటకం రమ్యముగా వుంటుంది. ఆ నాటకాలలో కూడా కాళిదాసుని శకుంతల
నాటకం మరీ రమ్యముగా వుంటుంది. అందులో నాలుగో అంకం లో కణ్వుడు శకుంతలను అత్తవారింటికి పంపే
ఘట్టం లో చెప్పే నాలుగు శ్లోకాలు చాలా రమ్యము గా వుంటాయి.. ఒక శ్లోకం లోకము లో ప్రసిద్ధమైనది.
"యాస్యత్యద్య శకుంతలేతి హృదయం సంసృస్టముత్కంఠ యా
కంఠ: స్థంభిత భాష్ప వృత్తి కలుషః చింతా జడం దర్శనం
వైక్లబ్యం మమ తావ దీ దృశ మహో! స్నేహాదర ణ్యౌకసః
పీడ్యంతే గృహిణః కథంను తనయా విశేష దు:ఖైర్నవై:"
అర్థము:--ఈ రోజు శకుంతల అత్తవారింటికి వెళ్లి పోతుందంటేనే మనసు చాలా భారమైపోతున్నది. కన్నీరు
ఆపుకున్న కొద్దీ గొంతు గద్గద మయిపోతున్నది. కన్నీటి పోర కళ్ళను కప్పేస్తున్నది.దిగులుతొ చూపు మంద మయింది. ఆహా! అరణ్యవాసిని, తాపసిని అయిన నాకే కేవలం పెంచిన కారణంగానే మమకారము చే యింత దుఃఖము గా ఉన్నదే! పాపం లోకము లో గృహస్తులకు కన్నకూతురిని కొత్తగా అత్తవారింటికి పంపే సమయములో యెంత బాధ కలుగు తుందో గదా!



ఒక శిష్యుడు స్వామి పరిజ్నేయానంద గారిని ఈ ప్రశ్న వేసాడు. నేత్రదానం చేసినవారు మరుజన్మలో అందులుగా జన్మిస్తారని కొంత మంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం?
జవాబు:-మహాత్ములు యేది ఆచరించి చూపించారో ఆ అడుగుజాదల్ని అనుసరించే మహోన్నత సంతతికి చెందినా వాళ్ళం మనం ఇతరుల శ్రేయస్సు కోసం తమ జీవితాల్ని త్యాగం చేసిన ఏంటో మంది మహర్షులు,యోగులు,రాజులు,చివరకు సాధారణమైన మనుష్యులను సైతం మన దేశ చరిత్రలో చూడవచ్చు. అలాంటి త్యాగ పురుషుదే ధధీచి మహర్షి. వ్రుత్రాసురుడనే రాక్షసుడి దురాగతాలను దేవతలు భరించలేక అతన్ని సంహరించే మార్గం అడిగారు. అప్పుడు విష్ణువు ఒక మహా దాత యొక్క వెన్నెముకతొ
వజ్రాయుధాన్ని తయారుచేస్తే దానితో ఆ రాక్షసుణ్ణి సంహరింప వచ్చు అని చెప్పాడు. దధీచి మహర్షిని యాచించ మని సలహా యిచ్చాడు. దేవేంద్రుడు అడగ గానే దధీచి లోక శ్రేయస్సు కోసం తన దేహాత్యాగం చేసాడు. మహర్షి వెన్నెముక నుంచి విశ్వ కర్మ వజ్రాయుధాన్ని తయారుచేసాడు. దానితో ఇంద్రుడు వృత్రాసురున్ని సంహరిస్తాడు. లోక శ్రేయస్సు కోసం శరీర అవయవాలను దానం చేయడం ఉన్నతమైన
కార్యమేనని మన పూర్వీకులు ఆచరించి చూపించినారు. మరణించిన తర్వాత మనతో వచ్చేది మన శరీరం కాదు. మనం చేసిన మంచి,చెడు కర్మలు మాత్రమె. మంచి చేస్తే మంచిజన్మ,చెడు చేస్తే చెడు జన్మ కలుగుతుంది. పుణ్య కర్మలు చేస్తే ఉత్తమ గతి కలుగుతుంది కానీ కళ్ళు దానం చేసినందు వల్ల కళ్ళు లేకుండా పుడతరనేది నిజం కాదు. అది వ్యాపార దృష్టి తో ధనం సంపాదించ డానికి చేస్తే మాత్రం వారు మరుజన్మలో అంధులుగానే పుడతారు.మరణించిన తర్వాత తమ శరీరావయవాలను ఇతరుల ప్రయోజనార్థము దానము చేసినవారు మరనంలోనూ జీవిస్తారు. ఇతరుల జీవితాల్లో వెలుగు నింపే వారు నిజంగా ధన్యులు.



తెలియక నాశహేతు వగు తీవ్రత రానల కీల లోపలన్
శలభము జోచ్చుగాక మతిచాలక మీనము తాను గాలపుం గొనం
గల పిశితంబు తామెసగు గాక యెరింగియు మేము దుఃఖపు
హేల వనితా సుఖంబు విడనాడము మోహ మహత్వ మెట్టిదో
అర్థము:-- తాను మాడిపోవుదునని తెలియని మిడుత దీపముచుట్టూ తిరిగి మాడిపోవును.తాను గాలమునకు తగిలి చనిపోవుదునని తెలియక చేప ఎరను తినును మనుషులు జీవితము అశాశ్వత మని తెలిసి కూడా భోగేచ్చమానలే కున్నారు ఆహా!అజ్ఞానమునకు ఎంతటి మహిమ యున్నదో గదా!



ఒక గురువు గారి దగ్గర శిష్యుడు వుండే వాడు. గురువు గారి భార్య చాలా గయ్యాళి. శి ష్యుడు గురువుగారిని అడిగాడు. గురువు గారూ మీరింత పండితులు కదా!మీ భార్యను అదుపులో పెట్టుకోలేక పోతున్నారెందుకని? అప్పుడు గురువు గారు నాయనా నీకూ పెళ్లి అయితే తెలుస్తుందిలే అన్నాడు.నేనైతే నా
భార్యను నోరెత్త నీయకుండా అదుపు చేస్తాను. అని ప్రగల్భాలు పలికాడు.అలాగే నాయనా నీ పెళ్లి అయాక
మీ యింటికి నేను వస్తాను,చూస్తాను నీవెంత అదుపు చేస్తున్నావో?అన్నాడు గురువు.శిష్యుడి విద్యాభ్యాసం పూర్తి అయింది.
అతను తర్వాత పెళ్లి చేసుకొని ఒక ఊరిలో స్థిరపడ్డాడు. అతని భార్య గురువు గారి భార్య కంటే రెండు రెట్లు గయ్యాళి. ఏమైనా అంటే ఊరంతా వినపడేటట్టు అరిచి అతని పరువు తీస్తుంది.అందుకని ఆ శిష్యుడు ఆమెను భరిస్తూ వచ్చాడు. ఒకరోజు గురువు గారు తాను
ఫలానా రోజు వస్తున్నట్టు కబురు పెట్టారు. శిష్యుడికి భయం పట్టుకుంది. భార్యను బతిమాలి గురువు గారు
వచ్చినప్పుడు కాస్త అణుకువగా వుండే టట్టు ఒప్పించాడు. అయితే ఆమె ఒక షరతు పెట్టింది నేను నీవు వంద తిట్లు తిట్తేవరకు భరిస్తాను.తర్వాత ఊరుకునేది లేదు అన్నది. . అంతకే అతను సంతోష పడిపోయాడు. గురువు గారు వచ్చారు.శిష్యుడు సందు దొరికింది కదా అని ప్రతి దానికీ భార్యను తిట్టసాగాదు. గురువు చాలా ఆశ్చర్య పోయాడు. వీడికి మంచి సాధ్వి అయిన భార్య దొరికింది అని. ఆవిడ తెలివైంది. ఒక పళ్ళెం లో వంద చింత పిక్కలు పెట్టుకొని
మొగుడు తిట్టి నప్పుడు ఒకో తిట్టుకు ఒకో గింజ బయటకు పారేస్తూ వచ్చింది. వాళ్ళిద్దరికీ భోజనం వడ్డించింది. అప్పటికి వంద తిట్లు అయిపోయాయి. శిష్యుడు ఏదో తిట్టు తిట్టి గురువు గారికి పులుసు వడ్డించు అని గద్దించాడు..
అంతే ఆ పులుసుకుండ తీసుకొని వచ్చి గురువు నెత్తిన పడేసింది. కుండ పగిలి పోయింది. గురువు పైన ఆ వేడి వేడి పులుసు పడి ఒళ్లంతా మంటలు పుట్టాయి.గబ గబా పెరట్లోకి వెళ్లి అంతా కడుగుకొని వచ్చాడు. అప్పుడు ఆవిడ గురువును కుండ పగిలి పోయింది దాని వెల యిచ్చి మరీ వెళ్ళు అంది.
అప్పుడు గురువు,
అనేక శత భాండాని భిన్నాని మమ మస్తకే
అహో!గుణవతీ భార్యా భాండ మూల్యం న యాచతే
అర్థము:- ఇలాంటి కుండలు వందలకొద్దీ నానెత్తిన పగిలాయి కానీ ఆహా! నా భార్య ఎంత గుణవంతురాలు. ఎప్పుడూ కుండకు డబ్బు లిమ్మని నన్ను అడగలేదు.అని వెళ్ళిపోయాడు.



కాళిదాసు తర్వాత చాలా వేల ఏళ్ళ తర్వాత ఒక రాజు గారు కవితా గోష్టి జరుపుతున్నారు. ఆయన కవులను యిలా అడిగారు. చేతి బొటనవేలిని అంగుష్ఠం అంటున్నాము, చూపుడు వేలిని తర్జని అనీ,నడిమి వ్రేలిని నడిమి వ్రేలని,చిటికెన వేలిని కనిష్టికా
అంటున్నాము. కానీ ఉంగరపు వేలిని మాత్రం ఏ పేరూ లేనట్టు అనామిక అంటున్నాము. దీనికి కారణ మేమిటో ఎవరైనా ఊహించి చక్కని శ్లోకం చెప్పి,నా చేతి ఈ వజ్రపు ఉంగరం బహుమతిగా తీసుకోండి.
ఒక కవి వూహించి చక్కటి శ్లోకం చెప్పాడు.
శ్లోకం:-- పురా కవీనాం గణన ప్రసంగే కనిస్టికాధిస్టిత కాళిదాసా
అద్యాపి తత్తుల్యకవే రభావాత్ అనామికా సార్థవతీ బభూవ
అర్థము:-- పూర్వం కవులందరూ కూర్చొని సంస్కృత కవులలో ప్రథమ స్థానం ఎవరిదీ,తరువాతి స్థానాలు ఎవరివి?అని చర్చించుకుంటున్నారట. ఒక కవి మొదటి స్థానం కాళిదాసు దే అని చిటికెన వేలిని మడిచాడు. మిగతా అందరూ దాన్ని అంగీకరించారు. రెండో స్థానం ఎవరిదీ అన్న ప్రశ్న వచ్చింది. చాలా పేర్లు వచ్చాయి
గానీ,వారెవరూ రెండో స్థానం లో నిలబడ దగ్గ వారని సభ వొప్పుకో లేక పోయింది. ఏ పేరు చూసినా హిమాలయం తర్వాత ఏదో పిచ్చికల గుంపును ఎంచి నట్టుగా అనిపించింది. మరి కాళిదాసు అంతటివాడు. చివరికి ఆ రెండో వేలికి ఏ కవీ దొరక్క ఆ వేలు 'అనామిక'గా నిలిచిపోయింది. అని చమత్క రించే సరికి రాజు పొంగిపోయి ఆ వజ్రపుటుంగరాన్ని తనే స్వయంగా ఆ శ్లోకం చెప్పిన కవి యొక్క అనామికకు (ఉంగరపు వేలు) వేలికి తొడిగి 'అనామికా సార్థక నామవతీ బభూవ' అన్నాడు.అప్పటినుండీ ఉంగరపు వేలుకు అనామిక అని పేరు పడిపోయింది.



ఒకసారి అవధానం లో ఈ సమస్య యిచ్చారు."ప్రాంజ్ఞగ మందు శంభుడు సుభద్రన్ పొందగా పుట్టే గాంధి యున్" ఎంత క్లిష్ట ప్రాస. నాగఫణి శర్మ గారి పూరణ.దీఎన్ని క్రమాలంకారములో పూర్తి చేశారు.
క్రమాలంకార మంటే మొదటి మూడు పాదాల లోని ప్రశ్నలకు నాలుగవ పాదం లో సమాధానాలు వస్తాయి.
దిజ్ఞవ కాంతి సూర్యుడు తేటగ నెచ్చట పుట్టు? అంబికా
దృజ్ఞవ మూర్తి యెవ్వడు? కిరీటి వ్రతం బడి యెవరి కోసమో
స్రంజ్ఞిజ భారతిన్ దనుప జాతిని పుట్టే నెవండు?జూడగా
ప్ర్రాంజ్ఞగ మందు శంభుడు సుభద్రన్ బొందగ పుట్టె గాంధి యున్
తా:-దిక్కులకు కాంతి యిచ్చు సూర్యుడు ఎచ్చట పుట్టు? ప్రాంజ్ఞగ మందు అంటే తూరుపు కొండలలో పార్వతీ దేవి చూచునది ఎవ్వరిని? శంభుడిని కిరీటి వ్రతము యెవరి కోసము?సుభద్రను పెళ్ళిచేసు కొనుటకు మన భారత జాతి దాస్యాన్ని తొలగించేందుకు ఎవరు పుట్టిరి? గాంధి పుట్టినాడు
ఎంత అద్భుత మైన పూరణ .



ఒకసారి అవధానం లో ఈ దత్తపది యిచ్చారు. సోనియా,తెరిసా,మండేలా,గాంధీజీ నాగఫణి శర్మ గారి
పూరణ.
వాల్లభ్యంబును వీడి వచ్చితి మహో వా సోనియామ్యస్థితిన్
చల్లంగా గడతేరిసాగి గహనీ సంచార ధారా గతిన్
జిల్ల్లన్ గుండియ మండే లాలిత జనశ్రీ జూపు నా ప్రేమతో
నల్లాడెన్ పితృవాక్య నిర్వహణ రాగాంధీ జిత క్రోధమై
అర్థము:-ఈ మాటలు లక్ష్మణుడు అంటున్నాడు రాముడితో వదిన కష్టపడుతూందనే బాధతో అన్నగారి మీద
మిక్కుటమైన ప్రేమతో అంటున్నాడు.వల్కలములు (నారచీరలు)ధరించవలెనను నియమముతో అంతఃపుర
సౌఖ్యాలన్నిటినీ విడిచి పట్టి పితృ వాక్య పరిపాలన కోసం ఈ అడవుల్లో సంచరిస్తున్నాము.అయోధ్య ప్రజలు చూపిన ప్రేమతో నా గుండె మండిపోతూ వుంది.అని అన్నగారి మీద ప్రేమతో అంధుడై పోయిన
లక్ష్మణుడు క్రొధమును జయించిన అన్నగారితో అన్నాడు..  



రాజు గారి కోశాగారం పై అంతస్తులోనే భోజరాజు శయన మందిరం వుంది.
ఒకసారి భోజరాజు కోశాగారం లోకి ఒక దొంగ ఎలాగో ప్రవేశించి విలువైన రత్నాలన్నిటిని మూట గట్టుకొని బయల్దేరే సమయములో వాడికి ఎందుకో జ్ఞానోదయమైంది. వాడు యిలా అనుకున్నాడు.
యతో వ్యంగా కుష్టు నశ్చంధా పంగవశ్చ దరిద్రణ:
యతో వ్యంగా కుష్టు నశ్చంధా పంగవశ్చ దరిద్రణ:
పూర్వోపార్జిత పాపస్య ఫల మాస్నంతి దేహినః
అర్థము:-- లోకం లో అంగవైకల్యము గలవారు, కుష్టు రోగులు,కుంటివారు,గుడ్డివారు,
దరిద్రులూ వీరంతా ఎపుడో చేసిన పాప కర్మల ఫలితాన్ని అనుభవిస్తున్న వారే కదా!అనే పాపభీతి కలిగి
ఆ మూట అక్కడే వదిలేసి వెళ్ళిపోదామని అనుకుంటూ వుండగా, భోజ రాజు నిద్ర పట్టక లేచి కిటికీ లోనుంచి తన అందమైన ధారా నగరాన్ని చూస్తూ చూస్తూ భావావేశంతో గట్టిగా యిలా అన్నాడట.
శ్లోకం:-- చేతోపహరా యువతయః సుహ్రుదనుకూలా సద్భాన్ధవా ప్రణయ గర్భగిరశ్చభ్రుత్యాన్
వల్గంతి దంతి నివహా తరళా: తురంగాః
అర్థము:-- నాకేమి తక్కువమనోహరమైన అందగత్తెలు,అనుకూలురైన మిత్రులూ,సజ్జనులైన బంధువులూ,యెంతో ప్రేమతో సేవచేసే సేవకులు,గజ తురగ దళాలూ,దూకుడు గల సేనలూ వున్నాయి.
దొంగ అప్రయత్నంగా నాలుగో పాదంగట్టిగా చెప్తూ యిలా పూరించాడు.
"సమ్మీలనే నయనయో : నహి కించి దస్తి"అంటే ఒక్కసారి కన్నుమూత పడగానే (అంటే చనిపోగానే)నశించే వే కదా! దాంతో దొంగ దొరికి పోయాడు. భటులు వాడిని బంధించి రాజుగారి దగ్గరకు తీసుకొని వచ్చారు. భోజ రాజు వాడు చేయ బోయిన దొంగ తనాన్నిపట్టించు కోకుండా చక్కటి సత్యంతో తన శ్లోకాన్ని పూరించి నందుకు అతనికి తన చేతి బంగారు కడియాన్ని బహూకరించి పంపేశాడట.



ఒకసారి భోజరాజు ఒక సమస్య యిచ్చాడు. సమస్య:- "అంభోధి:జలధి: పయోధి:ఉదధి:వారాంనిధి: వారిధి:"
ఇవన్నీ సముద్రానికి పర్యాయపదాలు. అన్నీ ఒకే పాదం లో రావాలి. క్లిష్టమైన సమస్య. కాళిదాసు చక్కటి కథ అల్లాడు. పార్వతికి తన భర్త తనకొక సవతిని తెచ్చి తలమీద పెట్టుకోవడం అస్సలు నచ్చలేదు. తన బాధ కొడుకైన షణ్ముఖుడితో చెప్పుకుంది. అప్పుడు షణ్ముఖుడు తండ్రితో యిలా అన్నాడు.
శ్లోకం:-- అంబా కుప్యతి తాత మూర్ద్ని విలసత్ గంగేయం విస్తృజామ్
విద్వాన్ షణ్ముఖ కా గతి?మయి చిరాత్ అస్త్వా స్థితయా వద:
కోపావేశాత్ అశేష వదనై ప్రత్యుత్తరం దత్తవాన్
అంభోధి:జలధి: పయోధి:ఉదధి:వారాంనిధి:వారిధి:
అర్థము:--నాన్నా నీవు గంగను నెత్తిన పెట్టుకోవడం వల్ల అమ్మకు కోపం వచ్చింది. కావున నీవు గంగను పరిత్యజించు. అప్పుడు శివుడు పాపం చాలా కాలంగా నన్ను నమ్ముకొని వున్నది గంగ యిప్పుడు వెళ్లి పొమ్మంటే ఆమె గతి ఏమిటి?ఎక్కడికి పోతుంది?షణ్ముఖుడు తన కోపాన్ని ఆరు ముఖాలతో ఆరు సముద్ర పర్యాయ పదాలు చెప్పాడు. "నదీనాం సాగారో గతి:"నదులకు సాగరమే గతి. సముద్రములో వదిలెయ్యి. భోజ రాజు తో సహా అందరు కవులూ కాళిదాసు సమయ స్ఫూర్తిని మెచ్చుకున్నారు



ఒకసారి కృష్ణదేవ రాయల ఆస్థానానికి ఒక పండితుడు వచ్చాడట.అతను నేను ఏ గ్రంథము లోనిదైనా ప్రశ్నలు అడిగితే వెంటనే జవాబు చెప్పేస్తాను అని గొప్పలు చెప్పుకున్నాడట.సభలోని వారందరూ చాలా గ్రంథాల లోనుండి ప్రశ్నలు అడిగారాట.అన్నింటికీ అతను చాలా బాగా సమాధానం చెప్పాడట.
తెనాలి రామకృష్ణుడు మాత్రం రేపు నేను ఒక గ్రంథము తెస్తాను.అందులో ప్రశ్నలకు సమాధానము యిస్తే మేము మీ గొప్పతనాన్ని ఒప్పుకుంటాము అని చెప్పాడట.
మరుదినము సభకు రామకృష్ణుడు ఒక ఎర్రటి సంచీ లో పక పుస్తకం లాంటిది పెట్టుకొని వచ్చాడట.ఈ గ్రంథం
ేరు 'తిలకాష్ట మహిష బంధనము' దీనిలో ని ప్రశ్నలు వేస్తాను.అన్నాడట.ఆ పండితుడు దిమ్మెర పోయాడు.అసలు ఆ గ్రంథము పేరే అతను వినలేదు.యింక అందులోని ప్రశ్నలకు సమాధానము యేమి
చెప్పగలడు?అందుకని ఓటమి ఒప్పుకొని వెళ్ళిపోయాడు.రాయలు అతన్ని తగురీతి సత్కరించి పంపాడు
అతను వెళ్ళిపోయినా తర్వాత రాయలు రామకృష్ణా అదేమీ గ్రంథము?మేమూ ఆ గ్రంథము పేరు వినలేదు.అని అడిగారు.అప్పుడు రామకృష్ణుడు సంచీ లోనుండి బయటకు తీశాడు.కొన్ని ఎండిపోయిన కర్ర ముక్కలకు ఒక తాడు చుట్టి వుంది.మహా రాజా యివి ఎండిపోయిన నువ్వుకట్టెలు దానికి బర్రెల మెడకు కట్టే పలుపు తాడు చుట్టాను. అంతే.అదే 'తిలకాష్ట మహిష బంధనము'.అన్నాడు.ఆ పండితుడు
ఆ గ్రంథము ఎవరు వ్రాశారు?చూపించండి అని అడగకుండానే వెళ్ళిపోయాడు.అన్నాడు.సభ అంతా
నవ్వులతో అదిరి పోయింది.



ముఖం పద్మ దళా కారం
వచ శ్చందన శీతలం
హృత్కర్తరి సమం చా
అతి వినయం ధూర్త లక్షణం
తా :--ముఖము తామరరేకుల్లాగా అందంగా వుంటుందట.మాటలు గంధము వలే చల్లగానూ,విన సొంపుగానూ వుంటాయట.కానీ మనస్సు మాత్రం కత్తెరలాగా మనకు హాని చేసేదిగా వుంటుందట.అలాంటి
అతివినయము చూపించే వ్యక్తులతో జాగ్రత్తగా వుండమని హెచ్చరిస్తున్నాడు.కవి.



కన్యా వరయతే రూపం
మాతా విత్తం పితా శ్రుతం
బాన్ధవాః కుల మిచ్చంతి
మృష్టాన్న మిత్రే జనా
తా:--ఈ శ్లోకం మనువు చెప్పినది.అమ్మాయి వరుడు అందంగా వుండాలని కోరుకుంటుందట.అమ్మాయి తల్లి
అల్లుడు ఆస్తిగలవాడా కాదా అని చూస్తుందట.తండ్రి అల్లుడు బాగా చదువుకున్నాడా లేదా అని చూస్తాడట.
యిక బంధువులు అబ్బాయి మన కులస్తుడా కాదా అని చూస్తారట.యిక పెళ్ళికి వచ్చినవాళ్ళు భోజనం లోకి
ఏమేమి చేశారు? లడ్డు మారు వడ్డ్డిం చారా లేదా?వంటకాలు రుచిగా వున్నాయా లేదా అనే చూస్తారట.
యిప్పుడు అంతా మారిపోయింది.అమ్మాయితో సహా అందరూ అబ్బాయి జేబు చూస్తున్నారు.అబ్బాయి ఎంత సంపాదిస్తాడు?ఎన్ని కార్లు వున్నాయి?ఎన్ని యిళ్ళు వున్నాయి?అమెరికా లో వున్నాడా?ఇండియా లోనా?సాఫ్ట్ వేరా?కాదా? అని.మారనిది యితరులు మాత్రమే.భోజనానికి ఎన్ని పదార్థాలు చేశారు?ఎన్ని తీపి పదార్థాలు చేశారు?యింక యిప్పుడు వడ్డించు కునే పద్ధతి లేదు కదా తమ యిష్ట మైనవి తామే వడ్డించు కోవచ్చు.



అర్థా గృహే నివర్తంతి స్మశానే మిత్ర బాంధవా
సుకృతం దుష్కృతం చైవ గంచ్చంత మను గచ్చతి
తా:--మనిషి చనిపోయి నప్పుడు ధనము యింటి వద్దనే వుంటుంది.మిత్రులు,బంధువులు స్మశానం
వరకే వస్తారు.మనిషి వెంట వచ్చేవి తాము చేసుకున్న పాపము,పుణ్యము మాత్రమే.అందుకని మనిషి
సత్కర్మలు మాత్రమే చేయవలయును అని కవి హెచ్చరిస్తున్నాడు.



సత్యం మాతా పితా జ్ఞానం
ధర్మో భ్రాతా దయా సఖా
శాంతి: పత్నీ క్షమా పుత్రః
షడేతే మమ బాంధవా
తా:--నాకు సత్యమే తల్లి,జ్ఞానమే తండ్రి,ధర్మమే సహోదరుడు,దయనే మిత్రుడు,శాంతి యే నాకు భార్య ,
ఓర్పేపుత్రుడు,ఈ ఆరుగురు నాకు బంధువులు.(ధర్మరాజ ఉవాచ)



విద్యచే భూషితుండై వెలయుచున్న
దొడరి వర్జింప నగు జుమీ దుర్జనుండు
చారు మాణిక్య భూషిత శస్త మస్తకంబైన
పన్నగము భయంకరము గాదె
తా:--దుర్మార్గు డైన వాడు ఎంత విద్యావంతు డైనను వానితో స్నేహము చేయరాదు.పాముతలపైన మని వున్ననూ దానిని మనము సమీపించలేము గదా!



ఉపకారేణ నీచానాం అపకారోహి జాయతే
పయః పానం భుజంగానాం కేవలం విష వర్ధనం
తా:-నీచులకు ఉపకారము చేసినా వాళ్ళు మనకు అపకారమే చేస్తారు.ఎలాగయితే పాముకు పాలు పోయడం వలన దానికి విషము వృద్ధి యై మనల్ని కాటువేస్తుందో అలాగ.



ఒకసారి భోజరాజు సభ లో కాళిదాసు,దండి,భవభూతి వీరిలో ఎవరు గొప్ప అనే విషయము చర్చకు వచ్చింది.
ఈ వాదమునకు తీర్పు చెప్పుటకు పరమేశ్వరి యే తగినదని అందరూ ఆలయమునకు వెళ్లి భువనేశ్వరీ దేవి ని
ప్రార్థించిరి,కాళికా దేవి ముఖమునుండి "కవిర్దండీ కవిర్దండీ భవభూతి స్తు పండితః" అను మాటలు విన వచ్చెను.
దండి కవి దండియే కవి భవభూతి పండితుడు. కవి కాళిదాసు కు చాలా కోపం వచ్చింది ఆయన కోపంతో
'కోహం రండే?" అన్నాడట నేనేవారే రండా? వెంటనే దేవి "త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం"నీవే నేను నీవే నేను నీవే నేను" అని అనిందట. కాళిదాసు తల్లిని తిట్టినందుకు పశ్చాత్తాపం తో ఆమెను క్షమాపణ వేడి
ఆమెను స్తోత్రం చేశాడట. అప్పటి కవి పండితులు కూడా రాగద్వేషాలకు అతీతులు కారు.


ఒకసారి సనకసనందనులు అనే నల్గురు ఋషులు విష్ణువును దర్శించ టానికి వైకుంఠ మునకు పోతారు.
అక్కడ జయ,విజయులనెడి ద్వార పాలకులు వారిని లోనికి పోవడానికి అనుమతించరు.వారు ఎన్ని విధాల
చెప్పి చూసినా వారు లోనికి అనుంతించరు.అప్పుడు వారికి కోపం వచ్చి మీరు భూలోకం లోమానవులుగా పుట్టుదురు గాక అని శాపం యిస్తారు.అప్పుడే విష్ణువు బయటికి వచ్చి ఆ ఋషులను క్షమించ మని వేడి జయ.విజయులను మందలిస్తాడు.వారిచ్చిన శాపమును గురించి విని విష్ణువు జయవిజయుల తో యిలా చెప్తాడు.
మీరు భూలోకం లో మంచి వారుగా పుట్టి వంద జన్మల తర్వాత నన్ను చేరుకుంటారా?లేక రాక్షసులై పుట్టి
నన్ను ద్వేషిస్తూ మూడు జన్మల లో నా చేత చంప బడి నన్ను చేరుకుంటారా?మీకేది యిష్ట మో చెప్పండి.అప్పుడు వారు స్వామీ
మీకు దూరంగా వంద జన్మల వరకు మేము వుండలేము.రాక్షసులుగా పుట్టి మూడు జన్మ లలో మీ చేత చంపబడి మిమ్ములను చేరుకోవడమే మాకు యిష్టము.అని చెప్తారు.
వారిద్దరూ మొదటి జన్మలో హిరణ్యాక్ష, హిరణ్య కశిపులుగా పుట్టి లోక కంటకులై అందరినీ బాధ పెడుతుంటారు.వరాహావతారము లో హిరణ్యాక్షుడినీ,నరసింహావతారం లో హిరణ్యకశిపు డినీ విష్ణువు
సంహరిస్తాడు.
రెండవ జన్మ లో రావణ,కుంభకర్ణులు గా పుట్టి లోక కంటకు లై చరిస్తూ వుంటారు. అప్పుడు విష్ణువు శ్రీరాముడు గా పుట్టి వారిని సంహరిస్తాడు.
మూడవ జన్మ లో శిశుపాల, దంతావ క్త్రు లుగా పుడతారు.విష్ణువు శ్రీ కృష్ణుడు గా అవతరించి వారిద్దరినీ
సంహరిస్తాడు.శిశుపాలుడిని వంద తప్పుల వరకూ క్షమించి ధర్మరాజు చేసిన రాజసూయ యాగం లో శిశు
పాలుడిని తన చక్రము తో సంహరిస్తాడు.అప్పుడే శిశుపాలుడి ఆత్మ ఆయనలో లీన మవుతుంది.
యిక దంతవక్త్రుడు వృద్ధ శర్ముకు,శ్రుత దేవకు పుట్టిన కొడుకు.శ్రుతదేవ వసుదేవుడి చెల్లెలు.శిశుపాలుడు
యితడి అన్న. ఇతను కరూష దేశానికి అధిపతి.తన మిత్రులైన పౌండ్రక వాసుదేవాదులనుశ్రీకృష్ణుడు చంపడం వల్ల కృష్ణుడి మీద పగ పెంచుకుంటాడు.తన మిత్రులకు ఉత్తర క్రియలు జరిపిస్తూ వుంటే అక్కడ కృష్ణుడిని చూసి అతనితో యుద్ధము చేసి కృష్ణుడి చేతిలో మరణిస్తాడు.అతని తేజస్సు కృష్ణుడి లో ఐక్య
మవుతుంది అలాగ జయ,విజయులు తిరిగి విష్ణువును చేరుకుంటారు.



"Truth,Purity,unselfishness:-- Where ever these are present there is no power bellow or above the sun - to crush the possession there.Equipped with these one individual face the whole universe in opposition. SWAMY VIVEKANANDA.
సత్యము, పవిత్రత,నిస్వార్థము-- ఈ సుగుణాలున్న వాడిని అణగద్రోక్క గల సామర్థ్యం ముల్లోకాలలో ఎవరికీ లేదు. అలాంటి సుగుణ సంపన్నుడు విశ్వమంతా ఏకమైనా ఒంటరిగా ఎదిరించ గలుగుతాడు.
స్వామి వివేకానంద
అతనికి వార్ధి కుల్య యగు నగ్ని జలంబగు మేరు శైల మం
చిత శిలలీల నుండు మద సింహము జింక తెరంగు దాల్చు గో
పిత ఫణి పూలదండ యగు భీష్మ విషంబు సుధారసం బగున్
క్షితి జన సమ్మతం బగు సుశీల మదెవ్వని యందు శోభిలున్ (భర్తృహరి సుభాషితము)
తా:-- భూమిలోనున్న సుజనులు అందరూ ఒప్పుకునే సుగుణాలు ఎవ్వరి యందు ఉంటాయో ,అతనికి
సముద్రము పిల్లకాలువతో సమానమవుతుంది,అగ్ని నీటి తో సమానమవుతుంది,మేరు పర్వతము చిన్న రాయి లాగ కనబడుతుంది,మద సింహము జింక లాగా ప్రవర్తిస్తుంది,కోపముతోనుండు పాము గూడ పూలదండ అయిపోతుంది,భయంకరమైన విషము అమృతము లా తయారవుతుంది,



అహింసా సత్య మస్తేయం బ్రహ్మచర్యం దయార్జవం
క్షమా ధృతి ర్మితాహార శౌచం చేతి యమా దశ
అర్థము: అహింస సత్యము దొంగలింప కుండుట బ్రహ్మ చర్యము
దయ రుజుప్రవర్తన (త్రికరణముల ఏకత్వ ప్రవృత్తి) ఓరిమి
ధైర్యము మితాహారము శౌచము (బాహ్యంతర శుద్ధి)
ఈ పదియును యమములు అని పెద్దలు చెప్తారు (యమము అనగా ఒక యోగము)
పైని పది యోగానికి అంగములు




రామ రావణ యుద్ధం ముగిసింది. రావణుడు వధించ బడ్డాడు.విభీషణుడు రావణుడి అంతిమ సంస్కారం చేయడానికి నిరాకరిస్తాడు.
త్యక్త ధర్మ వ్రతం, క్రూరం,నృశంసం, అనృతం తథా నాహం అర్హోస్మి సంస్కర్తుం పరదారాభి మర్శి నమ్
అర్థము:-ధర్మ వ్రతం వదిలినవాడు, క్రూరుడు, కఠి నుడు, అసత్యవాదిపర స్త్రీలను బలాత్కారించేవాడు అయిన రావణుడికి నేను అంతిమ సంస్కారం చేయ లేను. అతను దానికి అర్హుడు కూడా కాదు.
అప్పుడు రాముడు
మరణాంతాని వైరాణినిర్వృత్తం నః ప్రయోజనం
క్రియ తామస్య సంస్కారో మమా ప్యేష యథా తవ
అర్థము:-శత్రుత్వాలు మరణం తో అంతమయి పోయేవే. మనం తలపెట్టిన కార్యం పూర్తయింది. యితని దహన సంస్కారం యధా విధిగాచేయవలె రావణుడు నీకేలాగా సోదరుడో నాకు కూడా అతను సోదర సమానుడే. రాముడి ధర్మ పరాయణత్వం ఎలాటిదో తెలిపే శ్లోకం యిది.తన భార్యను అపహరించి తనను క్షోభకు గురి చేసిన రావణుడి మీద అతనికి కోపం లేదు రావణుడికి అంతిమ సంస్కారాలు సగౌరవంగా,సక్రమం గా నిర్వర్తించమని చెప్తున్నాడు. "ఉదార చరితానాం తు వసు ధైక కుటుంబకం"
ఔదార్యము గల మహానుభావులకు ఈ వసుధ అంతా ఒకే కుటుంబమే అన్న సుభాషితానికి రాముడి కంటే
గొప్ప ఉదాహరణ వుండదు."రామో విగ్రహవాన్ ధర్మః"అని మారీచుడి లాంటి రాక్షసుడే రాముణ్ణి కీర్తించాడు. .


ఈ కథ కూడా ఇంతకుముందు వ్రాసిందే కొత్త మిత్రుల కోసం మరొక్కసారి.
దండి మహాకవి సంస్కృత సాహిత్యం లో అత్యుత్తమ శ్రేణి కవుల లో ఒకరు."దశకుమార చరిత్ర" అనే అతి
సుందరమైన గద్య కావ్యాన్ని వ్రాశాడు.'కావ్య దర్శనం' అనే అలంకార శాస్త్ర గ్రంథం కూడా రాశాడు.సరస్వతీ దేవి
చేత 'కవిర్దండీ కవిర్దండీ కవిర్దండీ న సంశయః అని అనిపించుకున్న వాడు.దండినః పదలాలిత్యం అని పేరు
పొందిన వాడు.దండి దక్షినభారతీయుడని ప్రసిద్ధి.
సరే యిప్పుడు మనం చెప్పుకునే కథలో కాళిదాసు,దండి భోజరాజు ఆస్థాన కవులు.ధారానగర వాసులు.
పైపెచ్చు యిద్దరూ నిరంతర తాంబూల చర్వణ చర్వులు.ఒకరోజు యిద్దరూ కూర్చొని సాహిత్య చర్చ జరుపు కుంటూ,మధ్యలో లేచి వీధిలోకి వెళ్ళారు.రాజవీధిలో నడుస్తూ ఒక చోట తాంబూల సేవనం కోసం ఆగారు.
చూస్తే దండిగారి దగ్గర సున్న్నం నిండుకుంది.కాళిదాసు గారి దగ్గర తామలపాకులు అయిపోయాయి.
దగ్గర లోనున్న దుకాణానికి వెళ్ళారు.దుకాణం నడుపుతున్న పడుచు పిల్లతో దండి మహాకవి లలితలలితంగా
యిలా అన్నాడు. 'తూర్ణ మానీయతాం చూర్ణం పూర్ణచంద్ర నిభాననే'(త్వరగా సున్నం యిప్పించ వమ్మా
ఓ!పూర్ణ చంద్రుడి వంటి మోముగల చినదానా!)
కాళిదాసు తనకు తమలపాకులు కూడా కావాలని కోరుతూ శ్లోకం పూర్తి చేశాడు.
'పర్ణాని స్వర్ణ వర్ణాని,కర్ణాంత కీర్ణ లోచనే' (చేవులవరకూ వ్యాపించిన విశాల నేత్రాలు గల సుందరీ!బంగారు
వన్నె గల తమలపాకులు కూడా ఆ చేత్తోనే యిప్పించు)అన్నాడు.
ఆ చిన్నది ముందు కాళిదాసుకు ఆకులు అందించి ,తర్వాత దండికి సున్నం అందించింది. దండి మహాకవి చిన్నబుచ్చుకున్నాడు.ముందు సున్నం అడిగింది నేను ఆకులు ఆయన తర్వాత అడిగాడు.మరి ఆయనకు ముందు ఆకులిచ్చి తర్వాత నాకు సున్నం యిస్తున్నావు.ఈ భోజరాజు లాగా నీవు కూడా కాళిదాసు పక్షపాతివా?ఆయనేదో నాకంటే గొప్ప కవి అనుకోని ముందు ఆయనకు ఆకులిచ్చావా?అన్నాడు కోపంగా
నిజంగా దండి అన్నది యదార్థం.దారానగరం లో ప్రజలందరి లాగే ఆ నెరజాణ కూడా కవితా రసజ్ఞు రాలే
ఆమెకు కాళిదాసు కవిత్వమంటే చాలా యిష్టం.అందుకే ఆయానకు అగ్రతాంబూలం యిచ్చింది.కానీ ఆమె
లౌక్యం తెలిసిన వ్యాపార దక్షురాలు.ఉన్నమాట చెప్పిఒకరిని నొప్పించట మెందుకని తెలివిగా సమాధానమిచ్చింది అయ్యా !నేను దుకాణం లో సరుకు అమ్మడానికి కూర్చున్నాను మహాకవుల కవిత్వం కమామిషూ అర్థం చేసుకొని గుణ దోషాలు నిర్ణయించ టానికి నేనెంత దాన్ని?నాది చిన్న బుర్ర కాళిదాసు గారు చెప్పిన శ్లోక పాదం లో నాకు 5 నా'ణా'లు వినిపించాయి తమరి శ్లోక పాదం లో నా చెవికి 3 నా'ణా'లు
వినిపించాయి మూడు నా'ణా'ల కంటే 5 నా'ణా'లు ఎక్కువ కాబట్టి పెద్ద బెరానికే ముందు ప్రాధాన్యత యిచ్చాను నాకు పక్షపాతం గానీ పక్షవాతం గానీ యేమీ లేవు.మిమ్మల్ని నొప్పించి వుంటే క్షమించండి.అనింది.
దండికి కోపం పోయి నవ్వు వచ్చింది.ఈ ధారానగర వాసులాటి యిదే చిక్కు యిక్కడ అందరూ అంతో యింతో కవిత్వం తెలిసిన వారు,రసజ్ఞులు, సమయస్ఫూర్తి కల వాళ్ళే అనుకుంటూ తాంబూలం నములుకుంటూ కాళిదాసు తో కలిసి గోష్టి కొనసాగించేందుకు వెళ్ళిపోయాడు.  



ఒక రోజు భోజ రాజు వ్యాహ్యాళి కై వెళ్లి ఒక చెట్టుక్రింద విశ్రమించా డ ట. అక్కడికి దగ్గరలో వున్న చెరువు లో ఒక చాకలి బట్టలు వుతుకుతున్నా డట. బండ మీద బట్టలను బాదు తూంటే ఆ శబ్దం రాజుకు ఈ విధంగా విన వచ్చిందట. "బీబీ బీబీ బిబి బీబీ బీబీ". మరుదినం సభలో దాన్నే సమస్యగా యిచ్చి పూరించ మన్నాడట.
కాళిదాసు చేసిన పూరణ.
మధ్యాహ్న కాలే మలినాంబ రాణాం
ప్రక్షాళ నార్థం రజకః కరాభ్యాం
పాషాణ ఘాతేన కరోతి శబ్దం
బీబీ బీబీ బిబి బీబీ బీబీ బీబీ అర్థం:-- ఒక చాకలి మధ్యాహ్న వేళ రాతిపై బట్టలను వుతుకు చున్నప్పుడు పై విధముగా ధ్వని వచ్చెను.



ఒక శిష్యుడు గురువుగారి దగర విద్య నభ్యసించి,పెళ్ళిచేసుకొని ఊరిబయట ఇల్లు కట్టుకొని స్థిరపడినాడు.
ఒకరోజు గురువుగారు ఎడ్లబండి మీద ఆ దారిలో వెడుతూ శిష్యుడి యింటికి వచ్చినారు.శిష్యుడు అతడి భార్య
ఆయనకు చక్కని ఆతిథ్య మిచ్చి పంచల చాపు యిచ్చి కాళ్ళకు నమస్కారము చేసినారు.అప్పుడు గురువు
ఒక శార్దూల వృత్తము(పద్యము) లోమధ్యలో ఒక వేదమంత్రము వచ్చేట్టుగా ఆశీర్వదించారు.
అప్పుడు శిష్యుడు నవ్వుతూ గురువుగారూ! మా ఆతిథ్యము స్వీకరించి మా యింట శార్దూలమును(పులిని) విడిచి
వెళ్ళుట మీకు న్యాయమేనా?అన్నాడు. గురువు గారు నవ్వుతూ ఆ శార్దూలమును మంత్రించి వదిలానులే
నీకు యేమీ అపకారము చెయ్యదు.పైగా నీవు ఊరిబయట ఇల్లు కట్టుకున్నావు.పంచమీ తత్పురుషము
లేకుండా ఈ షష్టీ తత్పురుషము కాపలా పెట్టాను..అన్నారు.
పంచమీ తత్పురుషము నకు అందరూ చెప్పే ఉదాహరణ 'దొంగ వలన భయము' షష్టీ తత్పురుషము నకు
ఉదాహరణ 'కుక్క యొక్క కాపలా' ఈ గురువుగారు దొంగ వలన భయము లేకుండా శార్దూలము యొక్క కాపలా పెట్టారు.
ఇప్పటి లాగా అప్పటి వాళ్ళు గుమ్మం దగ్గరనుండే టాటా బై బై చెప్పేవారు కాదు.గురువుగారిని బండీలో ఎక్కించి మీరు మళ్ళీ మా యింటికి దయచేయ్యాలి అన్నాడు శిష్యుడు. అందుకు గురువు గారు నవ్వుతూ
నీవు ద్వంద్వా తీతుడయిన తర్వాత వస్తానులే అన్నాడట.ద్వంద్వ సమాసమునకు ఉదాహరణ
'భార్యా భర్తలు' 'తల్లిదండ్రులు'యిస్తారు మామూలుగా.ద్వంద్వా తీతుడంటే మీ భార్యాభర్తలు తల్లిదండ్రులైనప్పుడు అంటే మీకు సంతానము కలిగినప్పుడు మళ్ళీ వస్తాను.అని అర్థము.పూర్వము అంత చమత్కారముగా మాట్లాడేవాళ్ళు.



"అందరికీ 'వినాయక చవితి' శుభాకాంక్షలు"
ప్రాచ్యాం రక్షతు హేరంబః ఆగ్నేయాంఅగ్ని తేజసః
యామ్యాం లంబోదరో రక్ష్యేత్ నైరుత్యాం పార్వతీ సుతః
ప్రతీచ్యాం వక్ర తుండస్తూ వాయవ్యం వరదః ప్రభు
ఉదీచ్యామ్ గానపః పాతు ఈశాన్యం ఈశనందనః
ఏవం దశ దిశో రక్ష్యేత్ హ్యవరం విఘ్ననాయకః
హీరంబస్య దుర్గ మిదం త్రికాలం యః ప టే న్నరః
కోటిజన్మ కృతం పాపం ఏకార్తేన నశ్యతి
ఇది 'శ్రీ గణే శ దుర్గా స్తోత్రం'రక్షా కర మైన స్తుతి
అర్థము:--తూర్పున హీరంబుడు,ఆగ్నేయం లో అగ్ని సమాన తేజస్వి,దక్షిణాన లంబోదరుడు, నైరుతి లో
పార్వతీ సుతుడు,పడమరన వక్రదంతుడు,వాయవ్యం లోవరదు డైన ప్రభువు,ఉత్తరాన గణపుడు,ఈశాన్యము లో ఈశ నందనుడు-ఇలా పది దిక్కులా విఘ్న నాయకు డైన 'శ్రీ మహా గణపతి;' మిమ్ముల నందరినీ కాపాడు గాక.
హేరంబుని స్మరించే ఈ రక్షా స్తోత్రాన్ని మూడు మార్లు చదివే వారికి పాపాలు నశించడమే కాక సంకటాలు తొలగు తాయి. వెంటనే పరిష్కారం లభిస్తుంది.ఇది శివకృష్ణ సంవాదం లో ప్రభోదించిన స్తుతి గా పురాణాలు చెప్తున్నాయి.




ఒక సారి భోజ రాజు వేటకు వెళ్లి బాగా అలసి పోయి ఒక చెరువు గట్టున నేరేడు చెట్టు నీడన విశ్రమించాడు.
ఆ చెట్టు మీద కొన్ని కోతులు ఆటలాడుకుంటూ కొమ్మలు కదిలించి నప్పుడల్లా నేరేడు పళ్ళు రాలి చెరువులో పడి యిలా శబ్దం చేస్తున్నాయి "గుళు గుగ్గుళ్ళు గుగ్గుళ్ళు" ఆలోచిస్తే అది అనుష్టుప్ ఛందస్సులో ఒక పాదం పూర్తీ చేస్తూంది. భోజరాజు మరుదినం సభలో దాన్నీ సమస్యగా యిచ్చి పూర్తి చెయ్య మన్నాడు. "గుళు గుగ్గిళ్ళు గుళు". కాళిదాసు యిలా పూరించాడు.
జంబూ ఫలాని పక్వాని పతన్తి విమలే జలే
కపి కంపిత శాఖాభ్యాం గుళు గుగ్గుళ్ళు గుళు
అర్థము:- కోతులు కొమ్మలను కదిలిస్తూ వుంటే పండిన నేరేడు పళ్ళు రాలి చెరువులో పడి 'గుళు గుగ్గుళ్ళు గుళు' అని శబ్దం చేస్తున్నాయి.భోజరాజు సంతోషానికి అంతే లేకుండా పోయింది.కాళిదాసును తగు రీతిని సత్కరించాడు. 
 
 
 



దారిద్ర్య రోగ బంధన వ్యసనానిచ
ఆత్మాపరాధ వృక్షస్య ఫలాన్యేతాని దేహినాం
అర్థము:--దారిద్ర్యం, రోగం, దుఃఖం, బంధనం, వ్యసనం యివన్నీ పూర్వం మనం చేసిన దోషకర్మ లనే
వృక్షం నుంచి లభించిన విష ఫలాలే. కానీ మనము అమాయకంగా అన్యులేవరో మన ఆపదలకు కారకులని ఆవేదన పడుతుంటాము. ఎంతటి వారైనా ఈ కాలభుజంగపు కాటుకు బలి కావలిసిందే.
అందుకే భారతం లో భీష్మాచార్యుడు యిలా అంటారు.
రాజట ధర్మజుండు,సురరాజ సుతుండట ధన్వి శాత్రవో
ద్వేజకమైన గాండీవము విల్లట సారధి సర్వభద్ర సం
యోజకమైన చక్రి యట ఉగ్ర గదాధరుడైన భీము డ
య్యాజికి తోడు వచ్చునట యాపద గల్గుటిదేమి చోద్యమో
అర్థము:-- ధర్మానికి మారుపేరైన ధర్మరాజు రాజు, మహా వీరుడైన యింద్రుడి కొడుకైన అర్జునుడు ధన్వి యట. శత్రు భయంకరమైన గాండీవము అతని ధనుస్సు సర్వ సౌభాగ్యాలనూ ప్రసాదించే శ్రీకృష్ణుడు వాళ్లకు తోడు, ప్రచండ గదాధారి యైన భీమసేనుడు కొండంత అండ. ఇంతటి సహాయ సంపత్తి కలిగినా పాండవులకు అరణ్య, అజ్ఞాత వాసాలనే కస్టాలు తప్పలేదు. ఇది చాలా ఆశ్చర్యం.
ఎంతటి వారి కైనా పూర్వకర్మ ఫలితము అనుభవించక తప్పదు. ఏ ఒక్కరూ కాలనియమానికి అతీతులు కారని మనకు నలుడు,హరిశ్చంద్రుడు,శ్రీరాముడు మొదలైన వారి జీవితాలు రుజువు చేస్తున్నాయి.



జ్ఞాయతే జాతు నామపి న రాజ్ఞ: కవితాం వినా
కవే: తత్ వ్యతిరేకేణ న కీర్తి:స్ఫురతి క్షితౌ
లోకం లో కవి కీర్తించనిదే రాజుకు పేరు రాదు రాజాశ్రయం లేనిదే కవికి కీర్తి రాదు. ఇవి రెండూ ఒకదాని నొకటి ఆశ్రయించి వుంటాయి. "నిరాశ్రయే న శోభంతే పండితా,వనితా,లతా"అని మనుస్మృతి చెప్తుంది
ఆధారం లేనిదే పండితుడు,స్త్రీ,తీగ నిలబడ లేవు. (శోభించవు)"మణి నా వలయం వల యేన మణి::"
రత్నము వలన కంకణము నకు అందము వస్తుందా?కంకణము లో పొదిగి నందు వల్ల రత్నము మెరుస్తుందా?రెండూ ఒకదాని నొకటి ఆశ్రయించి వుంటాయి. అలాగే కవి, రాజు కూడా.



ద -ద -ద (అంటే ఇమ్ము,ఇచ్చుట)
దానానికి గుర్తుగా సాగింది ఇలను సృష్టి
పంచ భూతము లిచ్చును మనకు స్పూర్తి
స్వార్థ రహితములై ధర్మము చెప్పి దారి చూపే
ధర పైన (భూమి పై) దానమే ఉత్తమ ధర్మ మంటూ
ద -ద- ద అని ఉరిమి చెప్పు గగనము(ఆకాశము )
మహీధరము (పర్వతము)మోయును ఈ మహి (భూమి)భారమంతా
జలదము (మేఘములు) లియ్యవా జలధార లెన్నొ
పంట చేలకు ప్రాణ మీయగా
పాడిపంటలు పసిడి పూవులు
ప్రకృతి పంచద మానవాళికి
ఎల్ల వేళల వీచు కదా చల్ల గాలి
శ్రమ జీవులకు సేద తీర్చగా
తీయని జలము నందిచవా నదులు
కొంచె మిచ్చినా చాలనుచు మనకు
ఘన ఫలము లందించవా తరులు లతలు
నీవు వేసిన కసవు (గడ్డి)తిని గోవులు
నిరతము కురిపించవా క్షీర ధారలు
దాన ధర్మము చేసికోవలె
దయను మించిన గుణము లేదిల
ఎంచి చూడక వంచ నెంచక
ఎదుటి వారికి తోడు నిలబడు
సాయపడ వలిసిన చోటనే సంశ యించు
స్వార్థ పరతను చిక్కి మనుజు డె పుడూ
సాగునా మన బతుకు సహకారము లేక
ఇచ్చుటే మిన్న గుణము లన్నిటి కన్న
వితరణ మెరుగని మనిషికి విలువ సున్న
జ్ఞాని యైన తెలియును దాన మహిమ
తెలిసికో నీవిధి ఓ మానవా (రచన వెంపటి హేమ)తెలుగు వెలుగు సౌజన్యముతో



దైవాన్ని మెచ్చుకునే భజనలు కట్టిపెట్టు
దైవం మెచ్చుకునే పనులు మొదులు పెట్టు
కంటికి కనిపించే ప్రాణినే ప్రేమించ లేకపోతే
కంటికి కనిపించని దైవాన్నలా ప్రేమించ గలవు?
తిరుపతి లో ఏడుకొండలు కనిపిస్తాయేమో గానీ ఏడుకొండలవాడు కనిపించడు
హరిద్వార్ లో హరిద్వారాలు కనిపిస్తాయేమో గానీ హరి కనిపించడు.
దేవుని దర్శనానికి ధ్యాన మొక్కటే మార్గం.
నీ వెంట రాని ఇంటిని,ఒంటిని రోజూ కడుగుతావు,
నీ వెన్నంటి వచ్చే మనస్సు నెప్పుడు కడుగుతావు?



ఇది ఇంతకుముందు వ్రాసిందే కొత్త మిత్రుల కోసం మరొక్క సారి.
ఒకరోజు భోజరాజు చాలా ఉల్లాసంగా "టంటంట టంటంట టటంట టంటం' అని కూనిరాగం తీస్తూ సభకు వచ్చాడట. మంత్రి కేమీ అర్థం కాలేదు రాజా! కవులను కావ్య గానం చేయమన్నారా?లేక మీరేదయినా సమస్య యిస్తారా? అని అడిగాడు. రాజు నవ్వుతూ ఇదే సమస్య "టంటంట టంటంట టటంట టంటం" దీన్ని ఆధారంగా చేసుకొని మిగతా మూడు పాదాలూ పూరించాలి. సభలో బాణుడు,భవభూతి తో సహా అందరు కవులూ రాజు కేమైనా పిచ్చి పట్టిందా అని నివ్వెర పోయి చూస్తున్నారు. కాళిదాసు మాత్రం ముఖం లో ఏ భావమూ చూపకుండా కూర్చున్నాడట.అప్పుడు భోజ రాజు మహాకవీ మీరు కూడా నాకు మతి పోయిందనుకుంటున్నారా? అని అడిగాడు. అంత ధైర్యం నాకు లేదు ప్రభూ!సమస్య యింకో మారు వివరించండి అన్నాడు.కాళిదాసు. .దానికి రాజు కుమార సంభవ కావ్యం లో మీరు రాసిన 'అస్తుత్తరస్యాం దిశి దేవాతాత్మా"అన్నట్లు యింద్రవజ్ర వృత్తములోని పాదం యిది. ఈ వృత్తం మీకు కొట్టిన పిండే కదా పూరించండి.అని సమస్య మరోమారు వినిపించాడు.. వెంటనే కాళిదాసు అయిదు క్షణాలు కళ్ళు మూసుకొని యిలా చెప్పాడు.
'రాజ్యాభిషేకే మద విహ్వాలయా:
హస్తాత్ చ్యుత: హేమ ఘటః యువత్యాః
సోపాన మార్గేషు కరోతి శబ్దం
టంటంట టంటంట టటంట టంటం"
రాజు ఆశ్చర్యం తో అలా చూస్తూండి పోయాడు. అలా చూస్తారేమి మహారాజా!అర్థం సులభమే కదా!నేను సభకు అర్థం వివరిస్తాను. రాజు గారికి పరిచారికలు స్నాన ఘట్టం లో స్నానం చేయిస్తున్నారు. వారిలో ఒక పరిచారిక రాజుగారి సౌందర్యం చూసి మన్మధ మదం లో మై మరిచి పోయింది. ఆమె చేతి లోని బంగారు చెంబు జారి పోయి స్నానఘట్టం మెట్ల మీదు గా దొర్లుతూ మీరు చెప్పినట్టు 'టంటంట టంటంట టటంట టంటం' అని మోత చేసింది.
భోజరాజు ఆశ్చర్యంగా మహా కవీ! మీరు ఉదయం స్నాన ఘట్టం దగ్గర లేరు కదా!మీరెలా చెప్ప గలిగారు?
నేను మీ ఉల్లాసాన్ని చూసి ఊహించి చిన్న శ్లోకం చెప్పాను. అన్నాడు కాళిదాసు. భోజ రాజు
సింహాసనం మీది నుంచి లేచి వచ్చి కాళిదాసును కౌగలించుకొని అక్షరలక్ష లిచ్చిగౌరవించాడు.భోజరాజు మనసులో వుండేది కాళిదాసు చెప్పగలుగుతాడు..
అందుకే కాళిదాసును మహాకవి అన్నారు. . .



శ్రీకృష్ణదేవరాయలు మరణించిన వెంటనే గజపతి రాజు కన్నడ రాజ్యానికి దండెత్తి రాగా పెద్దనామాత్యుడు ఈ సీస పద్యము వ్రాసి గజపతికి పంపి నాడట.
రాయ రాహుత మిండ రాచ ఏనుగు వచ్చి యారట్ల కోట గోరాడునాడు
సంపెట నరపాల సార్వాబౌముడు వచ్చి సింహాద్రి జయశిల జేర్చునాడు
సెలగోలు సింగంబు చేరి ధికృతి గంచు తలపుల గరుల డీ కోల్పునాడు
ఘనత నిర్భర గండపెండేర మిచ్చి కూతు రాయల కొనగూర్చునాడు
ఒడ లెరుంగవో చచ్చితో యుర్విలే వో
చేరజాలక తలచెడి జీర్ణ మైతో
కన్నడం బెట్లు జోచ్చేదు గజపతీంద్ర
తెరచినిలు కుక్క జొచ్చిన తెరగు దోప
అర్థము:-- రాహువు వలె రాయలు యారట్లకోట,సింహాద్రి, యివన్నీ గెలిఛి నీ రాజ్యపు తలుపులను ఏనుగులతో డీ
కొట్టిన నాడు,, కాలికి గండపెండేరము తొడిగి కాళ్ళు కడిగి నీ కూతురిని రాయలకుకన్యాదానము చేయు నాడు
నీవేమైన చని పోయినావా?ఒళ్ళు తెలియక పడుకున్నావా?నీ తల చెడి పోయి జీర్ణమై పోయి వుండిందా?
ఇప్పుడు రాయలు చనిపోయిన తర్వాత తెరచి వున్న యింట్లోకి కుక్క జొరబడి నట్లు కన్నడ దేశము పైకి యుద్ధానికి వస్తున్నావు.నీకు
సిగ్గుగా లేదా?
ఈ సీస పద్యము చదివి గజపతి సిగ్గుతో వెనుదిరిగి పోయాడట. గజపతి యెంత దుర్మార్గుడైనా ఆ పద్యము చదివి సిగ్గుతో వెను తిరిగి వెళ్ళిపొయినాడు.యిప్పటి సిగ్గు యెగ్గు లేని మన నాయకులతో పోలిస్తే గజపతి ఉత్తము డని పించడా?



ఒకసారి రాయలు బంగారు పళ్ళెరమున కవి గండపెండేరము తీసుకొని వచ్చి సభయందు వుంచి,సంస్కృతాంధ్రము లందు సమముగ కవనము చెప్పగలిగిన వారు దీనిని తీసు కొనుటకు అర్హులు అని పలికెను. సభలో ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు రాయలు
ముద్దుగ గండపెండియరమున్ గొనుడంచు బహూక రింపగా
నొద్దిక నా కొసంగుమని యొక్కరు గోరగ లేరు లేరకో అని సగము పద్యము జదివిన పెద్దనామాత్యుడు లేచి
పెద్దన బోలు పండితులు పృథ్విని లేరని నీ వెరుంగవే
పెద్దన కీదలంచినను పెరిమి నాకిడు కృష్ణరాణ్రుపా
అని పూరించి ఒక ఉత్పల మాలికను తెలుగులోనూ,సంస్కృతము లోనూ నాశువు చదివెనట . అప్పుడు రాయలు సింహాసనము దిగి వచ్చి తానే స్వయముగా పెద్దన కాలికి గండ పెండేరమును తొడిగెనట .
రాయల మరణానంతరము పెద్దన తన అవస్థ యిట్లు చెప్పుకొనెను

ఎదురైన చో దన మద కరీంద్రము నిల్పి కేలూత నొసగి ఎక్కించు కొనియె
మను చరిత్రంబందు కొను వేళ పురమేగ పల్లకి దన కేల బట్టి యెత్తె
గోకట గ్రామాద్యనేకాగ్రహారంబు లడిగిన సీమలందు నిచ్చె
బిరుదైన కవి గండపెండేరమున కీవే దగుదని తానె పాదమున తొడిగె
ఆంద్ర కవితా పితామహ అల్లసాని పెద్దన కవీంద్ర యని నన్ను బిల్చునట్టి
కృష్ణ రాయలతో దివికేగలేక బ్రదికి యున్నాడ జీవచ్చవంబు నగుచు.
అర్థము:--ఆయన ఏనుగు మీద వ్యాహ్యాళి కి పోతున్నప్పుడు నేను ఎదురైతే తన చేయి అందించి ఎక్కించి తన ప్రక్కన కూర్చుండ బెట్టుకునేవాడు,మనుచరిత్రము తీసుకున్నప్పుడు పల్లకీ తానే ఎత్తి పురమంతా తిప్పినాడు,ఎన్నో అగ్రహారములు నేనడిగిన చోట యిచ్చె,బిరుదైన గండపెండేరమునకు నీవే తగిన వాడవని తానే పాదమున తొడిగె,ఆంద్ర కవితా పితామహా అల్లసాని పెద్దన కవీంద్రా అని నన్ను పిలుచు నట్టి రాయలతో
స్వర్గమునకు పోలేక జీవచ్ఛవము లాగ బ్రతుకున్నాను. అని దుఃఖించినాడు.


బ్రౌన్ దొరగారు అధికారిగా వున్నప్పుడు ఆయన చాలా మందికి ఉదారంగా సహాయము చేసేవారు.
ఒక బీదముసలి బ్రాహ్మణుడు యింటి జరుగుబాటు కు ధనము లేక ఆకలికి తాళ లేక బ్రౌను దొరకు యిలా ఒక లేఖ పద్యరూపములో వ్రాశాడట.
లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె బ్రాణంబులున్
టావుల్ దప్పెను మూర్చ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమం బయ్యెడిన్
నీవే దప్ప నితః పరం బెరుగ మన్నింపందగున్ దీనునిన్
రావే యీశ్వర కావవే వరద సంరక్షింపుమా భద్రాత్మకా
తా:- బలము కొంచెము కూడా లేదు, ధైర్యము సడలిపోయింది,ప్రాణములు తమ నెలవు నుండి తప్పుకునేటట్టు వున్నాయి,మూర్చ వస్తూ వుంది,శ్రమ ఎక్కువై శరీరము అలసి పోయింది,నీవు తప్ప దిక్కెవరూ లేరు.నన్ను,ఈ దీనుని కాపాడు వచ్చి నన్ను రక్షించి కాపాడుమా యీశ్వరా అనే
భాగవతము లో అష్టమ స్కంధము లోని గజేంద్ర మోక్షణ కథ లో గజేంద్రుని ప్రార్థన యిది.

అప్పటికే చాలా మంది అలాగ సహాయము పొందినారు.అసలు నిజముగా అతను దీన స్థితి లో వున్నాడా?
అని ఆయనకు కొంత సందేహము కలిగి క్రింది పద్యము వ్రాసి పంపించాడట.ఈ పద్యము భాగవతము లోని
ద్వాదశ స్కంధము లో పరీక్షిత్తు మహారాజు కలియుగంలో పరిస్థితులు ఎలా వుంటాయని శుక మహర్షి ని అడిగినప్పుడు శుకుడు కలియుగంలో అందరూ పాపములు చేస్తూ తమ తమ ధర్మములను మరిచి సంచరిస్తారు.కలియుగం లో హరినామ స్మరణ ఒక్కటే తరింప జేసే సాధనము.యింక చనిపోతాననే భయము మాని హరిని స్మరించు.అని పరీక్షిత్తునకు చెప్తాడు.
ఏను మృతుండ నౌదునని యింత భయంబు మనంబు లోపలన్
మానుము సంభవంబు గల మానవ కోట్లకు జావు నిత్యమౌ
గాన హరిం దలంపు మిక గల్గదు జన్మము నీకు ధాత్రిపై
మానవ నాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్
తా:--నేను చనిపోతానేమో ననే భయము మనసులో పెట్టుకోకు పుట్టుట గిట్టుట ప్రాణులకు సహజము,గావున హరి నామ స్మరణ మొక్కటే మార్గము నీకు యింక జన్మము కూడా వుండదు.మాధవలోక నివాస సౌఖ్యములు నీకు కలుగుతాయి.పరీక్షిత్తు మరణానికి సన్నిహితముగా వుండినాడు కదా!అందుకని ఆయనకు శుక మహర్షి, మరణము నకు భయపడక హరి నామ స్మరణము చేయుమనిపరీక్షిత్తుకు ఉపదేశం చేసినాడు.ఆ ఉపదేశము ఆ బ్రాహ్మణుడికి దొర చేసినారు.
.తర్వాత బ్రౌన్ దొర తన మనుషుల చేత విచారించి నిజముగా అతను
దయనీయమైన స్థితి లో వున్నాడని తెలుసుకొని అతనికి ధన సహాయము చేసినాడట.బ్రౌను దొర గారికి వున్నఔదార్యము యిప్పటి నాయకులలో వున్నదా? ఆయన పరదేశీయు డయిననూ తెలుగు నేర్చుకొని తెలుగు పద్యము,అదీ భాగవతము లోనిది వ్రాసి పంపినాడంటే మనము సిగ్గుపడ వలిసిన విషయము కాదా?బ్రౌన్ దొరకు నమస్సుమాంజలులు.
ఆ బ్రాహ్మణుడుఆ పద్యము అప్పుడువున్న ఈశ్వరయ్య అనే తహసిల్దారుకు,వరదయ్య అనే కరణమునకు,,భద్రుడనే మరొక ఉద్యోగి కి వ్రాసి పంపినాడనే వేరే కథనము కూడా వున్నది.


ఒకసారి రాయల ఆస్థానానికి ఒక సంస్కృత పండితుడు వచ్చాడు. ఆతనని రాయలు చాలా గౌరవించి వుచితాసనము యిచ్చి గౌరవించారు.కానీ ఆయన తెలుగు భాషను తక్కువ చేస్తూ ఒక శ్లోకం చెప్పాడు.
శ్లోకం:- "ఆంద్ర భాషా కావ్య మయోమయ విభూషణం" అర్థం:- తెలుగు భాషా కావ్యాలు అన్నీ ఇనుముతో
చేసిన ఆభరణముల వంటివి. అంటే పనికి రానివి అని ఆక్షేపించాడు. అప్పుడు పెద్దన గారికి చాలా కోపం వచ్చింది. వెంటనే ఆయన లేచి "సంస్కృతారణ్య సంచారీ విద్వన్ మత్తేభ శృంఖలం"అని పూరించాడు.
అర్థము:-- సంస్కృత మనే అరణ్యములో విద్వాంసుల మనే గర్వముతో తిరుగుతున్న మదించిన ఏనుగులకు మా తెలుగు భాషా కావ్యాలు సంకెళ్ళ వంటివి. . మదించిన ఏనుగుల కాళ్ళకు సంకెళ్ళు వేసి బంధిస్తారు.సంకెళ్ళు ఇనుముతో చేస్తారు కదా!
ఆ సంస్కృత పండితుడు మాట్లాడకుండా సభ నుంచి వెళ్ళిపోయాడు.


భువన విజయము లో ఒకసారి కృష్ణదేవరాయలు దోషరహితముగా పద్యము చెప్పవలెనని ఆదేశిస్తాడు.
అప్పుడు పెద్దన కృష్ణదేవరాయలను ప్రశంసిస్తూ ఒక పద్యం చెప్పాడు.
శరసంధాన బల క్షమాది వివిధైశ్వర్యంబులుం గలిగి దు
ర్భర షండత్వ బిల ప్రవేశ చలన బ్రహ్మఘ్నతల్ మానినన్
నర,సింహ, క్షితిమండలేశ్వరుల నెన్నన్ వచ్చు నీసాటిగా
నరసింహ క్షితి మండలేశ్వరుల కృష్ణా రాజ కంఠీ రవా!
అర్థము:--శరసంధానము లో అర్జునిని తోనూ, బలములో సింహముతోనూ, ఓర్పు లో భూమితోనూ
నిన్ను పోల్చడానికి వీలు లేదు. ఎందుకంటే అర్జునునికి షండత్వ (నపుంసక)దోషముంది,సింహానికి బిల ప్రవేశ (గుహ)దోషముంది,భూమి కి చలించే దోషముంది (భ్రమణదోషం)ఇంక ఈశ్వరుడితో పోలుద్దామంటే ఆయనకు బ్రహ్మహత్యా దోషముంది (బ్రాహ్మణుడైన దక్షుడిని చంపాడు కదా!)
కనుక నీకు నేవే సాటి కృష్ణా రాజ సింహమా!
రామకృష్ణుడు ఫక్కుమని నవ్వాడు. రాయలు కోపంగా ఎందుకా నవ్వు? అని అడిగాడు. అప్పుడు రామకృష్ణుడు క్షమించండి మహా రాజా! సింహానికి బిల ప్రవేశ దోషముంది నిన్ను పోల్చడానికి వీలు లేదు అని అంటూనే తాతగారు "రాజకంఠీ రవా!" అని సంభోదిస్తుంటే నవ్వొచ్చింది. (కంఠీరవము అంటే సింహము). అప్పుడు పెద్దన చిన్న వాడవైనా పెద్దతప్పే కనిపెట్టావు మనవడా!ఏదీ నీవొక పద్యము చెప్పు అన్నాడు. అప్పుడు రామకృష్ణుడు
కలనం దావక ఖడ్గ ఖండిత రిపు క్ష్మాభర్త మార్తాండ మం
డల భేదం బొనరించి యేగునెడ దన్మధ్యంబునన్ హార కుం
డల కేయూర కిరీట భూషితుని శ్రీమన్నారాయణుం గాంచి లో
కలగంబారుచు నేగె నీవ యను శంకన్ గృష్ణరాయాధిపా!
అర్థము:--యుద్ధములో నీ ఖడ్గము చేత చంపబడిన శత్రు రాజులు వీర స్వర్గానికి సూర్యమండలము దాటి పోతూ అక్కడ సింహాసనము పై హారాలూ,కుండలాలూ,కేయూరాలూ, కిరీటమూ ధరించి కూర్చొని వున్న నారాయణుని చూచి నేవే నని భ్రమించి ఇక్కడికి కూడా వచ్చాడే అని భయము తో కంగారు పడుతూ గబగబా వెళ్ళిపోయారు.
పెద్దన గారు చిన్నవాడవైనా గొప్ప పద్యం చెప్పావు మనవడా! అని మెచ్చుకున్నారు.  



పోతన వ్రాసిన భాగవతాన్ని తనకే అంకిత మివ్వాలని అప్పటి రాజు ఆజ్ఞాపించాడు. ఆయనేమో శ్రీరామచంద్రుడికి తప్ప అన్యుల కియ్యనని చెప్పాడు.కానీ రాజు తనే స్వయంగా వచ్చి నాకే అంకిత మివ్వాలనీ
ఆలోచించు కొమ్మని చెప్పి వెళ్ళిపోతాడు. పోతన పూజా గృహం లోకి వెళ్లి చూస్తె అక్కడ సరస్వతీ దేవి కన్నీళ్ళతో తన వంక దీనంగా చూస్తున్నట్లనిపించింది. అప్పుడు పోతనగారు చెప్పిన పద్యం.
కాటుక కంటినీరు చన్కట్టు పయిన్ బడ యేల యేడ్చెదో
కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల ఓ మదంబ ఓ
హాటక గర్భు రాణి నిన్నాకటికిన్ గొనిపోయి నల్ల కర్నాట కి
రాట కీచకుల కమ్మ త్రి శుద్ధిగ నమ్ము భారతీ
ఓ విష్ణువు కోడలు, బ్రహ్మ దేవుని భార్యవైన భారతీ నిన్ను ఎప్పటికీ ఆ కర్నాట కిరాతకు లైన కీచకులకు అమ్మను నన్ను నమ్ము. ఏడవకు.
కర్నాటక రెడ్డి రాజు భాగవతాన్ని తనకు అంకితమిచ్చేందుకు పోతనను ఒప్పించవలిసిందని శ్రీనాథుణ్ణి పంపించాడు.శ్రీనాథుడు తన పల్లకీ లో బయల్దేరాడు. ఊరిబయట పొలం దున్నుతూ కనిపించాడు పోతన.
శ్రీనాథుడు తన గొప్పతనం చూపించుకోవాలని పల్లకీని మోస్తున్న ఒక బోయీని తప్పుకోమన్నాడు.పల్లకీ ఒక
బోయీ తోనే నడుస్తూంది.పోతన యిది చూసి నవ్వుకొని తన అరకకు కట్టిన ఒక ఎద్దును తొలగించాడు. అరక నడుస్తూనే వుంది. శ్రీనాథుడు యిది చూసి రెండో బోయీని కూడా తప్పించాడు పల్లకి అలాగే గాలిలో నిలబడింది.పోతన తన రెండో ఎద్దును తొలగించాడు. అరక తనంత తానె నడుస్తూంది.శ్రీనాథుడు పల్లకీ దిగి వచ్చి 'హాలికులకు కుశలమా?అని ఎగతాళిగా అడిగాడు (హాలికుడు అంటే రైతు) అప్పుడు పోతన
బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ కూ
ళ ల కిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్
హాలికు లైన నేమి గహనాంతర సీమల కందమూల కౌ
ద్దాలీకు లైన నేమి నిజ దార సుతోదర పోషణార్తమై చిన్నలేతకోమ్మలతో అలరారుతున్నకొమలమైన మామిడి మొక్క లాంటి కావ్య కన్యకను
దుర్మార్గులైన రాజులకు యిచ్చి ఆ పడుపు కూడు (వేశ్యా వృత్తి తో సమానమైన )తినేదానికన్న సత్కవులు రైతు లైతే నేమి?భార్యా బిడ్డలను పోషించడానికి అడవుల్లో కందమూలాలు ఏరుకొని అమ్ముకొని జీవిస్తే నేమి? అని, బావా నేను నా భాగవతాన్ని రామునికి తప్ప యితరు లేవ్వరికీ అంకిత మివ్వను. యిదే నా
తుది నిర్ణయము. అన్నాడు. శ్రీనాథుడు నిరాశగా అక్కడినుండే వెను తిరిగాడు.



అల్లసాని పెద్దన గారు మను చరిత్ర ప్రబంధాన్ని వ్రాస్తానని చెప్పినప్పుడు.కృష్ణదేవరాయలు ఆయన కనిపించి
నప్పుడంతా మొదులు పెట్టారా?అని ఆత్రంగా అడుగు తుండే వాడట.యిలా రెండు మూడు సార్లు అడిగేసరికి
పెద్దన గారికి చిరాకేసి యీపద్యము చెప్పారట.
నిరుపహతి స్థలంబు రమణీ ప్రియదూతిక తెచ్చి యిచ్చు క
ప్పుర విడె మాత్మ కింపైన భోజన ముయ్యలమంచమొప్పు త
ప్పరయు రసజ్ఞు లూహ తెలియంగల లేఖక పాటకోత్తముల్
దొరికిన గాక వూరక కృతుల్ రచియింపు మటన్న శక్యమే
తా:--లోకం లో ఎక్కడ లేనటువంటి అపురూపమయిన ప్రదేశము,,అందమయిన, ప్రియమైన దూతిక తెచ్చియిచ్చేకర్పూరము,మొదలగు సుగంధ ద్రవ్యములు వేసిన తాంబూలము,యిష్టమైన వంటకముల తోడి భోజనము,ఉయ్యాల మంచము,యిది తప్పు యిది ఒప్పు అని తెలియజెప్పే రసజ్ఞులు,నేనేమి చెప్తానో అది ముందే ఊహించి వ్రాయగల వ్రాయసగాండ్రు (పూర్వము కవులు చెప్తూ వుంటే వ్రాసేవారిని వ్రాయస గాండ్రు అనేవారు)యిన్ని దొరికితే గానీ కావ్యం వ్రాయడానికి వీలుకాదు.యిలా మాటిమాటికీ కావ్యాలు వ్రాయమంటే ఎలా కుదురుతుంది?
తాంబూలము.



ఈ కథ చాలా పాతకాలంది. ఒక పండితుడు ఇంకో పండితుడి గ్రామానికి బస్సు లో వస్తున్నానని కబురు చేశాడు.తన ఇంటికి వస్తున్నఆ పండితుడిని ఆహ్వానించడానికి ఈయన ఎడ్లబండి కట్టుకొని ఆ బస్సు వచ్చే చోటికి వెళ్తాడు.అది గ్రామానికి 3,4 మైళ్ళ దూరంలో వుంది..వెళ్లి ఆ పండితుడిని సాదరంగా ఆహ్వానించి
బండి లో కూర్చో బెట్టి బయల్దేరుతాడు. త్రోవ బాగా లేకపోవడం వల్ల బండి కుదుపులతో నడుస్తూ వుంటుంది.
వేరే వూరినుంచి వచ్చిన శాస్త్రి గారు 'అబ్బబ్బ వెధవ బండి' అన్నాడు. దానికి ఆ బండి యజమాని శాస్త్రి గారూ
మీరంటున్నది షష్టీ తత్పురుష మా లేక కర్మధారయమా?షష్టీ తత్పురుషము అంటే వెధవ యొక్క బండి
అనే అర్థము వస్తుంది కర్మధారయ మైతే 'వెధవ యైన బండి' అని అర్థము వస్తుంది.(బండి యొక్క యజమాని వెధవనా?బండి వెధవదా?) ఆ శాస్త్రి గారు నవ్వుతూ యేదీ కాదు చతుర్థీ తత్పురుషము లెండి. (అంటే వెధవ కొరకు యిలాంటి బండి) అన్నాడు. యిద్దరూ హాయిగా నవ్వుకున్నారు.. ఆ కాలం పండితులు అలాంటి చెణుకులు విసురుకునేవారు.



ఒక రోజు రాత్రి కృష్ణదేవ రాయలు పెద్ద రాణి తిరుమలదేవి శయనాగారానికి కాస్త పొద్దు పోయి వెళ్లారు. దేవి చాలా సేపు ఎదురు చూసి అప్పుడే పాన్పు పైన ఒక పక్క తలగడ వైపు కాక అటువైపు కాళ్ళు పెట్టుకొని పడుకుంది.రాయలు వచ్చి ఆమె నిద్రపొతున్నదని ఇంకొక పక్క పడుకోడానికి వంగాడు. అలికిడి విని రాణి దిగ్గున లేచింది. ఆ లేవడం లో ఆమె పాదం రాయల తలకి తగిలింది. ఆమె క్షమించమని అడుగు తున్నా అతను కోపంగా మందిరం నుండి వెళ్ళిపోయాడు.ఆ తర్వాత ఆమె మందిరానికి రావడం మానేశాడు. తిరుమలదేవి చాలా పశ్చాత్తాప పడింది.రాజు ను తన మందిరానికి వచ్చేలా ఎలా చెయ్యాలని ఆలోచించింది.
ఆవిడ తన పుట్టింటి నుండి అరణపు కవిగా వచ్చిన నంది తిమ్మన గారికి రమ్మని కబురు చేసింది.ఆయన వస్తూనే విషయం చెప్పి భోరున విలపించింది. ఎలాగైనా రాయలు తన మందిరానికి వచ్చే టట్టు చెయ్యమని అడిగింది. తిమ్మన ఆమెను ఓదార్చి ఏమైనా చేస్తానని మాట యిచ్చి వెళ్లి పోయాడు.అప్పుడు ఆయన
"పారిజాతాపహరణము" అనే ప్రబంధము వ్రాస్తున్నాడు. అందులో కృష్ణుడు రుక్మిణీ దేవి మందిరం లో వుండగా నారదుడు స్వర్గం నుండి వస్తూ ఒక పారిజాత పుష్పాన్ని తెచ్చి కృష్ణుడి కిచ్చి నీ కిష్టమైన వారికీ యిమ్మని చెప్తాడు.ఆయన వెంటనే ఆ పుష్పాన్ని రుక్మిణికి యిస్తాడు.అ దృశ్యాన్ని చూసిన సత్యభామ చెలికత్తెలు సత్యభామ కు చేర వేస్తారు.సత్యభామ అలిగి అలకా గృహం లో పడుకొని వుంటుంది. కృష్ణుడు సత్యభామ అలకా మందిరానికి వెళ్లి క్షమించమని ఆమె కాళ్ళ దగ్గర తల పెడతాడు సత్య భామ తన పాదము తో ఆయన తలను సున్నితంగా తోసేస్తుంది. ఆ ఘట్టం లో తిమ్మన గారు వ్రాసిన పద్యము.
జలజాతాసన వాసవాది సురపూజా భాజనంబై తన
ర్చులతాంతాయుధు కన్నా తండ్రి శిర మచ్చో వామ పాదంబు నన్
తొలగంగ దోసె లతాంగి అట్లయగు కాంతుల్ నేర ముల్సేయ పే
రలుకన్ జెందిన యట్టి కాంత లుచిత వ్యాపారముల్ నేర్తురే
బ్రహ్మ,దేవతలూ అందరి చేతా పూజింపబడే ఆ మన్మధుడి యొక్క తండ్రి శిరస్సును సత్య తన ఎడమ పాదము తో తోసి వేసింది. భర్తలు తప్పు చేసి నప్పుడు కాంతలు యిది ఉచితమూ ఇది అనుచితమో అని ఆ కోపం లో ఆలోచించరు కదా!కృష్ణుడు కూడా"నను భవదీయ దాసుని నెయ్యపు కిన్కబూని తా
చిన యది నాకు మన్ననయ చెల్వగు నీ పద పల్లవంబు మ
త్తను పులకాగ్ర కంటక వితానము సోకిన నొచ్చు నంచు
నే ననియెద అలక మానవు గదా యిక నైన అరాళకుంతలా
నీమనసులో నా పైన ప్రేమతోనే ఈ అలక అందుకనే నన్ను అలా అలవోకగా తాకావు.అది నాకు మన్ననే కదా!సున్నితమైన నీ పాదము పులకించిన నా శరీరపు వెంట్రుకలు గుచ్చుకొని యెంత నొచ్చెనో కదా! అని అనునయిస్తాడు.
నంది తిమ్మన రాయల తో ఏకాంత దర్శనము కోరి వెళ్లి ఈ పద్యాలు వినిపించి దాంపత్యము లో ఇలాంటి సరసాలు మామూలే నని సున్నితంగా హెచ్చరిస్తాడు.రాయలు స్వయముగా కవి రసికుడు కనుక తన తప్పు తెలుసుకొని తిరుమల దేవి మందిరానికి వెళ్తాడు.



మ్రింగెడు వాడు విభుండని
మ్రింగెడిది యు గరళ మని మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వ మంగళ
మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో
క్షీర సాగర మథన సమయం లో పుట్టిన హాలాహలాన్ని మ్రింగమని దేవతలు శివుడిని ప్రార్థిస్తారు.అప్పుడు శివుడు గరళము మ్రింగ దానికి పార్వతి అనుమతిని అడగడానికి ఆమె వైపు చూస్తాడు.ఏమి మ్రింగ మంటావా?అనిఅప్పుడు పార్వతీ దేవి మ్రింగెడి వాడు తన భర్త,మ్రింగేది విషము అని తెలిసి కూడా ప్రజలందరికీ మేలు జరుగుతుందని మ్రింగమని చెప్పింది ఆమె కు తన మంగళ సూత్రము మీద ఎంత నమ్మకమో.అంటాడు పోతన ,
కదలన్ బారవు పాప పేరు లొడలన్ ఘర్మాంబు జాలంబు పు
ట్టదు నేత్రంబులు నెర్రగావు నిజ జటా ర్దేంద్రుడున్ గందడున్
వదనాంభోజము వాడదా విషము నాహ్వానించు చో డాయుచో
బదిలుం డై కడి సేయుచో దిగుచు చో భక్షింపుచో మ్రింగుచోన్
తా:-- ఆయన మెడ లోని పాముల హారములు కదలవు,చెమట పట్టడము లేదు.కన్నులు యెర్ర గా అవడం లేదు,జటా జూటము లోనున్న చంద్రుడు కందిపోలేదు ఆయన పంకజము లాంటి ముఖము వాడలేదు,ఆ విషము చేతిలోకి తీసుకును నప్పుడు గానీ ముద్ద చేసేటప్పుడు గానీ నోటిలో పెట్టుకొనే టప్పుడు కానీ నములునప్పుడు కానీ మ్రింగునప్పుడు గానీ యివేమీ జరగ లేదు అంటే విషము మ్రింగు తున్నానని ఆయనేమీ భయపడలేదు.అని అర్థము.



అంచిత చతుర్థ జాతుడు
పంచమ మార్గమున నేగి ప్రథమ తనూజన్
గాంచి తృతీయం బప్పురి
నించి ద్వితీయంబు దాటి గ్రక్కున వచ్చెన్
అర్థము:--భూమి, నీరు, అగ్ని,వాయువు (గాలి),ఆకాశము ఈ యైదు పంచభూతాలు. పూజింపబడిన చతుర్థ జాతుడు అంటే వాయుసుతుడైన హనుమంతుడు.పంచమ మార్గమున అంటే ఆకాశ మార్గమున వెళ్లి
ప్రథమ తనూజన్ అంటే భూమి పుత్రిక అయిన సీతాదేవిని చూచి, తృతీయం అంటే అగ్ని ని లంకలో నింపి
ద్వితీయం అంటే సముద్రాన్ని (నీటిని) దాటి వచ్చెను.



ఒకసారి అవధానం లో ఒక పృచ్చకుడు గంగా గౌరీ సంవాదం లాంటి సీతారాముల సంవాదాన్ని ఆశువుగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు అవధాని గారి ఆశువు.
పొలము దున్నిన పిల్లలు మొలుతురట
మిధి లయందని రాముడు మేల మాడ
అవునయోద్ధ్య ను పాయస మారగింప
ఆ భయము గలదంచు సీత సంభ్రమము జూపె
మిధిలానగరం లో పొలము దున్నుతుండగా సీతమ్మ దొరికింది కదా అని సీతమ్మ పుట్టుకను రాముడు ఎగతాళి చేయగా సీతమ్మ నలుగురన్నదమ్ముల పుట్టుకకు పాయసమే కదా మూలం అందుకే అయోద్ధ్య లో పాయసం తాగాలంటే భయం అంటూ ఎగతాళి చేసింది.
అప్పుడు వాళ్ళిద్దరూ ఏమి చేశారు?అని అప్రస్తుత ప్రసంగి గారి ప్రశ్న "ఒకరిని చూసి ఒకరు ఫక్కుమని నవ్వుకొని వుంటారు" అని అవధాని గారి సమాధానం.



మహాభారత యుద్ధం చివరన భీముడు దుర్యోధనుడి తొడలు విరగగొడతాడు. అతడు కొన ఊపిరితో
వున్నప్పుడు అక్కడికి ఆశ్వత్టామ,కృపాచార్యుడు వస్తారు. అప్పుడు దుర్యోధనుడు అశ్వత్టామ తో
పాండవులను ఎలాగైనా చంపి అపాండవం చేయ మంటాడు. అశ్వత్టామ అతనికి మాట యిస్తాడు ఆ పని చేస్తానని. అతను ఆ రోజు రాత్రికి పాండవుల శిబిరానికి వెళ్లి పాండవులు కనపడక పోవడం తో
అక్కడ నిద్రిస్తున్న ఉపపాండవులను ఐదుగురి (ద్రౌపది కొడుకులు)తలలు అమానుషంగా నరికి వెళ్లి పోతుండగా అర్జునుడు, కృష్ణుడు అతనిని వెంబడించి యుద్ధం చేస్తాడు అర్జునుడు. ఆశ్వత్టామ
ఉపసంహారం ఎలా చెయ్యాలో తెలియని బ్రహ్మశిరోనామక అస్త్రాన్నిఅర్జునుడి మీదికి వదులుతాడు. అప్పుడు అర్జునుడు బ్రహ్మాస్త్రముతొ దాన్ని ఎదుర్కొంటాడు. ఆ రెండు అస్త్రాలూ ఆకాశం లో పోరాడుతుంటే అన్ని లోకాలూ కంపించి పోతాయి. ఆశ్వత్టామ కు ఉపసంహారం తెలీదు.. బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడు ఉపసంహరించుకుంటే అర్జునుడు ఆశ్వత్టామ అస్త్రానికి బలై పోతాడు. అప్పుడు కృష్ణుడు ఆశ్వత్టామ ను ఆ అస్త్రము యొక్క దిశను మార్చి అభిమన్యుడి భార్య ఉత్తర గర్భము లోని బిడ్డకు తగిలేలా చేయ మంటాడు. అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించగానే ఆశ్వత్టామ వేసిన అస్త్రము ఉత్తర గర్భము లో వున్న బిడ్డకు తగిలి ఉత్తరకు మృతశిశువు పుడతాడు. ఏడుస్తున్న ఉత్తరను ఓదార్చి కృష్ణుడు ఆ బిడ్డను తన చేతితో నిమిరి బ్రతికిస్తాడు. అతడే పరీక్షిత్తు..అది తర్వాత కథ.. అర్జునుడు అశ్వత్టామను చంప బోతుంటే కృష్ణుడు అతన్ని వారించి ద్రౌపది దగ్గరకు తీసుకొని పోదామని తీసుకొని పోతారు. అప్పుడు ద్రౌపది పుత్రశోకం తో చెప్పిన ఈ పద్యము చాలా ప్రసిద్ధ మైనది..
ఉద్రేకంబున శస్త్ర ధరులై,యుద్ధావనిన్ లేరు,కిం
చిద్ద్రోహంబును నీకు జేయరు బలోత్సేకంబుతో చీకటిన్
భద్రాకారుల చిన్న పాపల రణ ప్రౌడ క్రియా హీనులన్
నిద్రాసక్తుల సంహరింప నకటా నీ చేతు లేట్లాడెనో అర్థము:-- వారు ఉద్రేకముతో ఆయుధాలు ధరించి నీ మీదకు రాలేదు, యుద్ధ రంగములో లేరు, నీకే అపకారమూ చేయలేదు ఇంకా పసివాళ్ళు ఆదమరిచి నిద్ర పోతున్న పసిపాపలను చంపేందుకు నీకు చేతులేలా వచ్చాయి?నీవూ ఒక వీరుడవేనా అని నిందిస్తుంది ఏడుస్తుంది. అర్జునుడు వీడిని వధిస్తాను అని అంటే వద్దని వారిస్తుంది. గురుపుత్రుడు,బ్రాహ్మణుడు అతన్ని చంపుట మహా పాపము. . పైగా అతని తల్లికి పుత్ర శోకం కలిగించటం నాకిష్టము లేదు. ఆ శోకం ఎంత భయంకర మైనదో నాకు తెలుసు. అతని శిరస్సు పైనున్న రత్నాన్ని తీసి నాకివ్వు,అతని సర్వ శక్తులూ నశిస్తాయి. నిర్వీర్యుడై పోతాడు. అదే
అతనికి తగిన శిక్ష.. అంటుంది. అప్పుడు అర్జునుడు తన బాణము తో అతని తల పై వున్న మణిని తీసి ద్రౌపదికి యిస్తాడు. ఐదుగురు కొడుకులను ఘాతుకంగా చంపిన అతనిని వదిలి వేస్తుంది. అదీ ద్రౌపది ఔదార్యం. 




ఒకసారి కృష్ణ దేవరాయల ఆస్థానానికి ఒక సంస్కృత పండితుడు వచ్చాడు. అతను సంస్కృతం లోనన్ను ఓడించగలిగే వారు లేరు. మీ ఆస్థానం లో వున్నారేమో పరీక్షిద్దామని నేను వచ్చాను అని సవాలు చేశాడు. రాయలవారు ఆ పండితుడికి తుంగభద్రానదీ తీరం లోని అతిథి గృహం లో బస ఏర్పాటు చేశారు. ఆయన మరుదినం సభ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సంస్కృత పండితులు పని మీద వేరే దేశానికి వెళ్లి పోయారు. ఇప్పుడు ఈ సమస్యను ఎదుర్కోవడం ఎలా అని మిగతా కవులు అలొచనలొ పడ్డారు.వాళ్ళంతా తెనాలిరామకృష్ణుడి దగ్గరకు వెళ్లి ఈ గండాన్ని ఎలాగైనా గట్టెక్కించమని ప్రాధేయ పడ్డారు
మరుదినం ప్రొద్దున రామకృష్ణుడు చాకలి వాడి వేషం వేసుకొని తన భార్యకు చాకిత వేషం వేసి నది దగ్గరకు వచ్చి ఏమి చెయ్యాలో చెప్పాడు. ఉదయం .ఆ పండితుడు నది దగరకు వచ్చి స్నానం చేస్తున్నాడు. అక్కడికి దగ్గరలోనే రామకృష్ణుడు చాకలి వేషంలో బట్టలు వుతుకు తున్నాడు. ఇంతలో చాకిత వేషం లో వున్నఅతని భార్య వచ్చింది అన్నం లోకి కూరేమి చెయ్యమంటావు మామా? అని అడిగింది. అప్పుడు రామకృష్ణుడు
"మత్కుణం నది సంయుక్తం విచార ఫలమేవచ
గోపత్నీ సమాయుక్తం గ్రామ చూర్ణంచ వ్యంజనం" అని చెప్పాడు. భార్య కూడా అలాగే అని తల ఊపి వెళ్లి పోయింది.నదీతీరం లో సంధ్య వార్చుకుంటున్నపండితుడు ఆ సంభాషణ విన్నాడు. అతనికి ఒక్క ముక్కకూడా అర్థం కాలేదు. మత్కుణం నది సంయుక్తం యిదేమిటి?విచార ఫల మేమిటి?గోపత్ని,గ్రామచూర్ణం యివన్నీ ఏమిటి?తల తిరిగి పోయిందతడికి. యిక్కడ చాకలివాడికీవాడి భార్యకీ వచ్చిన సంస్కృతం తన కర్థం కాలేదే మరి తను రాయల ఆస్థానం లోని పండితుల నెలా ఓడించగలడు?అనుకోని తన బసకు వెళ్లి మూటా ముల్లె సర్దుకొని ఊరొదిలి పారిపోయాడు.. చారులవల్ల సంగతి తెలుసుకొని పండితులంతా రామకృష్ణుడి దగ్గరకు వెళ్లి అభినందనలు చెప్పి
ఏమి చేశావని అడిగారు. అంతా చెప్పేసరికి వాళ్ళు ఆ శ్లోకం తమకూ ఏమీ అర్థం కావటం లేదన్నారు. అప్పుడు రామకృష్ణుడు యిలా వివరించాడు. మత్కుణం అంటే నల్లి. నల్లి+యేరు= నల్లేరు, విచారఫలం అంటే చింతపండు. గోపత్ని అంటే ఆవు+ఆలు=ఆవాలు గ్రామ చూర్ణం అంటే వూరుబిండి. అంటే పచ్చడి. (రాయలసీమలో పచ్చడిని ఊరుబిండి అని అంటారు)నల్లేరు,చింతపండు,ఆవాలు వేసి పచ్చడి చెయ్యమని చెప్పాను. దెబ్బకు గురుడు పారి పోయాడు. అది విని అందరూ పెద్దగా నవ్వారు. రామకృష్ణుడికి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయారు.
యిది నేను ఇంతకుముందు రాసినదయినా కొత్త స్నేహితుల కోసం మరీ వ్రాశాను.



కుచేలుడు శ్రీకృష్ణుని ఆథిత్యాన్ని స్వీకరించి ఇంటికి వెళ్ళే సమయం లో అతని మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. కృష్ణుడు నాకీమీ ఇచ్చి పంపలేదే నా భార్య కేమి సమాధానం చెప్పేది?అనుకున్నాడు. వెంటనే తేరుకొని నాకు అపారమైన సంపద యిస్తే తనను నేను మరిచి పోతానని
ఇచ్చి వుండడు. మంచిపనే జరిగింది లే సంపద కంటే నాకు ఆయన నామస్మరణ మరవకుండుటే
ముఖ్యము కదా!అని ఈ క్రింది పద్యం చెప్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అపారమైన సంపద చూసి గర్వపడక నిరాడంబరంగా నారాయణుడి ధ్యానంలోనే తన శేష జీవితాన్ని గడిపాడు.
శ్రీ కృష్ణ స్నేహితుడైన కుచేలుడు ఏమన్నాడంటే
నీ పాద కమలసేవయు
నీపాదార్చకుల తోశ్రేకృష్ణ స్నేహితుడైన కుచేలుడు ఏమన్నాడంటే
నీపద కమలసేవయు
నీపాదార్చకుల తోడి నెయ్యము నితాం
తాపార భూత దయయును
తాపస మందార నాకునాకు దయ సేయ గదే
అర్థము:-- నీపాదాలను సేవించుకునే భాగ్యాన్నీ, నీ పాదములను సేవించే వారితో స్నేహాన్నీ అందరితో దయగా మసులుకునే సహృదయాన్నీ నాకు ప్రసాదించమని వేడుకున్నాడు కుచేలుడు
ఇష్టం వ్యాఖ్య పంచుకోండిడి నెయ్యము నితాం
తాపార భూత దయయును
తాపస మందార నాకునాకు దయ సేయ గదే
అర్థము:-- నీపాదాలను సేవించుకునే భాగ్యాన్నీ, నీ పాదములను సేవించే వారితో స్నేహాన్నీ అందరితో దయగా మసులుకునే సహృదయాన్నీ నాకు ప్రసాదించమని వేడుకున్నాడు కుచేలుడు



వరాహగిరి వేంకటగిరి మన 4 వ రాష్ట్రపతిగా 1969 నుండి 1974 వరకు వున్నారు. ఆయన 2వ ఆంధ్ర రాష్ట్రపతి. ఆయన భార్య సరస్వతి గిరి. ఆవిడ కవితలు రాసేవారు. ఆ కవితా సంకలనం నుంచి కవితలు అప్పుడు ఆంధ్ర ప్రభ వారపత్రికలోప్రతి వారం ప్రచురించే వారు.ఆ కవితలు చాలా అధ్వాన్నంగా వుండేవి.ఆవిడ వాటిని తన ఆరాధ్య దైవ మైన పరమ శివుడికి అంకిత మిస్తున్నట్టుగా వ్రాసుకున్నారు. (అవి చదివితే ఒక సినిమా లో శ్రీ లక్ష్మి కవితలు చదివి బట్టలు చింపు కొని ,జుట్టు పీక్కొన్న ఎడిటర్ గుర్తుకోస్తాడు)ఆంధ్రప్రభ ఎడిటర్ కూడా అల్లాగే జుట్టు పీక్కునే వాడేమో మరి!.విధిలెక రాష్ట్రపతి భార్య కనుక ఆంధ్రప్రభ వాళ్ళు వేసే వారేమో అని అనుకునే వాళ్ళం. అంత పిచ్చిగా ఉండేవి. ఎవరూ అవి బాగున్నాయని కానీ,బాగాలేవని కానీ ఉత్తరాలు రాసేవారు కాదు. అన్ని కవితలూ ప్రచురించడం అయ్యాక ఒక అజ్ఞాత వ్యక్తి ఒక ఉత్తరం రాశారు. పార్వతీ పరమేశ్వరుల సంభాషణ:-- శివుడు తల పట్టుకొని కూచున్నాడు.
పార్వతి:- నాధా!ఏమిటి అలావున్నారు?
శివుడు:--శిరోభారము ఎక్కువగా వుంది పార్వతీ కాస్త అమృతాంజనం రాస్తావా?లేక అస్ప్రో యిస్తావా?
పార్వతి:-- అయ్యో! ఎందుకని ఆ శిరోభారము నాధా!
శివుడు:--ఏమిచేప్ప మంటావు పార్వతీ ఆ సరస్వతీ గిరి కవితలు చదివితే తలనోప్పికాక ఇంకేమి వస్తుంది?
పార్వతి:-- మరి అవి చదవడ మెందుకు నాధా?
శివుడు:-- మరి చదవక చస్తానా ఈ తీరుగ నాకంకిత మిస్తే ?
తర్వాత తెలిసింది. ఆ ఉత్తరం వ్రాసింది మా చెల్లెలు సుధామణి భర్త,(గౌతమ్ నాన్న గారు ) నంద్యాల గోపాల్ అని. ఆయన అప్పుడు ఇండియన్ ఎక్స్ ప్రెస్ పేపర్ కు సబ్ ఎడిటర్ గా వుండేవారు. ఆ ఉత్తరాన్ని ధైర్యంగా ప్రచురించిన వారపత్రిక వాళ్ళను అభినందించాల్సిందే!



పారిజాతాప హరణం కావ్యాన్ని కృతి నందుకున్నప్పుడు కృష్ణదేవరాయలు నంది తిమ్మన కు తన రెండు కుండలాలు బహుమతిగా నిచ్చెనట.అవి పెట్టుకొని తిమ్మన తన యింటి అరుగు పై కూర్చుని వుండగా భట్టు కవి ఆ త్రోవన పోతూ ఆయనను అభినందించి ఈ పద్యము చెప్పెనట.
మాకొలది జానపదులకు
నీ కవనపు ఠీవి అబ్బునే కూపనట
ద్భేకములకు గగనధునీ
శీకరముల చెమ్మ నందిసింగయ తిమ్మా
అర్థము:--మాలాంటి పల్లెటూరి వాళ్లకు నీ లాగ కవిత్వము చెప్పడము యెలాగ వస్తుంది?బావిలో నాట్యమాడే కప్పలకు ఆకాశ గంగ యొక్క యెగసిపడే నీళ్ళ యొక్క తడి కూడా అంటనట్టు.(అంటే మేము కూపస్థ
మండూకాల వంటి వారము నీవు ఆకాశ గంగ లో విహరించే వాడవు.నీ కవిత్వము అంత గొప్పది).
తిమ్మన సంతోషించి తనదగ్గర ఏమీ లేనందున తన చెవి కున్న కుండలము నొక దానిని తీసి యిచ్చెనట.
(రాయల వారు యిచ్చినది.)మరుదినము యిద్దరూ ఒంటి కుండలముతో సభకు వెళ్లి రట.రాయలు యిదేమిటి? అని అడుగగాతిమ్మన భట్టుమూర్తి ఒక మంచి పద్యము చెప్పెను దానికి .నేను బహుమతిగా ఆ కుండలము యిచ్చితిని అని అన్నాడు.ఏమా పద్యము మేమూ వింటాము చెప్పండి అని అడిగాడు రాయలు . అప్పుడు వాళ్ళు వినిపించిన పద్యము విన్న రాయలు, అక్కడ 'గగనధుని" కాకుండా "నాకధుని" అంటే ఎలా వుంటుంది? అన్నాడు నాకధుని అంటే స్వర్గ ములో వుండే గంగ(ఆకాశము కంటే స్వర్గము యింకా పైన వుంటుంది.పైగా గగనము అంటే శూన్యము అనే అర్థం వుంది.శూన్యము లో గంగ వుండదు అని ఒక.అర్థం)
వారిద్దరూ మహారాజా!యిది అద్భుతంగా వుంటుంది యని తమ కుండలాలను రాయలకు ఒక పద్యము చెప్పి సమర్పిస్తారు ఆ పద్యము నాకు గుర్తు లేదు"కుండలాలు మీ చెవుల నుండి విడివడి అయ్యో అని దుఃఖిస్తూ వుండినాయి..యిప్పుడు మీ చెవులను చేరి సంతోషముతో యింకా మెరుస్తున్నాయి" అని అర్థము వచ్చే పద్యము.రాయలు వారిని తగురీతిని సత్కరించి పంపించాడట.




ఏవం వర్ష సహస్రాణం శతం నాహం త్వయా సహః
వ్యతిక్రమం న వేత్స్యామి స్వర్గోపి నహి మే మతః
అర్థము:-- మీతో కూడి విహరిస్తూ వందల వేల సంవత్సరాలైనా ఒక్క క్షణంలా గదుపుతాను. ఇంతకుమించి
స్వర్గ సుఖాలైనా నేను ఆశించను. అంటుంది సీత, తన వెంట అడవికి రావద్దని ఆ కస్టాలు నీవు భరించ లేవని అన్నరాముడితో. ఈనాటి స్త్రీ మూర్తులు భర్త వెంట అడవులకు అడవులకు వెళ్ళేంత త్యాగం చెయ్యక పోయినా ఇళ్ళను అడవులు చేసేంత సమస్యలను సృస్టించ కుండా మసలుకోవాలి. సుఖ సంతోషాల కోసం
పోరు పెట్టి, పక్కవారితో పోల్చి సాధించి భర్త తప్పు దారిన నడిచి లంచాలు తీసుకొని జైలు పాలయ్యేలా చేయ
కూడదు. సీత ఏమరు పాటుతో బంగారు జింక కావాలని కోరి కస్టాలు తెచ్చుకుంది. ఈ రోజుల్లో క్షణానికో మాయలేడి మగువల మనసుల్ని మరలిస్తోంది.కాస్త ఏమరుపాటుగా వుంటే చాలా కస్టాలు పడాల్సి వస్తుందని ఆలోచించి మసలు కొండి మగువలూ! (రామకృష్ణ ప్రభ మాసపత్రిక ఆధారంగా).




ఒకసారి నారదుడు వైకుంటానికి వెళ్ళాడట.అక్కడి ద్వారపాలకుడు.విష్ణువు పూజ చేసుకుంటున్నారు.కాసేపు కూర్చోమన్నారట.నారదుడికి ఆశ్చర్యమేసిం దట.అందరూ ఈయనను పూజిస్తుంటే యీయనెవరిని పూజిస్తాడబ్బా అని. కాసేపయ్యాక స్వామీ బయటికి వచ్చినాడట.అప్పుడు నారదుడు తనసందేహాన్ని బయట పెట్టాడట.అప్పుడు స్వామీ ఆయనను తన పూజా మందిరం లోనికి పిలుచుకొని పోయి నాడట.అక్కడ ఒక ఆసనము పైనొక బంగారు భరిణ పెట్టివుందట.దాన్ని స్వామీ తెరిచాడట,అందులో యింకొక భరిణ ఉందిట.అలా నాలుగు భరిణలు తీసిన తర్వాత ఒక చిన్న భరిణ లో ఏదో పొడి వుందట.దానిని చూపించి నారదా !యిది నా భక్తుల పాదధూళి.దీనినే నేను రోజూ పూజ చేస్తాను అన్నాడట.
దైవాధీనం జగత్సర్వం ; భక్త్యాధీనంతు దైవతం
తత్భక్తి ఉత్తమాధీనం ; ఉత్తమో మమ దేవతా
అర్థము:--ఈ జగమంతా దైవము యొక్క అధీనమై వున్నది. ఆ దైవము భక్తులకు అధీనమై ఉంటాడు.
ఆ భక్తీ ఉత్తముల కే అధీనమై వుంటుంది. అటువంటి ఉత్తములే నాకు దేవుళ్ళు (శ్రీకృష్ణుడు)
(రామకృష్ణ ప్రభ)


   
పూర్వం పండితులు నస్యం వేసుకునేవారు.నస్యం అంటే ముక్కుపొడుం.ముక్కులోకి ఆ పొడిని పేలుస్తారు.అది ఒక వ్యసనం ఒకరోజు నస్యం లేకుంటే వారికి పిచ్చేక్కినట్టుండేది..ఒకసారి ఒక పండితుడు ఒక శాస్త్రుల్లను నా దగ్గర నస్యం అయిపొయింది కాస్తంత నస్యం ఇస్తారా?అని అడిగాడట.అతను లేదన్నాడట.అప్పటి పండితులు కోపం వచ్చినా పద్య రూపం లోనే చెప్పేవారు. .అప్పుడు కోపంతో ఆ పండితుడు చెప్పిన పద్యం.
శాస్త్రు ల్లట ఈ నీచుడు
పాస్తోత్తుల మగడు వీని పరువేమో
కాస్తంత నస్యమడిగిన
నాస్తే యని పలికే వీని నాలిక పీకా
అర్థము:-- ఇంత లోభివాని మొగుడు లాగున్నాడే ఈ శాస్త్రుల్లు.కాస్తంత నస్య మడిగితే లేదన్నాడు వీని నాలిక పీకా!(ముందు వీని ముక్కు నస్యం లేక పీక్కోపోతూంది)



తెలియక నాశహేతు వగు తీవ్రత రానల కీల లోపలన్
శలభము జోచ్చుగాక మతిచాలక మీనము తాను గాలపుం గొనం
గల పిశితంబు తామెసగు గాక యెరింగియు మేము దుఃఖపు
హేల వనితా సుఖంబు విడనాడము మోహ మహత్వ మెట్టిదో
అర్థము:-- తాను మాడిపోవుదునని తెలియని మిడుత దీపముచుట్టూ తిరిగి మాడిపోవును.తాను గాలమునకు తగిలి చనిపోవుదునని తెలియక చేప ఎరను తినును మనుషులు జీవితము అశాశ్వత మని తెలిసి కూడా భోగేచ్చమానలే కున్నారు ఆహా!అజ్ఞానమునకు ఎంతటి మహిమ యున్నదో గదా!



అహల్యాబాయి హోల్కర్ మరాట్వాడా మహారాణి.చాలా తెలివిగలది.ఆమెకు చదవడం,వ్రాయడం రాదు.
వినికిడి జ్ఞానం ఆమె సొంతం.మంచి దక్షురాలయిన రాణి.రాజ్యాన్ని చాలా చక్కగా పాలించేదని చెప్తారు.
ఆమె ఒకరోజు రాజ పురోహితుడిని పిలిచి భగవద్గీత చదివి అర్థం చెప్పండి అని అడిగిందట.ఆయన
మొదటి శ్లోకం " ధర్మ క్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః "అని చదివేటప్పటికి చాలు చాలు స్వామీ
నాకు అంతా అర్థమయి పోయింది అనిందట.ఆయన ఆశ్చర్యం తో నేను యింకా చదవనే లేదు ఎలా అర్థమై పోయింది?అని అడిగాడట.సారం అర్థమయితే చాలు.నీవు ఏ క్షేత్రము (స్థానములో)లో వుంటావోఆ క్షేత్రము
యొక్క ధర్మము పాటించు అనే కదా కృష్ణుడు చెప్పినది.నీవు తండ్రి స్థానము లో వుంటే పితృ ధర్మం,
పుత్రుడి స్థానం లో వుంటే పుత్ర ధర్మం,గురు స్థానం లో వుంటే గురు ధర్మం,శిష్యుడు తనధర్మాన్ని పాటించాలి
వాటిని సరిగ్గా పాటిస్తే చాలు.ఎవరి ధర్మాలు వారు సక్రమముగా నిర్వర్తిస్తే అంతకంటే పుణ్యము యికేమి వుంటుంది?లోక కళ్యాణము జరుగుతుంది అన్నదట.పురోహితుడు ఆశ్చర్య పోయాడట.




మృత్పిండ మేకం బహుభాండ రూపం
సౌవర్ణ మేకం బహుభూషణాని
గోక్షీర మేకం బహుధేను జాతం
ఏకః పరాత్మా బహుదేహ వర్తి
అర్థము:--మట్టి ముద్దా ఒకటే, అయినా దానితో ఎన్నోరకాల కుండలు,కూజాలు.యింకా రకరకాలయిన వస్తువులు తయారు చేయవచ్చు బంగారు ఒకటే దానితో రకరకాల ఆభరణాలు చేయవచ్చు.పరమాత్ముడోక్కడే
మనము వివిధ రూపాల్లో ఆరాధిస్తున్నాము.



ఒక సారి ఆంధ్ర దేశము నుండి కొంతమంది పండితులు ఓడ్ర(ఒరియా) దేశానికి పండిత సభకు హాజరు కావడానికి
వెళ్లారట.అక్కడ వాళ్ళే వండుకొని తినేవారట.భోజానం చెయ్యడానికి అక్కడవున్న మర్రి చెట్ల ఆకులను కోసి విస్తరాకులుగా కుట్టుకున్నారట.ఆ ఆకుల్లో భోజనం చేస్తూ వుంటే అక్కడి పండితులు అయ్యయ్యో అపరాధం అపరాధం మర్రిఆకుల్లొ భోజనం చెయ్యడం మహాపరాధం అన్నారట.మన పండితులు ఎందుకని అడిగారట.
శ్రీ కృష్ణుడు వటపత్రశాయి కనుక మర్రి ఆకుల్లో భోజనం చెయ్యరాదు.అన్నారట. మనవాళ్ళల్లో వున్న పెద్దిభొట్టు అనే బ్రాహ్మణుడు మీరు స్వామి వారి అవతారాలనే వేయించుకొని తింటారు కదా! మేము ఆయన శయనించిన
ఆకుల్లో భోజనం చేస్తే తప్పేమిటి?అని అడిగారట.జవాబు చెప్పలేక వాళ్ళు తెల్లమొహాలు వేశారట.ఓడ్ర బ్రాహ్మణులు మత్స్త్య భుక్కులు.చేపలు జలపుష్పాలని
అది మాంసాహారం కాదని వాళ్ళ అభిప్రాయం.



భర్త :-అప్పటినుండీ ప్రయత్నిస్తున్నాను ఈ మొబైల్ పని చేయడం లేదు.వేరేది కొనాలేమో
భార్య:--ఏమీ కొనక్కర లేదు.అప్పటినుండీ మీరు నొక్కుతున్నది రిమోట్ మహానుభావా!
ఇది కర్ణాటకా వాళ్ళ జోకు.పాపం బీద దంపతులు.యింటికి ఎవరో బంధువు వచ్చాడు.ఎన్నాళ్ళు వుంటాడో తెలీదు.ఆయనకోసం నెయ్యి తెప్పించారు.మనకు లేకున్నా చుట్టానికి వెయ్యాలికదా!(మన మధ్యతరగతి మనస్తత్వం)యజమాని, బంధువు యిద్దరూ భోజనానికి కూర్చున్నారు.ఆవిడ వడ్డించి బంధువు తో బాటు మొగుడికి కూడా కాస్త నేయి వేసింది.ఆ బంధవు రెండోసారి నెయ్యి అడిగాడు ఆయనకు వేసి వెళ్లిపోతూంటే
"ననిగే తుప్ప హాకు"(నాకూ నేయ్యివెయ్యి)ఆవిడ భర్తను ఉరిమి చూస్తూ 'యేనూ'(ఏమిటీ)అని అని గట్టిగ అడిగింది.
భర్త కంగారుగా 'తుప్ప ఇల్లే ఉప్పే ఉప్పు హాకు' (ఏమీ లేదు ఉప్పువెయ్యి)



అభ్యాను సారిణీ విద్యా
బుద్ధి: కర్మాను సారిణీ
ఉద్యోగాను సారిణీ లక్ష్మీ
ఫలం భాగ్యాను సారిణీ  




పూర్వం తిరుమల రాయలు అనే రాజు ఉండేవాడు. అతనికి ఒక కన్నే వుండేది. ఆతను ఒకనాటి సభలో తనను స్వభావసిద్ధంగా అంటే ఎలాంటి అతిశయోక్తులు లేకుండా వర్ణిస్తూ పద్యం చెప్పాలని కోరాడు. ఒక కొంటె కవి చెప్పిన పద్యం.
అన్నాతి గూడ హరుడవు
అన్నాతిని గూడకున్న అసురగురుండవు
అన్నా తిరుమలరాయా
కన్నొక్కటి లేదు గాని మరి కంతుడవు గాదె
అర్థము:-- నీ భార్యతో కలిసి వున్నప్పుడు నీవు శివుడంతటి వాడవు.(అంటే భార్యతో వున్నప్పుడు ఆవిడ కన్నులతో కలిసి మూడు కన్నులు కదా!) నీవు ఒక్కడుగా వున్నప్పుడు అసుర గురుడైన శుక్రాచార్యుడంతటి వాడవు. అన్నా తిరుమలరాయా ఆ కన్నొక్కటి లేదు కానీ నీవు మన్మధుడవే.ఇంతకీ నీవు ఒంటి కన్ను వాడివి అని ఎత్తి పొడుపు. పొగుడుతూనే తెగడడం అంటే యిదే ప్రతి పాదం లో నీవు ఒంటికన్ను వాడవు అనే చెప్తున్నాడు కదా!




జెనరల్ స్ట్రాంగ్ అని వివేకానందుడికి ఒక స్నేహితుడుండే వాడు. ఆయనను వివేకానందుడు యిలా అడిగాడట. తగినన్ని తుపాకులు,మందుగుండు సామగ్రి, యుద్ధ శిక్షణలో ఆరితెరినవారై వుండి సిపాయిల తిరుగుబాటు లో సిపాయిలు అంత ఘోరంగా ఓడి పోవడానికి కల కారణాలేమిటి?అని
అందుకు స్ట్రాంగ్ నాయకుడు ముందు వుండి సైన్యాన్ని నడిపించ వలిసింది పోయి,వెనక ఎక్కడో భద్రమైన స్థలము లో వుండి యోధుల్లారా పోరాడండీ అని కేకలు పెట్టేవారు. సైన్యాధిపతి ఐన వాడు
ముందు వరుసలో వుండి చావును సైతం ఎదుర్కునేందుకు సిద్ధపడి సైన్యాన్ని నడిపించక పొతే సైనికులు హృదయ పూర్వకంగా యుద్ధం చేయలేరు.ఏ రంగం లో నైనా యిదే సూత్రం వర్తిస్తుంది.
నాయకుడైన వాడు జీవితాన్ని ఒక కార్యసాధన లో పణంగా పెట్టి ప్రాణ త్యాగానికి సిద్ధపడి నప్పుడే అతడు మంచి నాయకుడని పించు కుంటాడు. కానీ మనలో చాలామంది ఏ త్యాగమూ చేయకుండానే నాయకుల మవ్వాలని కోరుకుంటాము అందుకే ఫలితం శూన్య మవుతుంది.
ఉద్యమాలు చేస్తూ ఆత్మహత్యలు చేసుకుంటున్న యువత గురించి నేడు మనం వింటున్నాం. కానీ ఉద్యమాల కోసం ఆత్మ బలిదానము చేసే రాజకేయ నాయకులు మాత్రం ఎక్కడా కనపడరు కారణం?
ఆ నాయకులు ఏదైనా చేయించేవే కానీ చేసేవి కావు. మీ రక్తం చిందించి మా లక్ష్యం సాధించు కుంటామన్నదే వారి నీతి.




కామం, క్రోధంచ, లోభంచ దేహే తిష్టంతి తస్కరా:
జ్ఞాన రత్నాపహరాయ తస్మాత్ జాగృత జాగృతః
అర్థము:-- మన దేహమందున కామము,క్రోధము, లోభాములనే దొంగలు కూర్చుని జ్ఞాన మనే రత్నమును
దొంగిలించుటకు కాచుకొని యున్నారు.కావున జాగ్రత్తగా వుండుము.
మనో ధావతి సర్వత్ర మదో న్మత్త గజా యధా
జ్ఞానాం కుశేన తన్విద్ధి తస్య నో చ్చలతే మనః
అర్థము:-- మదించిన ఏనుగు లాంటిదైన యుక్తవయసులో మనసు దాని యిష్టము వచ్చినట్లు పరిగెడుతుంది
జ్ఞానమనే అంకుశము తో దాన్నినియంత్రిచ గలగాలి (నియంత్రించ గలవాడి మనస్సు చలించదు)



ఒకసారి అవధానం లో ఈ సమస్య యిచ్చారు.
"కపిన్ పూజలు జేసే రాముడు కపుల్ గనగా కపిలేని వేళలోన్"డా. నాగఫణి శర్మ గారి పూరణ
ఈ జననంబు ధన్యమై హేమ వితీర్ణ సువర్ణ పాత్రమై
భ్రాజ దనన్య గుణ రాజ శిఖామణి దేవ దేవతా
రాజిత నిరంతర వరప్రదాత నా వృషా
కపిన్ పూజలు జేసే రాముడు కపుల్ గనగా కపిలేని వేళ లోన్
తా:-రావణుడు బ్రాహ్మణుడు. ఆయనను చంపినందు వలన రామునికి బ్రహ్మ హత్యా పాతకం అంటుకుంటుంది దాన్ని పోగొట్టుకోవడానికి అక్కడ సముద్రపు ఒడ్డు దగ్గరనే శివలింగ ప్రతిష్ఠ చేయమని సలహా యిస్తారు.ప్రతిష్ఠ చేయడానికి ఆత్మ.లింగము తేవడం కోసం హనుమంతుడు కైలాసానికి పోతాడు.ఎంతసేపటికీ రాకపోయే సరికి ముహూర్తము దాటి పోతుందని సైకత (యిసుక)లింగము చేసి దానికి పూజలు చేయమని మునులు సలహా యిస్తారు.రాముడు ఆ సైకత లింగానికే ముందు పూజ చేస్తాడు.అదీ కథ.అక్కడ హనుమ లేకుండానే కపిలేని వేళలో వృషాకపి( అంటే శివుడు) ని రాముడు
పూజించాడు.గుణవంతుడైన రాముడు దేవతలందరూ ఎవరి పాదాలను పూజిస్తారో అటువంటి శివుడికి
పూజలు చేశాడు.
తనుతెచ్చిన లింగానికి కాక సైకత లింగానికి ముందు పూజ చేసినందుకు హనుమకు కోపం వస్తుంది సముద్రము లో పడి ప్రాణత్యాగము చేసుకుంటాను అంటాడు.అప్పుడు రాముడు అతనిని వారించి గర్భగుడిలో నీవు తెచ్చిన లింగానికే పూజలు జరుగుతాయని వరమిస్తాడు.యిప్పటికీ రామేశ్వరము లో
రెండు లింగాలు వుంటాయి.




విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం
విద్యా భోగకరీ యశసుఖకరీ విద్యా గురూణాం గురు:
విద్యా బంధు జనో విదేశ గమనే విద్యా పరం లోచనం
విద్యా రాజసుపూజ్యతే నహిధనం విద్యా హీనఃపశు:(భర్తృహరి సుభాషితము)
అర్థము:మానవులకు విద్యయేఎక్కువ సౌందర్యము నిచ్చునది . అదియే గుప్త ధనము;చదువే
కీర్తిని,సుఖమును,భోగమును కలిగించును; విద్యయే గురువులకు గురువైనది
విదేశ ములకు పోయినప్పుడు విద్యయే బంధువు:అదియే మరియొక కన్ను వంటిది;
రాజ సభలలో పూజార్హత విద్యకే గానీ ధనమునకు కాదు;ఇటువంటి విద్య లేని నరుడు వింత
పశువు గా పిలువ పడుతాడు.



పెళ్లి కొందరికి వడ్డించిన విస్తరి , చాలా మందికి యిది అర్థం కాని ఒక మిస్టరీ
సగీతం మేష్టారు: సంగీతం లో చాలా తాళాలు వున్నాయి తెలుసా?
చింటూ: నాకు ఒకటి తెలుసు సార్
సంగీతం మాష్టారు: సంతోషంగా అవునా ఏదీ చెప్పు
చింటూ: గోద్రెజ్

ఒక శిష్యుడు స్వామి పరిజ్నేయానంద గారిని ఈ ప్రశ్న వేసాడు. నేత్రదానం చేసినవారు మరుజన్మలో అంధులు గా జన్మిస్తారని కొంత మంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం?
జవాబు:-మహాత్ములు యేది ఆచరించి చూపించారో ఆ అడుగు జాడల్ని అనుసరించే మహోన్నత సంతతికి చెందిన వాళ్ళం మనం ఇతరుల శ్రేయస్సు కోసం తమ జీవితాల్ని త్యాగం చేసిన యెంతో మంది మహర్షులు,యోగులు,రాజులు,చివరకు సాధారణమైన మనుష్యులను సైతం మన దేశ చరిత్రలో చూడవచ్చు. అలాంటి త్యాగ పురుషుడే ధధీచి మహర్షి. వృత్రాసురుడు అనే రాక్షసుడి దురాగతాలను దేవతలు భరించలేక అతన్ని సంహరించే మార్గం అడిగారు. అప్పుడు విష్ణువు ఒక మహా దాత యొక్క వెన్నెముకతొ
వజ్రాయుధాన్ని తయారుచేస్తే దానితో ఆ రాక్షసుణ్ణి సంహరింప వచ్చు అని చెప్పాడు. దధీచి మహర్షిని యాచించ మని సలహా యిచ్చాడు. దేవేంద్రుడు అడగ గానే దధీచి లోక శ్రేయస్సు కోసం తన దేహాత్యాగం చేసాడు. మహర్షి వెన్నెముక నుంచి విశ్వ కర్మ వజ్రాయుధాన్ని తయారుచేసాడు. దానితో ఇంద్రుడు వృత్రాసురున్ని సంహరిస్తాడు. లోక శ్రేయస్సు కోసం శరీర అవయవాలను దానం చేయడం ఉన్నతమైన
కార్యమేనని మన పూర్వీకులు ఆచరించి చూపించినారు. మరణించిన తర్వాత మనతో వచ్చేది మన శరీరం కాదు. మనం చేసిన మంచి,చెడు కర్మలు మాత్రమే. . మంచి చేస్తే మంచిజన్మ,చెడు చేస్తే చెడు జన్మ కలుగుతుంది. పుణ్య కర్మలు చేస్తే ఉత్తమ గతి కలుగుతుంది కానీ కళ్ళు దానం చేసినందు వల్ల కళ్ళు లేకుండా పుడతారు అనేది నిజం కాదు. అది వ్యాపార దృష్టి తో ధనం సంపాదించ డానికి చేస్తే మాత్రం వారు మరుజన్మలో అంధులుగానే పుడతారు.మరణించిన తర్వాత తమ శరీరావయవాలను ఇతరుల ప్రయోజనార్థము దానము చేసినవారు మరణంలోనూ జీవిస్తారు. ఇతరుల జీవితాల్లో వెలుగు నింపే వారు నిజంగా ధన్యులు.


 
ఇది కర్ణాటకా వాళ్ళపూర్వకాలపు కథ .
ఒక శిష్యుడింటికి అతని గురువు చెప్పా పెట్టకుండా వచ్చాడు.పాపం శిష్యుడు చాలా పేద తనం లో వున్నాడు.
గురువుకు వండి పెట్టడానికి యింట్లో సరుకులు,కూరగాయలు ఏమీ లేవు. ఇంటి బయట పచార్లు చేస్తున్నాడు
ఏమిచెయ్యాలి అని.అప్పుడు అతని దృష్టి గురువుగారి పాదరక్షల పైన పడింది.వాడు ధైర్యం చేసి వాటిని తీసుకొని పోయి బజారు లో ఒక రూకకు విక్రయించి బియ్యము పప్పు,సరుకులు,కూరగాయలు కొనుక్కొని వచ్చాడు.అతని భార్య వెంటనే త్వర త్వరగా వంట చేసింది.గురువు గారు స్నానం చేసి సంధ్య వార్చుకొని
వచ్చి కడుపునిండుగా భోజనం చేశాడు. వంటకాలు చాలా రుచికరంగా వున్నాయని మెచ్చు కున్నాడు.
అప్పుడు శిష్యుడు "నమ్దేనల్ల స్వామీ యెల్ల నిమ్మ పాదరక్ష మహాత్య" అన్నాడు(.నాదేమీ లేదు స్వామీ అంతా మీ పాదరక్షల మహాత్మ్యం) ఇద్దరినీ ఆశీర్వదించి బయటకు వచ్చి తన పాదరక్షల కోసం వెతుక్కుంటూ వున్నాడు.శిష్యుడిని అడిగాడు నా పాదరక్షలు యేమైనాయి?అని అప్పుడు శిష్యుడు నన్ను క్షమించండి స్వామీ యింట్లో సరుకులన్నీ నిండుకున్నాయి. ఏమిచెయ్యాలో తెలీక మీ పాదరక్షలు అమ్మివచ్చిన డబ్బుతో
మీకు విందు చేశానుఅందుకే "నమ్బ్దేనల్లయెల్ల నిమ్మ పాదరక్ష మహాత్య"అని అన్నాను..ఇది గోండి అర్ధ రూక మిగిలింది తీసుకోండి అని మిగిలిన అర్ధ రూక ఆయన చేతిలో పెట్టాడు.వాడి నిజాయితీకి సంతోషించి గురువు ఆ అర్ధ రూక శిష్యుని కే యిచ్చి వెళ్ళిపోయాడు.



 ఒక పొడుపు కథ :
చలన శక్తి కలదు జంతువు కాదది
చేతులెప్పుడు త్రిప్పుచునుండు శిశువు కాదది
కాళ్ళు లేవు సర్వ కాలములందు నడచును
దీని భావమేమి తిరుమలేశా
(జవాబు:గడియారము)



ఒక అవధానం లో అప్రస్తుత ప్రసంగి అవధాని నడిగిన ప్రశ్న
ఒకావిడ ఒకతని దగ్గర అప్పు తీసుకుందుకు వెళ్ళింది.. అతను నేనొక వాక్యం చెప్తాను,అది మీరు చెప్పగలిగితే వడ్డీ తక్కువకు అప్పు యిస్తాను అన్నాడు."నీవునామొగుడు నేను నీ పెళ్ళాము కలిసి యాత్రలకు పోదాము" అనాలి.ఆవిడ మహా ఇల్లాలు ఆ మాట ఎలా అనగలుగుతుంది?
అవధాని గారు నీవు, నామొగుడు, నేను, నీపెళ్ళాము కలిసి యాత్రలకు పోదాము అని అంటుంది.కామాలు పెడితే సరి.



ఈ దత్తపది కూడా ఇంతకుముందు వ్రాసిందే.మళ్ళీ కొత్త మిత్రులకోసం
స్టాప్, లిజన్ ,అండ్ ప్రొసీడ్ అనే నాలుగు ఆంగ్ల పదాలిచ్చి శ్లోకం చెప్పమన్నారు.డా.నాగఫణి శర్మ గారి పూరణ
శా: ఇష్టా పూర్తి రిహాస్తుతే జనవర ప్రౌడ ప్రియం భావుక బ్ర
హ్మాండ స్థిర వర్ణ నీయ ఘటనా వ్యాపార లీలాస్పదా
కేళీ జన్మ విహార ధారణ కళా దివ్య ప్రభాంగ హే
విప్రోసీడ్డ్య గుణార్ణవ స్తుతి పరాకాష్టా స్థితే తే నమః
నీవు అందరి కోరికలనూ తీరుస్తూ అందరికీ ప్రియమైన వాడివి అయ్యావుఈ మొత్తం బ్రహ్మాండ మంతటికీ రాజువైనవాడివి.నీవు ఎత్తిన జన్మలన్నీ కూడా నీవు ఆడుతున్న ఆటలే గొప్ప నటనా వ్యాపారివి.దివ్య ప్రభావము గలవాడివి.నీవు విప్రుడవు అంటే జ్ఞానివి. యీడ్డ్య గుణార్ణు డవు =పొగడదగినట్టి గుణములకు సముద్రము వంటి వాడవు.విప్రః +అసి+యీడ్డ్య కలిసి ప్రొసీడ్ అనే పదం వచ్చింది.స్తుతి పరాకాష్టకు అర్హుడైన
నీకు నమస్కరిస్తున్నాను.
ఇష్టా పూర్తి లో స్టాప్, బ్రహ్మాండ లో అండ్,కేలీజన్మ లో లిజన్,విప్రోసీడ్డ్య లో ప్రొసీడ్ అనే పదం వచ్చాయి.
యిలా ఆంగ్ల పదాలను సంస్కృతం లో మిళాయించి మంచి శార్దూల వృత్తం చెప్పారు



"మహా గజాః ఫలాయన్తే మశ కానంతు కా గతి:"
అర్థము:-- ఎనుగులే ఎగిరి పోతుంటే ఇంకా దోమల గతి ఏమి?"
దీని పైన ఒక జోక్ :-- పనిమనిషి: అయ్యగారూ అమ్మగారు నన్ను పని లోనుంచి తీసేసారండీ!
యజమాని: వుండవమ్మా నా ఉద్యొగం పోయి నేను ఏడుస్తుంటే మధ్యలో నీ గోల ఏంటి?
గుడి బయట అడుక్కునే వాడికి,గుడి లోపల అడుక్కునే వాడికి స్థానాలు మాత్రమే వేరు.
బిచ్చగాడు:-- ధర్మం చెయ్యండయ్యా!
ఆసామి:-- దుక్క లాగ ఉన్నావు పని చేసుకొని బతకొచ్చు కదా!అడుక్కోడ మెందుకు?
బిచ్చగాడు:-- సామీ!మీరు లోపల దేవుడిని లక్షలు, కోట్లు అడుక్కుంటారు,నేను బయట రూపాయి అడుక్కుంటాను అంతే తేడా


క్రోధో మూల మనర్థానాం ; క్రోధః సంసార బంధనం
ధర్మ క్షయకరః క్రోధః ; తస్మాత్ క్రోధం విసర్జయేత్
అర్థము:--- అనర్థము లన్నింటికి కోపమే మూల కారణము. కోపమే సర్వ బంధనములకు హేతువు. అది ధర్మమును నాశనం చేస్తుంది. కనుక ముందుగా అందరూ కోపమును విడిచి పెట్టిన సుఖపడ గలరు.
క్రొధొ వైవస్వతో రాజా ; ఆశా వైతరణీ నదీ
విద్యాం కామ దుఘా దేను: సంతుస్టో నందనం వనం
అర్థము:-- క్రోధము యమధర్మ రాజు వంటిది (అంటే మనుష్యున్ని చంపేది)ఆశ యనునది వైతరణీ నది వంటిది(దాటడానికి సాధ్యము కానిది) విద్య అన్ని కోరికలను తీర్చు కామధేనువు వంటిది. సంతోషమే నందనవనము వంటిది (మనసుకు ఆహ్లాదము కలిగించునది)



రాకేందు బింబమై రవి బింబమై యొప్పు నీరజాతేక్షణ నేమ్మొగంబు
కందర్ప కేతువై ఘన ధూమ కేతువై యలరు పూబోడి చేలాంచాలంబు
భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై మెరయు నాకృష్ట మై మెలత చాప
మమృత ప్రవాహ మై ననల సందోహమై తనరారు నింతి సందర్శనంబు
హర్ష దాయి యై మహరోష దాయి
యై బరగు ముద్దరాలి బాణ వృష్టి
హరికి నరికి జూడ శృంగార
వీర రసము లోలి విస్తరిల్ల

తా:--హరికేమో ఆమె ముఖము చంద్రబింబము లాగా కనిపిస్తూందట, అసురుడికేమో సూర్యబింబము లాగా కనిపిస్తూందట, గాలికి తెగురు తున్న ఆమె చీరేకొంగు హరికి మన్మథుడి జండా లాగానూ,అసురుడికి
ధూమకేతువు యొక్క జండా లాగాను,ఆమె బాణ చాపము హరికి మన్మథుడి చాపము లాగాను,శత్రువుకు ప్రళయకాలము లోని సూర్యుడి చాపము లాగాను మెరుస్తూ వుందట,హరికి ఆమె బాణాల వర్షము సంతోషాన్ని కలిగిస్తూ వుంటే శత్రువుకు రోషాన్ని కలిగిస్తూ వుందట ఆలాగున ఆమె హరికి శృంగార రసం గాను,శత్రువుకు వీరరసము గాను కనిపిస్తూ భాసించింది.
కొమ్మా దానవ నాథుని
కొమ్మాహవమునకు దొలగె గురు విజయము గై
కొమ్మా మెచ్చితి నిచ్చెద
గోమ్మాభరణములు నీవు కోరిన వెల్లన్
తా:--ఓ!లలనా!దానవుని అహంకారము యుద్ధములో అణగి పోయింది.నీదే ఈ విజయము తీసుకో
మరియు నీఎకు యే యే ఆభరణములు కావాలో కోరుకో అవన్నీ నేను నీకు యిస్తాను.


ధర్మార్థ కామ సాధన కుప కరణంబు,గృహ నీతి విద్యకు గృహము విమల చారిత్ర
శిక్ష కాచార్య కంబు అన్వయ స్థితికి మూలంబు సద్గతికి నూత గౌరవంబునకు
యీమె కారణంబు ఉన్నత స్థిర గుణములకు ఆకరంబు హృదయ సంతోషము నకు
సంజనకంబు భార్యయ చూవె భర్తకు నొండ్లు గావు ప్రియము
లెట్టి ఘట్టములను,నెట్టి ఆపదలను నెట్టి తీరములను ముట్టబడిన వంత లెల్ల బాయు
నింతులు ప్రజలను నొనర చూడ గనిన జనులకు కెందు. (శకుంతల)
అర్థము: ఓ విమల చరితా! పురుషునికి ధర్మార్థ కామాలు ఆచారించాలన్నా,గృహనీతి విద్య
నేర్పాలన్నా,విమల మైన శీలాన్ని అలవరచాలన్న,వంశము నిలాపాలన్నా,సద్గతి సాధించాలన్నా
గౌరవము పొందాలన్నాగుణ గణాలు లభించాలన్నాహృదయము సంతోషాన్ని పొందాలన్నా
కావలిసింది భార్య యే.ఆలు బిడ్డల్ని ఆప్యాయంగా చూసే వారికీ ఆపదలన్నీతొలగి పోతాయ్.
ఇది గృహస్తాశ్రమ ప్రాధాన్యము.అన్నింటికీ గృహమే ప్రధానము 




రాత్రిర్గమిష్యతి, భవిష్యతి సుప్రభాతం, భాస్వానుదేష్యతి హసిష్యతి పంకజశ్రే
యిత్థమ్ విచింతయతి కోశగత ద్విరేఫః,హా హంత హంత నళినీం గజ ఉజ్జాహారః
అర్థము:--ఒక తుమ్మెద తామర పువ్వు పైన వాలి మకరందాన్ని ఆస్వాదిస్తూ సమయాన్ని మరిచి పోయింది. ఇంతలో సూర్యాస్తమాయం అయిపొయింది తామర ముడుచుకొని పోయింది. తుమ్మెద లోపలే వుంది పోయింది. తుమ్మెద తనలో యిలా అనుకుందట ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తాడు కమలం వికసిస్తుంది అప్పుడు నేను తప్పించు కోవచ్చు అని. కానీ అంతలో ఒక ఏనుగు వచ్చి తన తొండం తో ఆ తామర తూడును లాగి బయటకు విసిరి వేసింది. దానితో తుమ్మెద లోపలే వుండి చనిపోయింది. తానొకటి తలిస్తే దైవమొకటి తలచాడు. అన్నీ మనమనుకున్నట్టే జరగవు. భగవంతుడనే శక్తి ఒకటి ఉంటుందని గ్రహించాలి
(జగన్నాధపండిత రాయలు)




పూర్వం మాలిక్ ఇబ్రహీం అనే తురుష్క ప్రభువు వుండేవాడు. అతను పండిత కవి పోషకుడు,ప్రజలను కన్న బిడ్డలుగా చూసుకునేవాడు.ఆయనను ప్రజలంతా మల్కిభరాముడు.యిభారాముడు అని పిలుస్తుండేవారు.
విజయవాడ దగ్గరి ఇబ్రహీం పట్నం ఆయన పేరు మీదే నిర్మించారని చెప్తారు.కవులు ఆయాన్ను పొగుడుతూ
చాలా పద్యాలు వ్రాశారు.
పక్కన మొహమ్మద్ భేక్ అనే సుబేదారు వుండే వాడు.అతనికి అందరూ మాలిక్ ఇబ్రహీం ని పొగుడు తారే
అని అసూయగా వుండేది.ఆయన ఒకరోజు తన కొలువులోని పండితులను తనను పొగుడుతూ పద్యము చెప్పే వారికి 100 బంగారు కాసులు యిస్తానని ప్రకటించాడు.అతనిలో పొగడదగ్గ గునాలేవీ లేవు యేమని పోగాదాలో తెలియక సభలో పండితులు మల్లగుల్లాలు పడుతున్నారు.ఒక పండితుడికి ఏదో
స్ఫురించింది. అతను పోతన భాగవతం లోని అడవి వర్ణన పద్యం కాస్త మార్చి చదివాడు.
భిల్లీ భల్లు లులాయక భల్లుక ఫణి ఖడ్గ గవయ వలిముఖ చమరీ
ఝిల్లీ హరి శరభక కరి కిరి మల్లాద్భుత కాక ఘూక మాయమగు నడవిన్
అర్థము:-- భిల్లులు (కోయవాళ్ళు)అడవి ఎనుబోతులు, ఎలుగు బంట్లు, పాములు, ఖడ్గ మృగాలు, ముడుతలు పడిన ముఖము గల సవరపు మృగములు, యీల పురుగులు, సింహాలు,కుందేళ్ళు. అడవి పందులు, కాకులు, గుడ్లగూబలు నిండిన అడవి నందు. అని అడవి వర్ణన
ఈపద్యం చివర కొంచెం మార్చి"కాక ఘూక మహమ్మదు భేక" అని చదివాడట. అదేదో పొగడ్త అనుకోని సెహభాష్! అని మెచ్చుకొని వంద బంగారు నాణాలు ఇమ్మని చెప్పాడట. యిలా అంత ధనం యివ్వడం
యిష్టం లేని ఒక మహమ్మదీయుడు లేచి సుల్తాన్ యితడు మిమ్మల్ని ఘూఖా అన్నాడు.( 'ఘూ' అంటే
వారి భాషలో అమేధ్యం అని అర్థం). వెంటనే ఆ కవి సుల్తాన్ నేను 'ఘూఖా'అనలేదు 'ఘీఖా' అన్నాను మీరు పొరబాటున విన్నట్టున్నారు. అని తెలివిగా సవరించుకుని . వంద బంగారు నాణాలు పట్టుకొని వెళ్ళిపోయాడట.



ఇది ఒకసమస్య లేక పొడుపు కథ లాంటిది.
శ్లోకం:-- సువర్ణ మాయతం కృత్వా కరమూలే వినిక్షిపేత్
అతి నీలమతి స్థూలం యోజానాతి సపండితః
అర్థము స్థూలంగా చూస్తే సువర్ణమును అంటే బంగారును ఆయతంకృత్వా అంటే సాగ గొట్టి కరమూలము అంటే ముంజేతి యందు పెడితే అది అతినీలం అంటే నల్లగానూ అతి స్థూలం అంటే చాలా లావుగానూ వుంటుంది. ఎవరు దీన్ని చెప్ప గలరో వాడే పండితుడు అని సవాలు చేస్తున్నాడు
సూక్ష్మమైన అర్థము :-సు వర్ణము అంటే 'సు' అను అక్షరమును, ఆయతంకృత్వా అంటే పొడిగించి దీర్ఘీకరించి అంటే 'సూ'చేసి కరమూలే అంటే 'కర'అనే పదానికి ముందు పెట్టినట్లయితే అది 'సూకర' అంటే పంది అవుతుంది. అప్పుడు అది నల్లగానూ,లావుగానూ వుండడం లో ఆశ్చర్యము లేదు కదా! 'సూకర' అని సమాధానము.




ఒకసారి అవధానం లో ఒక సంస్కృత దత్తపది యిచ్చారు. జడేజా,ద్రావిడ్ ,కాంబ్లీ కుంబ్లే 4 గురు క్రికెట్ ఆట
గాళ్ళ పేర్లు యిచ్చి హనుమంతుని సముద్ర లంఘనం గురించి చెప్పమని,అడిగారు..ఈ అవధానం వైజాగ్ లో జరిగింది.
డా.నాగఫణి శర్మ గారి పూరణ:-
ఏషా జడేజా వికటా నిహన్యా
తద్రావిడేడ్యా జలధి ప్రసిద్ధా
తద్వానారోన్ముష్టి విఘాత చూర్ణా
కాంబ్లీతి,కుంబ్లేతి రవం చకార
అర్థం:-- జడేజా=జడమునుంది పుట్టినది రాక్షసి,ఆ రాక్షసి, ద్రావిడై:+యీడ్యా =లంకావాసులచే పొగడబడినది.
(లేక ద్రవిడ దేశానికి చెందినది.పూర్వం లంకావాసులని ద్రావిడులు అనేవారు)దాన్ని చంపే నేను ముందుకు పోవలెనని హనుమ తలచి దాన్ని తన ముష్టి ఘాతాలతో పొడిచి పిండి పిండి చేసేశాడు.అది చనిపోతూ
రాక్షస భాషలో కాంబ్లీ,కుంబ్లే అని అరిచింది.(లేక దాని కొడుకులను అలా పిలిచి వుండవచ్చు)